ఒసమా బిన్ లాడెన్ హత్య జరిగిన ఆరు వారాల అనంతరం ఆయన వారసుడిని ఆల్-ఖైదా నియమించుకుంది. లాడెన్కి కుడిభుజంగా పేరుపొందిన ఐమన్ ఆల్-జవహిరి అందరూ భావించినట్లుగానే ఆల్-ఖైదా సుప్రీం నాయకుడుగా నియమితుడయ్యాడు. ఆల్-ఖైదా జనరల్ కమాండ్ ఈ నియామకం జరిపినట్లుగా ఆల్-ఖైదా మీడియా విభాగం ఒక మిలిటెంట్ల వెబ్ సైట్ లో ప్రకటించింది. “షేక్ డా. ఐమన్ ఆల్-జవహిరి, భగవంతుడు ఆయనను నడిపించుగాక, ఆల్-ఖైదా అమిర్ (నాయకుడు) గా భాధ్యతలు స్వీకరించాడు” అని ఆ ప్రకటన పేర్కొంది. ఆల్-ఖైదా మీడియా విభాగం ఆల్-ఫజిర్ మీడియా సెంటర్ తరపున ప్రకటన జారీ అయింది.
“బ్రెయిన్” సంబంధం
ఆల్-జవహిరి ఈజిప్టులో జన్మించాడు. కంటి విభాగంలొ వైద్య వృత్తిని అభ్యసించాడు. అనేక సంవత్సరాలుగా బిన్ లాడెన్ కి కుడిభుజంగా, ముఖ్య అనుచరుడిగా ఉంటున్నాడు. లాడెన్ హత్యానంతరం తదుపరి జవహిరియే నాయకుడవుతాడని అందరూ వూహించారు. ఈయనని పట్టిచ్చినవారికి 25 మిలియన్ డాలర్ల బహుమతిని అమెరికా ప్రకటింది. అమెరికాలోని జంట టవర్లపై జరిగిన టెర్రరిస్టు దాడి వెనుక “ఆపరేషనల్ బ్రెయిన్స్” గా బిబిసి జవహిరిని పేర్కొంది. బిన్ లాడెన్ని జంట టవర్లపై దాడుల వెనక “మాస్టర్ బ్రెయిన్” గా అభివర్ణిస్తూ వచ్చిన పశ్చిమ దేశాల మీడియా సంస్ధలు, ఇప్పుడు జవహరిని ‘ఆపరేషనల్ బ్రెయిన్’ గా అభివర్ణిస్తున్నాయి. 9/11 ఘటనలతో ఏదో రకమైన “బ్రెయిన్” సంబంధం ఉంటేనే అమెరికా ప్రజలకు టెర్రరిస్టు నాయకుడని చెబుతున్నవారిపై ఆగ్రహం, కసి కలగవు. కనుక జవహిరి “ఆపరేషనల్ బ్రెయిన్” అయ్యాడు.
జవహరి బదులు మరొకరు ఆల్-ఖైదా నాయకుడుగా నియమితుడయితే ఆయన కూడా టెర్రరిస్టు దాడులకు ఏదో ఒక “బ్రెయిన్” అయ్యుండేవాడు. కుక్కను చంపాలనుకున్నపుడు పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్లే, అమెరికా ప్రజలకు ఒక శత్రువును, అది కూడా ప్రపంచ శాంతికీ, అమెరికా జాతీయ భద్రతకూ పెనుప్రమాదంగా నిలిచే శతృవును సృష్టించడానికి, ఆవ్యక్తికి 9/11 టెర్రరిస్టు దాడులతో సంబంధం, ముఖ్యంగా “బ్రెయిన్” సంబంధం ఉన్నదని ముద్ర వేయవలసి ఉంటుంది. సద్దామ్ హుస్సేన్ని సాకుగా చూపి ఇరాక్పైన దాడి చేయడానికి కూడా సద్దామ్కీ, ఆల్-ఖైదాకీ సంబంధాలు ఉన్నాయని అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రకటించడం, దాన్ని ఘనత వహించిన పశ్చిమ దేశాల కార్పొరేట్ మీడియా భుజానేసుకుని ప్రచారం చేయడం తెలిసిందే.
