దీర్ఘ కాలంపాటు గూఢచర్య సమాచారం సేకరించి సరిగ్గా గురిచూసి చేసిన దాడిలోనే 15 మంది పౌరులు మరణించారు. “ఆయుధాల వైఫల్యం వలన పౌరులు మరణించి ఉండొచ్చు” అని కూడా నాటో ప్రకటన చెబుతోంది. సరైన సమాచారం సేకరించి, సరిగ్గా గురిచూసి చేసిన దాడిలో సైతం పౌరులు మరణిస్తే అది ఆయుధాల వైఫల్యం అవుతుంది తప్ప ఆ ఆయుధాలు పేల్చిన వారి తప్పు మాత్రం కాదని నాటో చెబుతోంది. అదీ కాక భద్రతా సమితి అనుమతించక పోయిన చేస్తున్న మిలట్రీ క్యాంపెయిన్ లో పౌరులు మరణీంచలేమని చెప్పలేమని నాటో కమాండర్ ఒకరు ఆదివారం చెప్పాడు కూడా. లిబియా పౌరులను రక్షించడానికి మిలట్రీ క్యాంపెయిన్ చేపట్టిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు మెల్లగా తమ అసలు రంగును బైట పెడుతున్నాయి. వీరికి లిబియా పౌరుల రక్షణ కాదు కావలసింది. తమకు పూర్తిగా లొంగని గడ్డాఫీని చంపి తమమాట వినే వాడిని లిబియా లో ప్రతిష్టించాలి. అదే వీరి లక్ష్యం. 15 చనిపోయినందుకు ఈ సారి సారీ కూడా చెప్పలేదు నాటో. పదే పదే సారి చెప్పడం అనవసరమని నాటో భావిస్తున్నట్లుంది.
నాటో దాడిలో ధ్వంసమైన ఇల్లు లిబియా ప్రభుత్వ రివల్యూషనరీ కమాండ్ సెంటర్ లో సభ్యుడైన ఖ్వెల్దీ ఆల్-హమిదీ కి చెందినదిగా బిబిసి తెలిపింది. హమిదీని చంపడానికి చేసిన దాడి ఆయనని చంపలేదు కాని ఆయన కుటుంబంలోని ముగ్గురు పిల్లలు, మరో పాపను గర్భంలో మోస్తున్న వారి తల్లిని చంపడంలో విజయవంతమైంది. ఆదివారం నాడు ఐదుగురిని చంపిన మిసైల్ దాడి మిస్సైల్ స్ధావరంపై చేసిందని నాటో ప్రకటించింది. మిస్సైల్ స్ధావరంపై చేసిన దాడిలో ఐదుగురు పౌరులు ఎలా చనిపోయారో మాత్రం అది చెప్పలేదు. లిబియా పౌరుల్ని రక్షించడానికి నాటో చేస్తున్న మిలట్రీ క్యాంపెయిన్‌లో ఇంకెంతమంది లిబియా పౌరులు చనిపోవాలో!?
