తాలిబాన్, ఆల్-ఖైదా లది టెర్రరిజమా, స్వాతంత్ర్య పోరాటమా?


‘ఏసియా టైమ్స్’ ఆన్‌లైన్ ఎడిషన్‌కి సంపాదకుడుగా ఉన్న పాకిస్ధాన్ విలేఖరి సలీమ్ షాజద్ కిడ్నాప్‌కి గురై, ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని శరీరంపై చిత్ర హింసలకు గురైన ఆనవాళ్ళు తప్ప బలమైన గాయమేదీ కనిపించలేదు. తుపాకితో కాల్చిన గుర్తులసలే లేవు. ఎటువంటి గాయాలు కనిపించకుండా చంపగల నేర్పరితనం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఉందని తెలుగు ప్రజలకు తెలుసు. షాజద్ హత్య ద్వారా ఆ నేర్పరితనం ఐ.ఎస్.ఐ గూఢచారులకు కూడా ఉందని వెల్లడయ్యింది. షాజద్‌ని చంపింది ఐ.ఎస్.ఐ వారేనని రుజువైతేనే అనుకోండి. హత్యకు ముందు తనను ఐ.ఎస్.ఐ నుండీ, మిలిటెంట్లనుండీ బెదిరింపులు వస్తున్నాయని షాజద్ చెప్పటం వలనా, కిడ్నాప్‌ అయిన షాజద్ వెతుకుతుండగా అతను ఐ.ఎస్.ఐ ఆధీనంలో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం అందిందని “హ్యూమన్ రైట్స్ వాచ్” పరిశోధకుడొకరు చెప్పడం వలన షాజద్‌ని చంపింది ఐ.ఎస్.ఐ అని అంతా అనుమానిస్తున్నారు. ఐ.ఎస్.ఐ ఆ వాదనని ఖండించినా, ఐ.ఎస్.ఐ చరిత్ర తెలిసినవారు ఆ ఖండనను పట్టించుకోరు.

ఈ ఐ.ఎస్.ఐకి నిజానికి సి.ఐ.ఎ మాతృ సంస్ధగా చెప్పుకోవచ్చు. దక్షిణాసియాలో నెహ్రూ సారధ్యంలోని భారత దెశం “సోషలిస్టిక్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీ” (సోషలిస్టు వ్యవస్ధ లాంటి వ్యవస్ధ, కానీ సోషలిస్టు వ్యవస్ధ కాదు) మార్గాన్ని ఎంచుకుని రష్యాకు దగ్గరైంది. పాకిస్ధాన్ అమెరికాకి దగ్గరైంది. ఆ తర్వాత అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. ప్రచ్ఛన్న యుద్ధం లో భాగంగా ఇండియా పై గూఢచర్యానికి అమెరికా ఐ.ఎస్.ఐని పెంచి పోషించింది. దానికి అధునాతన టెక్నిక్కులన్ని నేర్పించి సి.ఐ.ఏ కి తమ్ముడిగా తయారు చేసింది. ఆ ఐ.ఎస్.ఐ ఇప్పుడు పాకిస్ధాన్‌లో ఒక శక్తివంతమైన అధికార కేంద్రం. ఐ.ఎస్.ఐ పాక్ మిలట్రీ ఆధీనంలో ఉంటుంది. జియావుల్ హక్ పుణ్యాన పాక్ మిలట్రీ రాజకీయ నాయకత్వానికి పోటీ కేంద్రంగా ఇప్పటికీ కొనసాగుతోంది.