కధలు, కధనాలు
ఇకనుండి జవహిరి పైనే అనేక కధనాలు కధలు, కధలుగా ప్రచారాలు వెలువడతాయి. ఆ కధలు, కధనాలు జవహిరి ఎంత క్రూరుడో, ఎంత పెద్ద రాక్షసుడో వివరిస్తాయి. వీలయితే మనుషుల రక్తాన్ని కూడా అతను తాగుతూ ఉండవచ్చు. మనుషుల రక్తం దొరక్కపోతే జంతు రక్తం కోసం ఆయన పాకులాడవచ్చు. ఉన్నవీ, లేనివీ అనేక దాడులకు జవహిరి “ఆపరేషనల్ బ్రెయిన్” గా ఇకనుండి వెలుగొందవచ్చు. బిన్ లాడెన్, దాడులన్నింటికి “మాస్టర్ బ్రెయిన్” కనుక జవహిరి “ఆపరేషనల్ బ్రెయిన్” గా మిగిలాడు. జవహిరి కూడా చనిపోతే మరొకరు ఏ ‘డిప్యుటీ మాస్టర్ బ్రెయినో’ లేదా ‘అసిస్టెంట్ ఆపరేషనల్ బ్రెయినో’ అవుతారన్నమాట. మొత్తం మీద ఆల్-ఖైదా నాయకులుగా నియమితులైనవారందరికీ ఏదో రూపంలో జంట టవర్ల దాడులకు ఒక బ్రెయిన్ సంబంధం ఉండి తీరుతుంది.
జవహరి వారం రోజుల క్రితమే బిన్ లాడెన్ చనిపోయాక కూడా సమాధులనుండే దురాక్రమణదారులను భయపెడతాడని ప్రకటించిన విషయాన్ని బిబిసి గుర్తు చేస్తోంది. తమ సంస్ధ నాయకుడు గనుక ఒక దేశం, అందునా అగ్ర రాజ్యం అన్యాయంగా చంపింది గనుక అటువంటి అభివర్ణనలు సహజం. అదీ కాక లాడెన్ ని భూమిలో పాతిపెడితే అదొక పుణ్యక్షేత్రంగా మారుతుందని భయపడే సమద్రంలో పాతిపెట్టామని అమెరికా అధ్యక్షుడే స్వయంగా ప్రకటించాడు. దానర్ధం లాడెన్ చావు కూదా అమెరికాని భయపెట్టిందనే. అదే జవహిరి ప్రకటించాడు. అమెరికా దురాక్రమణ ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో ఇంకా కొనసాగుతూనే ఉంది. డ్రోన్ వీమానాల దాడుల్లో వందలమంది పౌరులు మరణిస్తూనే ఉన్నారు. ఇరాక్, ఆఫ్ఘన్ లప్రజలు ఆకలి, దరిద్రాలతో తీసుకుంటూనే ఉన్నారు. అందువలన దేశభక్తి ఉన్న ప్రతి ఆఫ్ఘన్ దేశస్ధుడూ ఆక్రమణదారులను తరిమికొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నాలను అమెరికా, పశ్చిమ రాజ్యాలు టెర్రరిస్టు చర్యలు అంటుంటే ప్రపంచ జనం నమ్మేసి వారిపై కోపం పెంచుకోవడం అన్యాయమైన విషయం.
