గ్రీసు రెండో బెయిలౌట్‌కి ఇ.యు+ఐ.ఎం.ఎఫ్ అంగీకారం, గ్రీకులపై నడ్డి విరిగే భారం


Greece gets bailout -WSJ

దొంగల్ ముఠా: ఎడమనుండి ఐర్లండు ప్రధాని, గ్రీసు ప్రధాని పపాండ్రూ, బ్రిటన్ ప్రధాని కామెరూన్

“ఎద్దు పుండు కాకికి ముద్దు” అని సామెత. గ్రీసు అప్పు సంక్షోభం యూరప్‌లోని ధనిక దేశాల ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలకు సిరులు కురిపించబోతోంది. అదే సమయంలో గ్రీసు ప్రజలకు “పెనం మీదినుండి పొయ్యిలోకి జారిన” పరిస్ధితి దాపురిస్తోంది. గ్రీసు మరిన్ని పొదుపు చర్యలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే రెండో బెయిలౌట్ ప్యాకేజి ఇచ్చేది లేదని నెలరోజుల నుండి బెదిరిస్తూ వచ్చిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు తాము కోరింది సాధించుకుని రెండో బెయిలౌట్‌ ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మోసపూరితమైన బెయిలౌట్ వలన ఇప్పటికే సగం చచ్చిన గ్రీకు ప్రజలపై మరింత భారాన్ని గ్రీసు ప్రభుత్వం మోపడానికి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల వద్ద తలూపింది.

పచ్చి మోసం

శుక్రవారం జరిగిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ప్రతినిధులు గ్రీసు ప్రధానితో జరిపిన సమావేశంలో రెండో బెయిలౌట్‌గా 110 బిలియన్ యూరోలు (156.83 బిలియన్ డాలర్లు) గ్రీసుకి ఇవ్వడానికి అంగీకరించినట్లుగా గ్రీసు ప్రధాని జార్జి పపాండ్రూ ప్రకటించాడు. గత సంవత్సరం మే నెలలో కూడా 110 బిలియన్ యూరోల ప్యాకేజిని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ప్రకటించి దానిని ఒక్క సంవత్సరం మాత్రమే ఇచ్చాయి. రెండో సంవత్సరం వచ్చేసరికి గ్రీసు అమలు చేయవలసిన షరతులను పూర్తిగా అమలు చేయలేదనీ, కోశాగార లోటు (fiscal deficit) తగ్గింపు నిర్దేశించిన లక్ష్యానికి చేరలేదని చెబుతూ ఆ ప్యాకేజీ కొనసాగింపుకు నిరాకరించాయి.

గ్రీసు ఒడ్డుకి చేరాలంటే మొదటి ప్యాకేజి సరిపోదనీ, మరింత మొత్తంలో బెయిలౌట్ ప్యాకేజీ కావాలనీ అది కనీసం 120 బిలియన్ యూరోలు ఉండాలని ప్రకటించాయి. తమ ప్రకటనలతో మార్మెట్లో ఉద్రిక్తలు సృష్టించి మదుపుదారుల్లో గ్రీసు ఆర్ధిక వ్యవస్ధపై అపనమ్మకాలు సృష్టించాయి. “ఇక ఏమీ లేదు, అంతా నాశనం” అన్న అభిప్రాయాన్ని కలిగించాయి. అవి ఇచ్చిన అప్పుతో విధించిన షరతులను అమలు చేయడం వలన గ్రీసు ప్రజలు అనేక కష్ట నష్టాలకు గురయ్యారు. వేతనాలు, పెన్షన్లు తగ్గించడంతో పాటు, పన్నులు విపరీతంగా పెంచి, కార్మికుల, ఉద్యోగుల సదుపాయాలను రద్దు చేయడంతో వారి కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. మధ్యతరగతి ప్రజలు పేదలుగా మారారు.

మరోవైపు గ్రీసు ప్రజలు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు తమపై రుద్దాలని డిమాండ్ చేస్తున్న షరతులవలన తమ జీవితాలు కొండెక్కుతాయని గ్రహించి ఆందోళనలు చేశారు. సమ్మెలు నిర్వహించారు. ఎన్ని చేసినా వారి గోడు ఎవరికీ పట్టలేదు. గ్రీసు ఆర్ధిక పరిస్ధితిపై అపనమ్మకాలు సృష్టించడం ద్వారా గ్రీసు దేశంలోని ప్రభుత్వరంగ కంపెనీలను ప్రవేటు పెట్టుబడుదారులకు అమ్మించాలని కుట్రలు పన్నాయి. ప్రవేటీకరణ తప్ప మరోదారి లేదు అన్న దుర్మార్గ ప్రచారాని కార్పొరేట్ మీడియా సంస్ధలతో విస్తృత ప్రచారం చేయించాయి. బెయిలౌట్ ఇచ్చేది లేదని భయపెట్టి, బెదిరించి తాము అనుకున్నది సాధించుకున్నాక ప్యాకేజి ఇస్తున్నట్లు ప్రకటించాయి.

