చైనా ఫ్యాక్టరీ రంగ అభివృద్ధి కుంటుబడిందని పి.ఎమ్.ఐ సర్వేలో తేలింది. పర్ఛేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ను (Purchasing Managers’ Index) కుదించి పి.ఎం.ఐ గా పిలుస్తారు. ఈ ఇండెక్స్‌లో 50 ఉన్నట్లయితే అటు అభివృద్ధి గానీ ఇటు తిరోభివృద్ధి (contraction) గానీ ఏమీ లేదని భావిస్తారు. 50 కంటె ఎక్కువగా ఉన్నట్లయితే అది విస్తరణ లేదా అభివృద్ధిగా భావిస్తారు. అంతకంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ రంగం కుచించుకు పోతున్నట్లుగా లేదా తిరోభివృద్ధిని నమోదు చేస్తున్నట్లుగా భావిస్తారు. గురువారం వెల్లడయిన సర్వే వివరాలు చైనా ఫ్యాక్టరీల ఉత్పత్తి స్తంభనకు దగ్గరగా ఉన్నట్లుగా తేలింది. చైనా ద్రవ్య విధానంలో బ్యాంకు రేట్లను పెంచడం వలనా, స్ధూలంగా ప్రపంచ మార్కెట్‌లోనే డిమాండ్ తగ్గిపోవడం వలనా చైనా పారిశ్రామిక వృద్ధి స్తంభనకు గురైందని భావిస్తున్నారు.
చైనా పారిశ్రామిక కార్యకలాపాలకు సంబంధించి హెచ్.ఎస్.బి.సి నమోదు చేసే పి.ఎం.ఐ వివరాలు మొదట వెల్లడవుతాయి. దీని ప్రకారం చైనా పి.ఎం.ఐ జూన్ నెలలో 50.1 గా నమోదైంది. జులై 2010 నుండి ఇదే తక్కువని రాయిటర్స్ తెలిపింది. అంటే చైనా పారిశ్రామిక ఉత్పత్తి దాదాపుగా స్తంభించిపోయిందనే చెప్పుకోవచ్చు. మే నెలలో హెచ్.ఎస్.బి.సి నమోదు చేసిన చైనా పి.ఎం.ఐ 51.6 గా ఉంది. చైనా ఆర్ధిక కార్యకలాపాలు మరింతగా నెమ్మదిస్తాయని జూన్ పి.ఎం.ఐ ద్వారా తెలుస్తోందని క్రెడిట్ సుసీ కి చెందిన ఎనలిస్టు అభిప్రాయపడ్డాడు. ఆర్ధికవృద్ధి నెమ్మదిస్తున్న లక్షణం ఒక్క అభివృద్ధి చెందిన దేశాలకే కాకుండా ఎమర్జింగ్ దేశాలకు కూడా వ్యాపించిందని దీని ద్వారా అర్ధమవుతోందని మరొక విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు.
అయితే చైనా డేటాపై మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. వాటి స్పందన ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికే గ్రీకు సంక్షోభం, అమెరికా వృద్ధి నెమ్మదించడం వంటి కారణాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న మదుపుదారులు (investors) తమ జాగ్రత్తల జాబితాలొ మరొక అంశం చేరినట్లేనని భావిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపుదలవలన చైనాలో కూడా డిమాండ్ తగ్గిపోవడం పారిశ్రామిక వృద్ధి స్తంభనకు మరొక కారణమని హెచ్.ఎస్.బి.సి తెలిపింది. కాని గత సంవత్సరంతో పోలిస్తే పారిశ్రామిక వృద్ధి ఇంకా 13 శాతం ఉన్నందున పెద్దగా అందోళన అనవసరమని ఆ సంస్ధ తెలిపింది.
చైనా ప్రధాన ద్రవ్యోల్బణం మే నెలలో 5.5 శాతంగా నమోదైంది. ఇది 34 నెలల్లో అత్యధికం. జూన్‌లో గానీ జులైలో గానీ ద్రవ్యోల్బణం గరిష్ట స్ధాయికి (6 శాతం) చేరవచ్చని భావిస్తున్నారు. గరిష్ట స్ధాయికి చేరుకోవడం అంటే అంతకంటె మించి పెరగదని చెప్పడమే. గరిష్ట స్ధాయికి చేరే లోపు చైనా మరొక విడత వడ్డీ రేట్లు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు పెంపుదల వలన చైనా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం కట్టడికే చైనా ప్రాధాన్యం ఇస్తోంది. ఇండియా కూడా ఆర్ధిక వృద్ధి త్యాగం చేశయినా సరే ద్రవ్యోల్బణం అరికడతామని చాలా సార్లు ప్రకటించింది. వడ్డీ రేట్లు పెంచడం దాని వలన అప్పులు భారంగా మారడం జరుగుతోంది గానీ ఇండియా ద్రవ్యోల్బణం మాత్రం తగ్గుతున్న సూచనలు కనిపించడం లేదు. అవినీతి డబ్బు, నల్ల ధనంగా వివిధ రూట్లలో దేశంలోకి ప్రవేసిస్తుండడం భారత ద్రవ్యోల్బణానికి కారణం. నల్లధనం ప్రభావం అధిక ధరల రూపంలో పేదలపై కూడా పడడం విషాధం.