మెరుగైన సేవలు కావాలంటే ప్రైవేటు కంపెనీలకి పట్టణ ప్రజలు మరింత చెల్లించుకోవాల్సిందే -కేంద్ర మంత్రి


Urban Development Minister Kamal Nath

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి కమల్ నాధ్

భారత దేశ ప్రజలకు ఇప్పటివరకూ అన్నీ ఉచితంగా వాడుకోవడం అలవాటయ్యిందనీ, కానీ రోడ్లు, నీరు, విద్యుత్ లాంటి సేవలు మెరుగుపడాలంటే మరింతగా చెల్లించడానికి సిద్ధమైతే తప్ప సాధ్యం కాదనీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కమల్ నాధ్ తెగేసి చెబుతున్నాడు. రాయిటర్స్ వార్తా సంస్ధకి నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పట్టణాల్లొ సేవలను మెరుగుపరచడం కోసం ఇప్పటివరకూ ప్రభుత్వం ఒక్కటే బాధ్యత తీసుకున్నదనీ, ఇకనుండి ప్రైవేటు కంపెనీలకు పట్టణాల్లో మౌలిక సౌకర్యాల నిర్మాణానికి భాగస్వామ్యం కల్పించడానికి పెద్ద ఎత్తున పధకాలు రూపొందిస్తున్నామనీ ఆయన తెలిపాడు. ఇది సాధ్యం కావాలంటే భారత ప్రజల మైండ్ సెట్ మారాలనీ ఆయన ఉద్భోద చేశారు.

ప్రభుత్వాలే ఇప్పటివరకూ రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా కార్యకలాపాల్లో పూర్తి భాధ్యత తీసుకున్నందున మెరుగైన సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని కమలనాధ్ బోధిస్తున్నాడు. ప్రభుత్వ సంస్ధల కాంట్రాక్టుల్లో మంత్రులు, బ్యూరోక్రట్ అధికారుల దగ్గర్నుండి కింది స్ధాయి మేనేజర్ వరకూ పర్సెంటీజీలు పంచుకుని మేయడం వల్లనే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా సౌకర్యాలకు దిక్కులేకుండా పోయిన సంగతిని మంత్రి వర్యులు కమల్ నాధ్ దాచి పెడుతున్నాడు. ప్రజల జ్ఞాపక శక్తి మీద రాజకీయ నాయకులు భారీ నమ్మకాలే ఉంటాయి. అందుకే ఎలక్షన్ మ్యానిఫెస్టోల్లో, ఎన్నిల ప్రచారాల్లో పంచిన భారీ వాగ్దానాలన్నింటినీ, ఎన్నికలు ముగిసిన మర్నాడే గాలికొదిలేయగలుగుతున్నారు. ఈ నాయకులకి తాము అధికారంలోకి వస్తే పట్టణ సేవలన్నింటినీ ప్రవేటీకరిస్తామని చెప్పి గెలిస్తే వీరి చర్యలకు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. ఏరు దాటాక తెప్పతగలేసే మోసగాళ్ళకు తామిచ్చే హామీలపైనా, తమకు ఓట్లేసి గెలిపించే ప్రజలపైనే అసలు గౌరవం లేకపోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోవచ్చు.

ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ప్రాధమిక సౌకర్యాలు పరమ హీనంగా ఉన్న సంగతి తెలిసిందే. వేసిన రోడ్లు కొన్ని రోజులకే మాయమై పోవడం, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు కడుతుండగానే కూలిపోవడం, చినుకు కురిసినా, గాలి వీచినా విద్యుత్ నిలిచి పోవడం, స్ధానిక ప్రభుత్వాలు సరఫరా నీటి కోసం అర్ధరాత్రిళ్ళు మేలుకోవలసి రావడం భారతదెశంలోని చిన్న చిన్న పట్టణాలనుండి మెట్రోపాలిటన్ నగరాలవరకూ ప్రజలకు అనుభవంలో ఉన్న విషయం. పట్టణాల్లో ధనికులు ఉండే కాలనీలకు కొరవరాని సౌకర్యాలు మిగిలిన ప్రాంతాల్లోనే నిలిచి పోవడం సర్వత్రా ఎరిగినదే. దీనికి కారణాలుగా ఈ సర్వీసులన్నీ ప్రభుత్వ సంస్ధల ఆధీనంలో ఉండడమే కారణమని ప్రభుత్వాలు సిద్ధాంతాలు ప్రతిపాదించి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పత్రికలు, ప్రసార సాధనాలు వీరికి ఇతోధికంగా సహాయపడుతూ కమల్ నాధ్ చెప్పినట్లుగా ప్రజల మైండ్ సెట్ మార్చడానికి కృషి చేస్తున్నాయి.

