కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా, మన్మోహన్ ల నేతృత్వంలో గ్రూపులున్నది నిజమేనా?


భారత దేశం ఎమర్జింగ్ ఎకానమీగా చెలామణి అవుతోంది. చైనా తర్వాత అత్యధిక జిడిపి వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే చైనా అధిగమించాలని కలలు కంటోంది. చైనాకు పోటీదారుగా చెప్పుకుంటున్నప్పటికీ చైనా వివిధ రంగాల్లో సాధిస్తున్న ఆర్ధిక ప్రగతితో పోలిస్తే ఇండియా ప్రగతి చాలా దూరంలోనే ఉంది. చైనా ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ కాగా ఇండియా 11 వ స్ధానంలొ ఉంది. ఆసియాలో చూస్తే చైనా మొదటి స్ధానంలో ఉండగా ఇండియా, జపాన్ తర్వాత మూడవ స్ధానంలో ఉంది.

ప్రధాని మన్మోహన్, హోం మంత్రి చిదంబరం, వాణిజ్యమంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ప్రధాని ఆర్ధిక సలహా సంఘం అధిపతి కౌశిక్ బసు వీరంతా ఇండియాను ప్రభుత్వ పెట్టుబడిదారి విధానం నుండి ప్రవేటు పెట్టుబడిదారీ విధానం ప్రధాన పాత్ర పోషించే స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ వైపుకి తీసుకెళ్ళడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండంకెల ఆర్ధిక వృద్ధి సాధించాలని కలలు గంటున్నారు. ఆ క్రమంలో అమెరికా, ఐరోపా దేశాలకు, ప్రవేటు బహుళజాతి గుత్త సంస్ధలకు అత్యంత ఇష్టులుగా హోదా సంపాదించుకున్నారు.ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణాలయిన ప్రభుత్వ రంగ కంపెనీలను ఒక్కొక్కటిగా అమ్మేస్తూ అన్ని రంగాల్లోనూ ప్రవేటు కంపెనీల ఆధిపత్యాన్ని స్ధిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు గనక ఇండియాను ప్రభుత్వ రంగ ఆధిపత్యం నుండి ప్రవేటు రంగ ఆధిపత్యం వైపుకు వడి వడిగా అడుగులు వేస్తున్న “ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ” గా పిలుస్తున్నారు.

ఐతే భారత దేశంలో ప్రభుత్వ రంగంపై ఆధారపడి ఉన్న ప్రవేటు పెట్టుబడిదారులు ఇంకా గణనీయంగానే ఉన్నారు. వారి కంపెనీలు ప్రభుత్వ రంగ కంపెనీలతో ముడిపడి ఉన్నాయి. అందువలన ఇండియా ప్రభుత్వరంగం పూర్తిగా కూలిపోవడానికి వీరు ఆటంకంగా ఉన్నారు. వారి ప్రయోజనాల కోసం పనిచేసే రాజకీయ వర్గాలు కూడా రాజకీయ రంగంపై ప్రభావం కలిగి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ రెండు ఆర్ధిక ధోరణులను ప్రతిబింబించే వారు ఉన్నారు. వారి మధ్య తరచూ ఘర్షణలు జరగడం మనం చూస్తూనే ఉన్నాము. సోనియా గాంధి నేతృత్వంలోని ప్రణబ్ ముఖర్జీ, జైరాం రమేష్, రాహుల్ తదితరులు ఇంకా ప్రభుత్వ రంగంపై శ్రద్ధ కలిగి ఉండగా ప్రధాని మన్మోహన్ నాయకత్వంలోని అహ్లూవాలియా, చిదంబరం, ఆనంద్ శర్మ తదితరులు భారత దేశంలో ప్రభుత్వ రంగాన్ని వీలైనంత త్వరగా అమ్మేసి ప్రవేటు రంగానికి ఆధిపత్యం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు గ్రూపులకు ఉత్ప్రేరకం కమీషన్లే. అవి లేకుండా వీరు ప్రభుత్వాలు నడపడానికి ఆసక్తి ఉండదు.

