ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?


Iran conference

ఇరాన్‌లో జూన్ 24, 25 తేదీల్లో జరిగిన టెర్రరిజం వ్యతిరేక అంతర్జాతీయ మహాసభ. 60కి పైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయి

అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య ప్రాచ్యం ప్రాంతంలో ఇజ్రాయెల్‌కి దీటుగా ఇరాన్ ఎదగకుండా చేయడం కూడా అమెరికా ఆఫ్ఘనిస్ధాన్‌పై దాడి చేసిన లక్ష్యాలలో ఒకటి.

అయితే ఇరాన్, ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వంతో సత్సంబంధాలను నిర్వహిస్తూ వచ్చింది. ఇటీవలి కాలంలో ఇరాన్ అధ్యక్షుడు స్వయంగా అమెరికా ఆక్రమణలో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్‌లో పర్యటించి, అమెరికా ఆక్రమణకి వ్యతిరేకంగా ఉపన్యసించి మరీ వెళ్ళాడు. షియా మతాధిపత్యం ఉన్న ఇరాన్, సున్నీ మతాధిపత్యం ఉన్న శక్తివంతమైన పాకిస్ధాన్‌తో కూడా సత్సంబంధాలు నెరపడం తాజా సంచలనం. అరబ్-ముస్లిం ప్రపంచంలో సున్నీ మత దేశాలకు సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తోంది. సున్నీ సౌదీ అరేబియాకూ, షియా ఇరాన్ కూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది సున్నీ రాజ్యం, అమెరికాకి మిత్ర దేశమూ కూడా అయిన పాకిస్ధాన్‌తో స్నేహ సంబంధాలను ఇరాన్ కలిగి ఉండడం ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి తీవ్ర ఆటంకం కలిగించే విషయంగా చూడాలి.

ఈ నేపధ్యంలో గత బుధవారం నాడు ఇరాన్‌లో టెర్రరిస్టు వ్యతిరేక కాన్ఫరెన్సు నిర్వహించింది. అందులో ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల ప్రభుత్వాధిపతులే స్వయంగా హాజరయ్యేలా చూడడంలో ఇరాన్ విజయవంతమైంది. ఇరాన్ నిర్వహించిన టెర్రరిజం వ్యతిరేక మహాసభలో పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ దేశాలు పాల్గొనడం ఇరాన్ అధ్యక్షుడికి గొప్ప విజయం లాంటిది. అవకాశం దొరికితే చాలు ఇరాన్‌పై ఒంటికాలు మీద లేచే అమెరికాకి ఇది ఎదురు దెబ్బ. అందునా పాకిస్ధాన్ ప్రధమ పౌరుడు అసిఫ్ ఆలీ జర్దారీ, ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌లు స్వయంగా పాల్గొని ప్రసంగించడం అమెరికాకి మరింత కడుపు మంటను రగిలిస్తుంది. దౌత్య సంబంధాల పరంగా చూసినా, రాజకీయ సంబంధాల పరంగా చూసినా ఇది ఇరాన్‌కి చెప్పుకోదగ్గ విజయం. ఇరు దేశాల ప్రభుత్వాధిపతులను ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా ఆలి ఖమేనీ స్వయంగా ఆహ్వానించడం ఆఫ్-పాక్ దేశాలకు ఇరాన్ దృష్టిలో ఉన్న ప్రాధాన్యతను తెలియపరుస్తుంది.

ఈ రెండు దేశాలతో పాటు సూడాన్, తజకిస్ధాన్, ఇరాక్, మారిటానియా, క్యూబా లాంటి 60 కి పైగా దేశాలు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ లాంటి వివిధ దేశాల కూటములు, అనేక స్వచ్ఛంద సంస్ధలు, పరిశోధకులు ఇరాన్ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. వీరంతా ఇరాన్ చొరవను బహుధా ప్రశంసించడమే కాకుండా ఈ కాన్ఫరెన్సును శాశ్వత ప్రాతిపదికన నిర్వహించడానికి నిర్ణయించారు. తదుపరి కాన్ఫరెన్సు జరపడానికి ఇరాక్ ముందుకు రావడం మరో విశేషం. ఇరాక్‌లో జరిగిన ఎన్నికల తర్వాత అనేక నెలల ప్రతిష్టంభన అనంతరం ఇరాన్ అనుకూల ప్రభుత్వం అధికారం చేపట్టిన సంగతి విదితమే.

