పోస్కో (POSCO) కంపెనీ కోసం ప్రభుత్వాల పచ్చి అబద్ధాలు, అరాచకాలు


పోస్కోకి వ్యతిరేకంగా ధింకియా ప్రజల పోరాటంపోస్కో కంపెనీ ప్రాజెక్టు: ఇది దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి కంపెనీ. భారత దేశంలో సంవత్సరానికి నాలుగు మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేస్తానని 2005 లో భారత దేశంలో ఒప్పందం కుదుర్చుకుంది. 12 బిలియన్ డాలర్ల (రు. 52,000 కోట్లు) పెట్టుబడి ఈ ప్రాజెక్టు రూపంలో ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకే కంపెనీకి ఇంత పెట్టుబడి మరి దేనికీ రాలేదు. ప్రాజెక్టు కట్టడం కోసం ఇది ఒడిషాలోని జగత్‌సింగ్ పూర్ జిల్లలోని 4000 ఎకరాల అటవీ భూమే కావాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నయానో భయానో ఇప్పటికే 1800 ఎకరాల భూమిని సేకరించింది. మిగిలిన భూమి ధింకియా, గోవింద్ పూర్ గ్రామాల్లోని 60 శాతం భూమి కావాలి. కానీ ఆ రెండు గ్రామాల ప్రజలు తమ భూముల్ని ఇవ్వడానికి నిరాకరించారు.

ప్రభుత్వాలే చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయి

భారత ప్రభుత్వం అడవులు కాపాడుకోవడం కోసం, అడవులపై ఆధారపడి నివసించే గిరిజనుల హక్కులను కాపాడ్డం కోసం అటవీ హక్కుల చట్టం (Forest Rights Act) ఇటీవలే చేసింది. దీని ప్రకారం అడవి భూముల్ని తాకే హక్కు ఎవరికీ లేదు. గిరిజనులకి అడవులపైన అన్ని హక్కులూ ఉంటాయి. గిరిజనుల భూముల్ని గిరిజనులు తప్ప ఎవరు కొనకూడదు. కాని కేంద్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీల సేవల కోసం తాను చేసిన చట్టాలను తానే ఉల్లంఘించడానికి సిద్ధమైంది. కర్బన వాయువుల విడుదలవలన భూమి వేడెక్కి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరిగింది. దాన్ని నివారించడానికి అడవుల పెంపకాలను విస్తృతం చేయాల్సి ఉంది. అందుకోసం అంతర్జాతీయ ఒప్పందంపై ఇండియా సంతకం కూడా చేసింది. అటు అటవీ హక్కుల చట్టం, ఇటు పర్యావరణ చట్టాలను ఉల్లంఘీంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనాయి.

2005 లో ఒప్పందం కుదిరితే 2011 జనవరి వరకూ కేంద్ర పర్యావరణ శాఖనుండి, అటవీ శాఖనుండీ అనుమతులు రాలేదు. దానిక్కారణం ఆయా చట్టాలు అందుకు అనుమతించక పోవడమే. జనవరి నెలలో అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ అడవుల శాఖ అనుమతి ఇచ్చేసింది. కాని మే నెలలో పర్యావరణ మంత్రి జైరాం రమేష్ పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అనుమతిని మంజూరు చేసేశాడు. “చట్టాల ఉల్లంఘనను క్రమబద్ధీకరించడానికి నేను బద్ధ వ్యతిరేకిని. కానీ క్రమబద్ధీకరించక తప్ప లేదు” అని అనుమతి ఇస్తూ జైరాం రమేష్ అన్నాడు.

ప్రజలేమైతేనేం, అబివృద్ధి జరగాలి

ప్రధాని మన్మోహన్, హోం మంత్రి చిదంబరం, వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ వ్యవసాయ మంత్రి శరద్ పవార్ లాంటి మార్కెట్ స్వేచ్ఛా సిద్ధాంత పండితులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పర్యావరణ అనుమతిని మంజూరు చేయించారు. వారికి తమకు ఓట్లు వేసి గెలిపించిన భారత ప్రజల ప్రయోజనాల కంటే విదేశీ కంపెనీల ప్రయోజనాలు, రెండంకెల జిడిపి వృద్ధి రేటు… ఇవే కావాలి తప్ప భారత ప్రజల జీవనోపాధి గంగలో కలిసినా వారికి

బాధ లేదు. అభివృద్ధి పేరుతో ప్రజల నోటికాడి కూడును లాగివేస్తూ విదేశాలకు బంగారు పళ్ళెంలో పెట్టి అర్పించుకుంటున్నాయి. వేల బిలియన్ల రూపాయల ప్రాజెక్టులతో పాటు వచ్చే కమీషన్లను స్విస్ బ్యాంకులకు తరలించుకునే అరాచకాలకు పాల్పడుతున్నారు.

