‘ఆడలేక మద్దెల ఓడు’: అమెరికా సమస్యలకు జపాన్, యూరప్‌లే కారణమంటున్న ఒబామా


Barack Obama“ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టుంది అమెరికా అర్ధిక సమస్యలకి బారక్ ఒబామా చూపుతున్న కారణాలు. జపాన్, యూరప్ ల వలన అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేక పోతున్నదని బారక్ ఒబామా చెబుతున్నాడు. జపాన్ భూకంపం, యూరప్ అప్పు సంక్షోభాలే అమెరికా ఆర్ధిక వృద్ధికి ఆటంకంగా పరిణమించాయని ఒబామా తాజా పరిశోధనలో కనిపెట్టారు. ఇంతవరకూ ఏ ఆర్ధిక వేత్తగానీ, విశ్లేషకులు గానీ చేయనటువంటి విశ్లేషణ ఇది. అమెరికా ప్రభుత్వం తాజాగా శుక్రవారం వెలువరించిన గణాంకాలు అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు నెమ్మదించినట్లు తెలుపుతున్నాయి. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. కంపెనీలు గత ఎనిమిది నెలల్లో అత్యంత తక్కువ ఉద్యోగాలను మే నెలలో సృష్టించాయని గణాంకాలు తెలిపాయి. నిరుద్యోగం ఏప్రిల్ నెలలో 9 శాతం నమోదు కాగా మే నెలలో 9.1 శాతం నమోదయ్యింది.

“గత 15 నెలల్లొ అమెరికా ప్రవేటు రంగం రెండు మిలియన్ల ఉద్యోగాలు సృష్టించినప్పటికీ మన ఆర్ధిక వ్యవస్ధ కఠినమైన ఎదురు గాలి ఎదుర్కుంటోంది. ఈ మధ్య కాలంలో ఆయిల్ ధరలు పెరగడం, జపాన్ భూకంపం, యూరప్ దేశాల్లో ఫిస్కల్ (కోశాగార) పరిస్ధుతులు అసౌకర్యంగా మారడం… ఇవన్నీ సంభవించాయి. ప్రతిసారీ ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అమెరికా కోలుకునే దిశలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి” అని ఒబామా తన రేడియో ప్రసంగంలో పేర్కొన్నాడు. వారానికో రోజు అమెరీక అధ్యక్షుడు రేడియో ప్రసంగం ఉంటుంది. శనివారం నాడు ప్రసారమైన రేడియో ప్రసంగంలో ఒబామా ఈ అంశాలను పేర్కొన్నాడు. చిత్రం ఏమిటంటె రిపబ్లికన్లు సైతం ఈ ఎదురు దెబ్బల్నే ఒబామాకి వ్యతిరేకంగా ఉదహరిస్తున్నారు. ఒబామా విధానాలు పనిచేయడం లేదనడానికి వారు వీటినే సాక్ష్యాలుగా చూపుతున్నారు. 2012లో తిరిగి అధ్యక్షుడుగా పోటీ చేయనున్న ఒబామా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభ నెపాన్ని కొంత ఇతర దేశాల మీదికి మళ్ళించడం ద్వారా తనపై దాడిని బలహీనపరచాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.

రిపబ్లికన్ సెనేటర్ లామర్ అలెక్జాండర్ తమ పార్టీ రేడియో ప్రసంగంలో మాట్లాడాడు. “మన దేశంలో ప్రవేటు రంగంలో ఉద్యోగాల కల్పన సులభంగా, చౌకగా ఉండేట్లు చేయడం మన లక్ష్యంగా ఉండాలి. యూనియన్లలో చేరాలా వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ కార్మికుడికి ఇచ్చినట్లయితే దేశంలో పోటీ వాతావరణం ఏర్పడ్డానికి దోహదపడుతుంది. అటువంటి వాతావరణంలో నిస్సాన్, బోయింగ్ వంటి కంపెనీలు తామిక్కడ అమ్మే సరుకుల్ని ఇక్కడే ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది” అని అలెగ్జాండర్ సెలవిచ్చాడు. అంటె కార్మిక యూనియన్‌లు హక్కుల పేరుతో గొడవ చేయకుండా కంపెనీ యజమానులు ఎంతిస్తే అంత తీసుకోవాలన్నమాట. కార్మిక హక్కుల కోసం పట్టుబట్టకుండా పెట్టుబడిదారులకు సులభ మార్గాల్లో లాభాలు వచ్చేలా చేయాలి. అలాగే కార్మికుల వేతనాలు కూడ బాగా తగ్గించుకుని చౌక వేతనాలతో కంపెనీల లాభాలు పెంచాలి. ఇదే సెనేటర్ అలెగ్జాండర్ ప్రభోధిస్తున్నాడు.

