‘ఐ పాడ్ 2’ కోసం కిడ్నీ అమ్ముకున్న చైనా యువకుడు


ఐ పాడ్ 2అయినవారి కోసం కిడ్నీ దానం చేయడం చూశాం. పని దొరక్క కడుపు నింపు కోవడానికి రక్తదానం, కిడ్నీ దానం చేస్తున్న చేనేత కార్మికులను చూస్తున్నాం. కూతురి పెళ్ళి కోసం కట్నం చెల్లించే స్తోమత లేక కిడ్నీ అమ్ముకుంటున్న తల్లి దండ్రుల్నీ చూశాం. కానీ వినియోగ సంస్కృతి వెర్రితలలు వేస్తున్న ఫలితంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ మన ముందుంచిన ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరంపై మోజుతో కిడ్నీ అమ్ముకున్న యువకుడి విషయం తెలిస్తే యువత ఎంత ప్రమాదంలో ఉన్నదీ అర్ధమై నిర్ఘాంతపోక తప్పదు.

చైనాలోని అన్‌హూయి రాష్ట్రంలో ఒక టీనేజి యువకుడు ‘ఐ పాడ్ 2’ మీద మోజు తీర్చుకోవాలనుకున్నాడు. కానీ తల్లి దండ్రుల ఆర్ధిక స్ధితి అందుకు సహకరించదు. దాంతో ఏకంగా కుడివైపు కిడ్నీనే అమ్ముకున్నాడా యువకుడు. విషయం తర్వాత తెలుసుకున్న అతని తల్లి తన కొడుకు కిడ్నీని కాజేసిన వారి కోసం వేట మొదలు పెట్టింది. గత గురువారం డాంగ్‌ఫాంగ్ అనే టీవీ ఛానెల్ ఈ వార్తను ప్రసారం చేసింది.

17 సంవత్సరాల గ్జియావో ఝెంగ్ కొత్తగా రిలీజయిన ‘ఐ పాడ్ 2’ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. కిడ్నీ కొనడానికి సిద్ధంగా ఉన్న ఏజెంటుని సంప్రదించాడు. మధ్య చైనాలోని హూనాన్ రాష్ట్రానికి ప్రయాణం కట్టాడు. అక్కడ స్ధానికంగా ఉన్న ఒక ఆసుపత్రిలో అతనికి ఆపరేషన్ అయ్యింది. అతని కిడ్నీని ఆపరేషన్ ద్వారా తొలగించి తీసుకున్నాక గ్జియావోకి వాళ్ళు 22,000 యువాన్లు (3,900 డాలర్లు) చెల్లించారు. ఆ డబ్బుతో ‘ఐ పాడ్ 2’ తో పాటు ‘ఐ ఫోన్’ కూడా కొనుక్కుని ఇంటికొచ్చాడు.

‘ఐ పాడ్’ కంప్యూటర్ తో పాటు కొత్త ఫోన్ తో మా అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చాడు. అంత ఖరీదైన వస్తువులు కొనడానికి మాకు అన్ని డబ్బుల్లేవు. అంత డబ్బు ఎక్కడనుండి వచ్చిందో మొదట మాక్కూడా చెప్పకూడదని గ్జియావో నిర్ణయించుకున్నాడట. కొంత నచ్చ జెప్పాక తన కుడి కిడ్నీని అమ్ముకున్నట్లు చెప్పాడు” అని గ్జియావో తల్లి ఛానెల్ తో మాట్లాడుతూ తెలిపింది. ఘెంగ్ తల్లి కోపంతో కొడుకుని వెంటబెట్టుకుని మళ్లీ ఆసుపత్రికి వెళ్ళింది.

