డ్రగ్స్ రవాణా అమ్మకాలకీ, బలవంతపు వసూళ్ళకూ పేరుపొందిన ఇటలీ మాఫియా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే విష వ్యర్ధాలను డంపింగ్ చేయడంలో ఆ ఫ్యాక్టరీ యజమానులకు సాయపడ్డం ద్వారా సంవత్సరానికి 20 బిలియన్ యూరోలు (దాదాపు రు. 1,30,000 కోట్లకు సమానం) సంపాదిస్తోందని లండన్ నుండి వెలువడే ‘ది ఇండిపెండెంట్’ పత్రిక బుధవారం వెల్లడించింది. ఇటలీ దక్షిణ ప్రాంతాన్ని విష వ్యర్ధాలు పారబోయడానికి డంపింగ్ యార్డుగా మాఫియా గ్రూపులు మార్చివేశాయని పర్యావరణ సంస్ధ నివేదికను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. భార లోహాలు (హెవీ మెటల్స్), కేన్సర్ కారకాలైన ఆర్గానిక్ రసాయనాలను చట్టవిరుద్ధంగా తరచుగా వ్యవసాయ భూములున్న ప్రాంతాల్లో పాతిపెడుతున్నారని ఆ సంస్ధ తెలిపింది. కొత్త ఇళ్ళు నిర్మాణానికి వినియోగించే భూముల్లోనూ ఇలా విష వ్యర్ధాలను పూడ్చి పెడుతున్నారని తెలిపింది.
2008 లో విషతుల్యమైన డాక్సిక్ పధార్ధాలను కనుగొన్నాక నేపుల్స్ పట్టణానికి సమీపంలోని భూమి విషపదార్ధాలతో ఏ విధంగా వాడకానికి వీలు లేనిదిగా మారింది తెలుసుకుని అందరూ ఖిన్నులయ్యారు. గత సంవత్సరం అధికారులు రికార్డు స్ధాయిలో రెండు మిలియన్ టన్నుల విషపదార్ధాలు ఇలాగే డంప్ చేయడానికి తేసుకెళ్తుండగా పట్టుకున్నారు. విష వ్యర్ధాలను తరచుగా దక్షిణాన ఉన్న సిసిలీ, కాలబ్రియా, కంపేనియా, పూగ్లియా పట్టణ ప్రాంతాల్లో పాతి పెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మాఫియా వర్గాలు గట్టి పట్టు కలిగి ఉండడం గమనార్హం.
పర్యావరణ సంస్ధ అధికారులు పట్టుకున్న రెండు మిలియన్నుల వ్యర్ధాలు నిజానికి సముద్రంలో నీటి బొట్టంతేననీ అధికారులు పట్టుకోకుండా గమ్యానికి చేరుకుంటున్నది అంతకు అనేక రెట్లు ఉంటోందని ఆ సంస్ధ నివేదికలో పేర్కొంది. ఈ మార్కెట్ మాఫియాలకు పెద్ద మొత్తంలో లాభాలు సంపాదించి పెడుతోంది. అదింకా పెరుగుతోంది కూడా అని ఆ సంస్ధ తెలిపింది. 2010 లో ఇటలీలో 31,000 పర్యావరణ సంబంధాల నేరాలు జరిగాయనీ, వాటిలో 41 శాతం చట్టవిరుద్ధంగా వ్యర్ధాలను డంప్ చెయ్యడం, సిమెంటును రీసైక్లింగ్ చెయడలాంటి నేరాలకి సంబంధించినవేననీ ఆ సంస్ధ తెలిపింది.
నేపుల్స్ చుట్టూ ఉన్న కంపేనియా ప్రాంతం విష వ్యర్ధాలకు అత్యంత పెద్ద డంపింగ్ యార్డుగా ప్రసిద్ధి కెక్కింది. ‘కమొర్రా”గా పిలవబడే స్ధానిక మాఫియా ఇందుకు ప్రధాన భాధ్యురాలుగా గుర్తింపు పొందింది. చట్టవిరుద్ధమైన తమ డంపింగ్ సేవలను అందించడానికి వీలుగా మాఫియాలు ప్రభుత్వ శుద్ధి ప్లాంటులను మూసివేయిస్తున్నారు. స్ధానిక మాఫియా డబ్బును పోగేసుకునేందుకు చెత్తను తొలగించడానికీ వినియోగించే ఉపకరణాలను తమ నియంత్రణలో ఉంచుకోవడానికి మాఫియాకి సహాయం చేస్తున్నాడని వ్యాపారి “లుడోవికో ఉస్సిరో” పోలీసులు అరెస్టు చేసారు కూడా. ఈయన నాలుగు చెత్త తొలగించే కంపెనీలకు యజమాని అనీ తెలుసుకున్న పోలీసులు ఆ కంపెనీలను సీజ్ చేసినట్లు తెలిస్తోంది.
కేంపేనియా తర్వాత స్ధానం కలాబ్రియాదేనని తెలుస్తోంది. ఈ ప్రాంతం శక్తివంతమైన ఒక నేరస్ధ సిండికేట్ కి జన్మ స్ధానం. ఆ తర్వాత స్ధానం సిసిలీది. ఆ ప్రాంతం కోసా నొస్ట్రా, పుగ్లియాకు సొంతిల్లుగా చెబుతున్నారు. ఈ నాలుగు కేంద్రాల్లో జరిగే పర్యావరణ నేరాలు దేశంలో జరిగే మొత్తం నేరల్లో 45 శాతం ఉంటాయని తెలుస్తోంది. విష వ్యర్ధాల డంపింగ్ తో దక్షిణ ప్రాంతం నివాసానికి ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాక పర్యావరణ సంస్ధ నివేదిక ప్రకారం ప్రమాదకర వ్యర్ధాల రవాణాకు ఇటలీ అంతర్జాతీయ కూడలిగా భాసిల్లుదని ఇటలీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విష వ్యర్ధాలు డంపింగ్ చేసిన చోటనే చట్ట విరుద్ధంగా ఇళ్ళను నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారనికి వినియోగిస్తున్నారని, ఇదీ పెద్ద సమస్యగా మారిందని నివేదిక తెలిపింది. గత సంవత్సరం 26,500 ఇళ్ళను అలాగే నిర్మించారనీ తెలిపారు. ఈ కారణతో పార్కులు, ఆటస్ధలాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయని నివేదిక తెలిపింది.