ఏమిటా రెండో ప్యాకేజి? వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక అందించిన సమాచారం ప్రకారం, 110 బిలియన్ యూరోల ప్యాకేజీలో 30 బిలియన్ యూరోలు గ్రీసు ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలను అమ్మడం ద్వారా గ్రీసు సంపాదించుకుంటుంది. మరో 30 బిలియన్ యూరోలు ప్రవేటు మదుపుదారులు ఇప్పటికే సమకూర్చిన అప్పును రోలోవర్ (అప్పు, వడ్డీ కలిపి కొత్త అప్పుగా మార్చడం. ఇది అప్పును రీస్ట్రక్చర్ చేయడమే. పదాలు మార్చి మాయ చేసే విద్య ఇది) చేస్తారు. మిగిలించి మాత్రమే ఇ.యు దేశాలు, ఐ.ఎం.ఎఫ్ లు సమకూరుస్తాయి. తీరా చూస్తే అంతిమ ప్యాకేజీలో కొత్తగా సమకూర్చిన అప్పేమీ లేదు. 60 బిలియన్ యూరోలు పోగా మిగిలిన 50 బిలియన్ యూరోలు గత సంవత్సరం మొదటి బెయిలౌట్ ప్యాకేజీలో హామీ ఇచ్చినదే. అదే కొత్తగా ఇస్తున్నట్లు నాటకాలాడినట్లు కనిపిస్తోంది.

దొంగలు దొంగలు కలిసి…

ఇందులో నగ్నంగా కనిపిస్తున్న దగా ఏంటంటే, ఇన్ని రోజులూ బెదిరించి, భయపెట్టి వీళ్ళూ ఇస్తున్నామని చెబుతున్న దానిలో సగానికిపైగా వాళ్ళ ఇవ్వకపోవడమే. 30 బిలియన్ యూరోలు గ్రీసు దేశమే సొంత ప్రభుత్వరంగ కంపెనీలను అమ్ముకుని సంపాదించుకోవాలి. ఇందులో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇస్తున్నదేమీ లేదు. కానీ వారు పొందబోతున్నది మాత్రం కొండంత. అదీ శాశ్వతంగా లభించబోతోంది. అంత విలువ గల ప్రభుత్వరంగ కంపెనీలు శాశ్వతంగా ఇ.యులోని ధనిక దేశాల బహుళజాతి సంస్ధలకు చౌకగా లభిస్తాయి. చవకే కాకుండా ఆ పరిశ్రమలున్న రంగాల్లోకి ఇక స్వేచ్ఛగా ప్రవేటు పెట్టుబడులు ప్రవహిస్తాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల అమ్మకం వలన అందులో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులంతా ఉద్యోగాలు కోల్పోయి వీధిపాలవుతారు. మొదటి సంవత్సరం షరతుల్లో వేతనాలు తగ్గిపోయి, సదుపాయాలన్ని రద్దు కాగా, రెండో ప్యాకేజీ షరతుల్లో ఏకంగా ఉద్యోగాలే రద్దవుతాయి. ఇంతకంటె పచ్చి మోసం, దగా, నయవంచన ఇంకేమయినా ఉంటుందా? అదీ తోటి ఇ.యు దేశంపైన, సాయం చేస్తున్నామని చెబుతూ, సంక్షోభం నుండి బైటికి లాగుతున్నామని చెబుతూ గ్రీసు దేశ ప్రజలను దరిద్రం లోకి నెడుతున్న ఈ పాలకులను వర్ణీంచడానికి పదాలు ఉన్నాయా అని అనుమానం వస్తోంది.

ఇక మరో 30 బిలియన్ యూరోలు ప్రవేటు మదుపుదారులు రోలోవర్ చేస్తారు. ఈ ప్రవేటు మదుపుదారులకు రేటింగ్ సంస్ధల చేత రేటింగ్ తగ్గింపజేసి, సంక్షోభంలో ఉందని అదేపనిగా ప్రచారం చేసి గ్రీసుపై నమ్మకం కోల్పోయేలా చేసారు. ప్రవేటు మదుపుదారులు (ఇన్వెస్టర్లు) అధిక వడ్డీలు (యీల్డ్) డిమాండ్ చేస్తున్నందునే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు రంగంలోకి వచ్చి బెయిలౌట్ ఇచ్చాయి. రెండో సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ వారినే బెయిలౌట్‌లో భాగం పంచుకునేలా చేశారు. ఇదే జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజిలు చేసుకున్న ఒప్పందం. వీళ్ళు గ్రీసు ప్రజల తలరాతలను నిర్దేశించారు. తాము ఒక్క పైసా కూడా అదనంగా విదల్చకుండా పాత కమిట్‌మెంట్‌ని ఏమాత్రం మించకుండా పధకాలు పన్ని ప్రవేటు బాండ్ హోల్డర్లు కూడా అప్పు భారాన్ని భరించాలన్న తమ డిమాండ్ ను కామ్‌గా నెరవేర్చుకున్నాయి జర్మనీ, ఫ్రాన్సులు. రోలోవర్ అంటే గ్రీసు అప్పు చెల్లించలేక డిఫాల్టు కావడమేనని హెచ్చరించిన రేటింగ్ సంస్ధలు ఇప్పుడెక్కడ? వీళ్ళంతా దొంగలేననీ, దొంగలూ, దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకున్నారని ఇక్కడ స్పష్టంగా అర్ధం అవుతోంది.

