ఫుకుషిమా ప్రమాదంలో రేడియేషన్ అంచనాకు రెట్టింపుకంటె ఎక్కువే విడుదలైంది


ఫుకుషిమా శాటిలైట్ చిత్రంఫుకుషిమా అణు ప్రమాదం వలన వాతావరణంలో విడుదలైన రేడియేషన్ ఇప్పటివరకూ అంచనా వేసినదానికంటే రెట్టింపుకంటె ఎక్కువేనని ప్రమాదంపై దర్యాప్తు జరపనున్న స్వతంత్ర నిపుణులతో కూడిన దర్యాప్తు సంస్ధ దర్యాప్తు ప్రారంభించడానికి ముందు జపాన్ అణు ఏజన్సీ వెల్లడించింది. అంతే కాకుండా మూడు రియాక్టర్లలో ఇంధన కడ్డీలు ఇప్పటిదాకా అనుకుంటున్న సమయానికంటే చాలా ముందుగానే కరిగి రియాక్టర్ల క్రింది బాగానికి చేరిందని ఏజెన్సీ చెబుతున్నది. వచ్చే జనవరిలోగా ఫుకుషిమా అణు కర్మాగారాన్ని మూసివేయోచ్చని అణు కర్మాగారం ఆపరేటర్ టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) అంచనా వేస్తోంది. అయితే, ఇప్పటికీ రేడియేషన్ లీకవుతున్నందున ఈ కంపెనీ ఇప్పటివరకూ వేసిన అంచనాల లాగానే జనవరి లోపు మూసివేయడం సాధ్యం కాదనీ దానికి మరింతకాలం పట్టవచ్చన్న అనుమానాలు ఉన్నాయి.

జపాన్ కి చెందిన అణు మరియు పారిశ్రామిక భద్రతా ఏజన్సీ (ఎన్.ఐ.ఎస్.ఎ – నిసా) ఇప్పుడు చెబుతున్న వివరాల ప్రకారం మార్చి 11న భూకంపం, సునామీలు సంభవించినప్పటినుండీ 770,000 టెరా బిక్యూరల్సు రేడియేషన్ వాతావరణంలోకి విడుదలైందని తేలింది. ఇప్పటివరకూ 370,000 టెరా బిక్యూరల్సు రేడియేషన్ విడుదలైందని అంచనా వేస్తూ వచ్చారు. తాజా అంచనా గతం అంచనాకు రెట్టింపుకంటె కొంత ఎక్కువ ఉండడాన్ని బట్టి టెప్కో, వాస్తవాలను తగ్గించి చెప్పిందని స్పష్టమవుతోంది. ఈ రేడియేషన్ చెర్నోబిల్ అణు ప్రమాదంలో విడుదలైన రేడియేషన్ లో 15 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. ఒకటో రియాక్టరులో కరిగిపోయిన అణు ఇంధనం ప్రమాదం సంభవించిన 5 గంటలకే రియాక్టరు అడుగుకు చేరిన సంగతి నిసా పరిశీలనలొ తేలింది. టెప్కో సంస్ధ ప్రమాదం జరిగిన 10 గంటల తర్వాతే ఇంధనం కరిగిపోయిందని టెప్కో చెప్పినట్లుగా ఇప్పుడు చెబుతున్నారు.

వాస్తావానికి “అణు ఇంధన కడ్డీలు కరిగిపోయినట్లుగా (meltdown) భయపడుతున్నారు” అనే వార్తా సంస్ధల ద్వారా ప్రజలకు తెలిపారే తప్ప ఖచ్చితంగా పాక్ధికంగానైనా కరిగిపోయాయి అని నిర్ధారిస్తూ ఎప్పుడూ చెప్పలేదు. రెండో నెంబరు రియాక్టరులో ఇంధనం 80 గంటలకే కరిగిపోయి రియాక్టరు దెబ్బతిన్నదనీ, మూడో నెంబరు రియాక్టరులో 79 గంటలకే ఇంధనం కరిగి పోయిందనీ నిసా సంస్ధ తన తాజా నివేదికలో తెలిపింది. రియాక్టరు అడుగుకు చేరిన ద్రవ ఇంధనం అక్కడి నీటితో కలిసి పైపుల ద్వారా వెలుపలికి రావడంతో భూమితో పాటు వాతావరణంలోకి కూడా రేడియేషన్ విడుదలైంది. తాజా వివరాలు జపాన్ ప్రభుత్వం, టెప్కో లపై విమర్శలు తీవ్రం అయ్యే అవకాశం ఉంది. టెప్కో కంపెనీతో పాటు జపాన్ ప్రభుత్వం కూడా ప్రమాదానికి చాలా నెమ్మదిగా స్పందించాయని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని బిబిసి భావిస్తోంది.

