ఇ.యు షరతులు, పొదుపు ఆర్ధిక విధానాలపై గ్రీసు కార్మికుల సమర శంఖం


“ఈ ఆర్ధిక విధానాలు, పొదుపు చర్యలకు అనుకూలంగా ఓటు వేయాలంటే పులికి ఉండే క్రూరత్వం కలిగి ఉంటేనే సాధ్యం.” ఈ మాట అన్నది గ్రీకు పార్లమెంటు సభ్యుడు, జార్జి లియానిస్. ఈయన పాలక పార్టీ ఐన సోషలిస్టు పార్టీ సభ్యుడు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్ధ (IMF) లు సహాయం పేరుతో గ్రీసు కి ఇవ్వనున్న అప్పు కోసం గ్రీసు ప్రభుత్వం అమలు చేయవలసిన కఠినమైన పొదుపు ఆర్ధిక విధానాలు, చర్యలను ఉద్దేశిస్తూ ఆయన ఈ మాటలన్నాడు. జార్జి మాటలను బట్టే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు సహాయం పేరుతో ఎంతటి క్రూరమైన ఆర్ధిక విధానాలను గ్రీసు ప్రజలపై రుద్దుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

గత సంవత్సరం మే నెలలో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు కలిసి గ్రీసుకి 110 బిలియన్ యూరోల అప్పు ప్యాకేజి మూడు సంవత్సరాల కాలంలో ఇవ్వాలని నిర్ణయించాయి. ఫలితంగా అవి విధించిన విషమ షరతులను గ్రీసు అమలు చేసింది. ఆ షరతుల వలన గ్రీసు నిరుద్యోగం 16.2 శాతానికి చేరుకుంది. మిలియన్ కి పైగా ఉన్న ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఏడు లక్షలకి చేరుకున్నాయి. కొత్త ఉద్యోగాలు లేవు. పెన్షన్ భారాన్ని ఉద్యోగులపై మోపారు. పన్నులు పెంచారు. కొత్త పన్నులు మోపారు. వేతనాల్లో కోత పెట్టారు. బోనస్ లు రద్ధు చేశారు. ఈ విధానాల ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. కోనుగోళ్ళు తగ్గిపోయి ఆర్ధిక వృద్ధి మాంద్యం (recession) లోకి జారింది. ప్రజల జీవన స్ధాయి దిగజారింది.

2010 సంవత్సరం అంతా పొదుపు ఆర్ధిక విధానాల దెబ్బను రుచి చూసిన గ్రీసు ప్రజలు ఇక ఎంతమాత్రం ఆ విధానాలను భరించే స్ధితిలో లేరు. ఆర్ధిక సంక్షోభం దృష్ట్యా పొదుపు విధానాలు తప్పవేమోనన్న మౌన అంగీకారంతో గత సంవత్సరం పొదుపు విధానాలను అన్యమనస్కంగా ఆమోదించిన గ్రీసు ప్రజలు అవి తమ జీవితాలను ఎంతగా అల్లకల్లోలం చేసాయో అనుభవం లోకి రావడంతో అంతకంటె క్రూరమైన విధానాలను ఈ సంవత్సరం ప్రతిపాంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుధవారం వారు సార్వత్రిక సమ్మెకు పిలుపు నిచ్చారు. వేలమంది కార్మికులు గ్రీసు రాజధాని ఏధెన్సులో పార్లమెంటుముందున్న సింటాగ్మా స్క్వేర్‌కి వెల్లువెత్తి నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. “దొంగలు! ద్రోహులు!! డబ్బంతా ఎక్కడికి పోయింది?” అని పార్లమెంటు సభ్యులను తీవ్ర స్వరాలతో ప్రశ్నిస్తున్నారు. “ఇవి చాలా కఠినమైన చర్యలు. అవి మమ్ముల్ని సంక్షోభంనుండి ఏ మాత్రం బైటకి తీసుకురావు. మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పడం మెము నమ్మలేక పోతున్నాం” అని నిరసనకారులు ఆవేశంతో ఆక్రోశిస్తున్నారు.

