ఐతే, పాకిస్ధాన్ ఈ ఆరోపణలను తిరస్కరించింది. రాకెట్ దాడుల గురించి తనకేమీ తెలియదని తెలియజేసింది. కాని హమీద్ కర్జాయ్ పాక్ ప్రభుత్వమే రాకెట్ దాడులకు భాద్యత వహించాలనీ, పాక్ ప్రభుత్వం దాడుల వెనక లేనట్లయితే అందుకు బాధ్యులెవరో చెప్పాలనీ కర్జాయ్ డిమాండ్ చేసాడు. గత శనివారం, జూన్ 25 తేదీన ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన టెర్రరిజం వ్యతిరేక కాన్ఫరెన్సులో పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీతో రాకెట్ దాడుల విషయం చర్చించినట్లు కర్జాయ్ తెలిపాడు. కాని అదే రోజు ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రాకెట్ దాడులపై ప్రకటన జారీ చేస్తూ ఆఫ్ఘనిస్ధాన్ తనను తాను రక్షించుకోగలదని హెచ్చరించాడు. “ఆఫ్ఘన్ పౌరుల మరణానికి ప్రతిస్పందన ఉంటుందని పాకిస్ధాన్ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి” అని ప్రతినిధి మహమ్మద్ జహీర్ అజిమి హెచ్చరించాడు.
పాకిస్ధాన్ రాకెట్ దాడులకు స్పందనగా శుక్రవారం ఆఫ్ఘన్ రాష్ట్రాలు ఖోస్ట్, పాక్టికా రాష్ట్రాలలోని ఆఫ్ఘన్ భద్రతా దళాలు పాకిస్ధాన్ వైపుకి కనీసం రెండు ఫిరంగి దాడులు చేసినట్లు అజిమి తెలిపాడు. జూన్ 17 న నాటో కూడా పాకిస్ధాన్ పైకి కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపాడు. కాని పాకిస్ధాన్ మిలట్రీతో పాటు నాటో కూడా ఆఫ్ఘన్ వైపునుండి పాకిస్ధాన్లోకి అటువంటి కాల్పులు జరగలేదని చెప్పారు. అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ రాకెట్ దాడుల విషయం నాటో అధిపతి డేవిడ్ పెట్రాస్, అమెరికా రాయబారిలతో చర్చించానని చెప్పాదు. తాలిబాన్‌కి మద్దతు ఇవ్వడం ద్వారా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైన్యం వెళ్ళిపోయాక అక్కడ ఆధిపత్య సంపాదించాలని పాక్ ప్రయత్నిస్తున్నదనీ అందుకే మిలిటెంట్లకు లోపాయకారి మద్దతు ఇస్తున్నదని నాటో, ఆఫ్ఘన్ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రాకెట్ దాడులు అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని వారు చెబుతున్నారు.
రాకెట్ దాడులవలన 2000 కుటుంబాలు అక్కడినుండి వెళ్ళిపోయారని ఆఫ్ఘన్ సరిహద్దు అధికారులు చెప్పారు. “ఈ దాడులన్నీ పాకిస్ధాన్ వైపునుండి జరుగుతున్నవే. అమాయక ఆఫ్ఘన్లపైకి వినియోగిస్తున్న ఆయుధాలు పాకిస్ధాన్వేనని ఖచ్ఛితంగా చెప్పగలను” అని బోర్డర్ అధికారి ఎడ్రిస్ మహ్మద్ తెలిపాడు. సరిహద్దులో ఆఫ్ఘన్ సైనికుల వద్ద భారీ అయుధాలు ఉన్నాయి. కాని మేము పై అధికారుల ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నాం” అని ఆయన అన్నాడు. ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అజిమి రాకెట్ దాడులను వెంటనే ఆపాలని పాకిస్ధాన్‌ని కోరుతున్నామని నష్టాన్ని పూడ్చాలని కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పాడు.
జూన్ నెలలో 53 మంది నాటో సైనికులు మరణించారనీ, ఈ సంవత్సరం ఇంతవరకూ 200 మందికి పైనే మరణించారనీ వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ ల మధ్య ఘర్షణలు చెలరేగడం తాజా పరిణామంగా చెప్పుకోవచ్చు. నాటొ సైనికుల విరమణ ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ఘర్షణలు జరగడంపై వివిధ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
