సమాచార హక్కు చట్టం (Right to Information Act) ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ సంస్ధలు పనిచేస్తున్న పద్ధతుల్లో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం 2005 లో ప్రవేశ పెట్టిన దగ్గర్నుండీ, చట్టాన్ని ఇప్పటికి అనేకసార్లు తూట్లు పొడిచారు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అత్యున్నత సంస్ధలు అన్నింటినీ దీనినుండి మినహాయించారు. తాజాగా మినహాయింపుల జాబితాలో మరో మూడు సంస్ధలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జూన్ 9 నే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల ఐనప్పటికీ శనివారమే ఇది వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన “వ్యక్తులు మరియు శిక్షణ విభాగం” (Department of Personnel and Training) లేదా డి.ఓ.పి.టి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజాగా మినహాయించిన సంస్ధలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ లేదా సి.బి.ఐ, నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజన్సీ లేదా ఎన్.ఐ.ఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ లేదా నాట్‌గ్రిడ్. ఇప్పటికే మినహాయింపుల జాబితాలో 22 సంస్ధలు ఉండగా దానికి తాజాగా ఈ 3 సంస్ధలు చేరాక మినహాయింపుల సంఖ్య 25 కి చేరుకుంది.
సి.బి.ఐ, ప్రత్యేక క్రిమినల్ కేసులు, ఆర్ధిక నేరాలు, అవినీతి తదితర అంశాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. ఎన్.ఐ.ఏ, దేశ సార్వభౌమత్యాన్నీ, భద్రతనూ, సమగ్రతనూ నష్టపరచడం, హాని కలిగించడం లాంటి కేసులను పరిశోధించి ప్రాసిక్యూట్ చేయడానికి ఉద్దేశించిన సంస్ధ. నాట్‌గ్రిడ్, చట్టాలను అమలు చేసే సంస్ధల మద్ద సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ, స్వదేశంలోనూ, విదేశాల్లోనూ టెర్రరిస్టు నేరాలను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన సంస్ధ. ఈ మూడింటి కార్యకలాపాలను ఆర్.టి.ఐ నుండి మినాయింపు ఇవ్వవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి అర్జెంటుగా ఎందుకు కలిగింది? వివరాలేమీ ప్రభుత్వం ప్రకటించలేదు.
ఈ విధంగా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నించడానికి కాస్తో కూస్తో ఉపయోగపడుతున్న చట్టాలను నీరు గార్చడమే పనిగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాలు యధాతధ పరిస్ధితి కొనసాగాలని కోరుకుంటున్నట్లు వారి చేస్టలు చెబుతున్నాయి. అంతులేని అవినీతికి పాల్పడే అవకాశాలు ఇప్పటి పాలనా వ్యవస్ధలో పుష్కలంగా ఉన్నాయి. అవినీతితో సంపాదించిన డబ్బుని పెద్ద పెద్ద మొత్తాల్లో విదేశీ బ్యాంకులకు తేలిగ్గా తరలించగల లూప్‌హోల్స్ అనేకం ఇప్పటి చట్టాలకు ఉన్నాయి. దారుణమైన నేరాలు చేసి కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాగల మార్గాలున్నాయి. వేల, లక్షల కోట్లు ఆస్తులను కలిగి ఉండి కూడా కారు కూడా లేదని, నివసించడానికి ఇల్లు కూడా లేని దుర్భర పరిస్ధితుల్లో ఉన్నామని ప్రభుత్వాన్నీ, పోలీసుల్నీ, కోర్టుల్నీ, ఎన్నికల కమిషన్‌నీ మోసం చేయగల అవకాశాలూ ఉన్నాయి.