ఆసుపత్రికి వెళ్ళాక వారి ఆపరేషన్ ధియేటర్ ని వాణిజ్య వినియోగం కోసం వేరే వ్యాపారికి ఆ రోజు అద్దెకి ఇచ్చినట్లుగా ఆసుపత్రి వారు చెప్పారు. ఆ వ్యాపారి ఫుజియాన్ రాష్ట్రానికి చెందినవాడని ఆసుపత్రి వారి ద్వారా తెలిసింది. ఏజెంటుని సంప్రదించడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో సాధ్యం కాలేదు. కానీ ఏజెంటునీ, వ్యాపారినీ ఎలాగైనా కనిపెట్టి చట్టం ముందు నిలబెట్టాలని ఆ తల్లి పట్టుదలతో ఉంది. తన ప్రయత్నం సఫలమవుతుందని నమ్మకంతో ఉంది. మరో వైపు గ్జియావో ఆరోగ్యం క్షీణిస్తున్నట్లుగా ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ చెబుతోంది. సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఒక కిడ్నీ సరిపొతుంది. మరి గ్జియావో ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తున్నదీ వివరాలు అందలేదు.

టి.వి, ఫ్రిజ్, టెలిఫోన్, వాషింగ్ మెషిన్, సెల్ ఫోన్, ఇప్పుడు ఐ పాడ్, ఐ ఫోన్ ఇవన్నీ సోంత చేసుకోవాలని దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి జీవులు కలలు కంటుంటారు. ఈ వస్తువులు హోదాకి చిహ్నంగా మారిపోవడంతో వాటిపై మోజు కూడా పెరుగుతుంది. తమ సరుకుల్ని అమ్ముకోవడం కోసం అప్పులివ్వడం, వాయిదాల పద్దతిలో అమ్మడం, షాపులకి వెళ్తే అందమైన షోకేసుల్లో కనపడ్డం, టివిల్లో ప్రకటనలు ఇవన్నీ కూడా వినియోగ సరుకుల వైపు ప్రజలు ఆకర్ధితులు కావడానికి దారి తీస్తోంది. హోదా చిహ్నాలుగా ఉన్నవి క్రమంగా అత్యవసరాలుగా మారిపోతున్నాయి. సులభ జీవన శైలికి అలవాటు పడుతున్న కొద్దీ మరిన్ని వస్తువులు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. ఒకటి కొని వాడే లోపే దాని కంటె ఆకర్షణగా ఉండే మరో వస్తువు మార్కెట్ ని నింపుతున్నాయి.

ఈ విధంగా వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగ సరుకులు అత్యవసరం అని ప్రజలు భావించే స్ధాయికి కంపెనీలు వాతావరణాన్ని సృష్టించ గలిగాయి. జీవితంలో పైకి రావడం, సంఘంలో స్ధానం సంపాదించడం వీటన్నిటికీ కూడా ఎలెక్ట్రానిక్ పరికరాలు సంకేతాలుగా మారి పోయాయి. వినియోగ మత్తులో పడిన కుటుంబాలు అటువంటి వాతావరణం తమ పిల్లలను ఎలా ప్రభావితం చేస్తున్నదీ తెలుసుకునే అవకాశాలు లేవు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగే కొద్దీ మనుషుల మధ్య సంబంధాల గాఢత పలచపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను కూడా అవి ప్రభావితం చేస్తున్నాయి. సంస్కృతిని, ప్రజల అలవాట్లను ఈ వినియోగ సరుకులు శాసిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఫలితంగా కుర్రకారు ఎంతకైనా తెగిస్తున్నారు.

పౌరుల అభివృద్ధికీ, సామాజిక అభివృద్ధికీ అవసరమైన రంగాల్లో శాస్త్రీయ ప్రయోగాలు, పరిశోధనలు జరగడానికి బదులుగా పెట్టుబడిదారుల ప్రయోజనాలు, వారి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచగల సరుకులను కనిపెట్టడానికీ, వాటి అమ్మకాలను పెంచడానికీ శాస్త్ర ప్రయోగాలు జరుగుతున్న నేపధ్యంలో వినియోగ సరుకు కోసం కిడ్నీ అమ్ముకునే సంఘటనలు చోటు చేసుకోవడం సాధారణమే నని చెప్పుకోవాలి. డబ్బు కోసం, లాభాల కోసం కుత్తుకలు కోసుకుంటున్నపుడు కిడ్నీ అమ్ముకోవడం పెద్ద విషయం కాక పోవచ్చు. ఇలాంటప్పుడే ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధ ఆవశ్యకత స్పష్టంగా తెలిసి వస్తుంది.

One thought on “‘ఐ పాడ్ 2’ కోసం కిడ్నీ అమ్ముకున్న చైనా యువకుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s