ఆందోళనకారులు పార్లమెంటు మెట్లపై నిలబడి లోపలికి ప్రవేశిస్తున్న డిప్యుటీ (పార్లమెంటు సభ్యులు) లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 1500 మంది వరకు పోలీసులు పార్లమెంటు చుట్టూ రెండు మీటర్ల ఎత్తున ఇనప బారికేడ్లు నిర్మించారు. పార్లమెంటును పోలీసు వేన్లతో చుట్టుముట్టి కాపలా కాస్తున్నారు. వాటర్ కేనాన్లు తెచ్చిన పోలీసులు నిరసనకారులతో ఘర్షణకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఇవ్వనున్న సహాయం ఐదు సంవత్సరాల పాటు విస్తరించాలని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు నిర్ణయించాయి. ఆ ఐదు సంవత్సరాల పాటు గ్రీసు పొదుపు విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. గ్రీసు ప్రజల పరిస్ధితిని ఒక తాగుబోతు విలాసవంతుడి కుటుంబ సభ్యుల పరిస్ధితితో పాల్చవచ్చు.

కుటుంబం పెద్ద కుటుంబం అలనా పాలనా విస్మరించి తాగుడు తదితర వ్యసనాలతో ఊరినిండా అప్పులు చేసిన పరిస్ధితి. కుటుంబం బతకడానికి పైసా కూడా ఇంట్లో ఇవ్వని పరిస్ధితి. ఆ గడ్డు పరిస్ధితుల్లో అతని భార్యా పిల్లలు గొడ్డులా కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బుతో కలో గంజో తిని బతుకుతున్నారు. తాగుబోతుకి అప్పులిచ్చిన వారు అప్పులు తీర్చాలంటూ ఊరి పెద్దలని ఆశ్రయిస్తే వారు అతని కుటుంబ సభ్యులు సంపాదిస్తున్నదాంట్లో మెజారిటీ భాగాన్ని అప్పులు తీర్చడానికి ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చారు. ఇవ్వడానికి ఒప్పుకోక పోతే దండించడానికి గ్రామ గూండాలని నియమించారు. అప్పుడా కుటుంబం ఏం చేయాలి? తమ కొద్ది సంపాదనని అప్పులకోసం చెల్లించి కుటుంబ సభ్యులు ఆకలితో, అర్ధాకలితో బతుకు బండి లాగించాలి. లేదా కుటుంబం మొత్తం ఐక్యంగా తిరగబడి గ్రామ గూండాలని తరిమి కొట్టాలి. గ్రామ పెద్దలు తమ తీర్పు ఆ కుటుంబం మంచి కోసమేననీ, అప్పు తీర్చాలంటే తమ తీర్పు అమలు చేయక తప్పదనీ చెబుతున్నారు. అప్పుచేసిన వాడు కుటుంబ ప్రయోజనం కోసం ఖర్చు చేస్తే ఆ అప్పు తీర్చాలని కుటుంబాన్నంతటినీ కోరడంలో అర్ధం ఉంది. కాని అందుకు భిన్నంగా అప్పంతా తాగుబోతు తాగుడికీ, విలాసాలకీ ఖర్చు చేస్తే ఆ అప్పుని కుటుంబ సభ్యులు తీర్చాలని గ్రామ పెద్దలు ఒత్తిడి చేయడం, గూండాలను నియమించడం ఎంతవరకు సబబు? గ్రామ పెద్దలకూ, తాగుబోతుకీ ఉన్న కోవర్టు సంబంధాలే వారా తీర్పునివ్వడానికి ప్రేరేపించాయన్నది ముఖ్యాంశం.

