ఆరోజుతో నాజీవితం ముగిసినట్టే -కొడుకు తప్పుకు నగ్నంగా ఊరేగించబడ్డ పాక్ స్త్రీ వ్యధాభరిత కధనం


జూన్ నెలారంభంలో పాకిస్ధాన్‌లోని ఖైబర్ ఫక్తూన్ ఖ్వా రాష్ట్రంలోని నీలోర్ బాలా గ్రామంలో ఓ మధ్య వయసు స్త్రీని అతని కొడుకు చేసిన తప్పుకు బలవంతంగా వివస్త్రను కావించి ఊరేగించారు. ఈ ఘటన పాకిస్ధాన్‌లో సంచలనం కలిగించింది. ఆ రోజు ఏం జరిగిందీ తెలుసుకోవడానికి బిబిసి విలేఖరి అలీమ్ మక్బూల్ పాకిస్ధాన్‌ ఉత్తర ప్రాంతానికి వెళ్ళాడు. ఘటన జరిగిన నాటినుండి తన గ్రామంలో నివసించడానికి ఇష్టపడని ఆమె నివసిస్తున్న ప్రాంతాన్ని మక్బూల్ కనుగొని ఆమె ద్వారా ఆ రోజు ఏంజరిగిందీ తెలుసుకోవడానికి ప్రయత్నించి సఫలమయ్యాడు. అప్పటినుండి సిగ్గుతో, వ్యధతో సహోదరులకు సైతం తన ముఖం చూపలేని పరిస్ధితిలో ఉన్నానని కుమిలిపోతున్న ఆమెను కదిలించగా, మెల్లగా గొంతు పెగుల్చుకుని తన బాధను తెలుపుకుంది.

Shahnaz Bibi

షహనాజ్ బీబీ (40 సం.లు)

అమె పేరు షహ్‌నాజ్ బీబీ. “ఆ రోజు…, ఏ తప్పు జరిగిందో నిజానికి నాకు తెలుయదు” అని ప్రారంభించిందామె. ఎప్పటిలాగే తన ఇంటివద్దనే ఉంది. ఆమె భర్త లాహోర్ నగరంలో డ్రైవర్ గా పనిచేస్తున్నందున అక్కడే డ్యూటిలో ఉన్నాడు. “అకస్మాత్తుగా కొంతమంది మా ఇంటికి ముందు తలుపును గట్టిగా బాదుతూ తెరవడం విన్నాను. ఆక్కడే ఉన్న నా 11 ఏళ్ళ కొడుకును నేనెక్కడని అడిగారు. మా అబ్బాయి చెప్పాడు” అని తెలిపిందామె. నలుగురు పురుషులు పిస్టళ్ళు, రైఫిళ్ళతో తన గదిలోకి తోసుకుంటూ వచ్చారని షహ్‌నాజ్ చెప్పింది. “వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా నేను గుర్తించాను. పైగా పొరుగువారు కూడా” అని గుర్తుచేసుకుందామె.

“ఏం జరుగుతోందో తెలుసుకునే లోపలే వాళ్ళు నా ముంజేతుల్ని కట్టేశారు. నన్ను బలంగా తోసుకుంటూ వీధిలోకి నెట్టారు. బూతులు తిడుతూ, అప్పుడప్పుడూ నేల మీదికి నెడుతున్నారు. అలా నెట్టుకుంటూ ఒక బహిరంగ ప్రదేశానికి ఈడ్చుకెళ్ళారు. అక్కడ నా బట్టలన్నీ విప్పేశారు. పూర్తిగా ఒక గంటపాటు నగ్నంగా ఉన్న నన్ను తోస్తూ, నేల మీదికి నెడుతూ ఊరేగించారు. నేను గట్టిగా ఏడ్చాను. వాళ్ళని బ్రతిమాలాను. కాని వారు నామాటల్ని వినలేదు. నన్ను కొడుతూనే ఉన్నారు” అని ఆమె వివరించింది. త్వరలోనే ఊరంతా వచ్చి ఆమెను చూడ్డం ప్రారంభించారని ఆమె తెలిపింది.

