చైనా ప్రభుత్వంపై పరోక్షంగా హేకింగ్ ఆరోపణలు సంధించిన గూగుల్ సంస్ధకు చైనా ప్రభుత్వం తన అధికారిక పత్రిక ద్వారా స్పందించింది. అమెరికా, చైనాల మధ్య ఉన్న రాజకీయ విభేధాలను స్వప్రయోజనాలకు వినియోగించుకోవలని చూస్తే “నష్టపోతావ్!” అని పీపుల్స్ డైలీ పత్రిక హెచ్చరించింది. విదేశాల్లో పంపిణీకి వెలువడే పీపుల్సు డైలీ పత్రిక మొదటి పేజీలో రాసిన సంపాదకీయంలో ఈ హెచ్చరిక చేసింది. తన ఆరోపణల ద్వారా గూగుల్ తన వ్యాపారావకాశాలకు ప్రమాదం తెచ్చుకుంటోందని పత్రిక హెచ్చరించింది.
గూగుల్ ఈ మెయిల్ సర్వీసులో మెయిల్ ఎకౌంట్లు ఉన్న అమెరికా ఉన్నతాధికారులు, చైనా మానవ హక్కుల కార్యకర్తలు, విలేఖరులు మొదలైనవారి జిమెయిల్ పాస్ వర్డులను దొంగిలించడానికి జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లుగా గూగుల్ గత వారం ప్రకటించింది. ఈ హాకింగ్ దాడి చైనాలో తూర్పున ఉన్న షాన్డాంగ్ రాష్ట్ర రాజధాని జీనాన్ నుండి జరిగినట్లు కనిపిస్తోందని ఆ సంస్ధ ప్రకటించింది. ఈ పట్టణంలోనే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన గూఢచర్య విభాగం కేంద్ర కార్యాలయం ఉండడం గమనార్హం. జినాన్ పట్టణం చైనాకు అమెరికాలోని లాంగ్లే నగరం లాంటిది. చైనా యొక్క లాంగ్లేగా జీనాన్ ని పేర్కొనవచ్చు.
గూగుల్ సంస్ధ తన “స్ట్రీట్ వ్యూ” ప్రాజెక్టుకోసం వినియోగించిన కార్ల ద్వారా పశ్చిమ దేశాల్లోని వివిధ పట్టణాల కూడళ్ళు, రోడ్ల ఫోటోలు తీయడమే కాకుండా ఓ ప్రత్యేకమైన ప్రోగ్రాం ని ఉపయోగించి వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారి ప్రవేటు వివరాలను దొంగిలించింది. దీన్ని జర్మనీ మొదటిసారి పసిగట్టి గూగుల్ పై విచారణ చేయడంతో ఇతర యూరప్ దేశాలతో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు కూడా గూగుల్ పై దర్యాప్తు చేస్తున్నాయి. బ్రిటన్
దర్యాప్తు కమిటీ గూగుల్ వినియోగదారులను దారుణంగా మోసగించిందని ప్రకటించింది. అమెరికాకి చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎవ్.సి.సి) కూడా గూగుల్ దురుద్దేశంతో ఆ ప్రోగ్రాం ని స్ట్రీట్ వ్యూ ప్రాజెక్టులోకి చొప్పించిందని నిర్ధారించింది. ఇంత జరిగినా ఈ ప్రభుత్వాలేవీ గూగుల్ పై చర్యలు తీసుకున్న దాఖలాలేవీ లేవు.
గూగుల్ పై అమెరికా జరుపుతున్న దర్యాప్తుకూ, అవకాశం వచ్చినప్పుడల్లా ఆ సంస్ధ చైనా ప్రభుత్వంపై రాజకీయ ఆరోపణలు చేయడానికీ మద్య సంబంధాలున్నాయని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. చైనాపై గూగుల్ చేసే ఆరోపణలు అమెరికా రాజకీయ ఉద్దేశ్యాలను సంతృప్తిపరచడానికేనని వీరి అనుమానం. ఈ నేపధ్యంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గూగుల్ సంస్ధకి వ్యాపార హెచ్చరిక జారీ చేసింది.
ఓ వ్యాపార సంస్ధ విదేశీ ప్రభుత్వంపై రాజకీయ ఆరోపణలు సంధించడం, ఆ ప్రభుత్వం సదరు వ్యాపార సంస్ధకు వ్యాపార హెచ్చరికలు జారి చేయడం ఈ ఘర్షణలోని ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు.
చైనా మానవహక్కుల కార్యకర్తల జిమెయిల్ ఎకౌంట్లు హేకింగ్ కి గురైన జాబితాలొ ఉన్నాయని ఆరోపించడం ద్వారా గూగుల్ “పశ్చిమ దేశాలకు చైనా పట్ల ఉన్న ప్రతికూల అభిప్రాయాలను సొమ్ము చేసుకోవడానికి ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నది. తద్వారా చైనా ప్రభుత్వానికి హేకింగ్ తో సంబంధమ్ ఉన్నట్లుగా బలమైన సూచనలు ఇస్తోంది. చైనాపై గూగుల్ ఎక్కుపెట్టిన ఆరోపణలు తీవ్రమైనవి. స్వార్ధం కోసం చెడ్డ ఉద్దేశ్యంతో చేస్తున్న ఆరోపణలవి. రాజకీయ విభేధాలకు, అంతర్జాతీయ రాజకీయ ఘర్షణలో సాధనంగా గూగుల్ పనిచేయడం తగదు” అని హెచ్చరించింది.
అంతర్జాతీయంగా రాజకీయ గాలులు తమ దిశను మార్చుకున్నపుడు రాజకీయాల కోసం గూగుల్ తనను తాను సమిధగా అర్పించుకోవలసు ఉంటుంది. ఆ సుడిగాలిలో గూగుల్ మార్కెట్లో తన స్ధానాన్ని కోల్పోవలసి ఉంటుంది.
అని పీపుల్స్ డైలీ పత్రిక హెచ్చరించింది.
గత వారం సైబర్ దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించి సైనిక చర్యకు వెనకాడబోమని అమెరికా డిఫెన్సు సెక్రటరీ రాబర్టు గేట్స్ హెచ్చరించడం ఈ సందర్భంగా గమనార్హం.