పౌరసమాజ నాయకులను ఐక్యం చేసిన రామ్‌దేవ్ అరెస్టు, లాఠీ ఛార్జీ


Anna_hazare_5

ఆదివారం వేకువ ఝామున బాబా రాందేవ్ ఆమరణ నిరాహార దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేయడమే కాకుండా, టియర్ గ్యాసు ప్రయోగించి, లాఠీ ఛార్జీ కూడా చేయడంతో అప్పటివరకు వివిధ కారణాలతో ఎడమొగం పెడమొగం గా ఉన్న పౌర సమాజ నాయకులుగా మన్ననలు అందుకుంటున్నవారిని ఏకం చేసింది. రాం దేవ్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి ముప్ఫై మందిక పైగా కార్యకర్తలను గాయపరచడాన్ని అన్నా హజారే, అరుణా రాయ్, కేజ్రివాల్ తదితరులు తీవ్రంగా ఖండించారు.

కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేకుండా చేస్తున్నారని అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాయకుల అవినీతిని ప్రశ్నిస్తే లాఠీలతో సమాధానం చెప్పడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని విమర్శించారు. తమ మధ్య ఉన్న విభేధాలను విస్మరించి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. అన్నా హజారే పోలీసుల లాఠీ ఛార్జి ఘటనను జలియన్ వాలా బాగ్ తో సైతం పోల్చాడు. “రామ్ లీలా మైదాన్ లో తుపాకి కాల్పులు జరక్కపోవచ్చు. కానీ అమాయక ప్రజలను ఆ విధంగా అర్ధరాత్రి దాడి చేసి కొట్టడం నిస్సందేహంగా జలియన్‌వాలా బాగ్ నే తలపిస్తోంది” అని ఆయన విమర్శించాడు.

హజారే జూన్ 8 తేదీన రాందేవ్ శిబిరంపై దాడికి నిరసనగా ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించాడు. అరుణా రాయ్ నాయకత్వంలోని మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్, ప్రజాస్వామిక వ్యవస్ధ సక్రమంగా నడవడానికి నిరసన తెలిపే హక్కుని మౌలిక హక్కుగా గుర్తించాలని గుర్తు చేసింది. శనివారం వరకు బాబా రాందేవ్ నిరాహార దీక్షకు మద్దతుగా నిలవడానికి ద్వైదీ భావంతో ఉన్నాడు. సైద్ధాంతిక విభేధాలు ఆయన్ని వెనక్కి లాగాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ప్రముఖ పాత్ర పోషించి కరసేవకులను మతతత్వ ఉపన్యాసాలతో రెచ్చగొట్టిన సాధ్వీ రితంబర రాందేవ్ సరసన వేదికపై కనపడడం అన్నా బృందానికి మింగుడు పడలేదు. దీక్షా శిబిరంలో ఆర్.ఎస్.ఎస్ సభ్యులు పాల్గొనడాన్ని లోక్ పాల్ డ్రాఫ్టింగ్ కమిటీ

సభ్యుడు ప్రశాంత్ భూషణ్ బహిరంగంగానే ప్రశ్నించాడు. ఎన్.డి.ఏ పాలనలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన విషయాన్నీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవినీతినీ నెత్తిపై ఉంచుకున్నవారిని అవినీతి వ్యతిరేక పోరాటంలో ఎలా కలుపుకుంటారన్న ప్రశ్నలూ, అనుమానాలూ అందరిలోనూ బయల్దేరాయి. దానితో రాందేవ్ దీక్షకు మద్దతు ఇవ్వడానికి పౌర సమాజ నాయకులు ముందుకు రావడానికి జంకారు.

అయితే కేంద్ర ప్రభుత్వ పుణ్యాన ఆ విభేధాలన్నీ మటుమాయం అయ్యాయి. రాందేవ్ అరెస్టు ప్రజాస్వామిక నిరసనలపై ప్రభుత్వం దృక్పధాన్ని వెల్లడించింది. అవినీతి వ్యతిరేక నిరసనలను అణచివేయడం ద్వారా సమాధానం చెప్పడమే తప్ప అవినీతిపరులను శిక్షించడం ద్వారా సమాధానం చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టంగా అర్ధమయ్యింది. హజారే దీక్షానంతరం లోక్ పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీలోని సభ్యులపై లేని అవినీతి ఆరోపణలను గుప్పించడం ద్వారా వ్యతిరేక ప్రచారం చేసి లోక్ పాల్ బిల్లును బలహీన పరిచే ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది. అందితే జుట్టు అందకుంటె కాళ్ళు అన్న రీతిలో ప్రభుత్వం మాటలూ, వాగ్దానాలూ, నిర్ణయాలు మార్చుకుంటూ పోయింది. ప్రభుత్వం నడుపుతున్నవారు, వారిని విమర్శించి దారిలో పెట్టవలసిన ప్రతిపక్షాలూ అవినీతిలో ఉన్నపుడు కఠినమైన లోక్ పాల్ చట్టం మాత్రం చేయగలిగింది ఏమీ లేక పోవచ్చు. ప్రజలు పూనుకుని అధికారాన్ని లాక్కుంటె తప్ప అవినీతి సమస్యకు కమిటీలూ, చట్టాలూ పైపూతకే పనికొస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s