ప్రజల దీక్ష, పోరాటం

ఎట్టి పరిస్ధితుల్లోనూ తమ భూముల్ని అప్పగించగూడదని పోస్కో బాధిత ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. తాముంటున్న ప్రాంతాన్ని వదిలిపోతే వారికిక జోవనోపాధి ఉండదని వారికి బాగానే అర్ధమయ్యింది. ఆరు సంవత్సరాలనుండి అలుపెరగకుండా వారు పోరాడుతున్నారు. చివరికి ఇరవై ప్లాటూన్ల పోలీసుల్ని దించి ధింకియా గ్రామం ప్రవేశం దగ్గర మొహరించారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులతో సహా వేలమంది గ్రామస్ధులు గ్రామ ప్రవేశం వద్ద ఎర్రటి ఎండలో నేలపై పడుకుని గ్రామంలోకి పోలీసులు రాకుండా అడ్డగించడానికి సిద్ధపడ్దారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలోనూ, చుట్టూతా నిషేధాజ్ఞలు విధించింది. నలుగురైదుగురుకంటే గుమికూడదని ఆజ్ఞాపించింది. ఎండ ఎంత తీక్షణంగా ఉందంటే ఇద్దరు పోలీసులు స్పృహ తప్పి పడిపోయారు. పిల్లల్లో చాలామంది స్పృహ తప్పారు. వారు కోలుకుని మంచినీళ్ళు తాగి దీక్ష కొనసాగించారే తప్ప వెనుదిరగ లేదు. మధ్యాహ్నానికల్లా కలెక్టర్ గ్రామ ప్రజల నిరసన చట్ట వ్యతిరేకం అని ప్రకటించాడు. మైకుల్లో పోలీసులు ప్రజలు వెళ్ళిపోవాలనీ లేకుంటే లాఠీ ఛార్జీ, కాల్పులు తప్పవనీ హెచ్చరించారు.

చిత్రం చూడండి! అటవీ హక్కుల చట్టం, పర్యావరణ చట్టం ఉల్లంఘించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీ కోసం పోలీసుల్ని కూడా దించితే అది చట్టబద్ధత. తాము పుట్టి పెరిగిన నేలనూ తమ జీవనోపోధినీ వదులుకోడానికి నిరాకరించి బతుకు పోరాటం చేస్తూ తమ గ్రామంలోనే నేలపై పడుకుంటే అది చట్ట వ్యతిరేకం. ఎంత ఘోరం! ఎంత అన్యాయం!! ఎంత అరాచకం!!!

నాలుగు గంటలపాటు అంటే సాయంత్రం నాలుగు గంటలవరకూ పోలీసులూ, అధికారులూ లౌడ్ స్పీకర్లలో గ్రామస్ధుల చట్ట ఉల్లంఘన గురించి హెచ్చరిస్తూ లాఠీ ఛార్జీ, టియర్ గ్యాస్, కాల్పులు జరుగుతాయని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎవరూ కదల లేదు, మెదల లేదు. అయితే ధింకియా గ్రామం ప్రవేశ ప్రాంతానికి పోలీసులతో పాటు మీడియా కూడా పెద్ద ఎత్తున చేరుకుంది. బహుశా మీడియాకే జడిశారో, లేక మరో పధకమే పన్నారో, గ్రామస్ధుల ధైర్యం, పట్టుదలలను బద్దలు చేయలేక పోలీసులు వెనక్కి మళ్ళారు. పోలీసులు మళ్ళీ ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చనే అంచనాతో గ్రామస్ధులు తమలో కొంతమందిని గ్రామానికి కాపలాగా అక్కడే ఉంచి వాయిదా పడిన తమ ఇంటి పనుల నిమిత్తం ఇళ్ళకు వెళ్ళారు.

