
ఈ నేపధ్యంలో గ్రీసుకి బెయిలౌట్ ప్యాకేజి ఇవ్వబోమని బెదిరిస్తూ వచ్చిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు శుక్రవారం గ్రీసుతో అంగీకారానికి వచ్చినట్లు ప్రకటించి 110 బిలియన్ యూరోల రెండవ బెయిలౌట్ ఇస్తున్నట్లు తెలిపాయి. చిత్రంగా ఈ మొత్తంలో ఇ.యు దేశాలు భరిస్తున్నది కేవలం 50 బిలియన్ యూరోలు మాత్రమే. మిగిలిన దానిలో 30 బిలియన్ యూరోల మేరకు ప్రవేటు పెట్టుబడుదారులు తమ పాత అప్పులను రీస్ట్రక్చర్ లేదా రోలోవర్ చేస్తాయి. అంటే ఈ 30 బిలియన్ యూరోలు గ్రీసు కళ్ళజూసే అవకాశం లేదు. అప్పటికే ఉన్న అప్పుతో దానిపై సమకూరిన వడ్డీ కలిపి కొత్త అప్పుగా రీస్ట్రక్చర్ చేస్తారన్నమాట! మరో 30 బిలియన్ యూరోలు గ్రీసు దేశమే తన ప్రభుత్వరంగ కంపెనీలను అమ్మేసి సంపాదించుకోవాలి. ఈ మాత్రానికి గ్రీసును అంతగా బెదిరించి ప్రపంచవ్యాపితంగా షేర్ మార్కెట్లు నష్టపోవడానికి ఎందుకు కారకులయ్యారు?
మొత్తం మీద 30 షేర్ల బి.ఎస్.ఇ 513.89 పాయింట్లు (2.89 శాతం) లాభపడి 18240.68 పాయింట్లవద్ద క్లోజయ్యింది. 50 షేర్ల ఎన్.ఎస్.ఇ 151.25 పాయింట్లు (2.84 శాతం) లాభపడి 5471.25 వద్ద క్లోజయ్యింది. ఫైనాన్షియల్ షేర్లు షేర్ల పెరుగుదలకు నాయకత్వం వహించాయి. ఎస్.బి.ఐ, ఐ.సి.ఐ.సి.ఐ, హె.డి.ఎఫ్.సి లు 2.1 శాతం నుండి 5.7 శాతం వరకూ లాభాలు నమోదు చేశాయి. బ్యాంకింగ్ ఇండెక్స్ 3.1 శాతం పెరిగింది.
ఐ.ఇ.ఏ జులైలో 60 మిలియన్ బ్యారెళ్ళ చమురుని విడుదల చేయనున్నదని ప్రకటించాక ఆయిల్ ధరలు పడిపోయాయి. మే నెలలోని అత్యధిక ధర నుండి 20 శాతం తగ్గినట్లుగా రాయిటర్స్ తెలిపింది. శుక్రవారం బాగా తగ్గిన ఆయిల్ ధర శనివారం ఒక డాలర్ పెరిగి 107 డాలర్లకు చేరుకుంది. జె.పి.మోర్గాన్, గోల్డ్మెన్ సాచ్ కంపెనీలు ఆయిల్ ధరలపై భవిష్యత్తు అంచనాలను తగ్గించుకున్నాయి. ఎమర్జెన్సీ ఆయిల్ నిల్వల విడుదల నెమ్మదించిన ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేయడానికి కూడా ఉద్దేశించారు. అదెంతవరకు పనిచేస్తుందో వేచి చూడవలసిందే.
భారత ప్రభుత్వం డీజెల్, కిరోసిన్, గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో ఆహార ధరలతో పాటు అన్ని సరుకుల రవాణా ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ప్రభుత్వ చర్యలు ద్రవ్యోల్బణం పెరగడానికే దోహదం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణ తగ్గించడానికికని చెబుతూ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతున్నప్పటికీ ఆ చర్యల వలన ద్రవ్యోల్బణం తగ్గిన దాఖలాలు ఏనాడూ కనపడలేదు. విచ్చలవిడి అవినీతితో నల్లధనం విడుదలకావడానికి దోహదపడుతుండగా ద్రవ్యోల్బణం అరికట్టడం అసాధ్యమని తెలిసినా ఆ వైపుగా ప్రభుత్వ చర్యలేమీ లేవు. పైగా అవినీతిపై పోరాడుతున్న వారిపై దుష్ప్రచారానికి దిగడమే తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న ధ్యాస కనిపించడం లేదు. ఆయిల్ ధరల్లో అత్యధిక భాగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే ఆక్రమించాయి. ఈ పన్నులు తగ్గించి ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించవచ్చు. బహుశా అది అత్యాశేనేమో!
