కొడుకు చేసిన తప్పుకి అతని తల్లి కక్షిదారుల చేతిలో అవమానం ఎదుర్కోవలసి వచ్చింది. పాకిస్ధాన్ లోని “ఖైబర్ పక్థూన్ఖ్వా” రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని పాకిస్ధాన్ పోలీసులు చెబుతున్నారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణతో అతన్ని చంపడానికి ఆయుధాలతో వెళ్ళిన సంబంధీకులు నలుగురు, అతను ఇంటివద్ద లేక పోవడంతో అతని తల్లిని వివస్త్రను గావించి గ్రామంలో ఊరేగించారు. నిందితుల వద్ద ఆయుధాలు ఉండడంతో గ్రామస్తులెవరూ ఆ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని పోలీసులు తెలిపారు.
హరిపూర్ జిల్లా పోలీసు ప్రధాన అధికారి బిబిసికి తెలిపిన వివరాల ప్రకారం నిలోర్ బాలా గ్రామవాసి ఒకరు తన భార్యతో ఇద్దరు వ్యక్తులు అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆ గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలతో కూడిన విలేజ్ కౌన్సిల్ అతనిని తన భార్యకు విడాకులు ఇవ్వమని సలహా ఇచ్చారు. ఆ సలహా ఫిర్యాదుదారుకి నచ్చలేదు కాబోలు, అతను నలుగురు సాయుధులను వెంటబెట్టుకుని తాను ఆరోపిస్తున్న వారిలొ ఒకరి ఇంటిపైకి దాడి చేశాడు. చంపడానికి వెళ్ళినవారికి తాము వెతుకుతున్న వ్యక్తి ఇంట్లో కనపడలేదు. ఇంట్లో ఉన్న అతని తల్లి వారికి తేలికగా కనబడ్డ్డంతో ఆమెను బలవంతంగా వివిస్త్రను గావించి గ్రామంలో ఊరేగించారు.
పోలీసులు నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారని తెలుస్తోంది. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఏడుగురిపైన కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పాకిస్ధాన్ లొ ఇలాంటి ఘటనల్లో బాధిత మహిళలకు న్యాయం దొరకడం ఒకింత కష్టమే. అయినప్పటికీ ఖైబర్ ఫక్తూన్ఖ్వా రాష్ట్రంలో ఇటువంటివి అరుదని చెబుతున్నారు. గిరిజన ప్రాంతాల్లొ ఇప్పటికీ మిగిలి ఉండే మానవ విలువలు అందుకు కారణం కావచ్చు.
వ్యక్తిగత తగాదాల నుండి ఫ్యాక్షన్ తగాదాలు, కక్షల వరకు ఏ తప్పూ చేయనప్పటికీ సంబంధిత ఆడవారిని శిక్షకు గురి చేయడం సమాజంలో అనాదిగా వస్తున్న దురాచారం. దురాచారం అనడం కంటే అదొక వెసులుబాటుగా అందుబాటులో ఉంటోందని చెప్పడం సరైంది. స్త్రీలు మగవారి తర్వాతే అన్న ఆచారం పాతుకుపోయిన చోట ఇలాంటివి మామూలే అయినప్పటికీ చట్టాలు సైతం వారికి అందుబాటులో లేకపోవడం ఒక విషాధం.
ముఖ్యంగా ఈ నేరాలు దక్షిణాసియా దేశాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాల్లో అనేక సార్లు ఇటువంటి ఘటనలు జరిగాయి. ప్రఖ్యాత గజదొంగ గా పేరుగాంచిన పూలన్ దేవిని గ్యాంగ్ రేప్ చేయడంతోనే ఆమె గజదొంగగా మారిందన్న సంగతి తెలిసిన విషయమే. ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నిక అయినప్పటికీ ఆమె శత్రువులయిన భూస్వాములు వెంటాడి చంపగలిగారు. ఎం.పిగా ఆమె హోదా అమెను చంపడానికి అడ్డు రాలేక పోయింది.
2002 లో పాకిస్ధాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఇటువంటి ఘటనే జరిగింది. మీర్వాలా గ్రామంలో ఇలాగే అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కక్ష్యతో తప్పు చేశాడని ఆరోపించిన వ్యక్తి సోదరి ముఖ్తార్ మాయిని గ్యాంగ్ రేప్ కి గురిచేశారు. కోర్టులో పోరాడిన మాయి నిందితులు ఆరుగురిపై నేరం రుజువు చేయగలిగింది. కాని వారు సుప్రీం కోర్టులో అప్పీలుకి వెళ్ళాక గత ఏప్రిల్ లో వారిలో ఐదుగురిని నిర్దోషులుగా విడిచి పెట్టారు. సంవత్సరాల తరబడి సాగే విచారణ చివరికి మహిళలపై జరిగే అత్యాచార నేరాలను రుజువు చేయడానికి వీలు కాకుండా చేస్తుంది. తీరా శిక్ష పడే సమయానికి పరిస్ధితులు తారుమారై బాధితులకు న్యాయం అందడం కష్టంగా మారిపోతుంది.