దేశాల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియ జెప్పే సంఘటన ఇది. 119 మంది ప్రయాణికులు ఉన్న జెట్ విమానం ఉత్తర కొరియా ప్రయోగించిన యుద్ధ విమానంగా భావించి దక్షిణ కొరియా సైన్యం దానిపైకి కాల్పులు జరిపించి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఆ రెండూ 1950ల్లో విడిపోయినప్పటినుండీ ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా దక్షిణ కొరియాలో సైనిక స్దావరాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ఇరు పక్షాల మధ్య శతృత్వాన్ని మరింతగా పెంచింది.
గత సంవత్సరం దక్షిణ కొరియాకి చెందిన తేలికపాటి సబ్ మెరైన్ పైకి ఒక టార్పెడో పేల్చడంతో అందులో ఉన్న నలభైమంది సిబ్బందితో సహా సముద్రంలో మునిగిపోయింది. అందులో సిబ్బంది అంతా చనిపోయారు. జపాన్, దక్షిణకొరియాల నిపుణులు సభ్యులుగా గల విచారణ బృందం టార్పెడోను ఉత్తర కొరియానే పేల్చిందని తేల్చాయి. కాని ఉత్తర కొరియా ఆ ఆరోపణను తిరస్కరించింది. అప్పటినుండీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు ఉచ్ఛ స్ధాయిలో కొనసాగుతున్నాయి.
శుక్రవారం ఉదయాన ఏసియానా కంపెనీకి చెందిన జెట్ విమానం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని ఇంచియోన్ (Incheon) అంతర్జాతీయ విమానాశ్రమంలోకి దిగుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఉభయ కొరియాల సముద్ర సరిహద్దున ఉన్న గ్యోడాంగ్ (Gyodong) ద్వీపంలో ఉన్న ద.కొ సైనికులు ఆ విమానాన్ని ఉత్తర కొరియాకి చెందినదిగా భావించి కాల్పులు జరపడం ప్రారంభించారు. దాదాపు 99 రౌండ్లు కె-2 రైఫిళ్ళతో కాల్పులు జరిపారని బిబిసి తెలిపింది. పది నిమిషాల పాటు సైనీకులు కాల్పులు సాగించారు. అయితే రైఫిళ్ళ రేంజికి విమానం అందుబాటులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా విమానాశ్రయంలో దిగింది. అనంతరం విషయం తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం నైరుతి చైనాలో గల షెంగ్దు విమానాశ్రయం నుండి వచ్చిందని యోన్హాప్ న్యూస్ ఏజన్సీ తెలిపింది. జుమున్ ద్వీపంపై విమానం కనపడడంతో సైనికులు యుద్ధ విమానంగా భ్రమించారని ఏజన్సీ తెలిపింది.
సబ్ మెరైన్ ఘటన తర్వాత ఇరు దేశాల సముద్ర సరిహద్దుకు సమీపాన గల ద్వీపంలొ దక్షిణ కొరియా సైన్యం మిలట్రీ డ్రిల్లు నిర్వహిస్తుండగా, ఉత్తర కొరియా సైన్యం ఆ ద్వీపం పైకి ఫిరంగులు పేల్చి ఇద్దరు పౌరులు మరణించడానికి కారణమైంది. పౌరుల మరణానికి క్షమాపణలు చెప్పిన ఉత్తర కొ
రియా మిలట్రీ డ్రిల్లు పేరుతో తమ దేశంపైకి దక్షిణ కొరియా కాల్పులు జరపడంతో తాము ప్రతిస్పందించామని తెలిపింది. దక్షిణ కొరియా తాను ఉత్తర కొరియాపైకి కాల్పులు జరపలేదని దక్షిణ దిశలో సముద్రంపైకి మాత్రమే కాల్పులు జరుపుతూ మిలట్రీ డ్రిల్లు నిర్వహించుకుంటున్నామనీ వాదించింది.
ఇరు దేశాల సముద్ర సరిహద్దును అమెరికా ప్రోద్బలంతో ఏక పక్షంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించిందని ఆరోపిస్తూ దాన్ని గుర్తించడానికి ఉత్తర కొరియా నిరాకరిస్తోంది. సరిహద్దుకు సమీపంలో ఉన్న వివాదాస్పద ద్వీపంలో మిలట్రీ డ్రిల్లు జరపడం నచ్చకే ఉ.కొ కాల్పులు జరిపిందని అందరూ భావించారు. అనంతరం అమెరికా, దక్షిణ కొరియాతో కలిసి పశ్చిమ సముద్రంలో ఉమ్మడిగా మిలట్రీ డ్రిల్లు నిర్వహించింది. ఉమ్మడి డ్రిల్లు సమయంలో కూడా ప్రతిస్పందిస్తానని ఉత్తర కొరియా ప్రకటించి మరింత ఉద్రిక్తతను రేకెత్తించింది. అయితే చివరి నిమిషంలో తన ప్రతిస్పందనను విరమించుకున్నానని ఉ.కొ ప్రకటించి ఉద్రిక్తతను తగ్గించింది.
ఆ తర్వాత కూడా అడపా దడపా ప్రకటనల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా పాలకులని వీమర్శిస్తూ కొన్నాళ్ళు ఉత్తర కొరియాపై కరపత్రాలను జారవిడిచింది. ద.కొ ఇలాగే మానసిక యుద్ధాన్ని కొనసాగించినట్లయితే దానితో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటానని ఉ.కొ హెచ్చరించింది. ఉత్తర కొరియా అణ్వస్త్రాలను తయారు చేసుకోవడానికి కూడా అమెరికా ఇష్టపడటం లేదు. ఫలితంగా ఐ.ఎ.ఇ.ఏ తీర్మానంతో భద్రతా సమితి, రెండు విడతలుగా ఉ.కొ పై వాణిజ్య ఆంక్షలు విధించింది. దక్షిణ కొరియాలో అమెరికా అణ్వస్త్రాలని మొహరించింది. ఉత్తర కొరియా మాత్రం అణ్వస్త్రాలను తయారు చేసుకోవడానికి అంగీకరించనంటోంది. అమెరికా, ద.కొ, జపాన్ లు ఒకవైపూ, చైనా, ఉ.కొ లు మరోవైపు వాదోపవాదాలూ, మిలట్రీ డ్రిల్లులూ నిర్వహిస్తూ దక్ధిణ చైనా సముద్రంలో ఉద్రిక్తలు సృష్టించడం పరిపాటిగా మారింది.