లిబియాపై దాడుల కొనసాగింపుకు అమెరికా ప్రతినిధుల సభ నిరాకరణ


శనివారం అమెరికా కాంగ్రెస్ లిబియాకి సంబంధించి రెండు బిల్లులపై ఓటింగ్ నిర్వహించింది. రెండు బిల్లులపై ప్రతినిధుల సభ ఇచ్చిన తీర్పు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కనిపించడం ఆశ్చర్యకరం. నాటో నాయకత్వంలో లిబియాపై కొనసాగుతున్న మిలట్రీ ఆపరేషన్‌ను కొనసాగించడానికి అధ్యక్షుడు ఒబామాకు అధికారం ఇవ్వడానికి ప్రవేశపెట్టిన బిల్లును మెజారిటీ సభ్యులు తిరస్కరించారు. గత కొద్దివారాలుగా లిబియాలో అమెరికా నిర్వహిస్తున్న పాత్ర వివాదాస్పదం అయ్యింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే అధ్యక్షుడు లిబియా యుద్ధంలో కొనసాగుతుండడాన్ని రిపబ్లికన్ పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందినట్లయితే లిబియాలో అమెరికా ఒక సంవత్సరం పాటు పరిమిత స్ధాయిలో ఆపరేషన్లు నిర్వహించడానికి అనుమతి లభించేది. దానితో పాటు భూతల సైనికులని లిబియాలో దించకుండా నిషేధం విధించబడేది.US Congress bills

కాంగ్రెస్‌లో మరో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. దాని ప్రకారం లిబియాపై డ్రోన్ దాడులకు, వైమానిక దాడులకు నిధులు అందించడం నిలిపివేయాల్సి ఉంటుంది. కాని నాటో ఆపరేషన్‌ను అమెరికా మద్దతు ఇవ్వడం కొనసాగించడానికి అనుమతి లభిస్తుంది. ఈ బిల్లు కూడా కాంగ్రెస్ తిప్పికొట్టింది. డెమొక్రట్లతో పాటు 89 మంది రిపబ్లికన్లు ఈ బిల్లును వ్యతిరేకించారు. అంటే బిల్లుకు అనుకూలంగా 180 ఓట్లు, వ్యతిరేకంగా 238 ఓట్లు పోలయ్యాయి. ఈ బిల్లు ఓడిపోయింది కనుక డ్రోన్, వైమానిక దాడులకు నిధులు సమకూర్చడం కొనసాగుతుంది. కాని నాటో మిషన్‌కు అమెరికా బలగాలు మద్దతు ఇవ్వడానికి వీలులేదు. డ్రోన్, విమానాల దాడులకు నిధులిస్తూనే నాటో మిషన్‌కు మద్దతు ఇవ్వకూడదనడం ఏమిటో అర్ధం కాని విషయం. అలాగే మొదటి బిల్లును నిరాకరించడం ద్వారా సంవత్సర కాలం పాటు పరిమిత ఆపరేషన్లు నిర్వహించడానికి అనుమతి ఇవ్వకుండా భూతల బలగాలు దించడంపై నిషేధం నిరాకరించనట్లయింది. రెండు బిల్లుల్లో ఉన్న ఈ పరస్పర వైరుధ్యం ప్రత్యర్ధులను తికమక పెట్టడానికా, లేక ఇంకేమయినా తిరకాసు ఉందో తెలియదు.

అయితే లిబియా యుద్ధానికి అధికారం కల్పిస్తూ, అమోదం ఇవ్వడానికి ప్రవేశ పెట్టిన బిల్లును నిరాకరించడం కేవలం రిపబ్లికన్లు వేసిన సంకేతాత్మక రాజకీయ అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నట్లుగా బిబిసి తెలిపింది. ఈ బిల్లును ఆమోదించాలని డెమొక్రట్లు గట్టిగా కోరినప్పటికీ బిల్లు ఆమోదం పొందలేదు. లిబియా మిలట్రీ క్యాంపెయిన్‌కు అకస్మాత్తుగా మద్దతు విరమిస్తే అది గడ్డాఫీని బలపరచడమేనని హెచ్చరించారు. గడ్డాఫీ వ్యతిరేక తిరుగుబాటును మరి కొంతకాలం అణచివేస్తే పూర్తిగా చల్లబడుతుందన్న విశ్వాసం గడ్దాఫీకి కల్పించినట్లేనని డెమొక్రట్ల విప్ స్టెనీ హోయర్ చెప్పాడు. అంతే కాకుందా లిబియా పౌరుల జీవితాలు ప్రమాదంలో పడినట్లేనని ఆయన ఆందోళనకూడా వ్యక్తపరిచాడు. “మన విలువైన కూటములనూ, అవి కాపాడే మానవ హక్కుల సూత్రాలనూ నా కొలీగ్స్ అందరూ కాపాడాలని కోరుతున్నాను” అని హోయర్ కోరాడు. గత ఆదివారం గడ్దాఫీకి దీర్ఘకాలిక మిత్రుడి ఇంటిపైన జరిపిన దాడిలో 6గురు పిల్లలతో సహా 19 మంది పౌరులు చనిపోతే, ఎవరు చనిపోయినా అది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అని నిర్ధారించుకునే నాశనం చేశాం అని అహంకార పూరితంగా ప్రకటించిన నాటో కూటమి మానవ హక్కుల సూత్రాలను పాటిస్తుందని చెప్పడమే ఇక్కడ విడ్డూరం.

