
వెన్ జియాబావో బర్మింగ్ హామ్ లోని తమ కార్ల ఫ్యాక్టరీ తయారు చేసిన కొత్త మోడల్ “ఎం.జి6 మాగ్నెటా” ను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా వెన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. చైనా ప్రజల వినియోగం పెంచడం, విదేశీ వాణిజ్య మిగులును తగ్గించుకోవడం, ఎగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం చైనా విధించుకున్న ప్రాధామ్యాలు అని వెన్ ప్రకటించాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా అమెరికా, ఇ.యు లు చైనాపై ఈ అంశాల్లోనే ఒత్తిడి చేస్తున్నారు. చైనా విదేశీ వాణిజ్య మిగులు వలన వివిధ పశ్చిమ దేశాలతో చైనా వాణిజ్య తూకం అసమానంగా ఉంటోందనీ, దీన్ని సరి చేయడానికి చైనా కరెన్సీ యువాన్ విలువ పెరగడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
చైనా ప్రధాని వెన్, అమెరికా, యూరప్ లు కోరుతున్న అంశాలనే తమ ప్రాధామ్యాలుగా చెప్పుకోవడం విశేషం. వెన్ చెప్పింది నిజమే అయితే ప్రపంచ స్ధాయిలో వాణిజ్య సమతూకం మెరుగుపడడానికి విశేషంగా తోడ్పడుతుందని బిబిసి బిజినెస్ విళేఖరి రాబర్ట్ పెస్టన్ అంటున్నాడు. ఐదు రోజుల పర్యటనకు ముందు చైనా అసమ్మతి కళాకారుడుగా పేరుపడిన ‘ఐ వీవీ’ ని షరతులతో విడుదల చేసింది. రెండ్రోజుల తర్వాత మరొక ప్రఖ్యాత అసమ్మతి వాది, పర్యావరణ ప్రచారకుడు ‘హు జియా’ ను కూడా చైనా విడుదల చేసింది. చైనా ప్రధాని పర్యటనలో టిబెట్, మానవ హక్కుల ఆందోళనకారులు వెన్ సందర్శించే ప్రాంతాల వద్ద అందోళనలు చేయడం రివాజు. వీటికి సమాధానం చెప్పడానికే తాను బయలు దేరే ముందు ఇద్దరు అసమ్మతి వాదులని జైలునుండి విడుదల చేసింది, చైనా. పశ్చిమ దేశాలను సంతృప్తిపరచడం కూడా ఈ చర్య ఉద్దేశ్యం.
యూరప్ అత్యవసర పరిస్ధితుల్లో ఉన్నపుడు చైనా మిత్రదేశంగా వ్యవహరిస్తుందని వెన్ అభివర్ణీంచాడు. యూరోపియన్ దేశాలు సావరిన్ అప్పు సంక్షోభంలో ఉన్నపుడు చైనా నిజానికి కొన్ని యూరప్ దేశాల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం పెంచిందని వెన్ వెల్లడించాడు. యూరో నిల్వలను కూడా తగ్గించుకోలేదని తెలిపాడు. యూరోప్ దేశాలపైనా, యూరోజోన్ పైనా చైనాకి ఉన్న విశ్వాసాన్ని ఇది ధృవపరుస్తుందని వివరించాడు. “యు.కె రాకముందు హంగెరీకి వెళ్ళాను. హంగెరీ ప్రభుత్వ అప్పు బాండ్లను నిర్ధిష్ట మొత్తంలో కొనుగోలు చేయడానికి మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. హంగెరీ కష్టకాలంలో ఉన్నపుడు చైనా అందిస్తున్న ఆపన్న హస్తం ఇది. హంగెరీ కోసం మేము దీన్ని చేశాం. ఇతర యూరప్ దేశాలకు కూడా ఇదే చేస్తాం” అని వెన్ విలేఖరులకు తెలిపాడు.
3 ట్రిలియన్ డాలర్ల వరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్న చైనా దానిలో కొద్ది భాగాన్ని వివిధీకరించాలని, అంటే డాలర్ నిల్వలనుండి ఇతర కరెన్సీలలో నిల్వ చేయాలని భావిస్తున్నట్లుగా చైనా గతంలో ప్రకటించింది. యూరోలలో నిలవ చేయాలని యూరప్ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. చైనా ప్రధాని సోమవారమే బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ని కలిసే అవకాశం ఉంది.