“మగవాళ్ళు, స్త్రీలు, పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. కానీ ఎవ్వరూ నాకు సాయం చేయడానికి ముందుకి రాలేదు. నా శరీరాన్ని కప్పడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. వాళ్లలొ ఒకడు తన రైఫిల్ ని ఎత్తిపట్టుకుని ఎవరైనా ముందుకొస్తే చంపేస్తానని అరుస్తున్నాడు. దానితో అది జరిగినంతసేపూ ఎవరూ నా దగ్గరకు రాలేదు. కాని అంతా అక్కడే నిలబడి డ్రామా చూస్తున్నారు. నన్ను తిడుతూ, తోస్తూ, ముడుచుకున్నప్పుడల్లా బలవంతంగా బహిరంగపరుస్తూ మధ్య మధ్యలో నా కొడుకు వారి కుటుంబంలోని ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పారు. ఆ వ్యవహారం గురించి నాకసలేమీ తెలియదు,” షహనాజ్ వివరించింది.

షహనాజ్ చెప్పిందాని ప్రకారం ఆ ఘటన జరగక ముందు గ్రామంలో ఒక స్త్రీకి విడాకులిస్తున్నారని ఆమెకు తెలుసు గానీ తన కొడుకే దానికి కారణమని ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి ఆమెకు తెలియదు. గ్రామానికి చెందిన కొంతమంది విడాకులు మంజూరు చేయడానికి సమావేశం జరిపారని చెప్పారు. ఆ సమావేశం జరిగిన వెంటనే ఆ అమ్మాయి కుటుంబం వాళ్ళు షహనాజ్ బీబీ ఇంటికి వచ్చారు. “విషయం మాతో చర్చించి ఉండాల్సిందని చెప్పాను. లేకపోతే నా కొడుకు తప్పు చేశాడని భావిస్తే పోలీసులకయినా చెప్పాలని అన్నాను. కాని వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలనే వచ్చారు. ఆ ఘటన జరుగుతున్నంతసేపూ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చెప్పా పెట్టకుందా నాపైకి ఈ శాపం వచ్చిపడిందేమిటా అని కుమిలిపోయాను. వారి దుర్మార్గాన్ని ఆపమని వేడుకున్నాను. చాలా సేపటి తర్వాతా వాళ్ళు నన్ను మరింతగా నేలకు నెడుతూ, బూతులు తిడుతూ నన్ను వదిలేశారు. బట్టలు కప్పుకోవడానికి మా ఇంటికి పరుగెత్తుకెళ్ళాను” అని షహనాజ్ ఆనాటి దుర్ఘటనను వివరించింది.

తనపై జరిగిన దుర్మార్గాన్ని వివరిస్తున్న షహనాజ్ ఈ అంశాని వచ్చాక తన దుఃఖాన్ని ఆపుకోలేక పోయింది. వెల్లువలా వస్తున్న తన దుఃఖాన్ని కింది పెదవిని పంటితో నొక్కి పెట్టడం ద్వారా ఆపుకోవాలని శతధా ప్రయత్నించిందామె. ఆ ప్రయత్నంలో సఫలం కాలేకపోయిందామె. కంటినుండి జల జలా కన్నీళ్లు ప్రవాహం కట్టాయి. కన్నీళ్ళు కారుస్తూనె తన బాధను చెప్పుకుంటూ పోయింది. “నేనూ నా పదకొండేళ్ళ కొడుకూ ఏడుస్తూ గడిపాం. ఇద్దరం పక్కనే ఉన్న అడవిలోకి పరుగెత్తుకెళ్ళాం. ఇంటికి తిరిగి వెళ్ళడానికి నాకు చాలా సిగ్గువేసింది. ఆ రోజు రాత్రంతా ఆ అడవిలోనే నిద్రపోయాము” అని షహనాజ్ తన ఘటనానంతర పరిస్ధితిని వివరించింది. “మా దగ్గర డబ్బుల్లేవు. ఒక డ్రైవర్ ను బతిమాలుకుని అక్కడినుండి దూరంగా తీసుకెళ్ళమని అడిగాను” అవి చెప్పిందామె.

