ఇరాన్ అణు బాంబులు తయారు చేయడానికే యురేనియం శుద్ధి చేస్తున్నదంటూ ఇరాన్ అణు కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలనుండి రాజకీయ, వాణిజ్య ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా తదితర పశ్చిమ దేశాలు తాజాగా సిరియాపై కూడా అదే తరహా ఎత్తుగడను అమలు చేస్తున్నాయి. ఇరాన్‌పై చేసినట్లే సిరియాపై కూడా అణు దౌర్జన్యం చేయడానికి సిద్ధపడుతున్నాయి. తమకు లొంగని దేశాలపై ఏదో ఒక పేరుతో అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించి ఆ దేశాల ప్రజల ఉసురు తీసే నరహంతక పశ్చిమ దేశాలు తమ గూండాయిజాన్ని సిరియాకు విస్తరించడానికి ఎత్తుగడలు పన్నుతున్నాయి.
సిరియా, ఇరాన్ లాగే అణ్వస్త్ర నిషేధ ఒప్పందంపై సంతకం చేసిన దేశం. ఇండియా ఆ సంతకం చేయలేదు. ఇజ్రాయెల్ కూడా చేయలేదు. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ 300 కి పైగా అణ్వస్త్రాలను తయారు చేసుకున్నదని బిబిసి సంస్ధ అనేకసార్లు తెలిపింది. అది అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఎ.ఇ.ఎ) పరిశీలకులను ఇంతవరకూ తన అణు కర్మాగారాలను పరిశీలించడానికి అనుమతించలేదు. ఇరాన్ ఐ.ఎ.ఇ.ఎ పరిశీలకులను అనేక సార్లు అనుమతించింది. పరిశీలించడానికంటూ వచ్చిన అణు శాస్త్రవేత్తలు గూఢచర్యం చేస్తూ ఇరాన్ అణు సమాచారాన్ని అమెరికాకి చేరవేస్తుండడంతో వారిని బహిష్కరించింది. అయినప్పటికీ పశ్చిమ దేశాలు ఇరాన్‌పై ఇప్పటికి నాలుగుసార్లు భద్రతా సమితిని అడ్డుపెట్టుకుని ఆంక్షలు విధించాయి. ఇప్పుడు అదే విధానాన్ని సిరియాపై అమలు చేయడానికి కావలసిన పునాదిని తయారు చేసుకునే పనిలో ఉన్నాయి.
సిరియాలో మిలట్రీ వాడకుండా వదిలేసిన భవనాలని 2007లో పశ్చిమాసియాలో గూండాయిజం చేసే ఇజ్రాయెల్ బాంబులు వేసి ధ్వంసం చేసింది. అక్కడ మరో భవన సముదాయాన్ని సిరియా నిర్మించుకుంటోంది. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన భవనాలు యురేనియం శుద్ధి చేయడానికి కట్టిన అణు కర్మాగారం అనీ, అది తెలియకుండా ఉండటానికే ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన భవనాల స్ధానంలో కొత్త భవనాలు కడుతోందని అమెరికా ఇప్పుడు ఆరోపిస్తోంది. అసలు ఇజ్రాయెల్ దౌర్జన్యంగా మరోదేశంపై బాంబులేసి ధ్వంసం చేసినపుడు అడిగినోడు ఒక్కడూ లేడు. ఇప్పుడు కొత్త భవనాలు కట్టుకోవద్దని అమెరికా ఇంకా గూండా కూతలు కూయడం, దాని ఆటవిక నీతిని ఐ.ఎ.ఇ.ఎ కూడా సమర్ధించడం ప్రపంచ దేశాల ప్రజాస్వామిక సంబంధాలకు పట్టిన దౌర్భాగ్యం. చిన్న దేశాలను ఇలా వేధించుకు తినే అమెరికా గొప్ప ప్రజాస్వామిక దేశంగా, స్వేచ్ఛా రాజ్యంగా మన్ననలందుకోవడం అంతకంటే మించిన దౌర్భాగ్యం.
ఇక్కడ వరుసగా బిబిసి ప్రచురించిన మూడు పటాలు ఉన్నాయి.
మొదటి చిత్రంలో సిరియాలోని పాత భవన సముదాయాన్ని చూడవచ్చు.
రెండో చిత్రంలో ఇజ్రాయెల్ బాంబులతో ధ్వంసం చేసిన తర్వాత దృశ్యాన్ని చూడవచ్చు.
మూడో చిత్రంలో సిరియా ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త భవన సముదాయాన్ని చూడవచ్చు.