సెప్టెంబరు 11 దాడులతో పాక్ పాలకవర్గాల పంట పండినట్టే అయింది. టెర్రరిజంపై యుద్ధం పేరుతో దక్షిణాసియా, పశ్చిమాసియాల్లో అమెరికా తన ప్రాబల్యాన్ని స్ధిరపరుచుకోడానికి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణలకి దిగింది. ఎమర్జింగ్ ఎకానమీలుగా ఎదుగుతున్నాయని చెబుతున్న చైనా, ఇండియాలపై చెకింగ్ పెట్టడానికీ మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఎదురు లేకుండా చేయడానికి తద్వారా అయిలు, ఖనిజ సంపదలను కొల్లగొట్టాలన్న తన దోపిడీ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అమెరికా పన్నిన పధకమే ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లపై దాడి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఇరాన్ పెద్ద అడ్డుగా ఉంది. ఒక దశలో ఇరాన్ పై కూడా యుద్ధం ప్రకటించవచ్చని వార్తలు కూడా వచ్చాయి. రెండు యుద్ధాలకే శక్తులుడిగిన అమెరికాకి బహుశా అది భరించటం కష్టం అనిపించి ఉండవచ్చు. ఇలా పశ్చిమాసియా, దక్షిణాసియాలపై వ్యూహాత్మకంగా పైచేయి సాధించడానికి పాకిస్తాన్‌ని తన భాగస్వామిగా అమెరికా ఎన్నుకుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్ధాన్‌లో యుద్ధంలో మునిగిఉన్న తన సైన్యానికి ఆయుధ, ఆహార సరఫరాలు నిర్విఘ్నంగా సాగాలంటే పాకిస్ధాన్‌పై ఆధారపడక తప్పదు. ఉత్తరాన ఉన్న మాజీ సోవియట్ దేశాలు రష్యా పలుకుబడిలో ఉన్నందున వాటిపై ఆధారపడడం కష్టం. పైగా ప్రచ్ఛన్న యుద్ధం జరిగినన్నాళ్ళూ పాకిస్ధాన్ తనతోనే నమ్మకంగా ఉంది. ఆఫ్ఘనిస్ధాన్ ని రష్యా ఆక్రమించుకున్నన్నాళ్ళు మొదట ఒసామా బిన్ లాడెన్ తదితర రష్యా వ్యతిరేక శక్తులకు గానీ, ఆ తర్వాత తాలిబాన్‌కి గానీ  తనతో పాటు మద్దతు సమకూర్చింది కూడా పాకిస్ధానే. మతం, ప్రాంతం రీత్యా దగ్గరి సంబంధాలు ఉన్నందున పాక్ సాయం అమెరికాకి ఎంతో అవసరం.

టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం అని ప్రకటించాక టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధంలో పాల్గొన్న దేశాలకు అందుకయిన ఖర్చుని తిరిగి చెల్లించే పేరుతో (reimbursement) ఓ నిధిని అమెరికా ఏర్పాటు చేసింది. ఆ నిధి వలన అత్యధికంగా లాభపడింది పాక్ పాలకులే. పాకిస్ధాన్‌కి ఇచ్చిన నిధుల్లో కొంత రాజకీయ నాయకత్వానికీ, కొంత నేరుగా మిలట్రీకీ ఇచ్చింది అమెరికా. ఈ నిధుల వినియోగంలో పాక్ ప్రభుత్వానికీ, మిలట్రీకీ విభేధాలు కూడా ఉన్నాయి. సెప్టెంబరు 11, 2001 ఘటనల నుండి ఇప్పటివరకూ 20.7 (ఇప్పటి కరెన్సీ విలువ ప్రకారం ఇది 94,000 కోట్ల భారత రూపాయలకు సమానం) బిలియన్ డాలర్లు పాక్‌కి సాయంగా ఇచ్చిందని రాయిటర్స్ వార్తా సంస్ధ కొన్ని రోజుల క్రితం తెలిపింది. అయితే తాలిబాన్‌ గానీ, ఆల్-ఖైదా మిలిటెంట్లు గానీ ఒకప్పుడు ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించడానికి వ్యతిరేకంగా రష్యాపై పోరాటం చేసిన వాళ్ళు. రష్యా ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాడినవారు అమెరికా ఆక్రమణను ఆహ్వానిస్తారా? ఖచ్చితంగా ఆహ్వానించరు. రష్యా ఆక్రమణకి వ్యతిరేకంగా అన్ని సంవత్సరాలు పోరాడిందే స్వేచ్ఛా గాలులు పీల్చడం కోసం.