Iran conferenceఇరాన్ నిర్వహించిన “టెర్రరిజం వ్యతిరేక ప్రపంచ యుద్ధంపై అంతర్జాతీయ మహాసభ” (International Conference on Global Fight Against Terrorism) కు ఐక్యరాజ్య సమితి పూర్తి మద్దతు అందజేయడం ఇరాన్ సాధించిన మరొక విజయం. ఈ మహాసభ ఐక్యరాజ్య సమితి గుర్తును ఉపయోగించుకోవడమే కాక సమావేశంలో సమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ పంపిన సందేశాన్ని సమితి ప్రతినిధి చదివి వినిపించాడు. స్విట్జర్లాండ్ లోని యు.ఎన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్ధ ఇరాన్ కాన్ఫరెన్సుకు సమితి ఆమోదం ఉండడం పట్ల నిరసన తెలిపినప్పటికీ సమితి పట్టించుకోక పోవడం మరో విశేషం. “టెర్రరిజం వ్యతిరేక పోరాటంలో కలిసి పనిచేయడం అన్ని దేశాలకూ చాలా ముఖ్యం” అని సమితి ప్రతినిధి ఆ విమర్శకు సమాధానం చెప్పాడు.

అంతర్జాతీయంగా వ్యాపించిన టెర్రరిజం సమస్యను అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాలు తమ స్వప్రయోజనాలకు వినియోగించుకుంటున్న అంశం కాన్ఫరెన్సులో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. టెర్రరిజం సాకుగా ఆఫ్ఘనిస్ధాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న సంగతి ప్రస్తావనకు వచ్చింది. మధ్య ప్రాచ్యంలో అమెరికా జోక్యం గురించి చర్చించారు. “సాతాను లాంటి ప్రపంచ అధిపత్య శక్తులు తమ విధానాల్లో టెర్రరిజం అంశాన్ని వినియోగించుకుంటూ తమ అన్యాయ పూరితమైన లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నాయి” అని అయతొల్లా ఖమేనీ సభలో సందేశం ఇచ్చాడు. అమెరికా స్వయంగా టెర్రరిస్టు గ్రూపులకు ఆయుధాలు, డబ్బు సమకూర్తుస్తున్నదని తెలిపాడు. ‘బ్లాక్ వాటర్’ గ్రూపు పాకిస్ధాన్‌లోని అమెరికా ప్రేరేపిత టెర్రరిస్టులకు సహాయం చేస్తున్నదని పేర్కొన్నాడు. ఆఫ్-పాక్ లలో అమెరికా చర్యలు శృతిమించుతుండడంపై ఆ దేశాలు వ్యక్తం చేస్తున్న ఆందోళన పట్ల ఖమేనీ సానుభూతి తెలిపి ఆఫ్-పాక్ లకు మద్దతు తెలిపాడు.

పాకిస్ధాన్‌లోని ఏ మాత్రం రక్షణ లేని గ్రామీణులపైనా, ఆఫ్ఘనిస్ధాన్‌లోని దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న ప్రాంతాలపైనా అమెరికా చేస్తున్న మానవ రహిత విమాన దాడుల్లో అనేకమంది పౌరులు మరణిస్తున్నారనీ, పెళ్ళి ఊరేగింపులు, చావు యాత్రలుగా మారిన ఉదాహరణలు అనేకం ఉన్నాయనీ ఖమేనీ తెలిపాడు. అటువంటి ప్రవర్తన గల అమెరికా తానే టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించాడు. ప్రపంచాధిపత్యం కోసం ప్రయత్నించే శక్తుల దృష్టిలో తమ దుర్మార్గమైన స్వార్ధ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రతి అంశమూ టెర్రరిజంగానే కనిపిస్తుందని విశదపరిచాడు. దురాక్రమణ దారులకూ, జోక్యం దారులకు వ్యతిరేకంగా తమ సార్వభౌమత్వం కాపాడుకునే సమున్నత లక్ష్యం కోసం చేసే అన్ని పోరాటాలూ వీరి కంటికి టెర్రరిజంగా కనిపిస్తుందని విమర్శించాడు.

