కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి తన నాలుగు రోజుల నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపం మెల్ల మెల్లగా అర్ధం అవుతోంది. అవినీతి ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఒట్టి గాలి మూటలేనని తెలిసి వస్తోంది. ఎన్నికల మేనిఫేస్టో పేరిట లిఖిత హామిలు ఇచ్చి పచ్చిగా ఉల్లంఘించే భారత దేశ రాజకీయ పార్టీలు ఒక సత్యాగ్రహవాదికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఉఫ్… అని ఊదిపారేయడం చిటికేలో పని అని గతం కంటే ఇంకా స్పష్టంగా అర్ధం అవుతోంది కాబోలు.
అదే అంటున్నాడు అజ్జా హజారే. ప్రభావశీలమైన లోక్‌పాల్ బిల్లు రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదని న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. పౌర సమాజం ప్రతినిధులుగా లోక్‌పాల్ బిల్లు తయారీకి ఏర్పడిన జాయింట్ కమిటీ లో ఉన్నవారు జూన్ 6 తేదీ సమావేశాన్ని బహిష్కరిస్తామని ఆయన ప్రకటించాడు. జూన్ 8 తేదీన మరోసారి జంతర్ మంతర్ దగ్గర్ నిరాహార దీక్షకు కూర్చుంటానని కూడా ఆయన ప్రకటించాడు. ఢిల్లీ రాంలీలా మైదానంలో బాబా రాందేవ్ దీక్షా శిబిరంపైనా, అతని మద్దతుదారుల పైనా ప్రభుత్వం పోలీసులతో దాడి చేయడాన్ని ఆయన ఖండించాడు. ప్రభుత్వ చెడు ప్రవర్తన ప్రజాస్వామ్య మౌలిక లక్ష్యాన్నే చంపేసిందని ఆయన తీవ్రంగా విమర్శించాడు.
ప్రధాని మన్మోహన్ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని అన్నా హజారే డిమాండ్ చేశాడు. అన్నా, రాందేవ్ లు దీక్షలు చేస్తున్న సందర్భంగా ప్రధాని నీతిమంతుడనీ, నిజాయితీ పరుడనీ పొగిడేస్తూ ప్రభుత్వాల్ని విమర్శించేటప్పుడు ఆయన్ని మినాయిస్తున్నారు. కానీ ఆయనే ప్రభుత్వానికి అధిపతి. ఆర్ధిక విధానాలు రూపకర్త కూడా ఆయనే.1992 నుండి భారత పాలక వర్గాలు అనుసరిస్తున్న నూతన ఆర్ధిక విధానాలు ఆయన పుణ్యమే. సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణల ఫలితంగానే దేశంలో అవినీతి అనేక రెట్లు పెరిగిందని విశ్లేషకులంతా ఏకగ్రీవంగా అంగీకరిస్తున్న సత్యం.
స్వాతంత్వం వచ్చిందని చెప్పబడుతున్న 1947 నుండి, పబ్లిక్ పెట్టుబడిదారీ విధానం అమలైన 1992 వరకూ భారత అవినీతిపరులు విదేశాలకు తరలించిన దొంగ (నల్ల) డబ్బు కంటే, నూతన ఆర్ధిక విధానాల అమలు ప్రారంభమైన 1992 నుండి నేటివరకూ విదేశీ బ్యాంకులకు తరలి వెళ్ళిన నల్ల డబ్బు అనేక రెట్లు ఉన్నదని ప్రపంచ స్ధాయి విశ్లేషణా సంస్ధలు తేల్చి చెప్పాయి. అటువంటి మహత్తరమైన ఆర్ధిక విధానాలను భారత ప్రజల నెత్తిన రుద్దిన మన్మోహన్ మర్యాదస్తుడు, నీతిమంతుడు ఎలా అవుతాడో అర్ధం కాని విషయం.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే ప్రభుత్వంలోని ఆయన అభిమానులను అంతోడు, ఇంతోడు అని పొగడ్డం మానేసి తన లక్ష్యంపైన దృష్టి పెడితే బాగుంటుంది. అవినీతి సామ్రాజ్యంలొ నీతివంతమైన వ్యక్తులు ప్రధాని స్ధాయికి ఎదగడం అసాధ్యం అని కూడా ఆయన గ్రహించాల్సి ఉంది. నిజంగా ఆయన ఎంత నీతివంతుడైనా, భారత దేశ అశేష శ్రామిక జనులు, రైతు కూలీల బతుకులకు పాడె కట్టిన నూతన ఆర్ధిక విధానాల ప్రారంభకుడైనాక ఆయన నీతి, మర్యాదలో ఏనాడో గంగలో కలిసిపోయాయని గమనించాలి.