ఇక్కడ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రామ పెద్దల అవతారం ఎత్తాయి. కుటుంబ పెద్ద గ్రీసు పాలకవర్గాలు, పార్టీలు. వారు దశాబ్దాల తరబడి చేసిన అప్పులన్నింటిలో ప్రజలకు చేరింది చాలా నామమాత్రం. ఆ అప్పులు ప్రధానంగా ధనికుల కంపెనీలకి ఇచ్చిన సబ్సిడీలు, వారికి బడ్జెట్ ద్వారా ఇచ్చిన మద్దతు, కంపెనీలు బ్యాంకుల వద్ద తీసుకుని ఎగవేసిన అప్పులు, ఎగుమతి సబ్సిడీలు, ఎగుమతి పన్నుల మినహాయింపు, ఆదాయపు పన్ను ఎగవేత ఇలాంటి ఖాతాలకే జమ అయింది తప్ప ప్రజలకు అందింది లేశ మాత్రమే. ప్రజలు శ్రమ చేసి నిర్మించిన సంపద ఐన ప్రభుత్వ రంగ పరిశ్రమలని కూడా అమ్మేసి అప్పులు తీర్చాలని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు షరతులు విధించాయి. అంకెల్లో చెప్పుకుంటె 2015 లోపల ప్రభుత్వరంగ కంపెనీలను అమ్మి 50 బిలియన్ యూరోలు పోగేయాలని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు నిర్ధేశిస్తున్నాయి. అనేక కోతలతో వచ్చిన వేతనాలు కార్మికులు, ఉద్యోగులు తదితర ప్రజానీకం జీవిన స్ధాయిలను ఘోరంగా కుదించి వేశాయి. వస్తున్న కొద్ది వేతనాలను కూడా పన్నులు వేసి పిండుకోవాలని అవి ఆదేశించాయి. 2015 లోపు కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, సౌకర్యాలు కత్తిరించడం ద్వారా28 బిలియన్ యూరోలు మిగల్చాలని అవి షరతు విధిస్తున్నాయి.  గత సంవత్సరం ఇచ్చిన ప్యాకేజి మూడు సంవత్సరాలపాటు విస్తరించగా, దాని స్ధానంలో వస్తున్న తాజా ప్యాకేజీ ఐదు సంవత్సరాలపాటు విస్తరించనుంది. అంటే ఐదు సంవత్సరాల పాటు ప్రజలు కఠిన దరిద్రాన్ని ఎదుర్కోవాలి. ఆ తర్వాత వచ్చేది సుఖాలనుకుంటె పొరబాటే. అప్పటికి ప్రజల దగ్గర మిగిలేది ఏమీ ఉండదు. మహా పిండుకుంటే తిరుగుబాట్లను పిండుకోవలసిందే.

ప్రస్తుతం ఇంతగా గ్రీసుని తొందర పెట్టడానికి కారణం వచ్చే నెలలో గ్రీసు జారి చేసిన సావరిన్ అప్పు బాండ్లు కొన్ని పక్వానికి రానున్నాయి. పక్వానికి రావడం అంటే ఆ బాండ్ల ద్వారా సమకూడిన అప్పును తిరిగి వడ్డీతో సహా చెల్లించాలి. అది 12 బిలియన్ యూరోలు. ఆ డబ్బు గ్రీసు వద్ద లేదు. “మేం ఇప్పుడు చారిత్రకంగా అతి కీలకమైన క్షణాల్లో ఉన్నాం” అని గ్రీసు ప్రధాని జార్జి పపాండ్రూ అంటున్నాడు. ఈ విధానాలన్నింటిని అమలు చేయడానికి గ్రీసు పాలకులు సిద్ధమయ్యారు. పార్లమెంటులో అందుకనుగుణంగా చట్టం చేయబోతున్నారు. అది తెలిసి ప్రజలు నిరసన తెలియజేయడానికి వస్తే పోలీసులతో అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రీసు పాలకులకి, ఇ.యు-ఐ.ఎం.ఎఫ్ ల ద్వయానికీ ఉన్న అవగాహన గ్రీసు ప్రజల కుత్తుకలను ఉత్తరించడానికి దారి తీస్తోంది. గ్రీసులో ఉన్న బహుళజాతి కంపెనీలు, గుత్త సంస్ధలు అన్ని దాదాపు ఇ.యులోని జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ లాంటి దేశాలకు చెందినవి కావడం గమనార్హం. అంటే విషమ షరతులు విధించి ఇచ్చిన అప్పులో అధిక భాగం ఆ ధనిక దేశాల కంపెనీలు, బ్యాంకులకు అప్పుల కిందా, రీకేపిటలైజేషన్ కిందా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాయం పేరుతో ఇచ్చిన అప్పు అంతిమంగా గ్రీసు ప్రజలకి కాకుండా అప్పిచ్చిన దేశాల కంపెనీలకే చేరుతుంది.

