మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్” ను నాటో దళాలు కోల్పోయాయని నాటో తెలియజేసింది. లిబియాపై సాగిస్తున్న మిలట్రీ క్యాంపెయిన్‌లో లిబియా గగనతలం నుండి గూఢచర్యం నిర్వహిస్తున్న మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్,” నేపుల్స్ (ఇటలీ) లొ ఉన్న కమాండ్ సెంటర్ తో కాంటాక్టు కోల్పోయిందని నాటోకి చెందిన వింగ్ కమాండర్ మైక్ బ్రాకెన్ చెప్పాడని బిబిసి తెలిపింది. మౌమ్మర్ గడ్డాఫీకి చెందిన బలగాలు లిబియా పౌరులను భయోత్పాతాలకు గురిచేస్తూ, వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందీ లేనిదీ గగనతలం నుండి పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా కమాండ్ సెంటర్ తో కాంటాక్టు కోల్పోయిందని సదరు కమాండర్ చెప్పాడు.
అయితే దాడులు చేయగల హెలికాప్టర్ దేనినీ నాటో కోల్పోలేదని బ్రాకెన్ నిర్ధారించాడు. “ఈ ఘటన వెనక కారణాలను మేము పరిశీలిస్తున్నాం” అని ఆయన తెలిపాడు. అంతకు ముందు లిబియా ప్రభుత్వం తన బలగాలు నాటోకి చెందిన అపాఛ్ హెలికాప్టర్‌పై కాల్పులు జరిపి కూల్చివేశాయని టెలివిజన్‌లో ప్రకటించింది. పశ్చిమ డిస్ట్రిక్టు ఐన జిటాన్‌లో ఈ కూల్చివేత ఘటన చోటు చేసుకుందని టి.వి. ప్రకటన తెలిపింది. అయితే లిబియా సైనికులు కూల్చి వేసిన అపాచ్ హెలికాప్టరూ, నాటో కోల్పోయిన “డ్రోన్ హెలికాప్టరూ” రెండూ ఒకటే అయిందీ లేనిదీ తెలియ రాలేదు. తాము అటాక్ హెలికాప్టర్ ను కోల్పోలేదని నాటో కమాండర్ నిర్ధారించినదాన్ని బట్టి రెండూ ఒకటే అని భావించవచ్చు.
ఈ నెలారంభంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు గడ్డాఫీని చంపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే హెలీకాప్టర్లను యుద్ధరంగంలోకి దించాయి. యుద్ధ విమానాలు చాలా ఎత్తులో ప్రయాణిస్తున్నందున టార్గెట్ లను సరిగ్గా తాకే అవకాశాలు తక్కువగా ఉంటుంది. దానివలన తిరుగుబాటు బలగాలకు నాటో వైమానిక దాడులు ఒక దశ తర్వాత ఉపయోగం లేకుండా పోయిందని నాటో దేశాలు భావిస్తున్నాయి. పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ తిరుగుబాటు బలగాలు ముందడుగు వేయలేని పరిస్ధితిలో ఉండడంతో వారికి మరింతగా సాయం చేయడానికి తక్కువ ఎత్తులో ఎగరగల హెలికాప్టర్లను రంగంలోకి దించాయి.
గడ్డాఫీ ఇంటిపై చేసిన దాడుల్లో సైతం గడ్దాఫీ చనిపోకపోగా ఆయన కుమారుడు, మనవళ్ళు ముగ్గురు చనిపోవడం నాటోపై విమర్శలకు దారితీసింది. గడ్దాఫీని చంపడం తన లక్ష్యం కాదని ప్రారంభంలో అమెరికా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత గడ్డాఫీ న్యాయబద్ధమైన టార్కెటే నని నిస్సిగ్గుగా ప్రకటించింది. వైమానిక దాడుల్లో లిబియా పౌరులు చనిపోతున్నప్పటికీ నాటో బలగాలు మొక్కుబడిగా ‘సారీ’ చెప్పడం తప్ప పెద్దగా ఆందోళన చెందటం లేదు. ఇవన్నీ నాటో మిలట్రీ క్యాంపెయిన్ గడ్డాఫీని కూలదోయడమే లక్ష్యంగా ప్రారంభమైందని నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయి.