అమెరికా చర్చలు జరపనున్న తాలిబాన్ ఇక టెర్రరిస్టు సంస్ధ కాదట!?


taliban

Taliban guerrilla fighters hold their weapons at a secret base in eastern Afghanistan February 3, 2007. The Taliban promised a spring offensive of thousands of suicide bombers as the United States, doubling its combat troops in Afghanistan, took over command of the 33,000- strong NATO force in the country on Sunday. "We have made 80 percent preparations to fight American and foreign forces and we are about to start war," Khan, the 35-year-old guerilla leader, told Reuters at the secret base on Saturday. Photo taken February 3, 2007. REUTERS / Saeed Ali Achakzai (PAKISTAN)

తాలిబాన్‌తో పోరాటంలో డస్సిపోయిన అమెరికా తాలిబాన్‌తో చర్చలకు సిద్ధమై అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నది. మంచి తాలిబాన్‌తో చర్చలు జరుపుతామంటూ మూడు, నాలుగేళ్ళనుండే ప్రకటనలు చేస్తూ వచ్చిన అమెరికా అధికారులు అందుకోసం ఒక్కో అడుగూ వేస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ చేత “తాలిబాన్ తో అమెరికా చర్చలు జరుపుతున్నదంటూ రెండు రోజుల క్రితం ప్రకటన ఇప్పించింది. సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో తాలిబాన్‌ను ప్రోత్సహించడానికని చెబుతూ ఇప్పుడు ఆంక్షలు, నిషేధాలు విధించడానికి ఐక్యరాజ్యసమితి తాలిబాన్, ఆల్-ఖైదా సంస్ధల నాయకులతో తయారు చేసిన జాబితాను వేరుపరుస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇంతవరకూ ఈ రెండు సంస్ధలపై విధించిన ఆంక్షలు, నిషేధాలు, తలకు వెలలకు సంబంధించి ఒకే “సమితి ఆంక్షల కమిటీ” ఒకే జాబితాను నిర్వహించేది. ఇప్పుడు ఆల్-ఖైదా కోసం ఒక జాబితా, తాలిబాన్ కోసం ఒక జాబితా తయారు చేయాలని నిర్ణయిస్తూ భద్రతా సమితి తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానానికి ఇండియా కూడా మద్దతు ఇస్తూ ఓటేసింది. ఇలా రెండు జాబితాలుగా వేరు చేయడం ద్వారా తాలిబాన్ కు రాజకీయ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇదే సమయమని చెబుతూ సందేశం ఇస్తున్నామని భద్రతా సమితి చెబుతోంది. ఇప్పుడు భద్రతా సమితి ఆమోదించిన రెండు తీర్మానాలు తాలిబాన్, ఆల్-ఖైదాలకు రెండు వేరు వేరు లక్ష్యాలు ఉన్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నట్లుగా సందేశం పంపుతున్నాయి.

ఇక ఇప్పటినుండి ఆల్-ఖైదా లక్ష్యం ప్రపంచ వ్యాపితంగా జిహాద్ కి నిర్ణయించుకున్న సంస్ధ. దానిపై ప్రపంచ యుద్ధం కొనసాగుతుంది. కాని తాలిబాన్ మాత్రం ఆఫ్ఘనిస్ధాన్‌కి మాత్రమే పరిమితమై ఉద్యమిస్తున్న తిరుగుబాటు సంస్ధ. ఎవరిమీద తిరగబడుతున్నట్లు? అదేమీ తీర్మానం చెబుతున్నట్లు లేదు. తీర్మానం చెప్పకపోయినా, తాలిబాన్ చెపుతోంది. అది దురాక్రమణదారులకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న సంస్ధ. ఆక్రమణదారులని దేశం నుండి తరిమేసి తన రాజ్యం తానే ఏలుకోవాలని నిర్ణయించుకుని ఆ లక్ష్యం కోసం పోరాడుతున్న సంస్ధ. తాలిబాన్ తిరుగుబాటుదారైతే అమెరికా దాని తైనాతీలు ఏంకావాలి? ఆక్రమణదారులు కావాలి. దురాక్రమణదారులు కావాలి. అదే తాలిబాన్ కూడా చెబుతోంది. ఆఫ్ఘనిస్ధాన్ దేశాన్ని దురాక్రమించి వళ్ళంతా క్లస్టర్ బాంబులతో, కార్పెట్ బాంబులతో గాయాలు చేసి ఇప్పుడు తాలిబాన్ తో కలిసి ప్రజాస్వామ్య వ్యవస్ధనూ, మహిళలకు స్వేచ్ఛగా చదువు, హక్కులు కల్పించగల నందనవనాలు విలసిల్లే వ్యవస్ధనూ స్ధాపిస్తారట! ఛీ, నవ్విపోదురుగాక! నాకేటి సిగ్గు? ఇదే అమెరికా, యూరప్ దురాక్రమణ దేశాలు పంపుతున్న సందేశం!