తన గ్రామానికి ఇక ఎప్పటికీ తిరిగి వెళ్ళలేనని షహనాజ్ పేర్కొన్నది. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత షహనాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తన జిల్లాకి తిరిగి వచ్చింది. “మీకు తెలుసాండీ! జరిగిన సంఘటన గురించి కనీసం ఒక్కరు కూడా పోలీసులకు రిపోర్టు చేయలేదు” నమ్మలేనట్లుగా చెప్పిందామె. “పోలీసులు నా కేసు రిజిస్టరు చేసుకున్నారు. పోలీసుల దయ, వాళ్ళలో కొంతమందిని అరెస్టు చేశారు. కాని ఇతరులింకా బైటే ఉన్నారు. పారిపోయారు. నాకు చాలా భయంగా ఉంది. నేను పోలీసులకి ఫిర్యాదు చేసినందుకు వాళ్ళలో ఎవరైనా గానీ, వారి బంధువులు గానీ నన్ను చంపేస్తారేమోనని,” ఆమె కంఠంలో భయం ధ్వనించినా ఆమె నిర్ణయం పట్ల స్ధిర నిశ్చయం మాత్రం స్పష్టంగానే ఉంది.

“వారిని శిక్షించాలని నా కోరిక. దానివల్లన నాకు పెద్దగా ఉపయోగం లేకపోయినా సరే” దృఢంగా పలికాందామె. “దీనికి ముందు నేను పేదరాలినే, కాని గౌరవనీయమైన జీవితం ఉంది. నేను సంతోషంగానే ఉన్నాను. కాని ఇటువంటిది జరిగాక, ఆ రోజుతో నా జీవితం ముగిసినట్లే” షహనాజ్ దుఃఖం రెట్టింపయ్యింది. ఎంత పేదరాలయినా గౌరవంగా బతుకుతున్న స్త్రీకి తన శరీరం తన మగనికి తప్ప మరొకరి కంటపడడం తీవ్రమైన గౌరవ భంగమే. సంవత్సరాల తరబడి గుట్టుగా సంసారం నెట్టుకొస్తున్న షహనాజ్ లాంటి మహిళకు, అందునా స్త్రీల పట్ల దయలేని మతాల నియమ నిబంధనలకు కట్టుబడి బతుకుతున్న స్త్రీకి పదుగురిలో క్షణకాలం పాటయినా నగ్నదేహయై నిలబడడం అత్యంత తీవ్రంగా బాధించే విషయం. అలాంటిది గంటకు పైగా తన ఇష్టానికి వ్యతిరేకంగా ఊరందరి ముందు బలవంతంగా అలా ఉండవలసి రావడం షహనాజ్ ని తిరిగి ఊరికి వెళ్ళలేనంతగా బాధించడంలో ఆశ్చర్యం లేదు.

ఊరిలోని ప్రతి ఒక్క వ్యక్తీ నా నగ్న దేహాన్ని చూసిన గ్రామానికి నేను మళ్ళీ ఎలా వెళ్ళగలను? నా సొంత సోదరీ, సోదరులకు కూడా నా ముఖం చూపించడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది” అని షహనాజ్ విలపించింది.

కాని సిగ్గు పడవలసింది నిజానికి షహనాజ్ కాదు. ఆమెనా పరిస్ధితికి వదిలేసిన ఊరిజనం సిగ్గుపడాలి. రోజూ తమ మధ్య బతికే స్త్రీని, ఆమెకు ఏ మాత్రం సంబంధం లేని విషయానికి ఆమెను బాధ్యురాలిని చేసి తమలో ఉన్నవారే ఆమెపై వికృత చేష్టలకు పాల్పడుతుంటే కనీసం ఆమె దేహాన్ని కప్పడానికింత గుడ్డ కూడా అందించలేని తమ నిస్సహాయతని తలుచుకుని నీలోర్ బాలా ఊరి జనం, సిగ్గుపడాలి. ఆ దుర్మార్గుల చేతిలో ఆయుధాలు చూసి భయపడినా, ఆ తర్వాతయినా పోలీసులకు చెప్పలేక పోయిన తమ భయపూరిత బతుకుల్ని చూసి ఆ ఊరి జనం సిగ్గుపడాలి.