ప్రభుత్వంలో అధికారం వెలగబెడుతున్న రాజకీయ నాయకులూ, పాలధికారులయిన బ్యూరోక్రట్లూ అందరూ ఈ అవకాశాలన్నీ యధాతధంగా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కొనసాగాలని కోరుకుంటున్నారు. అందుకోసం వాళ్ళూ దేనికైనా తెగిస్తున్నారు. విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పేర్లు చెప్పమంటే జాతీయ భద్రతకు ప్రమాదం అంటారు. బ్యాంకుల వద్ద వందల వేల కోట్ల అప్పులు తీసుకుని ఎగవేసి నాన్ పెర్ఫార్మింగ్ అస్సెట్లు కుప్పలు కుప్పలుగా బ్యాంకుల వద్ద పేరుకుపోయి విపరీతమైన నష్టాలకు గురిచేసిన వారి పేర్లు చెప్పమంటే జాతీయ సమగ్రతకు ముప్పు అని సాక్ష్యాత్తూ పార్లమెంటులోనే ప్రకటిస్తారు. ప్రధాని దగ్గర్నుండి సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ వరకూ అంతా అవినీతికి పాల్పడుతుంటే వారిని శిక్షించడానికి లోక్ పాల్ చట్టాన్ని తెమ్మంటే అత్యున్నత స్ధానాల్లో ఉన్నవారిని లోక్ పాల్ నుండి మినహాయించాలని సిగ్గు లేకుండా వాదిస్తారు. ఆందోళన చేసిన గాంధేయుల్ని సైతం పోలీసుల్తో చితక బాదిస్తారు. లేదా వారి గుణ గణాల్ని హత్య గావించడానికి (character assassination) దుర్మార్గంగా, పనిగట్టుకుని మరీ విద్వేష పూరిత ప్రచారాలు (smear campaign) చేస్తారు. ఇవన్నీ యధాతధ స్ధితి కొనసాగించడానికి వీరు చేసే ప్రయత్నాలే.
ఈ ప్రయత్నాలన్నింటికీ పతాక స్ధాయి అసలు చట్టాలనే కుళ్ళ బొడవడం. ఒక చట్టం వలన ప్రభుత్వాల్లో అత్యున్నత స్ధానాల్లో ఉన్నవారికి ఎప్పుడైనా పొరబాటున ఇబ్బంది కలిగితే చాలు, ఇక ఆ చట్టం ఉండకూడదు. అటువంటి చట్టాలను తీసెయ్యడమో, లేక వాటి కోరలు పీకడమో చేసెయ్యాల్సిందే. అన్నా హజారే దీక్ష విరమించడానికి ఆయన కోరికలన్నింటినీ ఆమోదించిన కేంద్ర పభుత్వం మరుసటి రోజునుండే హామీల్ని ఉల్లంఘించడం ప్రారంభించింది. ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రధాని, ఛీఫ్ జస్టిస్ లే కకుండా ఇంకా అనేకమందిని లోక్ పాల్ పరిధినుండి తప్పించడానికి ప్రయనిస్తోందని పౌర సమాజ ప్రతినిధులు స్వయంగా చెబుతున్నారు. విదేశాల్లోని నల్ల ధనం తెప్పించమంటే అసలు వారి పేర్లే చెప్పడానికి తిరస్కరిస్తున్నారు. ఇక నల్లధనాన్ని ఎలా తెప్పిస్తారు. పైపెచ్చు విదేశీ బ్యాంకులతో చర్చిస్తున్నట్లు పచ్చి అబద్ధపు ప్రకటనలు చేసి దగా చేయడానికి ఎల్లప్పుడూ రెడీ.
ఛీ, వీళ్ళు పాడుగాను. గత్తరన్నా రాదేమీ వీళ్ళకి?

చివర్లో మీ నిరసన నవ్వు తెప్పిస్తోంది.
చట్టాలను సరిగా అమలు చేయలేకపోతున్నారనే విమర్శల తలనొప్పి తప్పించుకోడానికి ఉన్నవాటికే మినహాయింపులూ, సవరణలూ చేయటం ఎప్పుడో మొదలైంది కదా? ‘ఛీ, వీళ్ళు పాడుగాను. గత్తరన్నా రాదేమీ వీళ్ళకి?’ అంటూ ప్రజలు పెట్టే శాపనార్థాలేమీ పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఇలాగే తెలివిగా ప్రవర్తిస్తాయి! ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది మామూలే!
very informative article ..