పచ్చి అబద్ధాలు

“మా భాగస్వాముల మద్దతు మాకుంది. ఎందుకంటె గ్రీసు ప్రజల త్యాగాన్ని వారు గుర్తించారు. మా ఇంటిని సరిదిద్దుకోవడానికి మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం” అని పపాండ్రూ ప్రకటిస్తున్నాడు. ఈ మూడు వాక్యాల్లో మధ్య వాక్య ఒక్కటే నిజం. మిగిలిన రెండూ పచ్చి అబద్ధాలు. గ్రీసు భాగస్వాముల మద్దతు నిజంగా ఉన్నట్లయితే నెల రోజుల పాటు అంత ఘోరంగా డ్రాక్యులా స్ధాయిలో బెదిరించేవి కాదు. గ్రీసులోని ప్రభుత్వ రంగ సంస్ధలని అమ్మకానికి పెట్టేవి కాదు. గ్రీసు ప్రజలపై మరింత భారాన్ని మోపేవి కావు. కాని వాళ్ళూ చేసినవి అవే. గ్రీసు ప్రజల జీవితాలను నరకప్రాయం చేసిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసుకి భాగస్వాములట! గ్రీసు పాలకులకీ, ధనవంతులకీ భాగస్వాములంటే బాగుంటుంది కాని, గ్రీసు ప్రజలకు మాత్రం కాదు. ఇంటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పపాండ్రూ చెప్పడం మరింత విడ్డూరం. బహుశా ఆయన స్వంత ఇంటిని ఉద్దేశించి అనిఉండాలి. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల షరతులకు ఒప్పుకున్న పపాండ్రూకి ఎంత కమిషన్ జమ అయిందో ఆయన చెబితే తప్ప ఎవరికి తెలుస్తుంది? పపాండ్రూ ఇంటితో పాటు లాభాల సంక్షోభంలో ఉన్న యూరప్, అమెరికాల బహుళజాతి సంస్ధలను గ్రీసు ప్రజల త్యాగాలతో సరిదిద్దడానికే పపాండ్రూ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లతో చేతులు కలిపాడు.

ఇక పపాండ్రూ ప్రతిపాదించనున్న పొదుపు చర్యల బిల్లును గ్రీసు పార్లమెంటు ఆమోదిస్తుందా లేదా అని గత రెండు నెలలుగా అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. గ్రీసు పార్లమెంటులోని 300 సభ్యుల్లో అధికార సోషలిస్టు (ఇది నెహ్రూ సోషలిజం లాంటిదే. సోషలిజం ముసుగేసుకున్న పెట్టుబడిదారీ శక్తులే ఇవి. బహిరంగంగా నూతన ఆర్ధిక విధానాలకి మద్దతు పలికే వారి కంటే వీరితోనే ప్రజలకు అధిక ప్రమాదం సంభవిస్తోంది) పార్టీకి 155 సభ్యుల బలం ఉంది. వీరిలో ఒక సభ్యుడు పొదుపు బిల్లుకు ఓటేయడం లేదని చెప్పాడట. మరొకాయన కూడా బిల్లుకి వ్యతిరేకం అని చెబుతూనే అంతిమ నిర్ణయం సోమవారం చెబుతానంటున్నాడు. ధామస్ రోబోపౌలోస్ అనే పేరుగల ఈయన పపాండ్రూతో బేరం పెట్టబోతున్నాడని ఆయన మాటలే చెబుతున్నాయి. సోమవారం నాటికి ఆయనకి అంగీకారమైన పధకాన్ని పపాండ్రూ సిద్ధం చేయాలన్నదే ఈయన ఇస్తున్న సందేశం. పధకం అంటే ముడుపులు కావచ్చు, కాంట్రాక్టు కావచ్చు, లేక తనకు ఇష్టురాలయిన కంపెనీకి అనుకూల నిర్ణయం కావచ్చు. ఇటువంటి పధకాలతో ప్రజల పట్ల వీరికి ఉన్న ప్రేమ ఇట్టే ఆవిరై పోతుంది. పాలకుల ఆశయం నెరవేరుతుంది. బలయ్యేది అంతిమంగా గ్రీసు ప్రజలే. వారు నిర్ణయాత్మకమైన కార్యాచరణకి దిగనిదే వారిపై ఈ దుర్మార్గుల దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s