
ఆర్.టి.ఐ చట్టం ప్రకారం భద్రత (security) గూఢచర్యం (intelligence) లకు సంబంధించిన సంస్ధలను ఆర్.టి.ఐ చట్టం నుండి మినహాయించే అవకాశం ఉందని కెజ్రివాల్ తెలిపాడు. రా (RAW – Research and Analysis Wing) గానీ, ఐబి (IB – Intelligence Bureau) గానీ రెండూ ఇంటలిజెన్స్ సంస్ధలు గనక వాటిని ఆర్.టి.ఐ నుండి మినహాయించడంలో అర్ధం ఉందనీ, కానీ సి.బి.ఐ అటు సెక్యూరిటీకి సంబంధించినది కాదు, ఇటు ఇంటలిజెన్స్ కి సంబంధించినదీ కాదనీ, కేవలం నేరాలూ, అవినీతి అంశాలను మాత్రమే విచారించే సి.బి.ఐ ని ఆర్.టి.ఐ నుండి మినహాయింపు ఇవ్వడం రాజకీయాలకు వినియోగించడానికేననీ ఆయన ఆరోపించాడు.
సి.బి.ఐని గతంలో యు.పి.ఏ ప్రభుత్వంతో పాటు ఎన్.డి.ఏ ప్రభుత్వం కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బోఫర్స్ కేసును దశాబ్దాల పాటు కొనసాగించి చివరికి ఎవరూ దోషులు కాదని ప్రకటించడం వెనక కాంగ్రెస్ ప్రభుత్వాల ఒత్తిడి పనిచేశాయి. అదే విధంగా తన ప్రత్యర్ధులయిన మాయావతి లాంటి వారిని, వారిపై ఉన్న అవినీతి కేసులను సమయానుకూలంగా పైకి తేవడం ద్వారా వారినుండి తన ప్రభుత్వానికి నష్టం కలగకుండా కాంగ్రెస్ పార్టీ సి.బి.ఐ ని వినియోగించుకుంది. ఎన్.డి.ఏ పాలనలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసును నీరు గార్చడానికి, అద్వానీ లాంటి నాయకులపై కేసు లేకుండా చేయడానికి సి.బి.ఐ ని వాడుకున్నారు.
టెలికం కుంభకోణమైన 2జి స్పెక్ట్రం కుంభకోణంపై విచారణను ప్రభావితం చేయడానికి యు.పి.ఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే సుప్రీం కోర్టు ఆ కేసును స్వయంగా పర్యవేక్షిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పే బాధ్యతనుండి తప్పించడంతో కాంగ్రెస్ పార్టీ మిన్నకుండిపోయింది గానీ సుప్రీం కోర్టు చొరవ తీసుకోనట్లయితే ఏ.రాజా రాజీనామా జరిగేదీ కాదు, ఆయనతో పాటు కనిమొళి కూడా కటకటాల వెనక్కి వెళ్ళేవారూ కాదు. సుప్రీం కోర్టు పర్యవేక్షణతోనే ఇంతగా ప్రమాదం ఎదుర్కోవలసి వస్తున్నంది. సి.బి.ఐ ని ప్రభుత్వానికి సమాధానం చెప్పే భాధ్యత లేకుండా స్వతంత్ర సంస్ధగా వదిలినట్లయితే భారత పాలకుల అవినీతి కార్యకలాపాలకు తీవ్ర అడ్డంకిగా అది మారే ప్రమాదం ఉందని పాలకులకి బాగానే తెలుసు. కనీసం సి.బి.ఐ స్వాధీనంలోని సమాచారాన్ని సైతం వెల్లడి కావడానికి కూడా ప్రభుత్వం భయపడుతున్నదంటే వారు ప్రజల సొమ్ముని ఎంతగా భోంచేస్తున్నదీ ఇట్టే అర్ధం అవుతోంది.
ప్రజలు అన్నా హజారే బృందం రూపొందించిన లోక్ పాల్ బిల్లు వలన ప్రయోజనం ఉందని నమ్మితే ఆయన పోరాటానికి మద్దతు ఇవ్వాలని అరవింద్ ఈ సందర్భంగా కోరాడు.

ఈ వీడియో చూడండి: http://videos.teluguwebmedia.in/cbi