ఇది కేవలం గుప్పెడు భూమికోసం, జానెడు పొట్ట కోసం పడే ఆరాటం మాత్రమే కాదు. ఇది చావు బతుకుల పోరాటం. అభివృద్ధి పేరుతో ప్రజల మౌలిక అవసరాలను తీర్చకుండానే ప్రజల సంపదలను విదేశీ ధనికులకు తాకట్టు పెడుతున్న ప్రభుత్వాల మోసానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. ప్రజల కోసం చేసిన నామ మాత్రపు చట్టాలను సైతం ఉల్లంఘిస్తున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై జరుగుతున్న దోపిడీ వ్యతిరేక పోరాటం. నయా ఉదార ఆర్ధిక విధానాలైన నూతన ఆర్ధిక విధానాలను అమలు చేయడానికి బహుళజాతి కంపెనీలకు హామీలు ఇచ్చి వారి లాభాలకు భారత దేశపు అశేష శ్రామిక ప్రజల మెడలకు బిగిస్తున్న ఉరి తాళ్లను తెంచుకునే జీవన్మరణ పోరాటం. స్పెషల్ ఎకనమిక్ జోన్ పేరుతో భారత దేశ సరిహద్దుల్లోనే విదేశీ కంపెనీల సామ్రాజ్యాల్ని నిర్మించుకోవదానికి అనుమతినిస్తున్న భారత పాలక వర్గాల ద్రోహ పూరిత విధానాలకూ, వంచనకూ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. వ్యాపారం పేరుతో వచ్చి దేశం మొత్తాన్ని పాదా క్రాంతం చేసుకున్న నాటి బ్రిటిష్ వాడు ప్రత్యక్షంగా భారతదేశాన్ని పాలిస్తే, నేడు అదే విదేశీ కంపెనీల ప్రతినిధులుగా భారత పాలకులే స్వయంగా భారత సంపదలను అప్పనంగా అప్పజెప్పడానికి తమ ప్రజలపైనే ప్రకటించిన యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న అసలు సిసలైన స్వాతంత్ర్య పోరాటం.

అబద్ధాలు, నయ వంచన

ధింకియా, గోవింద్ పూర్ గ్రామాల ప్రజల పోరాటాన్ని ఒడిషా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు “కొన్ని వర్గాలు పధకం ప్రకారం చేస్తున్న ప్రణాళికా బద్ధ నిరసన (engineered protest)” గానూ, కొద్దిమంది సృష్టించిన “కేవలం శాంతి భద్రతల సమస్య” గానూ, “భూస్వాధీనానికి ఎదురౌతున్న చిన్న సమస్య” గానూ మోసపూరితంగా చిత్రిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిజానికి ప్రజల ప్రయోజనార్ధమేనని నమ్మబలుకుతున్నాయి. మెజారిటీ ప్రజలు వాస్తవంగా ప్రాజెక్టుకు తమ ఆమోదాన్ని ఎన్నడో తెలిపారనీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. అదే నిజమైతే…

  • ఈ గ్రామాల గ్రామ సభల నుండి ప్రాజెక్టును సమర్ధిస్తూ ఒక్క తీర్మానాన్నయినా ప్రభుత్వాలు రికార్డు చేశాయా?
  • అటవీ హక్కుల చట్టాన్ని ఈ గ్రామ ప్రజలకు ఎందుకు వర్తింప జేయరు?
  • గ్రామ సభల్లో గ్రామస్ధుల అనుమతిని తీసుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు?
  • పర్యావరణ శాఖ చేపట్టవలసిన గ్రామ సభ నిర్వహణను ఎందుకు ఇంతవరకూ చేపట్టలేదు?
  • గ్రామస్ధులే గ్రామ సభలు నిర్వహించుకుని 2/3 మెజారిటీతో ప్రాజెక్టు వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రభుత్వాలకు అందజేస్తే రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గానీ ఆ విషయం ఎందుకు ప్రకటించడం లేదు? దాన్నెందుకు దాడిపెడుతున్నారు? దాన్నెందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు.

