అమెరికా నిరుద్యోగం అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా మారింది. నిరుద్యోగం తగ్గడానికి నేరుగా చర్యలు తీసుకునే బదులు పెట్టుబడిదారులకు ప్రోత్సహాకాలు ఇవ్వడం ద్వారా నిరుద్యోగం తగ్గించాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకున్న ప్రవేటు బహుళజాతి సంస్ధలు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వినియోగించే బదులు ద్రవ్య మార్కెట్లలో స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలని చూస్తున్నారు. దానితో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాక ప్రజల కోనుగోలు శక్తి పెరగక ఉత్పత్తులు కొనేవాళ్ళు లేక ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి ప్రమాదంలో పడుతోంది. అమెరికా నిరుద్యోగం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ లకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశలు ఇలా ఉన్నాయి.
- 2011 మే నెలలో కేవలం 54,000 మాత్రమే కొత్త ఉద్యోగాలు కల్పించారు. కనీసం 150,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తే ఆ సంఖ్యలో సగం కూడా వాస్తవంగా లేకపోవడం మార్కెట్లను నిరుత్సాహానికి గురిచేసింది.
- ఏప్రిల్ నెలలో 232,000 కొత్త ఉద్యోగాలు సృష్టించ బడ్డాయి. ఏప్రిల్ కంటే మే నెలలో ఉద్యోగాల కల్పన తగ్గుతాయని అంచనా వేసినప్పటికీ మరీ ఇంత ఘోరంగా తగ్గుతాయని ఊహించలేకపోయారు.
- మే నెలలో కొత్త ఉద్యోగాలు భారీగా తగ్గినప్పటికీ వరుసగా ఎనిమిదో నెల ఈ సంఖ్య పాజిటివ్ గా ఉన్నందుకు కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- ఆర్ధిక వ్యవస్ధ రికవరీ సాధించే క్రమంలో ఎదురు దెబ్బలు సహజమేనని అధ్యక్షుడు ఒబామా తాను సమాధానపడుతూ, అమెరికన్లను సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
- నిరుద్యోగం ఏప్రిల్ లో 9.0 శాతం ఉంటే అది మే నెలలో 9.1 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల ఎవరూ ఊహించనిది. వాస్తవానికి నిరుద్యోగం 20 శాతం పైనే ఉంటుందని జేమ్స్ పెట్రాస్ లాంటి విశ్లేషకులు భావిస్తున్నారు.
- నిరుద్యోగుల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. వారి సంఖ్య ఇపుడు 13.9 మిలియన్లు (1 కోటీ 39 లక్షల మంది) గా ఉంది.
- 26 వారాలకంటె ఎక్కువ రోజుల పాటు ఏ పనీ దొరకనివారి సంఖ్య 361,000 పెరిగి 6.2 మిలియన్లకు చేరుకుంది.
- స్ధానిక ప్రభుత్వాలు నిరుద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు కనపడుతోంది. వరుసగా 22 వ నెలలో అవి 28,000 ఉద్యోగాలను ఇవ్వగలిగాయి.
- ప్రవేటు రంగం 83,000 ఉద్యోగాలు సృష్టించినప్పటికీ నిరుద్యోగ సైన్యంలో చేరుతున్నవారితో పోలిస్తే ఇది చాలా తక్కువ.
- వృత్తిగత ఉద్యోగాలు, వ్యాపార సేవలు, ఆరోగ్యం, మైనింగ్ రంగాల్లో ఉద్యోగాల సృష్టి జరుగుతున్నదని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సంస్ధ తెలిపింది.
- 2007 లో వచ్చిన ఆర్ధిక మాంద్యానికి ముందు రికార్డయిన ఉపాధి కంటే ఇప్పటి మొత్తం ఉపాధి ఇంకా 5 శాతం తక్కువగానే ఉంది.
- ఉపాధి, నిరుద్యోగం సమస్యలు అమెరికాలో రాజకీయాలను ప్రభాతం చేస్తాయి. దానితో మే నెలలో ఉద్యోగాల కల్పన తగ్గిపోవడాన్ని వైట్ హౌస్ అధికారులు తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తున్నారు.
- “మూడు సంవత్సరాల తర్వాత అధిక గాస్ ధరలు, అధిక ఆహార ధరలను అమెరికా ఎదుర్కొంటోంది. నిజం ఏంటంటే ఒబామా అమెరికాని విఫలం చేశాడు” అని రిపబ్లికన్ల నాయకుడు మిట్ రామ్నీ అన్నాడు.
- నిరుద్యోగం పెరుగుదలతో పాటు మాన్యుఫాక్చరింగ్ రంగంలో తక్కువ వృద్ధి రేటు నమోదు కావడం, వినియోగదారుల వినియోగం కూడా తగ్గిపోవడంతో అమెరికా మరొకసారి మాంద్యం (రిసెషన్) లోకి జారుతుందేమోనని నిరాశావహులు భయపడుతున్నారు. రెండో క్వార్టరు లో (ఏప్రిల్ నుండి జూన్ వరకు) అమెరికా వృద్ధి రేటు అతి తక్కువగా నమోదు కావచ్చని వారు చెబుతున్నారు.
- ఈ సంవత్సరంలోనే రెండో అర్ధ భాగంలో మూడవ బెయిలౌట్ (క్వాంటిటేటివ్ ఈజింగ్-3 లేదా క్యు.ఇ-3) ను అమెరికా ఫెడరల్ రిజర్వు ఇవ్వవచ్చని కూడా అంచనా వేస్తున్నవారు లేక పోలేదు. గత సంవత్సరం ఆగష్టులో 600 బిలియన్ డాలర్ల క్యు.ఇ-2 ను ఫెడరల్ రిజర్వు ప్రకటించి యూరప్, చైనా, జపాన్ దేశాల ఆగ్రహానికి గురయ్యింది. అమెరికా ట్రెజరీ బాండ్లను అమెరికా ఫెడరల్ రిజర్వే కొనేయడం ద్వారా ఆ డబ్బును మార్కెట్లలోకి విడుదల చేయడంతో అది ఎమర్జింగ్ దేశాలకు ప్రవహించి అక్కడ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమయ్యింది.
- మే నెల కొత్త ఉద్యోగాలు, నిరుద్యోగం వివరాలను అమెరికా ప్రభుత్వం ప్రకటించిన వెంటనే శుక్రవారం స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. బ్రిటన్ స్టాక్ సూచి ఎఫ్.టి.ఎస్.ఇ 100 ఫలితాలు ప్రకటించిన వెంటనే 0.8 శాతం పడిపోగా అమెరికా సూచిక డౌ 1.2 శాతం పడిపోయింది.