ఉదాహరణకి బ్యాంకుల మధ్య అంతర్జాతీయ స్ధాయిలో సెటిల్మెంట్లు చేసే అంతర్జాతీయ బ్యాంకు –Bank of International Settlements (BIS)- ప్రకటించిన వివరాల ప్రకారం 2010 చివరినాటికి గ్రీసు సావరిన్ బాండ్లలో పెట్టిన పెట్టుబడి, బ్యాంకులు కార్పొరేటు కంపెనీల అప్పులు అన్ని కలిపితే ఫ్రాన్సు బ్యాంకులు 56.7 బిలియన్ యూరోలు అప్పివ్వగా, జర్మనీ బ్యాంకులు 34 బిలియన్ డాలర్లు అప్పిచ్చాయి. ఇప్పుడు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇచ్చే అప్పు ప్యాకేజిలో అధిక భాగం ఈ జర్మనీ, ఫ్రాన్సు దేశాల బ్యాంకుల అప్పులు తీర్చడానికే ఖర్చవుతుంది. కాని ఆ అప్పుని తీర్చుతున్నదీ, తీర్చేదీ మాత్రం గ్రీసు ప్రజలు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఫ్రాన్సు లేదా జర్మనీ ఇచ్చిన అప్పులు ఒక్క గ్రీసు ప్రభుత్వానికి మాత్రమే కాదు (ఎరుపు అక్షరాలు). గ్రీసు లోని ప్రభుత్వ ప్రవేటు బ్యాంకులకూ, ప్రవేటు కార్పొరేటు కంపెనీలకు ఇచ్చిన అప్పులు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. గ్రీసు ప్రజల వేతనాలు తగ్గించి, పన్నులు పెంచి వారి మూల్గులు పిప్పి చేసి పిండుకున్న మొత్తాన్ని ప్రవేటు బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలు చేసిన అప్పుల్ని తీర్చడానికి గ్రీసు ప్రభుత్వం ఖర్చుపెడుతుంటే అది గ్రీసు ప్రజలకోసం అని నంగనాచి కబుర్లు చెప్పే ఈ దోపిడీ ప్రభుత్వాలని ఏమని సంబోధించాలో పాఠకులే నిర్ణయించాలి.

అంతిమంగా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇంతగా కిందామీదా పడి ఇచ్చే ప్యాకేజీ అప్పులు తీర్చాల్సింది మాత్రం గ్రీసు ప్రజలే. నూతన ఆర్ధిక విధానాలు అన్నా, సరళీకరణ-ప్రవేటీకరణ-ప్రపంచీకరణ విధానాలన్నా, నయా ఉదారవాద ఆర్ధిక విధానాలన్నా సారాంశంలో అంతిమంగా ఇవే. కష్టపడేది ప్రజలు, అనుభవించేది ఏ కష్టమూ చేయని బహుళ జాతి కంపెనీలు, వారి అనుచర గణం. కంపెనీలను మేపినందుకు ప్రభుత్వాలు నడిపేవారికి కమీషన్లు దక్కుతాయి. అంతిమంగా ప్రజలకు మిగిలేది కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి, దరిద్రం, నిరుద్యోగం వగైరాలు. ఇటువంటి వ్యవస్ధని గొప్పదనీ, తిరుగులేనిదనీ, ప్రత్యామ్నాయం లేదనీ చెప్పడానికి పూజారుల్లాంటి సిద్ధాంత కర్తలు ఎల్లప్పుడూ సిద్ధం. వారి పేర్లు ఇప్పుడు పాల్ క్రుగ్‌మేన్ కావచ్చు, లేదా నౌరియెల్ రౌబిని కావచ్చు, లేదా జోసెఫ్ స్టిగ్లిట్జ్ కావచ్చు. చెప్పేది మెదళ్ళు పండిన పూజారులో లేక సిద్ధాంత కర్తలో కనుక ప్రజలు అమాయకంగా నమ్మడం, నమ్మి చెడడం మామూలే.

ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు రుద్ధిన ఆర్ధిక విధానాలను సంవత్సరం పాటు అమలు చేశాక గ్రీసు ఆర్ధిక వ్యవస్ధ దారుణంగా బలహీనపడింది. అవి ఇచ్చిన సహాయం అప్పుకి తోడై గ్రీసు అప్పు మరింతగా పెరిగింది. గ్రీసు అప్పు సంక్షోభం పరిష్కారం కోసం అంటూ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇచ్చిన అప్పు, ఆ ఆప్పు సంక్షోభాన్ని మరింతగా తీవ్రం చేసింది. ఫలితంగా గత సంవత్సరం గ్రీసు కోసం ప్రకటించిన అప్పు ప్యాకేజి గ్రీసుకి సరిపోదని దాన్ని మరింత పెంచాలని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు నిర్ణయించి చర్చలు జరుపుతున్నాయి. ఆ చర్చలు ఎంతకీ తేలడం లేదు. గ్రీసు అప్పు భారాన్ని ప్రవేటు మదుపుదారులు కూడా కొంత భరించాలని జర్మనీ, ఫ్రాన్సులు వాదిస్తుండగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ECB) అందుకు ససేమిరా అంటోంది. స్వచ్ఛందగా ముందుకు వస్తే సరేగాని బలవంతంగా ప్రవేటు మదుపుదారులపై భారం రుద్దితే అది అప్పు చెల్లించలేక పోవడంతో (debt default) సమానమనీ ఇసిబి వాదిస్తోంది. అది మార్కెట్లను మరింత దెబ్బతీస్తుందనీ, సంక్షోభం త్వరగా ఇతర యూరోజోన్ (Euro zone) దేశాలకు పాకుతుందని భయపడుతూ, భయపెడుతోంది.

