లాడెన్ హత్య – సి.ఐ.ఏ ఇన్ఫార్మర్లను అరెస్టు చేసిన పాకిస్ధాన్ ప్రభుత్వం


లాడెన్ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురు పాకిస్దానీ ఇన్ఫార్మర్లను పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ సంస్ధ ఐ.ఎస్.ఐ అరెస్టు చేసింది. ఒసామా బిన్ లాడెన్ హత్య వీరిచ్చిన సమాచారం వల్లనే జరిగిందని భావిస్తున్నారు. వీరు సి.ఐ.ఏ నియమించిన గూఢచారులుగా పని చేస్తూ అబ్బోత్తాబాద్ భవనానికి జరిగే రాకపోకలపై నిఘా ఉంచి ఆ సమాచారాన్ని సి.ఐ.ఏకి చేరవేసినట్లుగా అనుమానిస్తున్నారు. లాడెన్ రక్షణ తీసుకున్న ఇంటికి దగ్గర్లోనే సి.ఐ.ఏ ఒక సేఫ్ హౌస్ ఏర్పాటు చేసుకుంది. ఆ ఇంటి ఓనర్ అరెస్టు అయినవారిలో ఒకరని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. పాక్ సైన్యంలో మేజర్ ర్యాంకులో ఉన్న వ్యక్తి కూడా వీరిలో ఉన్నారని ఆ పత్రిక తెలిపినప్పటికీ పాకిస్ధాన్ దాన్ని ఖండించింది. సైన్యం గానీ, పోలీసులు గానీ ఆ ఐదుగురిలో లేరని ఐ.ఎస్.ఐ తెలిపింది.

బిన్ లాడెన్ హత్యానంతరం పాక్ ప్రభుత్వంపై పాక్ ప్రజలకు అనుమానాలు తలెత్తాయి. సైన్యం చేతగానిదిగా మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా పాకిస్ధాన్ సైన్యం పాక్ లో ఉన్న సి.ఐ.ఏ ఏజెంట్లలో మూడింట రెండొంతులమందిని వెనక్కి పంపేసింది. లాడెన్ హత్యతో చెడిన సంబంధాలను బాగు చేసుకోవడానికా అన్నట్లుగా హిల్లరీ క్లింటన్ ఇటీవల పాక్ ని సందర్శించింది. “పాక్ సైన్యంలో ఉన్నత స్ధాయిల్లో ఉన్నవారికి తాలిబాన్ తో కానీ, ఆల్-ఖైదాతో కానీ సంబంధాలున్నట్లు అస్సలు ఎటువంటి సాక్ష్యాలు లేవు” అని ప్రకటించింది. దానర్ధం కింది స్ధాయిలో ఉన్నావారికి ఆ సంస్ధలతో సంబంధాలు ఉన్నాయనేదే అర్ధం. పాక్ విదేశీ మంత్రి కూడా ఐ.ఎస్.ఐ, సైన్యం లలొ కింది స్ధాయివారికి టెర్రరిస్టు సంస్ధలతో సంబంధం ఉండి ఉండవచ్చు అని ప్రకటించాడు కూడా.

బిన్ లాడెన్ కాంపౌండుకి సమీపంలో ఉన్నవారిలో కొంతమందిని అరెస్టు చేశామని ఐ.ఎస్.ఐ ప్రతినిధి బ్రిగేడియర్ అజ్మత్, మరొక అర్మీ అధికారి నిర్ధారించినట్లుగా బిబిసి తెలిపింది. “వారు సి.ఐ.ఏ తో కలిసి పనిచేశారని మేం అనుమానిస్తున్నాం. లాడెన్ కాంపౌండ్‌కి రాకపోకలు సాగించినవారు కూడా అరెస్టు ఐన వారిలో ఉన్నారు” అని అర్మీ అధికారిని ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. అరెస్టు ఐనవారిలో రెండు కేటగిరీలకు చెందినవారున్నారని మిలట్రీ అధికారులు చెప్పారు. ఒక కేటగిరి, అమెరికా హెలికాప్టర్లు వస్తుండగా వాటికి దారి చూపడానికి లాడెన్ కాంపౌండ్ లోకి మండుతున్న దివిటీలను విసిరినవారు కాగా రెండో కేటగిరి, పాకిస్ధాన్ భూభాగంలొ అమెరికా హెలికాప్టర్లు తిరిగి ఇంధనం నింపుకోవడానికి సహకరించినవారు అని వారు తెలిపారు.