అమెరికాలో కఠినమైన పర్యావరణ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు కార్మికులకు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని ఇతరత్రా సామాజిక సదుపాయాలను కల్పించవలసి ఉంటుంది. వీటిని తప్పించుకోవడానికి అమెరికాకి చెందిన బహుళజాతి సంస్ధలు చైనా, ఇండియా లాంటి చౌక శ్రమ లభ్యమయ్యే చోటికి తరలి పోయాయి. చైనా, ఇండియాల్లో కార్మిక హక్కులూ తక్కువే. ఉన్నా నామ మాత్రం. వాటిని అమలు చేసే దిక్కు ఉండదు. పర్యావరణాన్ని కంపెనీలు తమ చిత్తం వచ్చినట్లు నాశనం చేసుకోవచ్చు. దేశం అభివృద్ధి చెందాలంటె అటువంటి కష్టాలను భరించకతప్పదని ప్రధాని మన్మోహన్ బోధిస్తుంటారు. అయితే ఆ కష్టాలను మోయవలసింది ఎప్పుడూ పేదలు, గిరిజనులే కావడమే అసలు సమస్య. పశ్చిమ దేశాలన్నీ పర్యావరణ చట్టాలను అమలు చేస్తూ, కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ పశ్చిమ దేశాలు తరిమేసిన కాలుష్య కారక పరిశ్రమలను భారత, చైనా ప్రభుత్వాలు ఆహ్వానిస్తూ తమ ప్రజల ఆరోగ్యాలనూ, వారి జీవితాలనూ బలితీసుకుంటున్నాయి.

ఒబామా చేస్తున్న వాదనకి వస్తే అమెరికాలో ఆర్ధిక వృద్ధి రేటు తగ్గిపోవడానికి జపాన్, యూరప్ లు కారణమని ఒబామా అరోపిస్తున్నాడు. ఇది వాస్తవమేనా అన్నది పరిశీలించాలి. జపాన్‌లో భూకంపం, సునామీలు రాకముందే అక్కడి ఆర్ధిక వ్యవస్ధ స్తంభనకు గురై ఉంది. అధిక ఉత్పత్తి సంక్షోభం వలన ధరలు బాగా తగ్గిపోయి ప్రతి ద్రవ్యోల్బణం ఒక మొండి సమస్యగా అక్కడ గత పది సంవత్సరాల నుండి ఉంది. తగ్గుతున్న ధరల వలన “ధరలు ఇంకా తగ్గుతాయేమో” అన్న ఆలోచనతో జపనీయులు కొలుగోళ్లు తగ్గించడంతో అమ్మకాలు లేక ఆర్ధిక వృద్ధి స్వల్పంగా నమోదవుతూ వచ్చింది. అప్పటికే సంక్షోభ పరిస్ధుతులు ఉండగానే భూకంపం, సునామీలు సంభవించాయి. జపాన్ ఎగుమతులు ప్రధానంగా అమెరికాకి జరుగుతాయి. కాని అమెరికాలో నిరుద్యోగం వలనా, ఆర్ధిక సంక్షోభం వలనా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో జపాన్ ఎగుమతులు కూడా పడిపోయాయి. ఇక్కడ అమెరికా బలహీన ఆర్ధిక వ్యవస్ధ వలన జపాన్ ఎగుమతులు పడిపోయి అధిక ఉత్పత్తి సంక్షోభం ఏర్పడి తద్వారా ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడితే జపాన్ వలన అమెరీకాకి సమస్యలు వచ్చాయనడం వాస్తవాలను మభ్యపుచ్చడమే.