మరోవైపు 17 సభ్య దేశాల యూరోజోన్ ఆర్ధిక మంత్రుల సమావేశం గ్రీసుకి ఇవ్వదలుచుకున్న కొత్త ప్యాకేజిపై ఏ నిర్ణయానికి రాకుండానే మంగళవారం సమావేశాన్ని ముగించాయి. జూన్ 23-24 తేదీల్లో జరిగే యూరోపియన్ శిఖరాగ్ర సమావేశం నాటికి ఏదోకటి తేల్చాలని ప్రయత్నిస్తున్నాయి. కాని ఒప్పందం జులై 11 వరకు వాయిదా పడే అవకాశం ఉందని స్లోవేకియా ఆర్ధిక మంత్రి చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. గ్రీసు అప్పులను రీస్ట్రక్చర్ చెయ్యవలసి వస్తే ఎదురయ్యే పరిస్ధితిపై వారు ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారు. రీస్ట్రక్చర్ చెయ్యడమంటే గ్రీసు అప్పుబాండ్లలో పెట్టుబడులు పెట్టిన ప్రవేటు పెట్టుబడుదారులకు చెల్లింపులను తగ్గించడమే. అంటే గ్రీసు అప్పు తీర్చలేని పరిస్ధితుల్లో ఉందిగనక ప్రవేటు మదుపుదారులు తమకు రావలసినదానిలో కొంత వదులుకోవాలి. దీనికి ఇసిబి అంగీకరించడం లేదు. అది అంతిమంగా అప్పు సంక్షోభం యూరోజోన్ దేశాలకు విస్తరించడానికి దారి తీస్తుందని చెబుతోంది. ఆ విధంగా ప్రవేటు పెట్టుబడుదారులు కూడా భారం పంచుకోనట్లయితే జర్మని ఫ్రాన్సుల పైనే అధిక భారం పడుతుందని ఆ దేశాలు భయపడుతున్నాయి. ముఖ్యంగా జర్మనీ యూరోజోన్ నాయకుడిగా ఉంది. ఆర్ధిక వృద్ధిలో కూడా జర్మనీ ముందంజలో ఉంది. యూరోజోన్ లో ఇతర దేశాల భారాన్ని జర్మనీ అధికంగా భరించడానికి జర్మనీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జర్మనీ ప్రభుత్వం ఒక్క పైసా గూడా ఇవ్వడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నారు.

నిజానికి జర్మని, ఫ్రాన్సు లేదా ఇతర యూరోజోన్ దేశాలపై పడేది భారం కాదు. అవన్నీ కలిసి ఉమ్మడిగా అప్పు ఇస్తున్నాయంతే. కాకుంటే ప్రవేటు పెట్టుబడుదారులు సంక్షోభంలో ఉన్న దేశాలవద్ద డిమాండ్ చేసే వడ్డీ కంటే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లకు ఇచ్చే వడ్డీ కొంత తగ్గుతుంది. కానీ ఆ అప్పుతో విదించే షరతులు ప్రవేటు మదుపుదారులు డిమాండ్ చేస్తున్న అధికవడ్డీ కంటే ప్రమాదకరమైనవి. ఆ దేశాల ఆర్ధిక వ్యవస్ధల నాడీ మండలం మొత్తాన్నీ ఆ అప్పు బలహీన పరుస్తుంది. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితర సామాన్య ప్రజానికం అందరి ఆర్ధిక స్ధితిగతుల్ని తల్లకిందులు చేసేస్తుంది. గ్రీసు ప్రజలు ఒక్క సంవత్సరం పాటు ఎదుర్కొన్న భయంకర అనుభవాలే దానికి నిదర్శనం. ఐ.ఎం.ఎఫ్ విధించిన విషమ షరతులు అమలు చేసిన ఇండియాలాంటి మూడో ప్రపంచ దేశాల్లొ ప్రజలు మెజారిటీ భాగం ఆకలి, దరిద్రాలతో అల్లాడుతున్న పరిస్ధితే దానికి ప్రత్యక్ష సాక్ష్యం.