Iran conferenceఅమెరికా నాయకత్వంలో దశాబ్దం పాటు జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో పాకిస్ధాన్ అత్యధికంగా నష్టపోయిన విషయాన్ని పాక్ అధ్యక్షుడు జర్దారీ గుర్తు చేశాడు. 5000 మంది పాక్ సైనికులు మరణించారనీ, పాకిస్ధాన్ ఆర్ధిక వ్యవస్ధ 37 బిలియన్ డాలర్లమేరకు ఆస్తులనూ ఆదాయాన్నీ పాకిస్ధాన్ పోగొట్టుకుందనీ తెలిపాడు. “టెర్రరిజం వ్యతిరేక యుద్ధం”లో ప్రాంతీయ రాజ్యాలు ఉమ్మడిగా ప్రచారం చేయవలసిన “కీలకమైన” అవసరాన్ని జర్దారీ ఎత్తి చూపాడు. ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు ఇరాన్ కాన్ఫరెన్సులో ప్రసంగించాడు. “కేవలం మిలట్రీ మార్గాల్లోనే టెర్రరిస్టు వ్యతిరేక పోరాటం చేయడం సాధ్యం కాదని నా అభిప్రాయం” అని కర్జాయ్ తెలిపాడు. టెర్రరిజం వ్యతిరేక పోరాటంలో ముస్లిం రాజ్యాలు ఐక్యంగా నిలిచి, గట్టి నిర్ణయంతో ఉమ్మడిగా సహకరించుకోవాలని కర్జాయ్ పిలుపునిచ్చాడు.

కాన్ఫరెన్సు సందర్భంగా జర్దారీ, కర్జాయ్ లు ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ తో కలిసి త్రైపాక్షిక చర్చలు జరిపారు. మధ్య ప్రాచ్యంలో శాంతి, బధ్రతల అంశాల్లో ప్రాంతీయ దేశాల మధ్య సామీప్య సహకారం ఉండాలని ఈ త్రైపాక్షిక సమావేశం నిర్ణయించింది. “రాజకీయ, భద్రతా సంబంధిత, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలతో పాటు టెర్రరిజం వ్యతిరేక పోరాటంలోనూ, విదేశీ జోక్యానికి వ్యతిరేకంగానూ తమ మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని ఇరాన్, పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ దేశాలు ప్రతిజ్ఞ చేశాయని”ఇరాన్ అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది.

అమెరికా, నాటో సైన్యాలు ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగడం వలన పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాన్ దేశాలు మూడింటి ప్రయోజనాలపైన ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఉమ్మడి అవగాహనను మూడు దేశాలు కలిగి ఉండడానికి ఇరాన్ కార్ఫరెన్సు సందర్భంగా ప్రయత్నించింది. ఖమేనీ, జర్దారీ, కర్జాయ్ ల మధ్య జరిగిన చర్చలు ఈ వైపుగానే జరిగాయని తెలుస్తోంది. మూడు దేశాల మధ్య బేషరతు సహకారం అవసరమని ఇరాన్ కాన్ఫరెన్సులో నొక్కి చెప్పింది. అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్ధాన్‌లో కూడా అసమ్మతి బీజాలు నాటుతోందని ఇరాన్ గుర్తు చేసింది. పాక్ ప్రజలు అమెరికా ఆధిపత్య ఎత్తుగడల పట్ల గొప్ప అవగాహన కలిగి ఉన్నారని దాని ఎత్తుగడలను ప్రతిఘటిస్తున్నారని ప్రశంసించింది.

Iran conferenceపాకిస్ధాన్‌లో కరాచిలోని నౌకా దళ స్దావరంలో దాచి ఉంచిన అణ్వాయుధాలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా రహస్య ప్రయత్నాలు చేస్తున్నదని గతంలో ఇరానే ఎత్తి చూపింది. పాక్ దగ్గర నిలవ ఉన్న శుద్ధి చేయబడిన యురేనియంను సి.ఐ.ఏ గూఢచారులు దొంగిలించడానికి ప్రయత్నాలు చేసిన విషయం కూడా ఇరాన్ వెల్లడి చేసింది. అప్పటినుండే పాక్ మిలట్రీ సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల అప్రమత్తమై దాదాపు మూడింట రెండొంతుల సి.ఐ.ఏ సిబ్బందిని వెనక్కి పంపించింది. కాన్ఫరెన్సు సందర్భంగా ఖమేనీ మరొక అడుగు ముందుకు వేశాడు. పాకిస్ధాన్ ప్రభుత్వాన్ని అస్ధిరీకరించడానికి అమెరికా రహస్య ప్రయత్నాలు చేస్తున్నదని ఖమేనీ వెల్లడించాడు. పాకిస్ధాన్‌ని అస్ధిరం పాలు చేసి బలహీన పరిచి తద్వారా ఆ ప్రాంతంలో అమెరికా అధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న పాక్ ప్రజల ప్రతిఘటనకు గండి కొట్టాలని అమెరికా ప్రయత్నిస్తున్నదని ఖమేనీ సూచించాడు. ఈ ప్రాంతంలో పాకిస్ధాన్ ప్రభావవంతమైన దేశంగా ఎదగకుండా అమెరికా ప్రయత్నిస్తున్నదని హెచ్చరించాడు.

