భారత పాలకుల్ని నిరాశపరుస్తూ తగ్గుదల నమోదు చేసిన ఆర్ధిక వృద్ధి రేటు


Workers at LG TV factory, Noida

నొయిడా, ఎల్.జి టీవి ఫ్యాక్టరీలో టివిలు అసెంబుల్ చేస్తున్న కార్మికులు

గత 2010-11 ఆర్ధిక సంవత్సరంలో జనవరి 2011 నుండి మార్చి 2011 వరకు ఉన్న చివరి క్వార్టర్ లో భారత దేశ ఆర్ధిక (జిడిపి) వృద్ధి రేటు అంతకు ముందరి ఐదు క్వార్టర్లలో అతి తక్కువ వృద్ధిని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం వలన వినియోగం తగ్గడం, పెట్టుబడులు కూడా మందగించడం ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా లొంగిరాక పోవడంతో మరిన్ని సార్లు వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంకు పెంచుతుందని అంచనా వేస్తూ వచ్చిన విశ్లేషకులు జిడిపి వృద్ధి రేటు తగ్గడంతో తమ అంచనాలను సవరించుకునే పనిలో పడ్డారు.

గత ఆర్ధిక సంవత్సరం చివరి క్వార్టర్లో జిడిపి వృద్ధి రేటు 7.8 శాతం అని ప్రభుత్వ డేటా తెలుపుతోంది. ఇది మూడో క్వార్టర్ లో నమోదైన వృద్ధి రేటు (8.3 శాతం) కంటే తక్కువ. అంతే కాకుండా మార్కెట్ విశ్లేషకుల సర్వేలో వేసిన సగటు అంచనా (8.2 శాతం) కంటే కూడా తక్కువ. విశ్లేషకుల అంచనాని మించిందా, తగ్గిందా అన్న విషయాన్ని కూడా మార్కెట్ ఎకానమీలో ఒక వార్తగా చెలామణీ అవుతుంది. కేవల ఒక వార్తగానే కాకుండా ఆ అంకెలపై ఆధారపడి షేర్ మార్కెట్ లో పెట్టుబడుల ప్రవాహం కొద్దిగానైనా పెరగడమో, తరగడమో జరుగుతుంది. ఆర్ధిక కార్యకలాపాలను మార్కెట్ లోని ఆటగాళ్ళకు అప్పజెప్పడం వలన ఏర్పడే వైపరీత్యం ఇది. అంచనా కంటె వృద్ధి రేటు తగ్గితే దేశ ఆర్ధిక సామర్ధ్యంపై అనుమానం పెరుగుతుంది. ఎంత అనుమానం పెరుగుతుంది అనేది ఎంత తగ్గిందీ అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అనుమానం పెరిగితే షేర్ మార్కెట్ల నుండి విదేశీ సంస్ధాగత పెట్టుబడిదారులు (వీరినే ఎఫ్.ఐ.ఐ అనీ, వారి డబ్బుని హాట్ మనీ అనీ అంటారు) తమ పెట్టుబడిని ఉపసంహరించు కుంటారు. అది షేర్లు పడిపోవడానికి దారి తీస్తుంది. అయితే వృద్ధి రేటు అంచనా తగ్గినా అంతకు మించిన సంతోషకర వార్త వెలువడితే నష్టం బదులు లాభం రావచ్చు.

మొత్త ఆర్ధిక సంవత్సరానికి గానూ (ఏప్రిల్ 2010 నుండి మార్చి 2011 వరకు) జిడిపి వృద్ధి రేటు 8.5 శాతంగా నమోదైంది. ఇది కూడా ప్రభుత్వ అంచనా 8.6 శాతం కంటె తక్కువ. జూన్ లో రిజర్వు రేట్లను (ద్రవ్య విధానాన్ని) రిజర్వు బ్యాంకు సమీక్షిస్తుంది. ఆ సమీక్షలో వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం మూలంగా వడ్డీ రేట్లు పెంచడానికి రిజర్వు బ్యాంకుపై పడే ఒత్తిడి తాజా వృద్ధి రేటు తగ్గుదల వలన తగ్గవచ్చు అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఇండియా జిడిపి దూసుకు పోతోందంటూ భారత ప్రధాని, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు, ప్రధాని ఆర్ధిక సలహాదారులు ఉత్సాహంతో వేసిన అంచనాలకు నాల్గవ క్వార్టరు వృద్ధి రేటు బ్రేకులు వేసింది. దూసుకు పోతుంది చూడండన్నవాళ్ళు వృద్ధి రేటు కాస్తా తగ్గడంతో ఈ మాత్రం తగ్గుదల ఊహించిందే అని గంభీర ఫోజులు ఇస్తున్నారు.