ప్రభుత్వరంగం పై శ్రద్ధ ఉన్న సోనియా నాయకత్వంలోని గ్రూపుకి ప్రవేటు రంగ ఆధిపత్యం పట్లనో లేదా స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాల పట్లనో పూర్తిగా వ్యతిరేకత ఉందని అర్ధం కాదు. వారి ప్రయాణం కూడా భారత దేశాన్ని స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్ధ కిందికి మార్చేవైపే. అయితే రెండు గ్రూపుల మద్య తేడా ఆ ప్రయాణాన్ని ఎంత వేగంగా జరపాలన్నదానిపైనే తప్ప లక్ష్యం పట్ల భిన్నాభిప్రాయలు వారికి లేవు. సోనియా గ్రూపు కాస్త మెల్లగా వెళదాం అంటుంటే మన్మోహన్ గ్రూపు ఇంకా ఎందుకు ఆలస్యం? త్వరగా వెళ్దాం అంటోంది.

త్వరగా వెళ్తే అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని సోనియా గ్రూపుకి బాగా తెలుసు. వారు ప్రత్యక్షంగా ఎన్నిక అయిన ప్రతినిధులు. కనుక వారి రాజకీయాలు కొంత ప్రజలతో ముడిపడి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి సంస్ధాగత సారధులు కూడా వారే కనుక పార్టీని అధికారంలోకి తేవాలంటే ప్రజల మొర ఆలకిస్తున్నట్లుగా కనిపించవలసిన అవసరం ఉందని వారికి బాగానే తెలుసు. అందుకే మార్కెట్ వ్యవస్ధ వైపుకి ప్రతి అడుగునూ ఆచి తూచి వేయాలని వారు భావిస్తారు. లేకుంటే బి.జె.పికి 2004 లో పట్టినగతే తమకూ పడుతుందని వారికి అర్ధమయినంతగా మన్మోహన్ గ్రూపుకి అర్ధం కాదు. అందువలన మన్మోహన్ నేతృత్వంలోని గ్రూపుకి అవేవీ పట్టవు. వారిపై అమెరికా, ఐరోపాల ఒత్తిడి, బహుళజాతి సంస్ధల ఒత్తిడి ప్రధానంగా పని చేస్తుంది. పైగా మన్మోహన్ ఎన్నడూ ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడ లేదు. ఆయనకి ఓట్ల రాజకీయాలు అంతగా వంటబట్ట లేదు. అందువలనే పరుగెత్తుదాం పదండి అని తేలిగ్గా అంటుంటాడు.

1999-2004 కాలంలో అధికారం నెరిపిన బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం సరిగ్గా మన్మోహన్ ధోరణిలాంటి ధోరణులవల్లనే మట్టి కరిచింది. జిడిపి వృద్ధి రేటు వరసగా 9 శాతానికి అటు ఇటుగా నమోదు కావడంతో ఇండియా వెలిగిపోతోందని గాఢంగా నమ్మారు. తమతో పాటు ప్రజలు కూడా నమ్ముతున్నారని భావించారు. దానితో “ఇండియా షైనింగ్” అనీ “అంతా బాగుంది” అని నినాదాలిచ్చి గెలుపుకోసం ఎదురు చూశారు. కాని వారు శరవేగంగా అమలు చేసిన నూతన ఆర్ధిక విధానాల వలన ప్రభుత్వ రంగ సంస్ధలు అనేకం మూతపడి నిరుద్యోగులు పెరిగారు. అన్నిచోట్లా నియంత్రణ ఎత్తివేయడంతో రేట్లు పెరిగిపోయి సామాన్య మానవుడికి బ్రతుకు కష్టంగా మారిపోయింది. వ్యవసాయ సబ్సిడీలను ఎత్తేయడమో, కత్తిరించడమో చేసేసరికి వ్యవసాయం కూడా భారంగా మారింది. ప్రవేటు కంపెనీలు, ధనిక వర్గాలు బాగుపడ్డాయి తప్ప తమ పాలనలో భారత దేశంలోని అశేష కార్మిక వర్గ ప్రజలు, రైతులు, కూలీలు కష్టాలకు లోనయ్యారన్న సంగతిని మర్చిపోయింది బి.జె.పి ప్రభుత్వం. ఫలితంగా వారి అంచనాలు తారుమారై ఎన్నికల్లో మట్టి కరిచారు.

