గడ్డాఫీ బలగాల కాల్పులనుండి లిబియా పౌరులను రక్షించండంటూ భద్రతా సమితి నాటో దళాలకు అనుమతినిచ్చింది. పౌరులను కాపాడ్డానికి “అన్ని చర్యలూ తీసుకోండి” అని తమకు అనుమతి దొరికిందే తడవుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల యుద్ధ విమానాలు లిబియా అంతటా బాంబుదాడులు మొదలు పెట్టాయి. వీరి దాడుల్లో లిబియా అంతటా పట్టణాలు, గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. గడ్డాఫీ ఇంటిపై దాడి చేసి అతని మనవళ్ళను ముగ్గురినీ, చివరి కొడుకునీ చంపిన నాటో బలగాలు తాజాగా ట్రిపోలిలోని సౌక్ ఆల్-జుమా లో ఓ కుటుంబం నివసిస్తున్న ఇంటీపై బాంబులేసి ఐదుగురిని చంపేశాయి.
చనిపోయిన వారిలో భార్త భర్తలు వారి బిడ్డ ఉన్నారని బిబిసి విలేఖరి తెలిపాడు. మరో వ్యక్తి, పసి బాలుడు చనిపోయారని ఆయన తెలిపాడు. ఐదుగురి శవాలు ట్రిపోలి ఆసుపత్రిలో ఉంచారు. మరొక యువకుడికి తీవ్రంగా గాయపడగా అతనికి వైద్యం అందిస్తున్నారని కూడా బిబిసి విలేఖరి తెలిపాడు. సంఘటనా స్ధలానికి ప్రభుత్వం విలేఖరులను అనుమతించింది. బిబిసి ప్రచురించీన వీడియోలో బాంబుదాడిలో ధ్వంసమైన మూడంతస్ధుల భవనం శిధిలాలు రోడ్డుపైకి కుప్పకూలినట్లు కనిపించాయి. కుటుంబ సభ్యుల శవాలలో రెండింటిని బిబిసి విలేఖరి సంఘటనా స్ధలం వద్ద చూశాడనీ, పిల్లవాడి శవాన్ని శిధిలాలనుండి లాగుతుండగా చూశాడని బిబిసి తెలిపింది.
భవనం పౌరులు నివసిస్తున్న ఇంటిలా కనిపిస్తున్నదనీ, లిబియా ప్రభుత్వం చెబుతున్న కధనంలా లేదనీ బిబిసి విలేఖరి చెబుతున్నాడు. ప్రభుత్వ సైనికుల దాడుల్లో లిబియా పౌరులు చనిపోతున్నారంటూ కధలు ప్రసారం చేసిన ఈ విలేఖరులకు ఎవరేమి చెప్పినా కధల్లానే కనిపిస్తున్నాయి కాబోలు. దాడి అర్ధరాత్రి తర్వాత జరిగిందనీ, దాడి జరిగిన ప్రాంతం సాపేక్షికంగా పేదలు నివసించి ప్రాంతమనీ తెలుస్తోంది. అనేకమంది శిధిలాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా బిబిసి వీడియోలో కనిపిస్తోంది. కాని వారివద్ద వట్టి చేతులు తప్ప పరికరాలావే కనపడడం లేదు. అందరూ ఆరెంజ్ యూనిఫారంలో కనిపిస్తున్నారు.
నాటో ప్రతినిధి వింగ్ కేడర్ ఐన మైక్ బ్రాకెన్, తాము ఉపరితలం నుండి గాల్లోకి ప్రయోగించే మిసైళ్ళ ప్రయోగ స్ధావరంపై బాంబులేశామనీ, పౌరుల ఇళ్ళపై దాడులు చేసిందీ లేనిదీ ఇంకా తెలియదనీ, ఆపరేషన్ ను సమీక్షిస్తున్నామనీ చెబుతున్నాడు. పౌరులెవరైనా చనిపోయిఉంటే నాటో తన తీవ్ర బాధను వ్యక్తీం చేస్తోందంటూ ఆయన సారి చెప్పాడు. తమ పైలట్లు పౌరులు చనిపోకుండా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనీ కానీ ఒక మిలట్రీ క్యాంపెయిన్ లో జీరో నష్టం జరుగుతుందని చెప్పలేమనీ ఒక సిద్ధాంతం ముక్కని కూడా వదిలాడు. మిలట్రీ క్యాంపెయిన్ లో పౌరులు మరణించరని గ్యారంటీ ఇవ్వలేమని పరోక్షంగా సూచిస్తున్నాడు నాటో ప్రతినిధి.
అయితే భద్రతా సమితి, లిబియాపైన మిలట్రీ క్యాంపెయిన్ జరపమని అనుమతిని ఇవ్వలేదు. గడ్డాఫీ బలగాల యుద్ధ విమానాలు తమ పౌరుల ఇళ్ళపై బాంబులేస్తుండడంతో పౌరులు చనిపోతున్నారు గనక ఆ విమానాలు ఎగరకుండా “నో ఫ్లైజోన్” అమలు చేయమని మాత్రమే కోరింది. ప్రభుత్వ భవనాలన్నింటినీ బాంబులేసి ధ్వంసం చేయమని చెప్పలేదు. నేరుగా గడ్డాఫీ ఇంటిపైనే బాంబులేసి అతన్నీ, అతని కొడుకుల్నీ, మనవళ్ళను కూడా చంపమని చెప్పలేదు. లిబియా ప్రభుత్వ మిలట్రీ యుద్ధ పరికరాల గౌడౌన్లపై బాంబులేసి నాశనం చేయమనీ చెప్పలేదు. ప్రభుత్వ సైనికులపై దాడులు చేస్తూ తిరుగుబాటు సైన్యం పురోగమించేందుకు సహకరించమని అసలే చెప్పలేదు. పైగా ఆయుధాల నిషేధం, వ్యాపార వాణిజ్యాలపై నిషేధం ఇరుపక్షాలపైనా అమలు చేస్తామని ప్రారంభంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ప్రకటించాయి.
ఆ తర్వాత తమ తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఓ పదిమందిని పంపిస్తున్నామని మూడు దేశాలూ తమ గూఢచారులను దించాయి. మెల్లగా ట్యునీషియా బోర్డర్ లో శరణార్ధ్జులను చేరవేయడానికంటూ విమానాలు పంపి వాటిలో ఆయుధాలను తిరుగుబాటు బలగాలకు పంపించారు. ఇప్పటికీ సరిహద్దునుండి వారికి ఆయుధాలు అందుతూనే ఉన్నాయి. రెండు, మూడు వారాల క్రితం తక్కువ ఎత్తులో ఎగిరే మిలట్రీ హెలికాప్టర్లను కూడా దించాయి. వాటి ద్వారా లక్ష్యాలను గ్యారంటీగా నాశనం చేయవచ్చని చెప్పాయి. ఇప్పుడు ఏకంగా మిలట్రీ క్యాంపెయినే అని ఒప్పేసుకుంటున్నారు.
వీళ్ళా లిబియా పౌరులను రక్షించేది? వాళ్ళమానాన వాళ్ళని వదిలేస్తే అదే పదివేలు. గడ్డాఫీ కావాలో, లేక సుబ్రమణ్యం కావాలో వారే చూసుకుంటారు.