ఇటీవల కాలంలో అమెరికా పాకిస్ధాన్ ల మద్య తలెత్తీన్ ఉద్రిక్తలు ఇరాన్ కాన్ఫరెన్సుకు ఉత్ప్రేరకంగా పనిచేసినట్లు కనిపిస్తోంది. పాక్ నుంచి అంతర్గత శాఖా మంత్రి పాల్గొనడాన్ని బట్టి ఇరాన్‌తొ ముఖ్య విషయాలనే పాక్ పంచుకుందని చెప్పవచ్చు. ఇరాన్, పాక్ ల ఇంటీరియర్ మంత్రులు ప్రత్యేకంగా సమావేశం ఐనట్లు కూడా తెలుస్తోంది. పాకిస్ధాన్ భూభాగంపై ఇరాన్ వ్యతిరేక టెర్రరిస్టు గ్రూపు “జుందల్లా” కు శిక్షణ లభించడం పై ఇరువురు చర్చించుకున్నారని తెలుస్తోంది. గతంలో జుందల్లా గ్రూపుకి పాక్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఆరోపించిన ఇరాన్ ఇప్పుడు స్వరం మార్చి పాక్ ప్రభుత్వాన్ని ఆఅ గ్రూపుతో వేరుపరిచడం ద్వారా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఇరాన్ ప్రయత్నించింది.

ఈ క్రమంలో అమెరికా సైనిక ఉపసంహరణ ఆఫ్ఘన్ ప్రయోజనాలకు అనుకూలమని ఇరాన్ కర్జాయ్‌కి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ ప్రయోజనాలకు కూడా అమెరికా సైన్య ఉపసంహరణ ప్రయోజనమనీ, ఆఫ్ఘన్ వ్యవహారాలు చూసుకోగల శక్తి ఆఫ్ఘనిస్ధాన్‌కి ఉందనీ ఇరాన్ నమ్మకాన్ని ప్రోది చేసింది. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ లో కొనసాగడానికి తాలిబాన్ అసలు అంగీకరించకపోవడం, అమెరికా ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్ధిక సంక్షోభం, యుద్ధం పట్ల అమెరికా ప్రజల వ్యతిరేకత, అరబ్ దేశాల్లో ప్రజా ఉద్యమాలు వీటన్నింటి నేపధ్యంలో అమెరికా సైనిక స్దావరాలు ఆఫ్ఘనిస్ధాన్‌లో ఏర్పరచుకోవడానికి ఒకింత వెనకడుగు వేసే అవకాశాలు లేకపోలేదని ఇరాన్ విశ్వసిస్తున్నట్లు అంతర్గత సంభాషణల్లో పంచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవలి కాలంవరకూ ఆఫ్ఘనిస్ధాన్‌లో పాకిస్ధాన్, ఇరాన్ ప్రయోజనాలమధ్య ఘర్షణ నెలకొని ఉండేది. ఇపుడా ఘర్షణ వాతావరణాన్ని తగ్గించుకుంటూ సహకారం వైపు అడుగులు వేయడానికి ఇరాన్ చొరవ ఉపయోగపడవచ్చు. అయితే పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ పాలకులు ఎంతవరకు అమెరికాకు ప్రతిఘటన ఇస్తాయన్నదీ అనుమానమే. ఇరాన్ కాన్ఫరెన్సుకు హాజరు కావడం ద్వారా తమకూ ప్రత్యామ్నాయాలు ఉన్నాయనీ, తక్కువ అంచనా వేయడానికీ, తేలిగ్గా తీసివేయడానికి వీల్లేదనీ అమెరికాకి ఒక హెచ్చరిక మాత్రమే పంపదలుచుకున్నా అశ్చర్యం లేదు. కాన్ఫరెన్సును అడ్డు పెట్టుకుని అమెరికా నుండి మరిన్ని మినహాయింపులు, సహాయం పొందడానికి కూడా ఆఫ్-పాక్ పాలకుల ప్రయత్నం చేస్తున్న అవకాశాలను కొట్టిపారవేయలేం.

ఏమైనప్పటికీ ఇరాన్ నిర్వహించిన టెర్రరిజం వ్యతిరేక అంతర్జాతీయ మహాసభ దక్షిణాసియా, పశ్చిమాసియా లేదా మధ్య ప్రాచ్యం ప్రాంతంలో ఏదో ఒక మేరకు సమీకరణల మార్పుకు నాంది కావచ్చు. అది అమెరికా అధిపత్య రాజకీయాలకూ, దురాక్రమణకూ, సైనిక స్ధావరాల స్ధాపనకు వ్యతిరేకంగా ఉండగలిగితే, అత్యంత అభిలషణీయం కూడా.

One thought on “ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s