కాని వాస్తవాలు ప్రభుత్వాలు చెబుతున్నవాటికి భిన్నంగా ఉండడమే అసలు విషయం. డబ్బులు పంచి, తాగించి గెలిచిన స్ధానిక ప్రభుత్వాలను చేపట్టిన రాజకీయ నాయకులు ఆ డబ్బుని తిరిగి రాబట్టుకోవడానికి ప్రభుత్వ కాంట్రాక్టులనే నమ్ముకుంటారు. ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడికి పదింతలు రాబట్టుకునే సౌకర్యం ఉన్నందున ఎన్నికల్లో ఎంత ఖర్చుపెట్టడానికైనా వీరు వెనకాడడం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ మన రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారవర్గమూ అవినీతికి పాల్పడి మెక్కిన సొమ్ము ట్రిలియన్లకొద్దీ విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయి ఉంది. ముఖ్యంగా నూతన ఆర్ధిక విధానాల్లో భాగంగా ప్రవేటీకరణ చేపట్టిన 1990ల నుండీ భారత దేశం నుండి జమ అయిన అవినీతి డబ్బు అప్పటివరకు చేరిన అవినీతి డబ్బుకంటే అనేక రెట్లు ఎక్కువగా ఉందనీ స్విస్ బ్యాంకులే ప్రకటించాయి. దానర్ధం ప్రవేటీకరణ ఎవరికి లాభించిందన్న సంగతి ఆ ఒక్క ప్రకటనే తెలియజెప్పడం లేదా?

వీరి అవినీతి బయటపడకుండా ఉండడానికి లోక్ పాల్ బిల్లుని ముప్ఫై సంవత్సరాల నుండి రాజకీయనాయకులు, ప్రభుత్వాలు వాయిదా వేశారు. సమర్ధవంతమైన లోక్‌పాల్ బిల్లు తేవాలని కోరుతున్న పౌర ప్రముఖులను ప్రభుత్వాలకంటె తాము అతీతులమని భావిస్తున్నారంటూ పనికిమాలిన ఆరోపణలు గుప్పిస్తూ, అవినీతిపై ప్రజలకు కలిగిన ఏవగింపును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. లోక్ పాల్ బిల్లు రూపకల్పన కోసం నియమించిన డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న మంత్రులు ఆ కమిటీలో నియమించబడిన పౌర సమాజ నాయకులపై ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నదీ కళ్ళారా చూస్తున్నాం. ఆర్.ఎస్.ఎస్ కు తాము కోవర్టుగా పనిచేస్తున్నామంటూ మంత్రులు చేస్తున్న ప్రచారంపై వివరణ కోరుతూ అన్నా హజారే సోనియా గాందికి లేఖరాస్తే, ఆవిడ ఆయన లేఖలోని ప్రశ్నలకు ఎప్పుడో సమాధానం చెప్పానంటూ సమాధానం రాయడం ఈ ధుష్ప్రచారం వెనక ఆమె పాత్రను స్పష్టం చేస్తున్నది.

వీరి అవినీతి కొనసాగింపులొ భాగంగానే ఇప్పుడు కమల్ నాధ్ ఇంటర్వ్యూని చూడవలసి ఉంది. “భారతదేశ ఆర్ధిక వ్యవస్ధ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్ధల్లో ఒకటి. కానీ  విద్యుత్, పరిశుభ్రమైన నీరు, మంచి రోడ్ల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్లను నగర, పట్టణ ప్రభుత్వాలు తీర్చలేక పోతున్నాయి. కనుక పబ్లిక్ వినియోగ సర్వీసులలో స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీల పాత్రను బాగా పెంచవలసిన అవసరం ఉంది. ప్రజా సర్వీసుల్లో ప్రవేటు కంపెనీలు ప్రవేశం ద్వారా పడే భారాన్ని ప్రజలపైనే మోపవలసిన అవసరం కూడా ఉంది” అని కమల్ నాధ్ రాయిటర్స్ నిర్వహించిన “గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్” లో మాట్లాడుతూ చెప్పాడు.