ఇదిలా ఉండగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్టు గేట్స్, సెనేట్ హియరింగ్ లో పాల్గొన్నపుడు పాక్ అరెస్టుల గురించి పరోక్షంగా అడిగారు. “వారు (విదేశీ ప్రభుత్వాలు) మన మిత్రులు అని చెప్పుకుంటూ మనకు సహాయం చేస్తున్నవారిని కూడా అరెస్టు చేస్తారా?” అని సెనెటర్ పేట్రిక్ లీహే అడిగాడు. “కొన్ని సార్లు” అని చెప్పిన గేట్స్ కొనసాగిస్తూ “ఇంకా కొన్నిసార్లు మనపైన నిఘాఉంచడానికి మనుషుల్ని పంపుతారు. వాళ్ళే మనకు సన్నిహిత మిత్రులు కూడా. మేము వ్యవహరించే వాస్తవ ప్రపంచం అలానే ఉంటుంది” అని బదులిచ్చాడని బిబిసి తెలిపింది.

లాడెన్ హత్య తర్వాత పాక్ ప్రభుత్వం చాలామందిని అరెస్టు చేసింది. వారిని విడుదల చేయడం కూడా జరిగింది. పాకిస్ధాన్ అధికారులు సి.ఐ.ఏ ఇన్ఫార్మర్లను ఏరివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని గానీ తాలిబాన్ లేదా ఆల్-ఖైదా సానుభూతిపరులను అరెస్టు చెయ్యడానికి ఎటువంటి ఆసక్తీ చూపడం లేదని బిబిసి విలేఖరి వాపోతున్నాడు. అమెరికా దురాక్రమణకి సహకరించడమే కాక, ఆ దురాక్రమణపై పోరాడుతున్నవారి పట్ల సానుభూతి చూపుతున్న సొంత ప్రజలను కూడా శిక్షించాలని బిబిసి విలేఖరి కోరుకుంటున్నాడు. బిన్ లాడెన్ అన్ని సంవత్సరాలు అబ్బొత్తాబాద్ లో రక్షణ పొందడానికి సహకరించినవారిని వేటాడే బదులు పాక్ ప్రభుత్వం లాడెన్ మరణానికి సహకరించినవారిని అరెస్టు చేస్తున్నదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వాపోయింది.

అమెరికాతో మిత్రత్వం ఇలానే ఉంటుంది. వారి ఆజ్ఞలకు లొంగి ఉంటూ, దేశ సంపదల్ని అమెరికా కంపెనీలకు ధారపోస్తూ, అటువంటి చర్యలను వ్యతిరేకిస్తున్న సొంత పౌరుల్ని కూడా వెంటాడి వేటాడాలని అమెరికా బాసులు కోరుకుంటారు. పాకిస్ధాన్ ప్రభుత్వం స్వయంగా ఇన్నాళ్ళూ సి.ఐ.ఏ గూఢచారులను దేశంలోకి అనుమతించింది. పాక్ ఆర్మీ సి.ఐ.ఏ వాళ్ళను తమ అత్యంత రహస్యమైన కరాచి నావల్ బేస్ సందర్శించడానికీ, ఆర్మీ ప్రధాన కార్యాలయంలో టెబుల్ వేసుకుని కూర్చోవడానికి కూడా అనుమతించింది. అవన్నీ సి.ఐ.ఏ కి సహకరించే చర్యలే. కనుక అమెరికాకి సహకరిస్తున్నందుకు మొట్టమొదటి ద్రోహులు పాకిస్ధాన్ పాలకులు, ఐ.ఎస్.ఐ అధికారులు, మిలట్రీ అధికారులే అవుతారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s