చిత్రం ఏంటంటే ఓడిపోయాక గూడా వారికి ఎందుకు ఓడిపోయామో అర్ధం కాలేదు. కొంతమంది బి.జె.పి నాయకులు ప్రజలతీర్పుని అంగీకరిస్తున్నాం అని హుందాతనం కూడా ప్రదర్శించ లేకపోయారు. ప్రజలు తమను మోసం చేసినట్లుగా ఫీలైపోయారు. ప్రజలు బొత్తిగా తెలివి తేటలు లేనివారుగా వారు ఈసడించుకున్నారు. ‘మమ్మల్ని ఓడించారుగా ఇక అనుభవిస్తార్లే’ అన్నట్లుగా ఫోజులిచ్చారు. కానీ రెండో సారి వరసగా ఓడిపోయాక వారికి విషయం అర్ధమవుతున్నట్లుగా కనపడింది. అప్పటినుండీ ప్రజల సమస్యల గురించి ప్రకటనలు, అక్కడక్కడా ఆందోళనలు మొదలు పెట్టారు తప్ప ఇప్పటికీ తాము ప్రజలకోసం పనిచేస్తున్నామని ప్రజలను నమ్మించాలన్న సంగతిని వంటబట్టించుకున్నట్లు కనిపించడం లేదు. దానివలన అన్నా హజారే, బాబా రాందేవ్ లాంటి పౌర సమాజంలోని పలుకుబడి కలవారిపైన ఆధారపడుతున్నారు. మత తత్వ ముద్రవలన వారు ప్రజాసమస్యలపై పనిచేసినా నమ్మని పరిస్ధితి ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. చెప్పొచ్చేదేమంటే కాంగ్రెస్ లో ఉన్నట్లుగా రెండు ధోరణులుగా కనిపించే చతురత బి.జె.పికి లేక పోయింది.

దానివలన కాంగ్రెస్ లోనే రెండు గ్రూపులున్నాయనే ప్రచారం కాంగ్రెస్ పార్టీకే లాభకరంగా మారింది. వాస్తవంలో కూడా అర్ధిక ప్రయోజనల విషయంలో ఆ గ్రూపుల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ అంతిమ లక్ష్యం విషయంలో మాత్రం వారి మధ్య వైరుధ్యాలు లేవని గమనించాలి. బి.జె.పిలో వాజ్ పేయి హవా నడిచినంత కాలం మత తత్వం విషయంలో వాజ్ పేయి మోడరేట్ గా, అద్వానీ తీవ్రవాదిగా ప్రజలకు కనపడింది. వాస్తవానికి మత తత్వం అంశానికి సంబంధించి కీలక సమయాల్లో అంటే బాబ్రీ మసీదు కూల్చివెత సమయంలో గానీ, గుజరాత్ లో ముస్లింల మారణకాండ విషయంలో గానీ వాజ్ పేయి ఏ మాత్రం తగ్గ లేదు. కానీ ప్రజల్లో మాత్రం తాను మోడరేట్ గా ప్రభావం పడేలా చాతుర్యాన్ని ఆయన ప్రదర్శించాడు. ఆ చాతుర్యాన్ని అద్వానీ ప్రదర్శించడానికి ప్రయత్నించి విఫలమై ఆర్.ఎస్.ఎస్ నుండే విమర్శలు ఎదుర్కోన్నాడు. “అధికార పార్టీలో రెండు ధోరణులున్నాయి. ఒక ధోరణి ప్రజలకు అనుకూలం” అనే అవగాహన ప్రజల్లొ కలిగించగలిగితే ఆ పార్టీ అధికారంలో నిలవడానికి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయని దీని ద్వారా అర్ధం అవుతోంది.

ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో సోనియా గ్రూపు ప్రజల కోసం పనిచేస్తున్నట్లుగానూ, మన్మోహన నేతృత్వంలోని గ్రూపు ప్రజా వ్యతిరేక నూతన ఆర్ధిక విధానాలు అమలు చేస్తుంటే సోనియా గ్రూపు దాన్ని నిలవరిస్తున్నట్లుగానూ కనిపిస్తుంది. ఉద్దేశ్య పూర్వకంగానే ఇలా రెండుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారా? అనడిగితే సమాధానం అవును, కాదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటె వారి వారి ఆర్ధిక ప్రయోజనాలే వారి మధ్య వైరుద్యాలకు కారణం అన్నది నిజమే ఐనప్పటికీ వారి వైరుధ్యాలు అంతిమంగా పార్టీకి తోడ్పడుతున్న విషయం కూడా పార్టీలోని సిద్ధాంతవేత్తలుగా చెబుతున్నవారికి అవగాహన ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాల కోసం ఓవైపు ఘర్షణ పడుతూనే రాజకీయ ప్రయోజనాల కోసం మరోవైపు ఐక్యతను ప్రదర్శిస్తుంటారు. అటవీ హక్కుల చట్టం, ఆహార భద్రతా చట్టం, పనికి ఆహారం పధకం, ఉపాధి హామీ పధకం (వందరోజులు పని కల్పించే పధకం) లాంటివన్నీ సోనియా గ్రూపు ఆధ్వర్యంలో చేయబడిన చట్టాలుగా కనిపిస్తాయి. కాని వారే పోస్కో ఫ్యాక్టరీకి అన్ని చట్టాలూ ఉల్లంఘిస్తూ అనుమతినీ ఇస్తారు. వారే ఇన్సూరెన్సు రంగంలో విదేశీ పెట్టుబడుల్ని 25 నుండి 49 శాతానికి పెంచుతూ రాజ్యసభలో బిల్లు ఆమోదింపజేసారు. వారే ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలు అమ్మేస్తూ ప్రవేటీకరణను కొనసాగిస్తున్నారు. వారే కొన్ని నెలల్లొ మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి  ప్రవేటు విదేశీ పెట్టుబడుల్ని అనుమతించబోతున్నారు.

ఇక్కడ కాంగ్రెస్, బి.జె.పి పార్టీల మధ్య ఎత్తుగడల తేడాలను కూడా గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఎన్.డి.ఏ ప్రభుత్వం నడుస్తున్నపుడు ప్రభుత్వ రంగ కంపెనీల్ని అయినకాడికి అమ్మేయడానికి ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. దాని పేరు డిస్‌ఇన్వెస్టుమెంట్ మినిస్ట్రీ. ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా బి.జె.పి తాము ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్మేస్తాము అన్న విషయాన్ని బహిరంగంగా ప్రతిరోజు చెబుతున్నట్లే అయింది. ప్రభుత్వ రంగ ప్రవేటీకరణ అనేది నూతన ఆర్ధిక విధానాలకు అనుగుణంగా చేస్తున్నారనీ, దానివలన కార్మికులకీ, ప్రజలకూ నష్టమనీ ఓ వైపు కార్మిక సంఘాలూ, సో కాల్డ్ లెఫ్ట్ పార్టీలు ప్రచారం చేస్తుంటే ప్రభుత్వరంగ కంపెనీలను అమ్మడానికే మంత్రిత్వ శాఖను పెట్టడం అనేది ప్రజలకు తాము ప్రజావ్యతిరేకులం అని రోజూ గుర్తు చేయడమే. యు.పి.ఏ ప్రభుత్వం వచ్చాక ఆ మంత్రిత్వ శాఖను రద్దు చేసింది. అలాగే టాడా చట్టం. ఇది క్రూరమైన చట్టమని దాదాపు చాలామందికి తెలుసు. పత్రికలతో పాటు పాలకవర్గ పార్టీల నాయకులు కూడా దీనిబారిన పడ్డారు. ఆ చట్టాన్ని ఎన్.డి.ఏ ప్రభుత్వం పునరుద్ధరించింది. యు.పి.ఏ ప్రభుత్వం వచ్చాక ఆ చట్టాన్ని రద్ధు చేస్తే బి.జె.పి దాన్ని పునరుద్ధరించాలని ఆందోళనలకి దిగింది. ఇవి చూడ్డానికి చిన్న అంశాలుగా కనపడినా, ప్రజల్లోని మధ్యతరగతి సెక్షన్లను బాగా ప్రభావితం చేస్తాయి. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం డిస్‌ఇన్వెస్టుమెంటు శాఖ లేకుండానే ఎన్.డి.ఏ కంటె ఎక్కువ ప్రభుత్వ కంపెనీల్ని అమ్మేసింది. టాడా లేకుండానే ప్రజా ఉద్యమాలని అణచివేయగలుగుతోంది. ఇవన్నీ సుదీర్ఘకాలం పాలనలో ఉండడం వలన కాంగ్రెస్ కి అబ్బిన విద్యలు కావచ్చు.

