అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల తదుపరి టార్గెట్ సిరియా


Al-assad

రెండు నెలల నుండి లిబియాపై బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడి మౌలిక సౌకర్యాల నన్నింటినీ సర్వ నాశనం చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు సిరియాను తమ తదుపరి లక్ష్యంగా ఎన్నుకున్నాయి. సిరియా అధ్యక్షుడు అబ్దుల్ బషర్ ను గద్దె దించేందుకు ఐక్యరాజ్యసమితిలో పావులో కదుపుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు సిరియాపై సమితి చేత తీర్మానం చేయించడానికి ఒత్తిడి పెంచుతున్నాయి. లిబియా విషయంలో కూడా బ్రిటన్, ఫ్రాన్సు లు అక్కడి ప్రభుత్వం తమ ప్రజలపై నిర్బంధం ప్రయోగిస్తున్నదని మొదట ప్రచారం చేశాయి. తర్వాత భద్రతా సమితి చేట లిబియాపైన ఆర్ధిక, ఆయుధ ఆంక్షలు విధించాయి. అటు పిమ్మట లిబియా గగనతలంపై నో-ఫ్లై జోన్ ను విధింప జేసాయి. నో-ఫ్లై జోన్ అమలు చేసే పేరుతో లిబియాపై యుద్ధవిమానలతో దాడులు చేసి నాశనం చేశాయి. ఈ దాడుల్లో అనేక మంది ప్రజలు చనిపోయారు. కేవలం నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి అనుమతి సంపాందించిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు ఇప్పుడు యుద్ధ హెలికాప్టర్లను కూడా రంగంలో దించి అతి తక్కువ ఎత్తునుండి బాంబింగ్ జరుపుతూ లిబియా లోని మౌలిక సౌకర్యాలను ధ్వంసం చేస్తూ, లిబియా ప్రభుత్వాధిపతి కల్నల్ గడ్డాఫీని చంపడానికి ప్రయత్నిస్తున్నాయి.

లిబియా తరహాలోనే బ్రిటన్, ఫ్రాన్సులు సిరియాపై విష ప్రచారం ప్రారంభించాయి. ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించి సాయుధంగా దాడులు చేస్తున్న ప్రతిపక్షాలపై చర్యలు తీసుకోకూడదని చెబుతున్నాయి. తమ తమ దేశాల్లో ప్రజలపై అమలు చేస్తున్న దారుణమైన పొదుపు చర్యలపై ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తుంటే వాటిని నిర్ధాక్షిణ్యంగా పొలీసుల చేత అణచివేయిస్తున్న బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాలు సిరియా ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించినవారిని మాత్రం ఏమీ అనకూడదని డిమాండ్ చేస్తున్నాయి. అ వంకతో సిరియాపై అంతర్జాతీయ ఆంక్షలు విధించడానికి సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికి అమెరికా, యూరప్ లు సిరియా ప్రభుత్వం పైనా అధ్యక్షుడు బషర్ పైనా వాణిజ్య ఆంక్షలు విధించాయి. వాటికి తోడుగా భద్రతా సమితిలో సిరియాకి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదింపజేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సిరియా విషయంలో ఐక్యరాజ్యసమితి మౌనంగా ఉండజాలదని ఫ్రాన్సు విదేశాంగ మంత్రి అలెన్ జుప్పే ప్రకటించాడు. బుధవారం బ్రిటన్ సిరియాపై తీర్మానాన్ని తయారు చేస్తోంది.

జిసర్ ఆల్-షుఘౌర్ పట్టణంలో సిరియా ప్రభుత్వ సైనికులు 120 మంది ప్రతిపక్ష సాయుధుల చేతుల్లో చనిపోయారని సిరియా ప్రభుత్వం ప్రకటీంచింది. ఆ పట్టణానికి ప్రభుత్వం మరిన్ని సైన్యాన్ని పంపుతున్నది. సాయుధ ఘర్షణల భయంతో ఆ పట్టణంలోని ప్రజలు సమీపంలో ఉన్న టర్కీ సరిహద్దుకు పారిపోతున్నారని వార్తలు తెలుపుతున్నాయి. మరోవైపు ఫ్రాన్సులో సిరియా రాయబారిగా ఉన్న లామియా చక్కౌర్ తాను రాజీనామా చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించింది. లామియా రాయబారి పదవికి రాజీనామా చేసినట్లుగా ఓ రేడియో ఇంటర్వ్యూను మీడియా సంస్ధలు ప్రచారంలో పెట్టాయి. సిరియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ఇటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని లామియా నిందించింది. ఆ విష ప్రచారాన్ని కట్టిపెట్టాలని ఆమె కోరింది.

బ్రిటన్, ఫ్రాన్సులు తయారు చేసిన తీర్మానాన్ని ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాలు అంగీకార యోగ్యంగా తయారు చేయడానికి అందులో సవరణలు చేయడానికి బ్రిటన్స్ ఫ్రాన్సులు సిద్ధపడ్డాయి. సిరియాపై బ్రిటన్ ఫ్రాన్సులు ప్రవేశ పెట్టే తీర్మానం అంతిమంగా లిబియాపై జరుగుతున్న దాడుల వంటి పరిణామాలకే దారి తీస్తుందని ఆ దేశాలు భావిస్తున్నాయి. అదేమీ ఉండదని చెప్పడానికి బ్రిటన్, ఫ్రాన్సులు సవరణలు చేస్తున్నట్లుగా చెబుతున్నాయి. తీర్మానంలో సిరియాపై చర్య తీసుకోవడానికి అవకాశాలు లేకపోతే అటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి బ్రిటన్, ఫ్రాన్సులు ప్రయత్నించనవసరం లేదు. తమ అదుపాజ్ఞలకు లొంగని సిరియా, సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ లను ఆంక్షలతో వేధించడానికి, ఆదేశంపై అంతిమంగా దురాక్రమణ దాడికి దిగడానికి ఇప్పటి తీర్మానం మొదటి అడుగుగా ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు భావిస్తున్నాయి. లిబియా ఉదాహరణ అందుకు సాక్ష్యంగా చూపుతున్నాయి.

సిరియాకి సంబంధించినంతవరకూ రష్యా, చైనాలకు రాజకీయంగా మద్దతు లేకుండా చేయడానికే బ్రిటన్ ఫ్రాన్సు దేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాయని బిబిసి చెబుతోంది. సిరియాపై చర్యలను చైనా, రష్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కనుక ఆ దేశాలకు మద్దతు లేదని చూపిస్తూ తమ దారికి తెచ్చుకోవాలని బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికా దేశాలు ప్రయత్నిస్తున్నాయని అది తెలిపింది. రష్యా మాత్రం సిరియాపై ఏటువంటి తీర్మానానికి అంగీకరించేది లేదని స్పష్టం చేస్తోంది. బెల్జియంలోని రష్యా రాయబారి ఈ మేరకు ప్రకటన చేశాడు.

వ్యాఖ్యానించండి