సమాధానం స్పష్టమే. ప్రజలు ప్రాజెక్టును సమర్ధించడం లేదు కనుక గ్రామ సభలను జరపరు. ఆ నిజం వెనక అనేక తెరవెనక సత్యాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు, కంపెనీ చెబుతున్నట్లు పోస్కో ప్రాజెక్టు వలన వీసమెత్తు ప్రయోజనం కూడా ప్రజలకు కలగదు. పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ స్వయంగా నియమించిన ఎంక్వైరీ కమిటీ విచారణ జరిపి “ప్రాజెక్టు వలన పర్యావరణానికి తీవ్రమైన వినాశకరమైన ప్రభావం పడుతుందనీ” తేల్చింది. పర్యావరణంపై ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన అంశాలు వాస్తవంలో పచ్చి అబద్ధాలుగా ఆ ఎంక్వైరీలో తేలాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పోస్కో కంపెనీలు సమగ్రమైన రీతిలో, ఒక పద్ధతి ప్రకారం, ఉద్డేశ్య పూర్వకంగా కుమ్మక్కయ్యి చట్టాలను ఉల్లంఘించడానికి సిద్ధపడ్డాయి. భారత ప్రభుత్వం స్వయంగా విదేశీ కంపెనీతో కుమ్మక్కయి, ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చడం కోసం భారత చట్టాలను గేలి చేయడానికీ, ప్రజల హక్కులను అణచివేయడానికీ, పచ్చి అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేయడానికీ నిర్ణయించుకున్నాయి.

ఈ అబద్ధాలు, మోసాలూ, నయవంచనలూ, దుష్ప్రచారాలూ కేవలం ఒడిషా ప్రభుత్వానికీ, పోస్కో కంపెనీలకే పరిమితమైనవి కావు. దేశ వ్యాపితంగా కొన్ని వందల కంపెనీల కోసం కొన్ని లక్షల ఎకరాల భూములను ప్రజలనుండి బలవంతంగా లాక్కొని విదేశీ కంపెనీలకు, ప్రవేటు వ్యక్తులకు కట్టబెటుతున్నాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలు నగ్నంగా ఉల్లంఘిస్తున్నాయి. లక్షలాది కుటుంబాలకు చెందిన వ్యవసాయ భూముల్ని, అటవీ భూముల్ని లాక్కొని అతి తక్కువ రేట్లకు విదేశీ, స్వదేశీ ప్రవేటు కంపెనీలకు ఇచ్చేస్తున్నాయి. వివిధ సంధర్భాల్లో పర్యావరణ శాఖ నిర్ణయాలను ప్రజా సంఘాలు సవాలు చేస్తుంటే అది తన నేరాలను అంగీకరించదానికి కూడా వెనకాడ్డం లేదు. అయినా తప్పదని పచ్చిగానే చెబుతున్నాయి. పర్యావరణ చట్టాలను తామింకా అర్ధం చేసుకుంటూనే ఉన్నామని జైరాం చెబుతున్నాడు. భారత దేశ వనరుల నిర్వహణలో భారత ప్రభుత్వ ఎన్ని ఘోరమైన తప్పులను చేస్తున్నదీ, ప్రజల సంపదలను ఎంత నీఛంగా పరాయి కంపెనీలకు అప్పనంగా అప్పజెపుతున్నదీ పోస్కో లాంటి వ్యవహారాలు విప్పి చూపుతున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు ఎంత దారుణ నేరాలకు పాల్పడుతున్నాయో కూడా వివరించి చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వలన అంతిమంగా లబ్ధి పొందేది విదేశీ, స్వదేశీ కంపెనీలే తప్ప ప్రజలకు మిగిలేది ఆకలి కడుపులే అన్న నిజాల్ని సమర్ధవంతంగా కప్పి పెడుతున్నాయని రుజువు చేస్తున్నాయి.

ప్రవేటు కంపెనీల లాభాలకు భారత దేశ బీద, కూలి, కార్మిక వర్గ ప్రజల సామాజిక జీవనాన్నీ, సామాజిక ప్రతిష్టనూ బలి పెడుతున్నాయి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు. ధింకియా గ్రామస్ధుల లాంటి గ్రామాల ప్రజలు దేశ వ్యాపితంగా భారత దేశపు భవిష్యత్తరాల బంగారు భవిష్యత్తును కాపాడ్దానికి పోరాడుతున్నారన్న సత్యాన్ని ఎరిగి అన్ని వర్గాల ప్రజలు దింకియా, గోవింద్ పూర్ గ్రామ ప్రజల జీవన్మరణ పోరాటానికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకరాపల్లి, కనపర్తి, నెల్లూరు తదితర గ్రామాల ప్రజలు సాగించిన రక్త తర్పణలకు ఫలితం ఉంటుందని ప్రతి ఒక్కరూ చాటి చెప్పి అందుకు పూనుకోవలసిన అవసరం చాలా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s