ఈ సందేశం కేవలం తాలిబాన్‌కి మాత్రమే కాదు. అమెరికా ప్రజలకూ, ప్రపంచ ప్రజలకూ కూడా. ముఖ్యంగా తాలిబాన్, ఆల్-ఖైదా లపై అమెరికా అనేక కధలు సృషించి కార్పొరేట్ వార్తా సంస్ధల చేత ప్రచారం చేయిస్తే వాటిని నమ్మి తాలిబాన్ పరమ క్రూరమైన, టెర్రరిస్టు సంస్ధగా నమ్మి ద్వేషం పెంచుకున్న ప్రపంచ ప్రజలందరికీ ఐక్యరాజ్యసమితి, భద్రతా సమితి, వాటిని తన చిత్తానుసారం నడిపించే అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాల దుష్ట కూటమి, వారి అడుగులకు మడుగులొత్తే ఇతర మూడో ప్రపంచ దేశాల పాలకులూ ఇస్తున్న సందేశం ఇది. పదేళ్ళక్రితం కార్పెట్ బాంబులూ, క్లస్టర్ బాంబులతో పాటు అనేక అత్యాధునీక ఆయుధాలు, బాంబులతో ఆఫ్ఘనిస్ధాన్‌పై విరుచుకుపడడానికి వీరంతా చెప్పిన కారణాలు, కధలకు వీరు వివరణ ఇవ్వకుండానే ఇప్పుడు తాలిబాన్‌తో చర్చలకు సిద్ధమవుతున్నారు.

పదేళ్ళ క్రితం మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నపుడు తాలిబాన్ అమెరికాను చర్చించుకుందాం రమ్మంది. అమెరికా చెబుతున్నట్లు బిన్ లాడెన్‌కి జంట టవర్లపై దాడితో సంబంధం ఉన్నట్లయితే, అందుకు కనీస సాక్ష్యాలు చూపితే మూడో పక్షానికి బిన్ లాడెన్‌ను అప్పగించడానికి సిద్దమని ప్రకటించింది. అందుకు అమెరికా అధ్యక్షుడు ససేమిరా అన్నాడు. బిన్ లాడెన్‌ను బేషరతుగా అప్పగించాలంది. అతనితో పాటు ఆల్-ఖైదాకి చెందిన ఇతర నాయకులను, వారికి సయాయపడుతున్నవారిని వెంటనే అప్పగించాలని హుంకరించింది. బాంబింగ్‌లో ఆఫ్ఘన్ ప్రజలు చనిపోతున్నారు, విరమించి చర్చలకు రావాలని తాలిబాన్ కోరితే, అదేమీ మాకు తెలియదు, బాంబింగ్ కొనసాగితీరుతుంది, అని అప్పటి అమెరికా అధ్యక్షుడు, యుద్ధోన్మాది జార్జి బుష్ ఫత్వా జారీ చేశాడు.

ఫలితంగా కొనసాగిన మారణ హోమంలో, మానవ హననంలో, బరితెగించి పాల్పడిన యుద్ధ నేరాల్లో, అమెరికా పరీక్షించుకున్న అనేక కొత్త కొత్త యుద్ధ పరికిరాలు, ఆయుధాల ప్రయోగాల్లో ఆఫ్ఘనిస్ధాన్ దేశం దేశమే నెత్తురై పారింది. దశాబ్దాల తరబడి నెత్తురోడుతున్న గాయంగా ప్రపంచ చిత్రపటంపై తన అస్తిత్వాన్ని నెట్టుకుంటూ వస్తున్న ఆఫ్ఘనిస్ధాన్, వళ్ళంతా బాంబుల గాయలతో తల్లడిల్లంది. రక్తం ఏరులై ప్రవహించడమంటే ఏమిటో ప్రపంచానికి చవిచూపింది. లక్షలమంది కన్నబిడ్డల్ని పోగొట్టుకుంది. ఊళ్ళకు ఊళ్ళే స్మశానాలుగా మారుతుంటే కన్నీరై విలపించింది. పసిపిల్లలు, మహిళల దగ్గర్నుండి పండు ముదుసలివరకూ శవాలై, వికలాంగులై మిగులుతుంటే ఆర్తిగా తడిమి చూసుకుంది. ఇది న్యాయమా? ఇదేనా న్యాయం? అని ఆధునిక వ్యవస్ధలమని చెప్పుకుంటున్న దేశాలముందు, దూసుకొస్తున్నామంటున్న దేశాలముందు ప్రశ్నల మొక్కల్ని నాటి అడిగింది. పదేళ్ళుగా ఆ మొక్కల్ని సాకి ఇప్పుడు మహా వృక్షాల్ని చేసింది.

అంతేనా! తనను తాను కాపాడుకోవడానికి తనకు తానే మానవబాంబులనే సరికొత్త ఆయుధాన్ని తయారు చేసుకుంది. శతాబ్దానికి పైగా అనేక వలస, సామ్రాజ్యవాద రాజ్యాల ఇనప బూట్లకింద నలిగి నాశనమై కూడా శక్తుల్ని కూడదీసుకుని ప్రపంచ పోలీసుగా తనకు తాను నియమించుకున్న ప్రపంచ గూండా అమెరికాకు మరో వియత్నాంను రుచి చూపింది. ఎంత అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విమానవాహక యుద్ధనౌకల్లో తెచ్చి కుమ్మరించినా, సామాన్య మానవుడి తెగింపు ముందు, దేశ భక్తి ముందు గడ్డిపోచ లెక్కేనని చాచి చెంపపైన కొట్టిమరీ చెప్పింది. దేశ భక్తి అంటే ఏమిటో, దేశాన్ని ప్రేమించడం అంటే ఏమిటో జెండా పండగనాడు, క్రికెట్ ఆటలనాడు వీరంగం వేస్తూ తమకు తాము దేశ భక్తులమని మురుస్తున్న వారికి  అదేంటో ఆచరించి చూపింది. దేశం కోసం మానవబాంబులై పేలి శతృవు దేహాన్ని తునాతునకలు చేయడమెలాగో ప్రపంచ విముక్తి ఉద్యమాలకు పాఠాలు నేర్పింది. నెత్తురోడుతున్న గాయం మానవబాంబై పేలగలదని తనను తాను పేల్చుకుని చూపింది. ఆక్రమణదారుడికి తాను ఎప్పటికీ సుదూర లక్ష్యాన్నేనని చాటి చెప్పింది.

దాని ఫలితమే నేటి చర్చల ప్రక్రియ, లేదా రాజకీయ ప్రక్రియ. పలు విధాలుగా ఇది అమెరికా నేతృత్వంలోని దుర్మార్గ పశ్చిమ రాజ్యాలకు మూకుమ్మడి ఓటమి. రెండు మూడు నెలల్లో ఆఫ్ఘనిస్ధాన్‌ని మడిచి చంకలో పెట్టుకుందామనుకున్న యుద్ధోన్మాదికి కొద్దిలో తప్పనున్న చావే ఇది. చావు తప్పదు కనకనే ఇదిగో పోతున్నానంటూ, చర్చల నాటకం మొదలు పెట్టింది. అయితే అమెరికానూ, దాని తైనాతీలైన యూరప్ రాజ్యాలనూ, వారికి నిస్సిగ్గుగా వంతపాడి సాటి పేద దేశాన్ని తగలబెడుతుంటే వినోదం చూసిన మూడో ప్రపంచ దేశ పాలక వ్యవస్ధలను ప్రపంచ ప్రజలు, నెత్తుటి దేహాలై మిగిలిన ఆఫ్ఘనిస్ధాన్ ప్రజల తరపున అడగవలసిన ప్రశ్నలు, జవాబు రాబట్టవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి.

ఇప్పుడిక తాలిబాన్ టెర్రరిస్టు సంస్ధ కాదా? ఆల్-ఖైదా నాయకుడు బిన్ లాడెన్‌కు ఆశ్రయమిచ్చిన నేరం ఇక నేరంగా మిగలదా? ఇప్పటికీ ఆల్-ఖైదా నాయకులతో భుజం కలిపి పోరాడుతున్నదే తాలిబాన్? ఇంకా ఆల్-ఖైదా నాయకులు తాలిబాన్ కి మిత్రులుగా కలిసే ఉన్నారే? ఆ నేరం కూడా ఇక సమిసినట్లేనా? ఆల్-ఖైదా నాయకులందర్నీ అప్పగిస్తే తప్ప బాంబింగ్ ఆపనని హుంకరించిన అమెరికా అధ్యక్షుడి హుంకరింపులు ఉత్తిత్తివేనా? తాలిబాన్ పాలనలో మహిళలు ఇక స్వేచ్ఛా జీవులై సుఖించనున్నారా? తాలిబాన్ మతమూఢత్వ సమస్య ఇక ప్రపంచానికి తొలగినట్లేనా? ముఖ్యంగా ఆఫ్ఘన్ మహిళలకు తొలగినట్లేనా?

అమెరికా జాతీయ భద్రతకు తాలిబాన్‌తో ప్రమాదం తొలగినట్లేనా? అమెరికా ప్రజలు కనీసం తాలిబాన్‌కైనా భయపడకుండా నిద్రపోవచ్చా? ఆఫ్ఘనిస్ధాన్‌లో తాలిబాన్‌తో కలిసి ప్రజాస్వామ్య వ్యవస్ధను స్ధాపించగలమని అమెరికా, దాని మిత్రదేశాలు నమ్ముతున్నాయా? నమ్మితే 2001లోనే ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? స్వయంగా తాలిబాన్ ముందుకొచ్చి అడిగినా ఎందుకు తిరస్కరించినట్లు? బిన్ లాడెన్ హత్య ఈ చర్చల నాటకం కోసమే జరిగిందా? మరి ఆల్-జవహరి ఇంకా మిగిలే ఉన్నాడు కదా? వారి అనుచరులూ ఇంకా మిగిలే ఉన్నారు కదా? వారితో కలిసే తాలిబాన్ పోరాడుతోంది కదా? ఈ ప్రశ్నలకు బదులేది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s