ఇండియా జిడిపి వృద్ధి రేటు చైనా వృద్ధి రేటుని అధిగమించి రెండకెలకు చేరాలన్నది ప్రధాని మన్మోహన్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ప్రధాని ఆర్ధిక సలహాదారుల బృందం నాయకుడు కౌశిక్ బసులకు నిరంతరం కంటున్న కల. గత మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి వృద్ధి రేటు 8 నుండి 8.5 శాతం ఉంటుందని ప్రపంచ విశ్లేషకులు అంచనా వేస్తే మన వాళ్ళు మాత్రం 9 నుండి 9.5 వరకూ ఉంటుందని అంచనా వేసారు. ఇపుడది 8.5 శాతం అని తేలిపోయింది. దానితో తమ అంచనాల గురించి మార్కెట్ పండిత పాలకులు కిక్కురు మనడం లేదు. వారి అంచనా పొరపాటున నిజమై ఉంటే ఈ పాటికి ప్రకటనల మీద ప్రకటనలు, పార్టీల మీద పార్టీలతో ఫోటోలు పత్రికల్లో వచ్చేవి.

ఇంతకీ జిడిపి వృద్ధి రేటు చివరి క్వార్టర్లో ఎందుకు తగ్గింది? పెట్టుబడల పెరుగుదల రేటు మూడో క్వార్టర్లో 7.8 శాతం ఉంటే నాలుగో క్వార్టర్లో కేవలం 0.37 శాతమే నమోదైంది. అధిక వడ్డీ రేట్లు, అనేక ప్రాజెక్టులు ఆలస్యం కావడం, పర్యావరణ అనుమతులు రాకపోవడం, అవినీతి ఆరోపణలతో సతమవుతూ ఆర్ధిక కార్యకలాపాల గురించి పట్టించుకోక పోవడం ఇవన్నీ పెట్టుబడుల వృద్ధి రేటు తగ్గడానికి కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ చెబుతోంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పుచ్చు. ఏ కారణాలవల్లనైనా కానియ్యండి ఇండియాలో పెట్టుబడులకు ఇతర దేశాల్లో కంటే లాభాలు తక్కువ వచ్చినా, లేదా ఇండియా కంటే ఇతర చోట్ల లాభాలు పెరిగినా పెట్టుబడులు ఇండియా నుండి వెళ్ళి పొతాయి.

ఇలా లాభాల కోసం నిరంతరం ప్రపంచ మార్కెట్లను చుడుతూ వండే పెట్టుబడుల్ని ఎఫ్.ఐ.ఐలని పిలుస్తారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. చైనా ఈ పెట్టుబడుల్ని రానివ్వదు. అడ్డుకుంటుంది. దానర్ధం చైనాకి వచ్చే పెట్టుబడుల సంఖ్య ఎక్కువగా ఉందని. అలా ఎక్కువ ఎఫ్.ఐ.ఐ పెట్టుబడులు వస్తే ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అదీ కాక వాటిని నమ్ముకుంటే మరోచోట ఇక్కడి కంటె ఎక్కువ లాభం కనపడితే తుర్రుమంటాయి. అపుడు వాటిమీద ఆధారపడి వేసుకున్న పధకాలు నష్టపోతాయి. అందువలన హాట్ మనీని చైనా అడ్డుకుంటుంది. కాని ఇండియా పరిస్ధితి అది కాదు. హాట్ మనీ రాకుండా అడ్డుకునేంతగా పెట్టుబడులు ఇక్కడకి రావడం లేదు. పైగా ఎఫ్.ఐ.ఐ లను కూడా భొట్టుపెట్టి పిలుస్తున్నారు. అవొస్తే చూశారా పెట్టుబడులు పెరిగాయి అని కూడా చెప్పుకుంటున్నారు. అలాంటి ఇండియా, చైనా వృద్ధి రేటును అధిగమించాలన్న పోటీ పక్కన బెట్టడం ప్రస్తుతానికి ఉత్తమం.