కనుక సహజంగానే ఆల్-ఖైదా, తాలిబాన్‌లకు అమెరికా ఆక్రమణ నచ్చలేదు. అమెరికా పైన కూడా పోరాటం మొదలు పెట్టారు. ఒక స్వతంత్ర దేశం ఆక్రమణకి గురైనప్పుడు ఆ ఆక్రమణకి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఏమవుతుంది? చరిత్రను ఒకసారి పరికిస్తే అర్ధం అవుతుంది. బ్రిటిష్ ఆక్రమణకి వ్యతిరేకంగా భారతీయులు చేసిన పోరాటం జాతీయ పోరాటం అయితే ఆఫ్ఘనిస్ధాన్‌‌ని ఆక్రమించుకున్న అమెరికాకి వ్యతిరేకంగా జరిగే పోరాటం టెర్రరిజం అవుతుందా? కాని అమెరికా టెర్రరిజం అని ముద్ర వేసింది. టెర్రరిజం అని ముద్ర వేయని పక్షంలో ప్రపంచం అంతా ఆధునిక యుగంలో మరొక దేశాన్ని వలసగా మార్చుకోవడానికి అంగీకరించదు. ఎక్కడిదాకానో ఎందుకు? అమెరికా ప్రజలే అంగీకరించరు. మరొక దేశాన్ని ఆక్రమించడానికి చేసే యుద్ధంలో అమెరికా సైనికులు చనిపోతుంటే వారెందుకు ఒప్పుకుంటారు? అందుకే సెప్టెంబరు 11 దాడులను చూపి అవి చేయించింది ఒసామా బిన్ లాడెనే అన్నారు. జంట టవర్లపై దాడి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బిన్ లాడెన్ దోషి అని ప్రచారం చేసేశారు. కొన్ని గంటల్లోనే దోషిని నిర్ధారించడం సాధ్యమా? గంటలదాకా ఎందుకు? కొన్ని రోజుల్లోనైనా దోషిని నిర్ధారించడం సాధ్యమా? మహా అయితే అనుమానం కలగవచ్చు. కానీ అనుమానానికీ, నిర్ధారణకీ చాలా తేడా ఉంది. జంట టవర్లపై దాడితో ఆగదనీ మరిన్ని దాడులు జరుగుతాయనీ ప్రచారం చేశాక ఆ ప్రచారాన్ని నమ్మిన అమెరికన్లు ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణని టెర్రరిజంపై యుద్ధంగా నమ్మి దాన్ని ఆహ్వానించారు.

ఒక్క అమెరికన్లే కాదు. మిగిలిన ప్రపంచం అంతా నమ్మింది. అమెరికా గురించీ, యూరప్ గురించీ, ఆ దేశాల దోపిడీ చరిత్ర గురించి తెలిసినవారు నమ్మలేదు. అంతకు ముందే కొత్త మిలీనియంలో “నాగరికతల మధ్య యుద్ధం” జరుగుతుందని పుస్తకాలు ప్రచురించి ముస్లిం ప్రజానికంపై ఒక సార్వత్రిక ద్వేషాన్ని ప్రచారం చేసి పెట్టాయి పశ్చిమ దేశాల పాలకవర్గాలు. మత కలహాల వలన మతాలను నమ్మే ప్రజల మధ్య ద్వేషం ఉండవచ్చు. కానీ ముస్లిం మతం అంటేనే హింసను ప్రభోధించేది అనే ప్రచారం ముస్లిమేతరులతో పాటు ముస్లింలలో గూడా జరిగింది. భారత దేశ స్వాతంత్ర సమయంలో పాక్, ఇండియా ల విభజన వలన ముస్లింలపై ప్రారంభంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో అది భారతీయుల్లో చాలా వరకు తగ్గిపోయింది. అయినప్పటికీ మనకు పాకిస్ధాన్‌కీ లక్ష ఉండొచ్చు గాక! అంతమాత్రాన ఆఫ్ఘన్ జాతీయోద్యమానికి పాకిస్ధాన్ పౌరులు మద్దతు ఇస్తే అది టెర్రరిజానికి మద్దతు ఇచ్చినట్లా? కాదు. ఆఫ్ఘనిస్ధాన్ ప్రజల న్యాయమైన జాతీయ ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడం అవుతుంది. తమ నేల తమకు దక్కాలని పోరాడుతున్న ఆఫ్ఘన్ లకు పాక్ పౌరులు ఇస్తున్న మద్దతు ఒక న్యాయమైన జాతీయ పోరాటానికి ఇస్తున్న మద్దతుగానే చూడాలి.