జవహరి గత వారం చేసిన ప్రకటనలో అరబ్ ప్రజా ఉద్యమాలను కొనియాడాడు. “అవినీతి, అణచివేతలతో పాలిస్తున్న పాలకులు నేల కూలేదాకా, మన దేశాలపై పశ్చిమ దేశాలు రుద్దిన అటువంటి క్రూర పాలకులు మట్టి కరిచేదాకా తమ పోరాటాలను ప్రజలు కొనసాగించాలి” అని కోరాడు. ఈజిప్టు, ట్యునీషియా లలో ప్రపంచం కోరుకుంది అదే. లిబియాలో కూడా ఇతర దేశాల ప్రజలు గడ్డాఫీ నియంతృత్వాన్నుండి లిబియా ప్రజలు విముక్తి కావాలని కోరుకుంటున్నారు. కాని అమెరికా, యూరప్ లు మాత్రం మరొక నియంతను నియమించాలని కోరుకుంటున్నాయి. జవహిరి ప్రజల పక్షాన మాట్లాడుతుంటే అమెరికా, యూరప్ లు మరొక నియంత పక్షాన మాట్లాడుతూ దాడులు చేస్తున్నాయి. అందుకే లిబియా, సిరియాలే కాదు ఏ దేశమైనా ఆ దేశ భవిష్యత్తుని నిర్ణయించేది అక్కడి ప్రజలే తప్ప అమెరికా, యూరప్ లు కాదు.
జవహిరి నివాసం?
జవహిరి పాకిస్ధాన్ లోని ఆఫ్ఘన్ సరిహద్దు రాష్ట్రాల్లో, గిరిజన తెగలు నివసిస్తున్న చోట రక్షణ తీసుకుంటున్నాడని అమెరికా, యూరప్ ల గూఢచారి సంస్ధలు భావిస్తున్నాయి. బిన్ లాడెన్ కూడా ఆఫ్ఘన్ కొండల్లో, కోనల్లో, గుహల్లో నివసిస్తున్నాడని పశ్చిమ దేశాల పత్రికలు కోడై కూశాయి. అరిచి గోల చేశాయి. తీరా చూస్తే పాకిస్ధాన్ నడిబొడ్డున, మిలట్రీ అకాడమీకి కూతవేటు దూరంలో విలాసవంతమైన భవనంలో (నిజానికి ఈ భవనంలోపల గోడలకు సిమెంటు ప్లాస్టరింగ్ తప్ప కనీసం పెయింటింగ్ అన్నా కనిపించలేదు. టివికి ఇచ్చిన కనెక్షన్ వైర్లు ఏదో టూరింగ్ టాకీస్ లో వేలాడుతున్నట్లు వేలాడుతున్నాయి. లాడెన్ అంటూ ప్రసారం చేసిన వీడియోలో ఆయన వంటిపైన ఖరీదైన రగ్గులేవీ లేవు కేవలం దుప్పటి కప్పుకుని ఉన్నాడు. బైటి గోడలు సైతం సిమెంటు ఇటుకలే కనిపిస్తున్నాయి తప్ప సిమెంటు ప్లాస్టరింగ్ కూడా లేదు. విలాస భవనం అంటే పచ్చగా మెరిసే లాన్ లు ఉండాలి కనీసం. అవేవీ లేకపోగా నల్లనేల దున్నినట్లుగా ఉందంతే. భవనం బైట కాంపౌండ్ లో బండలుకూడా పరిచి లేవు. అటువంటి భవనాన్ని విలాసవంతమైన భవం అని రాయడానికి వీరికి పెన్నెలా వచ్చిందో అర్ధం కాదు) ఉండగా కేవలం నాలుగు హెలికాప్టర్లతో వచ్చి చంపివెళ్ళారు.
పశ్చిమ దేశాలు ప్రసారం చేసే కధనాలు మౌలికంగా మూడో ప్రపంచ దేశాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవి. బలహీనమైన ఆఫ్ఘనిస్ధాన్ పై ఉన్మత్త దాడులు చేసి అక్కడి ప్రజలను రోజూ చంపుతున్నవారు రేపు మన ఇంటిముందే బాంబులేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా, పశ్చిమ రాజ్యాల సామ్రాజ్య దాహానికి అంతులేదు కనుక.