జిడిపి వృద్ధి రేటు ఎందుకు తగ్గిందన్న ప్రశ్నకు మళ్ళీ వస్తే, కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగిన రాష్ట్రాల ఎన్నికల వలన నూతన ఆర్ధిక విధానాల అమలుకు సంబంధించిన చర్యలను వాయిదా వేసుకుంది. ఎందుకంటే నూతన ఆర్ధిక విధానాలు ప్రజలప్రయోజనాలకి వ్యతిరేకం గనక. నూతన ఆర్ధిక విధానాలను అమలు చేయడం వలన ప్రజల ఓట్లు తగ్గుతాయన్న తెలివిడి ప్రభుత్వానికి ఉందంటే దానర్ధం అవి ప్రజలకు నష్టం చేస్తున్నాయని తెలుసుకోబట్టే కదా. మరి ప్రజలకు నష్టం చేసే విధానాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పూనుకుంటోంది? ఇది అసలు ప్రశ్న. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పెట్రోలు రేటును ఎన్నడూ లేనంతగా 5 రూ. కి పైనే పెంచింది ప్రభుత్వం. పెట్రోలుపై కంట్రోలు ఎత్తివేసిన ఫలితమిది.

కంట్రోలు ఎత్తివేత నూతన ఆర్ధిక విధానాల్లో భాగం. కొద్ది రోజుల్లో డీజెల్, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచబోతున్నారు. దాని కోసం మీటింగులు కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా కంట్రోలు ఎత్తివేయడం, ధరలు పెరగడానికి అనుమతించడం, గిరిజనుల జీవనాధారమైన అటవీ భూముల్ని బాక్సైట్ తవ్వకాలకి వేదాంత కంపెనీకి ఇచ్చెయ్యడం, ఒరిస్సాలో ప్రజల భూముల్ని పోస్కో కంపెనీకి తక్కువ రేటుకి ఇచ్చెయ్యడం, అడ్డుపడిన ప్రజలను పోలీసులతో కాల్పించి, కుళ్ళబొడిచి, ఎక్కడ లేని నల్ల చట్టాలు మోపి, జైల్లో కుక్కి అడ్డు తొలగించడం… ఇవీ నూతన ఆర్ధిక విధానాలు. ఇవి లేటైనందున భారత ప్రభుత్వానికి పెరాలిసిస్ వచ్చిందని రాయడానికి కూడా రాయిటర్స్ సంస్ధ సిద్ధమైపోయింది.

కనుక ఏతా వాతా తేలేదేమిటంటే భారత దేశ ఆర్ధిక వృద్ధి రేటు పెరగడం అంటే, భారత దేశ సహజ వనరులను బహుళజాతి సంస్ధలకు అప్పజెప్పడం. అలా అప్పజెప్పినప్పుడు ప్రజలు ఊరుకోరు గనక వారిపైన కేసులు బనాయించి జైళ్ళకు పంపడం, వీలైతే అక్కడికక్కడే కాల్చి వేయడం. పెట్టుబడుల పెద్ద ఎత్తున దేశంలోకి రావడం అంటే ఇండియాలో భూముల్ని, ఖనిజ వనరుల్నీ పెట్టుబడుల అధిపతులైన బహుళజాతి సంస్ధలకు పెద్ద ఎత్తున అప్పజెప్పడం, ఆ భూముల్లొ నివసిస్తున్న వారికి నష్టపరిహారం పేరుతో అంతో ఇంతో పడేసి వినక పోతే పోలీసుల్తో ఖాళీ చేయించడం. ఇటువంటి ఆర్ధిక (జిడిపి) వృద్ధి రేటు భారత ప్రజలకు అవసరమా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s