గ్రీసుకి ఇవ్వదలుచుకున్న కొత్త ప్యాకేజి వాయిదా పడే కొద్దీ మార్కెట్లు యూరోజోన్ దేశాల గ్రూపుకి ప్రతికూలంగా మారుతున్నాయి. ఉదాహరణకి యూరో విలువ గత రెండు నెలల తర్వాత మొదటి సారిగా  జూన్ 15న 1.43 డాలర్లకంటే తక్కువకు పడిపోయింది. గ్రీసు బ్యాంకుల షేర్లు 7 శాతం నష్టపోయాయి. ఫ్రాన్సు బ్యాంకుల షేర్లు కూడా పడిపోయయి. రేటింగ్ సంస్ధలు గ్రీసు రేటింగ్ ని తగ్గిస్తాయేమోనని గ్రీసు ప్రభుత్వ వర్గాలు భయపడుతున్నాయి. సంక్షోభం ఈ విధంగా ఘనీభవించడంలో రేటింగ్ సంస్ధల పాత్ర తక్కువది కాదు. అవి రేటింగ్ తగ్గిస్తాయన్న భయంతో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, యోరోపియన్ కమిషన్, ఫ్రాన్సు ప్రభుత్వాలు ప్రవేటు పెట్టుబడుదారులకు గ్రీసునుండి తమకు రావలసిన చెల్లింపులను కొత్త బాండ్ల రూపంలో తీసుకోవాలని బ్రితిమాలుకుంటున్నాయి. లేకుంటే గ్రీసు రేటింగ్ ని డిఫాల్టు స్ధాయికి తగ్గించడానికి ఫిచ్ లాంటి రేటింగ్ సంస్ధలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని సంతృప్తిపరచాలంటే యూరోజోన్ దేశాలు తామివ్వాలనుకుంటున్న 120 బిలియన్ యూరొలకంటె ఎక్కువ ఇవ్వాల్సి ఉంది అందుకు ఫ్రాన్సు, జర్మనీల ప్రజలు అంగీకరించడం లేదు. అందుకే జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆ భారాన్ని ప్రవేటు పెట్టుబడిదారులు పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజిలు శుక్రవారం ఏకాంతంగా సమావేశం కానున్నారు.

పాలకులు ఈ పనుల్లో ఉంటే గ్రీసు ప్రజలు ఆందోలన పధంలో ఉన్నారు. పోలీసులతో ఘర్షణ పడ్డారు. రాళ్ళు రువ్వారు. టియర్ గ్యాస్ ని ఎదుర్కొన్నారు. గ్రీసు కార్మిక యూనియన్లు అక్కడ ఉన్న మొత్తం ఐదు మిలియన్ల కార్మికుల్లో సగం మంది సభ్యులుగా కలిగి ఉన్నాయి. వారంతా దేశంలోని వివిధ పట్టణాల్లొ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పోర్టులు, స్కూళ్ళు, మూసేశారు. ఆసుపత్రుల్లో సగం మంది డ్యూటీకి హాజరుకాలేదు. గ్రీసు అప్పు ఇప్పుడు 340 బిలియన్ యూరోలు. అది గ్రీసు జిడిపి లో 150 శాతం. అంటే జిడిపి కంటె 1 1/2 రెట్లు ఎక్కువ. ఇది ఎప్పటికైనా గ్రీసు తీర్చగలదా అని మార్కెట్లకు గట్టి సందేహాలున్నాయి. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇచ్చే అప్పులతో కలిపి గ్రీసు అప్పు మరింతగా పెరుగుతుంది. ఇక దీనికి అంతేలేదు. ప్రజలు ఊరుకున్నంత కాలం, భరించినంతకాలం ఈ క్రమానికి అంతే ఉండదు. అంతులేని కధ కంటే ఘోరంగా ఉంటుంది. ప్రజలకిక మిగిలింది ఉద్యమాలూ, పోరాటాలే. అది కూడా నిర్ణయాత్మకమైన పోరాటాలు. వాటికి ఈ దోపిడి గజ దొంగలు లోంగి వచ్చేది.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s