
ధింకియా గ్రామంలో పోస్కో వ్యతిరేక ఆందోళన, పిల్లలు బోర్లా పడుకుని పోలీసుల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న దృశ్యం
ఒడిషాలొని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 ప్లాటూన్ల పోలీసు బలగాలను దించి ధింకియా, గోవింద్ పూర్ గ్రామాలను బహుళజాతి ఉక్కు కంపెనీ కోసం వశం చేసుకోవడానికి ప్రయత్నాలను తీవ్ర్రం చేసింది. దాదాపు 3000 ఎకరాల్లోని అటవీ భూముల్ని పోస్కోకి కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చేశాయి. ఈ భూముల్లోని అడవులపైనే అక్కడ ఉన్న తమలపాకు పంటపైనే ధింకియా, వోవింద్ పూర్ ప్రజల జీవనోపాధి ఆధారపడి ఉంది. ఆ అడవులను కంపెనీకి ఇచ్చినట్లయితే వారికి బతుకు గడవదు. గ్రామాలు వదిలి పట్టణాల్లో అడుక్కుంటూ బతకడమో లేదా ఆకలికి చావడమో వారికి మిగిలింది. దాంతో గ్రామస్ధులు ఆ చావేదో తమ గ్రామాల్లోనే చావాలని నిర్ణయించుకుని ప్రభుత్వాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ధింకియా గ్రామంపై పోలీసులు కేంద్రీకరించారు. పోస్కో ప్రతిరోధ్ సంఘర్షణ సమితి నాయకులతో చర్చలు జరిపే ఉద్దేశ్యంతో ప్రభుత్వం శుక్రవారం పోలీసులను వెనక్కి పిలిపించుకుంది. గ్రామస్ధులు ప్రాజెక్టును వేరే చోటికి తరలించాల్సిందేనని చెప్పడంతో మళ్ళీ దింకియా గ్రామ ప్రవేశం వద్ద ప్రభుత్వం పోలీసులను మొహరించింది. గ్రామ శివార్లలోనూ, ప్రవేశం వద్దా ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. ఒక గ్రామంలో ఆ గ్రామస్ధులే ముగ్గురికంటే ఎక్కువ జమ కూడదని నిషేధాజ్ఞలు విధించడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధమైనాయంటే విదేశీ కంపెనీలకు భారత పాలకులు ఏ విధంగా లొంగిపోయారో వెల్లడవుతోంది.
పిల్లలు, మహిళలు, వృద్ధులు మూడంచెల ప్రతిఘటనా వ్యవస్ధను నిర్మించుకున్నారు. మొదటివరసలో పిల్లలు దాదాపు వందమంది వరకు నేలకు మొఖం ఆనించి పడుకుని ఉండగా వారి వెనక మహిళలు, వృద్ధులూ మరొక వందక మందికి పైగా రెండు వరసల్లో అదే పొజిషన్లో పడుకుని పోలీసులు గ్రామంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్నారు. 20 ప్లాటూన్ల పోలీసులతో తలపడడానికి వారు సిద్ధమయ్యారు. జిల్లా అధికారులు గ్రామస్ధులను నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారు వినడం లేదు. ప్రభుత్వాల మాయమాటలకు లొంగడమంటే తమ జీవనోపాధిని పోగొట్టుకోవడమని వారికి అర్ధమయ్యింది.
2005 లో పోస్కో కంపెనీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి ఒడిషా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పర్యావరణానికి భారిగా నష్టం వాటిల్లడంతో పాటు, పోస్కోకు కావలసిన భూమి అటవీ భూమి కావడంతో భూసేకరణకు అటవీ చట్టాలూ, పర్యావరణ చట్టాలూ ఆటంకంగా మారాయి. దానితో ఆరు సంవత్సరాలుగా ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులు నిలిచి పోయాయి. గత సంవత్సరం అనుమతి నిరాకరించిన పర్యావరణ మంత్రి జైరాం రమేష్ ఈ సంవత్సరం అనుమతిని ఇచ్చేశాడు. “చట్ట వ్యతిరేకతను క్రమబద్ధీకరించడానికి నేను బద్ధ వ్యతిరేకిని. కానీ అందుకు అంగీకరించవలసి వచ్చింది” అని అనుమతి ఇచ్చే సందర్భంగా జైరాం రమేష్ చెప్పడాన్ని బట్టి ఆయనపై ప్రధాని, ఇతర మంత్రిత్వ శాఖలనుండి వచ్చిన ఒత్తిడిని అర్ధం చేసుకోవచ్చు.
52,000 కోట్ల రూపాయల ఖరీదుతో, 5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంతొ తలపెట్టిన ఈ ఫ్యాక్టరీ భారత పాలక వర్గాలు భారత దేశాన్ని నయా ఉదారవాద ఆర్ధిక విధానాల ద్వారా విదేశీ కంపెనీలకు అప్పజెప్పటానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదానికి పరీక్షగా నిలిచింది. నూతన ఆర్ధిక విధానాలైన సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను భారత దేశంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, చివరికి ప్రజలపైకి పోలీసుల్ని ఉసిగొల్పి వారి ప్రాణాలు తీసైనా సరే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత పాలకులు చెప్పదలుచుకున్నారు. దాన్ని రుజువు చేసుకోవడానికి వారు ఉరకలు వేస్తున్నారు. దాని ఫలితేమే నేడు రెండు గ్రామాల ప్రజలపైకి ఇరవై ప్లాటూన్ల పోలీసుల్ని ఉసిగొల్పు చోద్యం చూస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
Great struggle!