ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం – 2


సేమౌర్ హెర్స్ ఇంకా ఇలా రాశాడు.

“అయితే అమెరికాకి చెందిన అత్యంత ఉన్నత స్ధాయి రహస్య గూఢచార నిర్ధారణలతో సహా పెద్ద పెద్ద సాక్షాలు (large body of evidence) అమెరికా సద్దామ్ హుస్సేన్, ఇరాక్ ల విషయంలో ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన తప్పులాంటి తప్పునే మళ్ళీ ఇరాన్ విషయంలోనూ చేసే ప్రమాదంలో ఉందని సూచిస్తున్నాయి. ఒక నిర్భంధ పాలకుడి విధానాలపై ఉన్న ఆత్రుతకొద్దీ ఆ ప్రభుత్వ మిలట్రీ సామర్ధ్యాలూ, ఉద్దేశాలపైన మన అంచనాలు తప్పు దారి పట్టించడానికి మనమే అనుమతిస్తున్నాము. ఇరాన్ అణ్వాయుధ ప్రగతిపై ఇటీవలి రెండు ‘జాతీయ గూఢచార అంచనాలు (నేషనల్ ఇంటెలిజెన్సు ఎస్టిమెట్స్)’ “2003 నుండి బాంబు తయారు చేయడానికి ఇరాన్ ప్రయత్నం చేసినట్లుగా ఎటువంటి నిర్ధారించ తగిన సాక్ష్యమూ లేదనే” చెబుతున్నాయి.

అయినప్పటికీ ఇరాన్ అణు టెక్నాలజీపై భారిగా పెట్టుబడులు పెట్టింది. అది భూమిలో చాలా లోతులో నెలకొల్పిన తన ప్రధాన అణు ఇంధన శుద్ధి కర్మాగారమైన నటాంజ్ లో గత నాలుగు సంవత్సరాల్లో ఆపరేషన్‌లో ఉన్న సెంట్రిఫ్యూజ్ ల సంఖ్యను మూడు రెట్లకు పెంచింది.

ఇరాన్ అందిస్తున్న సహకారం స్ధాయిపట్ల ఐ.ఎ.ఇ.ఎ సంస్ధ పరిశోధకులు (లేదా పరిశీలకులు) చాలా నిస్పృహ వ్యక్తం చేసాయి. కానీ అణ్వాయుధ కార్యక్రమానికి శుద్ధి చేయబడిన యురేనియంను ఇరాన్ ప్రభుత్వం తరలించిందని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాన్ని కనుగొనలేక పోయింది.”

ప్రస్తుతం ఐ.ఎ.ఇ.ఎ అధిపతిగా ఉన్న యుకియో అమానో, గత సోమవారం బోర్డు సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్ అణు విధానానికి మిలట్రీ కోణం ఉందని సూచించే విధంగా సమాచారం ఇవ్వని కొన్ని కార్యకలాపాలు జరుగుతున్న సమాచారం ఐ.ఎ.ఇ.ఎ సంపాదించింది అని చెప్పాడు. బహుశా ఈ సమాచారం ఎల్ బరాది చెబుతున్న నిస్పృహ లోంచి వచ్చిన అంచనాయే కావచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓ వార్త ప్రచరించింది. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపేయాలని కోరినా ఇరాన్ నిరాకరించినందుకు ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినప్పటికీ, అండర్ గ్రౌండ్ ఫెసిలిటీలో ఇంధనం శుద్ధి చేయనున్నామని ఇరాన్ ప్రకటించిన నేపధ్యంలో యుకియో చెబుతున్న కొత్త సమాచారం తెలిసిందని ఆ పత్రిక తెలిపింది.