1973 వియత్నాం యుద్ధం కాలం నాటి చట్టం ప్రకారం అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలపై యుద్ధం చేయదలుచుకుంటే అందుకు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఒక వేళ కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం ప్రారంభించినట్లయితే మూడు నెలలలోపు కాంగ్రెస్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అధ్యక్షుడు స్వయంగా మరో 30 రోజులపాటు యుద్ధం కొనసాగింపును కోరవచ్చు. ఆ లోపుగా కాంగ్రెస్ అనుమతి తీసుకోనట్లయితే మొత్తం మీద నాలుగు నెలలలోపు అనుమతి తీసుకోనట్లయితే ఆ యుద్ధం చట్ట విరుద్ధం అవుతుంది. ఇలా అని 1973 చట్టం నిర్దేశిస్తోంది. లిబియా యుద్దం మే 20 తో మూడు నెలలు పూర్తిచేసుకుంది. జూన్ 19 తో అధ్యక్షుడికి ఉన ప్రత్యేకంగా ఇచ్చే నెల రోజుల పొడిగింపు కూడా పూర్తయ్యింది.

ఒబామా అనుమతి కోరే బదులు 32 పేజీల డాక్యుమెంట్ పంచి అందులో లిబియా యుద్ధానికి అనుమతి తీసుకోనవసరం లేదని వాదించాడు. దానికి కారణం 1973  చట్టంలో పేర్కొన్నట్లుగా లిబియా యుద్ధంలో hostilities ఏమీ లేవనీ అమెరికా పాత్ర కేవలం సహాయక పాత్రేననీ వాదించాడు. అమెరికా సైన్యం ప్రత్యక్ష పాత్ర పోషించడం లేదనీ, అమెరికా సైనికులెవరూ యుద్ధంలో లేరనీ, పరస్పరం దాడులు జరగడం లేదనీ వాదించాడు. అయితే ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నాయకుడు “అమెరికా డ్రోన్ విమానాలు లిబియాకి వెళ్తున్నాయి. లిబియాపై బాంబులు వదులుతున్నాయి. ఆ దాడుల్లో లిబియా సైనికులు మరణిస్తున్నారు. అయినా ఇది యుద్ధం కాదని ఒబామా సూత్రీకరిస్తున్నాడు” అని విమర్శించాడు.

లిబియా యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని చేసిన వాదనలో ఒబామా యుద్ధానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. అమెరికా జరిపే మిలట్రీ ఆపరేషన్లలో అమెరికన్ సైనికులెవరూ గాయపడడం లేదా చనిపోవడం జరగక పోతే అది యుద్ధం కానట్లే. ఎదుటి పక్షంలో ఎంతమంది సైనికులైనా చనిపోవచ్చు. పౌరులెంతమందైనా మరణించవచ్చు. అమెరికా ఎన్ని సార్లైనా వైమానిక దాడులు చేయవచ్చు. డ్రోన్ విమానాలతో బాంబు దాడులు చేయవచ్చు. ఒకటీ అరా విమానాలు సాంకేతిక లోపం వలన కూలిపోవచ్చు. అయినప్పటికీ అమెరికా సైనికులు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోతే అది ఇంకేమైనా కావచ్చు కాని యుద్ధం మాత్రం కాదు. అది లిబియా విషయంలో సహాయక పాత్ర అయ్యింది. మరొక చోట మరో పాత్రం కావచ్చు.

డ్రోన్ విమానాల వలన అమెరికా మిలట్రీకి ఎన్నడూ రాని అవకాశం వచ్చింది. సైనికులెవరూ నడపకుండానే వైమానిక దాడులు చేసి వైరి పక్షానికి నష్టం చేయవచ్చు. ఎక్కడో కమాండ్ సెంటర్ లో కూర్చుని రిమోట్ కంట్రోల్‌తో డ్రొన్ విమానాన్ని విదేశాలపైకి పంపి బాంబుదాడులతో విధ్వంసం చేయవచ్చు. పోతే విమానం పోతుంది తప్ప సైనిక నష్టం ఉండదు. డ్రోన్ హెలికాప్టర్లను యూరోపియన్ దేశాలు కూడా సమకూర్చుకున్నాయి. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకుని మానవ రహిత విమానాలు తయారు చేసుకున్నంతమాత్రాన దేశాలపై బడి పౌరులూ, సైనికులూ అని తేడా లేకుండా సామూహిక విధ్వంసాలకు పాల్పడుతూ కూడా తాము చేస్తున్నది యుద్ధం కాదనడం అమెరికా యుద్ధ పిపాసకీ, సామ్రాజ్యవాద ఆధిపత్యానికీ, మార్కెట్ల దాహానికీ ప్రతీక తప్ప మరొకటి కాదు. అగ్ర రాజ్యాల దాష్టీకాన్ని ప్రజలే ఎదుర్కోవాల్సి ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s