యూరప్ అప్పు సంక్షోభం నిజానికి అమెరికాకి లాభంగా పరిణమించిన విషయాన్ని ఒబామా మరిచిపోయాడు లేదా మరిచినట్లు నటిస్తున్నాడు. యూరప్ లో యూరో జోన్ కి చెందిన గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు అప్పు సంక్షోభంలో కూరుకు పోయాయి. దీనివలన యూరో భవిష్యత్తుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అంటే మదుపుదారులు యూరో భవిష్యత్తుపై ఉన్న నమ్మకాలతో యూరోలకు బదులు డాలర్లవైపు మొగ్గు చూపుతాయి సహజంగా. అప్పు సంక్షోభంలో ఉన్న యూరో జోన్ దేశాల పరిస్ధితులను వాల్ స్ట్రీట్ కంపెనీలు వినియోగించుకుంటూ లాభాలు గడించడమే కాక అప్పు సంక్షోభం మరింత తీవ్రం కావడానికి అవి దోహదం చేస్తున్నాయి. స్వల్పకాలిక లాభాల సంపాదన కోసం యూరప్ అప్పు సంక్షోభాన్ని వినియోగించుకుంటూ ఆ అప్పు సంక్షోభం మరింత క్లిష్టం కావదానికి అమెరికా కంపెనీలు దోహదపడుతుంటే అది వదిలేసి యూరప్ సంక్షోభాన్ని అమెరికా బలహీనతకు కారణంగా చూపడం సరికాదు. పైగా అమెరికా ఫెడరల్ రిజర్వు గత సంవత్సరం 600 బిలియన్ డాలర్ల క్వాంటిటేటివ్ ఈజింగ్ – 2 వలన ప్రపంచ మార్కెట్లలొకి డాలర్లు వరద కట్టాయి. దానితో డాలరు విలువ తగ్గి అమెరికా ఎగుమతులకు పోటీ సానుకూలత (కాంపిటీటివ్ అడ్వాంటేజ్) ఏర్పడి ఎగుమతులు పెరగడానికి దోహదపడింది కూడా.

గత నెలలో స్టాండర్డ్ అండ్ పూర్ రేటింగ్ సంస్ధా, రెండ్రోజుల క్రితం మూడీస్ రేటింగ్ సంస్ధా అమెరికా అప్పు రేటింగ్ ని తగ్గించాల్సి ఉంటుందని హెచ్చరించాయి. అంటే యూరప్ సంగతి అలా ఉండగా అమెరికా స్వయంగా అప్పు సంక్షోభాన్ని ఎదుర్కోనున్నది. అమెరికా అప్పు గత మే 16 తేదీన తన గరిష్ట పరిమితి 14.3 ట్రిలియన్ డాలర్లను చేరుకుంది. ఆగష్టు 2 న అమెరికా ట్రెజరీ బాండ్లు మెచ్యూరిటీకి రానున్నాయి. వడ్డీ చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. అప్పటికి అమెరికా అప్పు పరిమితి పెంచడానికి రిపబ్లికన్, డెమొక్రట్ పార్టీలు ఓ ఒప్పందానికి రాని పక్షంలో ఆ చెల్లింపులు చేయలేని పరిస్ధితికి అమెరికా నెట్టబడుతుంది. అంటే అమెరికానే స్వయంగా అప్పు సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. రిపబ్లికన్ లు బడ్జెట్ ఖర్చు తగ్గించే పొదుపు బిల్లుతోనూ, డెమొక్రట్ పార్టీ అప్పు పరిమితి పెంచే బిల్లుతోనూ ప్రత్యర్ధులుగా నిలబడి ఉన్నాయి. ఒకరి బిల్లుని మరొకరు ససేమిరా అంటున్నారు. ఇదే ప్రతిష్టంభన కొనసాగుతుందేమొనని రేటింగ్ సంస్ధలు హెచ్చరిస్తున్నాయి. కనుక అమెరికా అధ్యక్షుడు ముందు జపాన్, యూరప్ లపైకి నెపాన్ని నెట్టకుండా ముందు ఇంటిని చక్కదిద్దుకోవలసిన అవసరం ఉంది. అమెరికా సంక్షోభంలోకి వెళ్ళినట్లయితే ప్రపంచ వ్యాపితంగా మరొకసారి ఆర్ధిక సంక్షోభం తలెత్తడం ఖాయమ్.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s