చివరాఖరికి ఈయన చెప్పదలుచుకున్నదేమంటే “మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మెట్రోపాలిటన్ నగరాల్లో విద్యుత్, నీరు, రోడ్లు, రైల్వేల సౌకర్యాలను ప్రవేటీకరించబోతున్నారు. ప్రవేటు కంపెనీలు ఈ సర్వీసులు నిర్వహిస్తాయి. అవి తమ ఖర్చుని ప్రజలనుండే వసూలు చేస్తాయి. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహిస్తున్నందువలన ఫ్రీగా అనుభవించారు. ప్రవేటు కంపెనీలు నిర్వహించబోతున్నాయి గనక ఇక ఫ్రీగా అనుభవించడం కుదర్దు. అన్నింటికీ డబ్బులు చెల్లించుకోవాల్సిందే. అందుకు పట్టణ ప్రజలు సిద్ధంగా ఉండండి!” అని.

పట్టణ సర్వీసుల ప్రవేటీకరణతో పాటు ఇతరత్రా మౌలికరంగాల్లో కూడా (జాతీయ రోడ్లు, మెట్రో రైల్వేలు, గోడౌన్లు, ఆహార పదార్ధాల ప్రాసెసింగ్ సౌకర్యాలు మొ.వి) భాగంగా 2012 నుండి 2017 లోపు 1 ట్రిలియన్ డాలర్లు (45 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తంలో సగం అంటే 500 బిలియన్ డాలర్లు (22.5 లక్షల కోట్ల రూపాయలు) ప్రవేటు రంగం నుండి సేకరించాలని నిర్ణయించింది. కేంద్రంలో యు.పి.ఏ ఉన్నా, ఎన్.డి.ఏ ఉన్నా ఈ నిర్ణయంలో మార్పు ఉండదు. విదేశీ బ్యాంకుల్లో భారత రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారులు దాచిన మొత్తం రు.70 లక్షల కోట్ల నుండి రు.1 కోటి కోట్ల వరకూ ఉంటుందని ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే మన నాయకుల పాల్పడ్డ అవినీతిలో మూడో వంతునుండి నాలుగో వంతువరకయినా వెనక్కి రప్పించుకోగలిగితే కమల్ నాధ్ చెబుతున్న ఈ ప్రవేటు కంపెనీల భారం భారత ప్రజలకు తప్పుతుంది.

స్వర్ణ చతుర్భుజి, అంటే దేశంలోని నాలుగు మెట్రో నగరాల్ని కలుపుతూ వేసిన ఆరు లేన్ల రోడ్డు, కొన్ని నగరాల మధ్య వేసిన ఎక్స్‌ప్రెస్‌వే రోడ్లు అన్నింటినీ పబ్లిక్ ప్రవేటు భాగస్వామ్యం (Public Private Partnership -PPP) కిందనే వేశారు. ఈ రోడ్ల నిర్మాణం కమల్ నాధ్ రోడ్లు శాఖామంత్రిగా ఉన్నపుడు కూడా జరిగింది. ఇపుడా రోడ్లపైన ఉచితంగా వాహనాలు తిరగడానికి వీల్లేదు. వందలూ, వేలల్లో అన్ని వాహనాలు అనేక టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజులు చెల్లించి తిరగాల్సిందే. ఆర్టీసి బస్సులకు కూడా మినహాయింపు లేదు. ఆర్టీసి బస్సులు చెల్లించే టోల్ ఫీజులు ప్రయాణీకులనుండే వసూలు చేస్తున్నారు. అంటే స్వర్ణ చతుర్భుజి రోడ్లను ప్రవేటు వాళ్ళు కట్టినందున దేశంలో ప్రతి కుటుంబం వారికి టోల్ ఫీజు రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక ఈ వ్యవహారం నేషనల్ హైవే వరకే పరిమితం కాదన్నమాట! ఈ దోపిడీ దొంగలు మునిసిపాలిటీల్లోకీ, కార్పొరేషన్లలోకి వచ్చేస్తారు. మన ఇంటి ముందుకే వచ్చేస్తారు. కదిలినా, మెదిలినా ఫీజులంటారు. సామాన్య మానవుడు పట్టణాల్లో, నగరాల్లో స్వేచ్ఛగా నడవలేని పరిస్ధితులు రాబోతున్నాయి.