అటువంటి విద్యల్లో భాగంగానే కాంగ్రెస్ లోని రెండు గ్రూపులు గ్రూపింగ్ ద్వారా తమ ఆర్ధిక ప్రయోజనాలని నెరవేర్చుకుంటూ, ప్రజల సమ్మతిని సంపాదించుకుంటూ కూడా ప్రజావ్యతిరేక నూతన ఆర్ధిక విధానాలని నిర్విఘ్నంగా అమలు చేసి రెండో సారి కూడా అధికారంలోకి రాగలిగింది. అన్నా హజారే ఉద్యమానంతరం ఆయన డిమాండ్ అంగీకరించినట్లు నటించి దీక్ష ముగిసాక హజారేతో పాటు ఇతర పౌర సమాజ నాయకులపై దుష్ప్రచారం ప్రారంభించింది. బాబా రాందేవ్ కోసం నలుగురు మంత్రులు పంపించడం కాంగ్రెస్ లొంగుబాటుగా అందరికీ కనిపించింది. కాని అది కాంగ్రెస్ దాన్ని లొంగుబాటు గా పరిగణించదు. అది కాంగ్రెస్ వేసిన ఎత్తుగడగానే గుర్తించాలి. నలుగురు మంత్రుల్ని బాబా రాందేవ్ ని ఆహ్వానించడానికి పంపి తాను అవినీతి సమస్యను పట్టించుకున్నట్టుగా కనిపించింది. చర్చలు జరిగినట్లూ, దాదాపు 99 శాతం డిమాండ్లు అంగీకరించినట్లు రాందేవ్ చేతనే ప్రకటింపజేసింది. దీక్షను ఫలానా టైంకి విరమిస్తాను అని లిఖిత పూర్వక హామీ తీసుకుంది. కానీ దిక్ష ముగించకపోవడం వెనక రాందేవ్ కి రాజకీయ ప్రయోజనాలున్నాయనీ అర్.ఎస్.ఎస్ కోసమూ, తద్వరా బి.జె.పి కోసమే దీక్ష కొనసాగిస్తున్నాడనీ, దీక్ష అసలు ఉద్దేశ్యం రాజకీయాలేననీ దేశ ప్రజల్ని నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలం ఐందని గుర్తించాలి. అందుకే బాబా రాందేవ్ నిరాహార దీక్షని మరో ఎనిమిది రోజులు కొనసాగించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి మరో స్వామి వచ్చి నచ్చజెప్పి దీక్ష విరమింపజేసినట్లుగా ఓ కలర్ ఇచ్చి దిక్షను ముగించుకోవలసి వచ్చింది, రాందేవ్ కి. కాంగ్రెస్ మార్కెట్ ఎత్తుగడలకి ఇదొక చిన్ని ఉదాహరణ మాత్రమే. కాంగ్రెస్ లోని రెండు గ్రూపులు కూడా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధికార లక్ష్యాన్నీ, దానితోపాటు పశ్చిమ దేశాల కంపెనీల కోసం నూతన ఆర్ధిక విధానాల్నీ అమలు చేయగల అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s