వాస్తవ పరిస్ధితులను పక్కన పెట్టి రాండ్ కార్పొరేషన్ వివిధ పరిస్ధితులను తానే ఊహించి అటువంటి పరిస్ధితుల్లో విధాన పరమైన ప్రత్యామ్నాయాలంటూ నివేదిక తయారు చేయడం సరైనదేనా అని రాండ్ సమీక్షించుకోవాలి. తన ఊహలతో అమెరికా, ఇజ్రాయెల్ కి ఫలానా పరిస్ధితి ఎదురుకావచ్చంటూ వాస్తవాలతో సంబంధం లేకుండా హెచ్చరించడం అంతిమంగా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా నివేదికలు తయారు చేయడం తప్ప మరొకటి కాదు. ఇరాన్ అణు విధానానికి సంబంధించిన వివిధ అంచనాలని చెబుతూనే అంతిమంగా ఇరాన్ తన జాతీయ భద్రత రీత్యా అణ్వాయుధాన్ని తయారు చేసుకుంటుందని నిర్ధారించడం రాండ్ నివేదికలోని డొల్లతనం తప్ప మరొకటి కాదు.

రాండ్ నివేదికలోనే అది చేసిన నిర్ధారణలకు వ్యతిరేకమైన అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ అణ్వాయుధం నిర్మిస్తే దాని పొరుగు దేశాలు సైతం తమ సొంత బాంబులు నిర్మించుకోవాలని ప్రయత్నించడం, దానితో ఆయిల్ దేశాల మధ్య ఖరీదైన ఆయుధ పోటీ తలెత్తడం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల రక్షణకోసం అమెరికా శాశ్వతంగా అణ్వస్త్ర నిరోధక వ్యవస్ధ ఏర్పాటుకు నిర్ణయించే అవకాశాలు ఉండడం… ఇవన్నీ ఆ కోవలోనివే. నివేదిక రచయితలు అంగీకరించినట్లుగా అమెరికా తన సాంప్రదాయక ఆధిపత్య కార్యకలాపాలను విస్తరిస్తే ఇరాన్ అణ్వస్త్ర ప్రమాదం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు.

రాండ్ కార్పొరేషన్ నివేదిక వెలువడిన సమయంలోనే మంగళవారం వాషింగ్టన్ లొ మిడిల్-ఈస్ట్ ప్రాంతంపై ఒక కాన్ఫరెన్సు జరిగింది. “మారుతున్న మధ్య ప్రాచ్య (మిడిల్-ఈస్టు) పరిస్ధితులు, అమెరికా ఇరాన్ ల సంబంధాలు” అంశంపై ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో అమెరికా సెంట్రల్ కమాండ్ మాజీ అధిపతి అడ్మిరల్ జేమ్స్ ఫాలన్ మాట్లాడాడు. “అమెరికా మరియు/లేదా ఇజ్రాయెల్ లు ఇరాన్‌పై దాడి చేయడానికి అవకాశాలు లేవనే లేదా చాలా చాలా తక్కువ అవకాశాలున్నాయనే చెప్పాలి. మధ్య ప్రాచ్యంలో ఇతర ఉమ్మడి ఆందోళనా కారక పరిస్ధితులు ఉన్న దృష్ట్యా, అమెరికా, ఇరాన్ లు సమగ్రమైన చర్చలు జరిపే మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం” అని ఆయన సభికులకు చెప్పాడు.

ఇటువంటి హేతుబద్ధమైన అభిప్రాయాలకు ప్రచారం కల్పించే బదులు అమెరికా మీడియాతో పాటు ఇతర పశ్చిమ దేశాల మీడియా సంస్ధలు ఇరాన్ అణు విధానంపై కొత్త సాక్ష్యాలు లభించాయంటూ తెలిపే అసంబద్ధ ప్రకటనలకు ప్రాముఖ్యత ఇవ్వడం ఏ విధంగానూ మానవాళికి తోడ్పడదు. అది అమెరికా ప్రజలకు గానీ, ఇరాన్ ప్రజలకు గానీ, లేదా ప్రపంచ భవిష్యత్తుకే నష్టకరంగా పరిణమిస్తుంది తప్ప కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం అబద్ధ ప్రచారాలకు దిగడం ఏ మీడియాకైనా తగని పని.

(ఇది ఏసియా టైమ్స్ వెబ్‌సైట్ లో కావే ఎల్. అఫ్రాసియాబి రాసిన వ్యాసానికి స్వేచ్ఛానువాదం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s