కాలిఫోర్నియాకి చెందిన 59 ఏళ్ళ గజ ఈతగాడు బిల్ వారెన్ బిన్ లాడెన్ శవం కోసం సముద్రాన్ని గాలించడానికి సిద్ధపడ్డాడు. ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నిజంగా చనిపోయాడో లేదో ప్రపంచానికి తెలియజేయడానికి తాను ఈ పనికి పూనుకున్నానని వారెన్ చెబుతున్నాడు. “నేను దేశ భక్తి గల అమెరికన్ ని. నిజం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ పనికి సిద్ధపడ్డాను” అని ఆయన న్యూయార్క్ పోస్ట్ పత్రికతో మాట్లాడుతూ చెప్పినట్లుగా ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. బిల్ వారెన్ నిధుల అన్వేషి (ట్రెజర్ హంటర్) గా పేరు పొందిన వ్యక్తి అని తెలుస్తోంది.
9/11 టెర్రరిస్టు దాడులకు పధక రచన చేసినట్లుగా అమెరికా ఆరోపించిన ఒసామా బిన్ లాడెన్, మే 2 తేదీన అమెరికా నావీ సీల్స్ అనే ప్రత్యేక కమెండోల చేతిలో హత్యకు గురయ్యాడని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించాడు. అతని శవాన్ని సముద్రంలో పాతి పెట్టామని ఆయన ప్రకటించాడు. సద్దాం హుస్సేన్ శవం పాతిపెట్టిన స్ధలం పెద్ద పుణ్య క్షేత్రంగా మారినట్లే ఒసామా సమాధి కూడా మారుతుందన్న భయంతో లాడెన్ శవాన్ని సముద్రంలో పారేసినట్లుగా అమెరికా అధికారులు ఆ తర్వాత తెలిపారు. లాడెన్ శవం ఫోటోలు చూసినవారు భయభ్రాంతులకు గురయ్యేలా ఉన్నందున వాటిని విడుదల చేయబోమని కూడా వారు తెలిపారు.
అయితే ఫోటోలు విడుదల చేయకపోవడమే లాడెన్ నిజంగా చనిపోయాడా లేదని అనుమానాలు తలెత్తేలా చేసింది. లాడెన్ వాస్తవానికి కిడ్నీ వ్యాధితో 2001 డిసెంబరు లోనే చనిపోయాడనీ, ఆయన శవాన్ని అతని భార్య అమెరికాకి అప్పగించిందనీ, అమెరికాలోని ఒక రహస్య ప్రాంతంలో లాడెన్ శవం ఇన్నాళ్ళూ భద్రంగా ఉంచారనీ అనేక కధనాలు వెలువడ్డాయి. జంట టవర్లపై దాడులు తానే చేయించినట్లుగా లాడెన్ అంగీకరిస్తూ
విడుదలైన వీడియో టేపుల్ని తామే రూపొందించినట్లుగా సి.ఐ.ఏ గతంలో ఒప్పుకున్న నేపధ్యంలో ఇప్పటి లాడెన్ హత్య కూడా డ్రామా అవడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలో బిల్ వారెన్ లాడెన్ శవం వెతకడానికి సిద్ధపడడం అసక్తికరంగా మారింది.
అమెరికా మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం బిన్ లాడెన్ శవాన్ని ‘యు.ఎస్.ఎస్ కార్ల్ విన్సన్’ అనే పేరుగల యుద్ధనౌక సాయంతో ఉత్తర అరేబియా సముద్రంలో పాతిపెట్టారు. ఒసామా చనిపోయాడనేందుకు తగిన సాక్షాన్ని ఒబామా ఇవ్వలేదని వారెన్ భావిస్తున్నాడు. బిల్ వారెన్ 1972 నుండీ వాణిజ్య ప్రయోజనాల నిమిత్తం గజ ఈత వృత్తిలో ఉన్నాడు. కాలిఫోర్నియాలోని శాంతా క్రజ్ వద్ద మునిగిపోయిన బ్రిటిష్ వ్యాపార నౌకను వెతకడం వారెన్ సాధించిన మొదటి విజయంగా పత్రికలు తెలిపాయి.
రష్యా గూఢచారులెవరూ లాడెన్ హత్యా వార్తను నమ్మడం లేదని తన రష్యన్ గర్ల్ ఫ్రెండు ద్వారా తెలిసిందని వారెన్ చెప్పాడు. “నాకొక రష్యన్ గర్ల్ ఫ్రెండు ఉంది. అక్కడ రష్యాలో గూఢచార సర్కిల్ లో లాడెన్ నిజంగా చనిపోయినట్లు ఎవరూ నమ్మడం లేదట” అని వారెన్ చెప్పాడు. “నేను మా ప్రభుత్వాన్ని గానీ ఒబామాని గానీ నమ్మడం లేదు” అని కూడా వారెన్ కుండబద్దలు కొట్టాడు.
లాడెన్ శవం కోసం వెతకడానికి 400,000 డాలర్లు ఖర్చవుతుందని వారెన్ అంచనా వేస్తున్నాడు. అనేక బోట్లు, అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఈ వెతుకులాట జరపడానికి వినియోగిస్తున్నట్లు వారెన్ తెలిపాడు. లాడెన్ శవం గనక దొరికితే అక్కడె సముద్రంలోనే డి.ఎన్.ఎ పరీక్ష జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ఆయన తెలిపాడు.