స్వదేశీ ప్రవేటు కంపెనీలు అంటారు గానీ వాటిలో ప్రధాన వాటాలు అంతర్గతంగా విదేశీ ప్రవేటు కంపెనీలే ఆక్రమించి ఉంటాయి. ప్రభుత్వ పి.పి.పి పధకం విదేశీ కంపెనీలకు గొప్ప వరం కాబోతోంది. అమెరికా, యూరప్ ల ఆర్ధిక వ్యవస్ధలు తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ దేశాల ప్రవేటు బహుళజాతి సంస్ధల ఉత్పత్తి కార్యకలాపాలకు వినియోగదారులు లేక సంక్షోభంలో ఉన్నాయి. వాటికి తమ తమ దేశాల ఆర్ధిక సంక్షోభాలవలన మార్కెట్ దొరకడం లేదు. మార్కెట్ దొరకపోవడం అంటే వారి దగ్గర పోగుబడిని పెట్టుబడి మళ్ళీ లాభాలు సృష్టించే పెట్టుబడులకింద మార్చడానికి వీల్లేకుండా పోతోంది. అదిగో, అక్కడే భారత ప్రభుత్వం అడుగు పెట్టి మీకు మార్కెట్ మేమిస్తాం. మా దేశం రండి. మీ పెట్టుబడులు మా దేశంలో పెట్టండి. మీకు కావలసినంత మా ప్రజలనుండి వసూలు చేసుకుండి అని దేబిరిస్తున్నాయి. వీరు గనక ఇక్కడకి వచ్చి కాంట్రాక్టులు స్వీకరిస్తే, వారికి కాంట్రాక్టులు ఇచ్చినందుకు గాను భారత రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారులకు బోల్డన్ని పర్సెంటేజీలు దక్కుతాయి. అవినీతి డబ్బు మరిన్ని వందల, వేల కోట్లు వారి స్విస్ ఎకౌంట్లకు చేరుతాయి.

భారత ప్రభుత్వ ప్రవేటీకరణ మర్మం ఇదే. వీరి ప్రవేటీకరణ ప్రయత్నాల వెనక విదేశీ బహుళజాతి సంస్ధలకు మార్కెట్లను సమకూర్చడం, తాము కొద్దో గోప్పో పర్సెంటీజీలు వసూలు చేసుకోవడం అనే లాభాలు ఉన్నాయి. ప్రధానంగా లబ్ది పోందేది స్వదేశీ, విదేశీ బహుళజాతి సంస్ధలు కాగా నష్టపోయేది భారత ప్రజలు, దానికి ప్రభుత్వం సరిగా సర్వీసులు నిర్వహించలేకపోతున్నదంటూ సాకులు చూపిస్తున్నారు తప్ప డబ్బు ఎవడు పెట్టినా అదే రోడ్డు, అదే నీరు, అదే విద్యుత్తే వస్తుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ కాంట్రాక్టులైనా, ప్రవేటు కాంట్రాక్టులైనా పర్సెంటీజీలు ఖాయం. అందువలన భారత ప్రజలు మేలుకోక తప్పదు. తమ ఇంటినీ, భూమినీ దక్షిణ కొరియా బహుళజాతి సంస్ధ పోస్కోకి ఒడిషా ప్రభుత్వం అప్పజెప్పితే అక్కడ ధింకియా, గోవింద్ పూర్ గ్రామాల ప్రజలు పిల్లలూ, మహిళలతో సహ కాపలా కాస్తూ పోలీసులు, పోస్కో రాకుండా పోరాటం చేస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రాధామ్యాలు చూస్తుంటే, ప్రజలకు దోపిడీకి గురికాకుండా మిగిలిన దారి అదే కనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s