ఒక్కసారి చరిత్రను మననం చేసుకుందాం. బ్రిటిష్ ఆక్రమణపై పోరాడ్డానికి సుభాష్ చంద్ర బోస్ జపాన్ సాయం కోరాడు. జపాన్ సహకారంతో అజాద్ హింద్ ఫౌజ్ ని స్ధాపించాడు. ఇప్పుడు పాకిస్ధాన్ తాలిబాన్ కానీ, ఆల్-ఖైదా కానీ స్వతంత్ర పోరాటం చేస్తున్న ఆఫ్టన్ పౌరులకు ఎలా కనిపిస్తుందో అప్పట్లో మనకు అంటే భారత పౌరులకు ఆజాద్ హింద్ ఫౌజ్ అలా కనిపించింది. లేదా వైస్ వర్సా. అజాద్ హింద్ ఫౌజ్‌నీ, సుభాష్ చంద్రబోస్‌నీ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం దేశద్రోహంగా పరిగణించింది. ఎక్కడినుండో వ్యాపారం పేరుతో వచ్చి తగువులు పెట్టి చివరికి దేశం మొత్తం ఆక్రమించిన బ్రిటన్ పైన దేశ విముక్తి కోసం సైన్యాన్ని స్ధాపించిన సుభాష్‌ది దేశ ద్రోహం అని ఆరోపించింది. భారత దేశం తమ సొంత సొత్తయినట్లుగా. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఆఫ్ఘనిస్ధాన్‌ని తన వ్యాపార, యుద్ధ ప్రయోజనాల కోసం ఆక్రమించుకున్న అమెరికా సైన్యంపై ఆఫ్ఘనిస్ధాన్‌కి చెందిన తాలిబాన్ పోరాడుతుంటే, తమ మతస్ధులకి సంఘీభావంగా ఆల్-ఖైదా, పొరుగు దేశస్ధులకు సహాయంగా పాక్-తాలిబాన్ లు సహకరిస్తున్నాయి. పాకిస్ధాన్ పాలక వర్గం (మిలట్రీ అధికార వర్గంతో సహా) అమెరికా పాలక వర్గంతో మిలాఖతై పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ కి ద్రోహం తలపెట్టాయి. అమెరికా విదిలిస్తున్న డాలర్లకు వారు దాసోహమై పొరుగు దేశానికి నమ్మక ద్రోహం చేస్తున్నారు. తమ పాలకులు చేస్తున్న ద్రోహాన్ని పాక్ ప్రజలు సహించలేక పోతున్నారు. దాంతో వారిలో కొంతమంది పాక్ తాలిబాన్ ఏర్పాటు చేసుకుని తమ పాలకుల ద్రోహ విధానలపై పోరాడుతున్నారు. అలాగే ఆఫ్ఘన్ తాలిబాన్‌కి సహకరిస్తున్నారు. నార్త్ వజీరిస్తాన్ లో గానీ, ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియా (ఎఫ్.ఎ.టి.ఎ) లో గానీ తాలిబాన్, ఆల్-ఖైదా లు తలచాచుకోగలగుతున్నారంటే అక్కడి ప్రజల పూర్తి మద్దతు లేకుండా అది అసాధ్యం. అదొక్కటి చాలు అమెరికా ఆక్రమణతో పాటు పాక్ పాలకుల విద్రోహవిధానాలను కూడా పాక్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పడానికి.