అణు ప్రమాదంపై పది మంది సభ్యులుగల స్వతంత్ర నిపుణుల పానెల్ దర్యాప్తు ప్రారంభించనున్న నేపధ్యంలో తాజా వివరాలని నిసా వెల్లడించింది. ప్రమాదం జరిగిన మూడు నెలల అనంతరం వాస్తవ వివరాలంటూ ఇప్పుడు వెల్లడించడం స్వతంత్ర దర్యాప్తు సంస్ధ విచారణలో వాస్తవాలు వెలువడితే తమ తప్పు తెలిసిపోతుందనే అంచనాతోనే అని భావించవచ్చు. స్వతంత్ర దర్యాప్తు సంస్ధ వెల్లడించే వాస్తవాలు ఇప్పటికే తాము వెల్లడించిన వివరాల కంటె భిన్నంగా ఉన్నట్లు తేలితే టెప్కోపై విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా మొత్తం అణు కర్మాగారాల ఆపరేటర్లపైనే విశ్వసనీయత సన్నగిల్లే అవకాశం ఉండేది. ఇప్పటికే జర్మనీ అణు విద్యుత్ వినియోగం పూర్తిగా వదులుకోవాలని నిర్ణయించడం, ఇండియా లాంటి చోట్ల అణు విద్యుత్ కర్మాగారాలపై ఆందోళన జరగుతుండడంతో అటువంటి వైరుధ్యం ఆపరేటర్ల వ్యాపారావకాశాలను దారుణంగా దెబ్బ తీసేది.

ఫుకుషిమా దైచి అణు కర్మాగారం చుట్టూ 20 కి.మీ పరిధిలో ఉన్న 80,000 మందిని అక్కడినుండి ఖాళీ చేయించారు. 20 నుండి 30 కి.మీ లోపు ఉన్నవారికి స్వచ్ఛందంగా తమ ఇళ్ళను ఖాళీ చేయించే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ పరిధిలో ఇళ్ళలో ఉండదలుచుకున్నవారు ఇల్లు దాడి బైటికి రావద్దనీ, వస్తే రేడియేషన్ కు గురయ్యే ప్రమాదం ఉందనీ జపాన్ ప్రభుత్వం సలహా ఇచ్చింది. ముప్ఫై కిలో మీటర్ల పరిధికి బైట ఉన్న కొన్ని పట్టణాలు కూడా రేడియేషన్ ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. నిపుణులు జరుపుతున్న పరిశీలనలో అక్కడ నెలకొన్ని ఉన్న పరిస్ధితులు, గాలి దిశలను బట్టి ముప్ఫై కిలోమీటర్ల పరిధికి ఆవల కూడా రేడియేషన్ స్ధాయి పెరుగుతున్నదని వెల్లడవుతోంది.

అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఎ.ఇ.ఎ) తన నివేదికలో సముద్ర తరంగాలు ఉవ్వెత్తున లేచినపుడు ఫుకుషిమా కర్మాగారంలో బేకప్ జనరేటర్లకు వాటిల్లగల ప్రమాదాలకు తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోలేదని ఎత్తి చూపింది. ఈ అంశాన్ని జపాన్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. సముద్ర అలలు దైచి కర్మాగారం లోకి రాకుండా ఉండడానికి 6 మీటర్ల (20 అడుగులు) ఎత్తుగల రక్షణ గోడను నిర్మించగా సునామీ అలలు 14 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి. దానితో సముద్రపు నీరు కర్మాగారాన్ని ముంచెత్తి విద్యుత్ జరరేటర్లను పనిచేయకుండా పాడు చేశాయి. భూకంపం ధాటికి విద్యుత్ ప్రసార వ్యవస్ధ దెబ్బతిన్న తర్వాత ఈ జనరేటర్లు విద్యుత్ ను అందించాల్సి ఉంది. సునామీ ధాటికీ జనరేటర్లు కూడా పనిచేయకపోవడంతో రియాక్టర్లలో కూలింగ్ వ్యవస్ధ దెబ్బతిని అణు ఇంధన రాడ్లు కరిగిపోయి అడుగుకు చేరింది.

అణు కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని ఐ.ఎ.ఇ.ఎ నివేదిక స్పష్టం చేసింది. వారితో పాటు కర్మాగారం చుట్టుపక్కల నివసించే సాధారణ ప్రజల ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని సిఫారసు చేసింది. అలాగే అణు పరిశ్రమల రంగంలో రెగ్యులేటరీ వ్యవస్ధ అణు మంత్రిత్వశాఖకూ, పరిశ్రమకు సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేయాలని కూడా సిఫారసు చేసింది. జపాన్ అణు నియంత్రణ ఏజన్సీ (నిసా) అణు మంత్రిత్వ శాఖ లో ఓ భాగంగా ఉంది. అణు మంత్రిత్వ శాఖ అణు విద్యుత్ ను ప్రోత్సహిస్తుండగా, దాని పరిధిలో ఉండే రెగ్యులేటర్ ఏజెన్సీ విధానం సైతం అందుకు భిన్నంగా, స్వతంత్రంగా నిర్ణయాలు చేయగల అవకాశం ఉండదని ఐ.ఎ.ఇ.ఎ ఉద్దేశ్యం. అణు భద్రత పైన ఈ నెలలోనే ఐ.ఎ.ఇ.ఎ మంత్రుల కాన్ఫరెన్సు జరపనుంది. ఈ సమావేశంలో నిసా తన నివేదికను సమర్పించాల్సి ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s