పాలస్తీనా భూభాగం నుండి, వారి ఇండ్లనుండి పాలస్తీనా కుటుంబాలను తరిమివేసి 63 సంవత్సరాలు పూర్తయ్యాయి. అమెరికా, ఇంగ్లండుల ప్రత్యక్ష చర్యతో, ఇతర యూరప్ దేశాల పరోక్ష మద్దతుతో తమ తమ దేశాల్లో పదుల వందల ఏళ్ళ క్రితం తరలివచ్చి స్ధిరపడిన యూదు జాతి వారిని వదిలించుకోవడానికి పన్నిన చారిత్రక కుట్రే పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ సృష్టి. ఆనాటి జాతి హననంలో లక్షల పాలస్తీనీయులను ఇజ్రాయెల్ సైన్యం వెంటాడి వేటాడింది. తమ ఇళ్ళను వదిలి పక్క దేశాలకు పారిపోయేదాక వెంటబడి తరిమింది. రెండో ప్రపంచ యుద్దానికి ముందు హిట్లర్ యూదులపై జరిపిన జాతి హత్యాకాండకు పరిహారం చెల్లించే పేరుతో పాలస్తీనీయుల భూములపై ఇజ్రాయెల్ దేశ సృష్టికి పశ్చిమ రాజ్యాలు పన్నిన కుట్ర ఫలితమే నేటి ఇజ్రాయెల్, చుట్టుపక్కల అరబ్ దేశాల్లో శరణార్ధి శిబిరాల్లో ఇప్పటికీ తలదాచుకుంటున్న లక్షల లక్షల కుటుంబాలు.
యూదు హత్యాకాండను రచించింది హిట్లర్ నేతృత్వంలోని జర్మనీ. బాధితులు యూదులు. యూదులకు పరిహారం ఇవ్వవలసింది జర్మనీ లేదా సాటి యూరోపియన్ దేశాలు. అది న్యాయం. కాని న్యాయం పేరుతో జరిగిన కుట్రకు యూదు హత్యాకాండతో ఏ సంబంధమూ లేని పాలస్తీనీయులు బలయ్యారు. బలవుతూనే ఉన్నారు. ఆరు దశాబ్దాల నుండి పాలస్తీనా అరబ్బులు తమ సొంత ఇళ్ళకూ, పొలాలకూ తిరిగి రావడానికి ఎదురు చూస్తూనే ఉన్నారు. అప్పటినుండీ పాలస్తీనీయులనూ ఇప్పటికి కూడా వారి వారి ఇళ్ళను కూల్చి ఇజ్రాయెలీయులకు సెటిల్మెంట్లు నిర్మిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ సమాజం ఇది అన్యాయం అంటూనే ఉంది. ఇజ్రాయెల్ దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానాలున్నాయి. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాల్ని వెనక్కి ఇచ్చేయాలని ఇప్పటి ఒబామా వరకూ అమెరికా అధ్యక్షులంతా ఉపన్యాసాలు దంచినవారే. కాని ఇజ్రాయెల్ జాతి దురహంకారం కొనసాగుతూనే ఉంది. పాలస్తీనీయుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి.

జూన్ 6న లెబనాన్‌లోని శరణార్ధి పాలస్తీనీయులు "డే ఆఫ్ రేజ్" పాటించారు. లక్షల పాలస్తీనీయుల రగులుతున్న గుండెలకు సాక్షిగా నిలబడి ఉన్న ఈ పాలస్తీనా బాలుడు రేపటి టెర్రరిస్టు కాకూడదంటే పాలస్తీనా సమస్యకు పరిష్కారం కావాలి. ఇజ్రాయెల్ దౌర్జన్యం అంతం కావాలి. అమెరికా సామ్రాజ్య విస్తరణకు ముగింపు పలకాలి.
ప్రపంచ స్దాయికి చేరిన ముస్లిం టెర్రరిజానికి మూలం ఇదే. పాలస్తీనీయులకు వారి వారి సొంత ఇళ్ళూ, భూములు దక్కిననాడు ముస్లిం టెర్రరిజానికి ఇక చెప్పుకోవడానికి కారణం ఉండదు. అంతే కాదు అమెరికా, తదితర పశ్చిమ దేశాలకు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రపంచ దేశాల మీద ప్రజాస్వామ్యం పేరుతో టెర్రరిజంపై యుద్ధం పేరుతో దురాక్రమణ విధ్వంసాలు సృష్టించడానికి సాకులూ దొరకవు.
అందుకే పాలస్తీనీయుల మౌలిక సమస్య పరిష్కారానికి నోచుకోకుండా కొనసాగుతూనే ఉంటుంది. పాలస్తీనా సమస్య కేంద్రంగా టెర్రరిజం కొనసాగుతూనే ఉంటుంది. ఆ టెర్రరిజాన్ని సాకుగా చూపుతూ అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్సు తదితర దేశాల దురాక్రమణ యుద్ధాలు, ప్రపంచ పోలీసు పెత్తనం, అమెరికా ప్రపంచ గూండాయిజం, ఇజ్రాయెల్ ప్రాంతీయ గూండాయిజం కొనసాగుతూనే ఉంటుంది. టెర్రరిజానికి జన్మనిచ్చిన అమెరికా తదితర పశ్చిమ దేశాలు ఆ టెర్రరిజంపై ప్రపంచ యుద్దం ప్రకటించడం వింతల్లోకెల్లా వింత. దశాబ్దాలనాటి పచ్చి వాస్తవాలు అపభ్రంశం చెందిన ఫలితమే నేటి ఇస్లామిక్ టెర్రరిజం
అమెరికా కంటే పెద్ద టెఱరిస్ట్ ఎవరండీ? ఇజ్రాయెల్ సృష్టితో ఉగ్రవాదం పేరుతో మిగిలిన దేశాలపై జరిపే హత్యాకాండకు ప్రయోగశాలగా దానిని వాడుకుంటున్నారు.. అందుకే మన నల్లదొరలు కూడా తమ పోలీసులకు అక్కడే ట్రైనింగ్, ఆయుధాల కొనుగోలు చేస్తున్నారు.. పాలస్తీనా ప్రజల స్వేచ్చా స్వాతంత్రాలను హరించి వారిని వేటాడే క్రమంలో మొత్తం ముస్లిం సమాజాన్ని టెఱరిస్టులుగా చూపుతున్నారు.. ప్రపంచ పోలీసు పెత్తనానికి వ్యతిరేకంగ జరిగే పోరాటాలకు సంఘీభావం తెలుపుదాం…
అవును. మీరన్నది నిజం.