ఈ నేపధ్యంలో తాలిబాన్, ఆల్-ఖైదాలకి ఐ.ఎస్.ఐ, మిలట్రీల లోని కొన్ని సెక్షన్‌లు ఇస్తున్న సహకారాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? 1857 సిపాయి తిరుగుబాటు పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అప్పటి సిపాయిలు వాస్తవానికి బ్రిటిష్ వారు ఏర్పాటు చేసుకున్న సైన్యం. భారతీయులను అణచివేయడానికి భారతీయులనే సిపాయిలుగా వారు నియమించుకున్నారు. కాని బ్రిటిష్ వారు నియమించుకున్న సిపాయిలైనా వారు భారతీయులే. వారిలోనూ భారత జాతీయత ఉంటుంది. తమ జాతీయు దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ ప్రభుత్వంపై వారిలోనూ వ్యతిరేకత క్రమంగా ప్రబలింది. ఆ వ్యతిరేకతే సిపాయి తిరుగుబాటుగా ప్రసిద్ధి కెక్కింది. ఆవు కొవ్వు, పంది మాంసం అని బ్రిటిష్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి సిపాయిల మహత్తరమైన తిరుగుబాటుని తక్కువ చేసి చూపడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నించారు. అదే ఇప్పటికీ మన విద్యార్ధులకీ నేర్పుతున్నారు. వాస్తవానికి అది మొట్టమొదటి భారత జాతీయ పోరాటం.

అదే విధంగా ఆఫ్ఘన్ సైనికులుగానీ, పాకిస్ధాన్ సైనికులు గానీ, గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ సంస్ధలోని కొందరు ఉద్యోగులుగానీ అమెరికా ఆక్రమణను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. అమెరికా విదిలించే డాలర్లకోసం అమెరికా ఆక్రమణకి మద్దతు ఇస్తున్న పాకిస్ధాన్ పాలకులపై వారికీ కోపం రగులుతోంది. పాకిస్ధాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లలోని ఉన్నత స్ధాయి అధికారులకి డాలర్లు అందుతున్నాయి గనక వాళ్ళు అమెరికా ఆక్రమణకి సహకరిస్తారు. కింది స్ధాయి సైనికులు, అధికారులలో దానికి భిన్నంగా పొరుగు దేశాన్ని ఆక్రమించుకున్నదే కాక పాక్ భూభాగంపైన కూడా డ్రోన్ దాడులు చేస్తూ పాక్ ప్రజలను చంపుతున్న అమెరికా పట్ల కోపం పెంచుకున్నారు. అది సహజమైన కోపం. బ్రిటిష్ ఆక్రమణకి వ్యతిరేకంగా బ్రిటిష్ వాడు నియమించుకున్న భారత సిపాయిలకు కోపం వచ్చినట్లే అమెరికా ఆక్రమణకి సహకరిస్తున్న పాక్ పాలకవర్గాలు, మిలట్రీ అధికారులపైన కూడా పాక్ సైనికులకు కోపం రగులుతోంది. దాని ఫలితమే పాక్ మిలట్రీలో కూడా ఆల్-ఖైదా, పాక్ తాలిబాన్ లు చొచ్చుకెళ్ళగలిగడం. పాకిస్ధాన్ టెర్రరిస్టులు పాకిస్ధాన్ ప్రభుత్వ సైనిక స్ధావరం పైనే దాడి చేస్తే “టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్దాన్ కి తగిన శాస్తి జరిగింది. పాముకి పాలు పోసి పెంచితే అది కాటేయక మానుతుందా?” అని చేస్తున్న విశ్లేషణల్లో వాస్తవం లేదని గమనించాలి.