అంతే కాదు. తాము ఆధునిక యుగంలోని సౌకర్యాలన్నింటినీ అనుభవిస్తూ, దేశ ప్రజల శ్రమతో సృష్టించబడ్డ సంపదలను అనుభవిస్తూ, ఆ సంపదలను తమకు అందించీన దేశంలోని గ్రామిణ జన సంస్కృతిని ఇంకా ఫ్యూడల్ స్ధాయిలోనే ఉంచి కాపాడుతున్న పాకిస్ధాన్ పాలకులు అందరికంటే ముందు సిగ్గుపడాలి. షహనాజ్ ఎదుర్కొన్న దుర్మార్గం నిజానికి దేశ ప్రజల పట్ల పాకిస్ధాన్ పాలకులకు ఉన్న అశ్రద్ధకూ, నిర్లక్ష్యానికీ, సంస్కార హీనతకూ మాత్రమే ప్రతీక తప్ప షహనాజ్ జీవితంలోని ఏ కోణానికి, ఏ క్షణానికి ఆమెకి ఎదురైన దుర్ఘటన ప్రతిబింబం కాదు. అందుకే షహనాజ్ సిగ్గుపడడానికి ఏమీ లేదక్కడ. కాని ఆ విషయం ఆమెకు తెలిసేదెలా?

 

4 thoughts on “ఆరోజుతో నాజీవితం ముగిసినట్టే -కొడుకు తప్పుకు నగ్నంగా ఊరేగించబడ్డ పాక్ స్త్రీ వ్యధాభరిత కధనం

  1. అవును అమానుషం. స్త్రీ గౌరవం కుటుంబ మొత్తం గౌరవానికి ప్రతీకగా గుర్తించే పితృస్వామిక భావజాలం వలన ఈ ఘోరాలు జరుగుతున్నాయి. ఇండియా, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లలోని ఫ్యూడల్ సమాజాల లక్షణం ఇది. అందుకే స్త్రీలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లొ ఈ మూడు ముందున్నాయి.

  2. అబ్బో మీరు ఈ విషయం లో రోజూ విమర్సించే అగ్రరాజ్యం ఈ విషయం లో బలేగా ఉందనుకొంట్టున్నారు. అక్కడ జరిగే హింస pEపర్ లో చదివేది. పాకిస్థాన్ లో హిందువు స్రీల మీద జరిగే అత్యాచారాలకి లెక్క పక్క ఉండదు. మీకు కావాలంటే ఎంత సమాచారం కావాలన్న ఇస్తాను.
    —————————–

    ఆడవాళ్లకు హీనమైన పరిస్థితులు దరిద్రపుదేశాల్లో, వెనుకబడిన దేశాల్లో మాత్రమే ఉంటాయన్నది మరో అపోహ. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు స్త్రీలపై అమలుజరిపే శిక్షలను చూపి, కొన్ని మతప్రాబల్యరాజ్యాలలో మహిళలపై విధించే ఆంక్షలను చూపి- తమది మహా నాగరిక దేశమని అమెరికన్లు మురిసిపోతుంటారు. కానీ, ఆడవాళ్లను చంపుకుతినడంలో అమెరికాదే అగ్రస్థానం. ఏటా ఏడులక్షలమంది స్త్రీలు అత్యాచారానికి గురి కావడమో, లైంగికదాడులు ఎదుర్కొనడమో అమెరికాలో జరుగుతున్నదట. కంబోడియా వంటి బడుగు దేశంలో నూటికి పదహారుమంది స్త్రీలు భర్తలచేతిలో హింసలు పడుతుంటే, ఇంగ్లండ్‌లో 32 శాతం మంది ఆ దుస్థితిలో ఉన్నారట. మన దేశంలో మహిళలపై నేరాలు రోజుకు 500కు పైగానే జరుగుతాయట. ఈ లెక్క నమోదైన ఫిర్యాదులది మాత్రమే. నోరు నొక్కుకుని దిగమింగిన నేరాలు ఎన్ని ఉంటాయో లెక్క లేదు.

    https://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/editpagemain

  3. స్త్రీల పరిస్ధితి అగ్ర రాజ్యంలో బలేగా ఉందని నేనెక్కడా అన్లేదు. పాక్‌లో వివిధ మతాల స్త్రీల పరిస్ధితిని కూడా నేనిక్కడ సమీక్షించలేదు. పాక్‌లో జరిగిన ఒక ఘటన గురించి మాత్రమే రాశానిక్కడ. ఒకే మతంలో, ఒకే ఊరిలో జరిగిన ఘటన ఇది. జ్యోతి దిన పత్రిక మా ఇంటికి వస్తుంది. మీరు ఇచ్చిన లింకు నేనిప్పటికే చదివాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s