మన దాయాదులపై ఉన్న ఆగ్రహాన్ని ఒక్కసారి పక్కనబెడదాం. ఆ అగ్రహాన్ని పక్కనబెట్టి నిష్పాక్షికంగా ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ ప్రజల కోణం నుండి ఆలోచిద్దాం. వాళ్ళు ముస్లింలు అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లలో నివసిస్తున్నది మనలాగే మనుషులు అని ఒక్కసారి గుర్తిద్దాం. సమాజంలో మనుషులుగా ఉన్నవారికి స్వేచ్ఛగా బతకాలన్న కోరిక ఉంటుందని గుర్తిద్దాం. నూట యాభై సంవత్సరాల పాటు బ్రిటిష్ వాడిపాలనలో బతికిన భారతీయుడు స్వేచ్ఛాగాలుల కోసం ఎంతగా పరితపించి పోయి ఉంటాడో మననం చేసుకుందాం. అదే స్వేచ్ఛా పిపాస, అదే స్వాతంత్ర్య కాంక్ష అమెరికా అక్రమ ఆక్రమణలో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ పౌరులలోనూ, ఆఫ్గనిస్ధాన్ ని ఆక్రమించిన అమెరికా సైనికుల దాడిని ఎఫుర్కుంటున్న పాకిస్ధాన్ పౌరులలోనూ ఉంటుందని గుర్తిద్దాం. మరి తాలిబాన్ మత ఛాందస పాలనలో ఆఫ్ఘన్ ప్రజలు మగ్గుతారు కదా? అనడగవచ్చు. తాలిబాన్ మతఛాందసపాలనను తప్పించాలంటె ఆదేశాన్ని ఆక్రమించి వందలవేల ఆఫ్ఘన్ ప్రజలను చంపాలా? అమెరికా ప్రజలు కూడా అందుకు ఆహుతై పోవాలా? ఆఫ్ఘన్ లో మత ఛాందస పాలనను తప్పించడానికి ఇరాక్ పై దాది చేయవలసిన అవసరం ఎందుకొచ్చింది? సద్దాం హుస్సేన్ వాస్తవానికి సెక్యులర్ పార్టీ అయిన బాత్ పార్టీ కదా? అతని పాలనలో మత ఛాందసవాదం అణిగిమణిగి ఉంది కదా? సద్దాంని ఎందుకు చంపినట్లు? మత ఛాందసవాద పాలన అని అమెరికా తదితర పశ్చిమ దేశాలు చెప్పేవి వంకలు మాత్రమే.

నిజానికి ఆఫ్గన్ పాలకుల మతఛాందసవాదాన్ని ఎదుర్కోవలసింది ఆఫ్ఘన్ ప్రజలు మాత్రమే. ఆక్కడి ప్రజలు సాధించుకున్న సవ్యమైన పాలనే నాలుగు యుగాలపాటు నిలుస్తుంది. కనుక ఆ ప్రశ్న ఆఫ్ఘన్ పౌరులకే వదిలేయడం సబబు. అందుకే అమెరికా, దాని తైనాతీలైన బ్రిటన్, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా తదితర దేసాల సైన్యాల అక్రమ ఆక్రమణలో ఉన్న ఆఫ్ఘన్ ప్రజల స్వాతంత్వ పోరాటనికి మద్దతునిద్దాం!

4 thoughts on “తాలిబాన్, ఆల్-ఖైదా లది టెర్రరిజమా, స్వాతంత్ర్య పోరాటమా?

  1. Hi Sir,why osama bin laden attacked world trade centres?
    After attacking world trade centres only, US announced globar war on terrorism and started conquering Afghanisthan,before that what made Osama to attack world trade centers(US)

  2. It was/is just a propaganda. There is not a single proof to prove that Laden did it. Laden himself said “I did not do it. But I wish I could have done it.” Even the US could not provide any evidence to prove that the 9/11 attacks were handiwork of Bin Laden.

    Moreover, Laden is raised and nourished by none but CIA i.e. the U.S. The U.S supported, trained Laden’s network and supplied all sorts of arms to fight against secular regime of Afghanistan which had the blessings of the then USSR. Again we entered into a global geopolitical arena. Isn’t it?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s