ఆల్-ఖైదా, పాక్‌ నేవీ ల సంబంధాలు వెల్లడించిన పాక్ విలేఖరి దారుణ హత్య


Saleem Shahzad

ఐ.ఎస్.ఐ చేతిలో హతుడైనాడని భావిస్తున్న సలీం షాజద్

(విలేఖరి పరిశోధన అనంతరం తన మరణానికి ముందు రాసిన ఆర్టికల్ అనువాదం దీని తర్వాత పోస్టులో చూడండి)

పాకిస్తాన్ గూఢచార సంస్ధకు ఆల్-ఖైదా, తాలిబాన్ లాంటి సంస్ధలతో దగ్గరి సంబంధాలున్నాయని భారత ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఒసామా హత్య తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఒసామా పాక్‌లో తలదాచుకోడానికి కారణం పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లతో మిలిటెంట్ సంస్ధలకు సంబంధాలుండడమే కారణమని అమెరికా కూడా ఆరోపించింది. ఆ తర్వాత పాక్ మంత్రి మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల క్రింది స్ధాయి ఉద్యోగులకు మిలిటెంట్లతో సంబంధాలు ఉంటే ఉండొచ్చని పాక్షికంగా అంగీకరించాడు. పాకిస్ధాన్ నౌకా దళాల్లోకి కూడా ఆల్-ఖైదా బాగా చొచ్చుకొని పోయిన విషయాన్ని ఏసియా టైమ్స్ ఆన్ లైన్ ఇన్‌ఛార్జిగా ఉన్న సలీం షాజద్ అనే విలేఖరి పరిశోధించి వెల్లడించడంతో ఆయన దారుణంగా హత్యకు గురయ్యాడు. మే 22 తేదీన ఆల్-ఖైదా మిలిటెంట్లు కరాచీలోని నౌకాదళ స్ధావరంపై దాడి చేసి 14 మంది నౌకా దళ సభ్యులను చంపడంతో పాటు రెండు అత్యాధునిక విమానాలను ధ్వంసం చేయడమే కాక దాడి చేసిన ఆరుగురిలో ఇద్దరు తప్పించుకున్నారు. ఈ దాడికి కారణం నౌకాదళంలోకి ఆల్-ఖైదా చొచ్చుకు పోవడమే కారణమనీ, లోపలి వారి సహాయంతోనే మిలిటెంట్లు దాడి చేసి అధిక నష్టాన్ని కలుగజేసి ఇద్దర్ని తప్పించగలిగారని షాజహాద్ లోతైన వివరాలతో మే 27 తేదీన వార్త ప్రచురించాడు.

షాజద్ ఆర్టికల్స్ పట్ల ఆగ్రహం చెందిన ఐ.ఎస్.ఐ అతన్ని బెదిరించినట్లుగా గతంలో ఇతర విలేఖరులకు చెప్పిన విషయం వెల్లడయ్యింది. ఆదివారం నాడు కిడ్నాప్‌కి గురైన షాజహాద్ మంగళవారాని కల్లా శవమై కనిపించచాడు. అతని మరణానికి కారణంగ చాలామంది ఐ.ఎస్.ఐనే వేలెత్తి చూపిస్తున్నారు. కిడ్నాప్‌కి గురయ్యాక షాజద్ గురించి వెతుకుతుండగా హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధకి చెందిన పరిశోధకుడొకరు షాజహాద్ ఐ.ఎస్.ఐ కస్టడీలో ఉన్నాడన్న విశ్వసనీయ సమాచారం లభించిందని చెప్పాడు. ఇంతలోనే షాజహాద్ శవం ఉత్త్తర గుజరాత్ జిల్లాలోని మండి బహాఉద్దీన్ కాలవలో లభ్యమైంది. అతని శరీరంపై 15 చిత్రహింసలు పెట్టిన ఆనవాళ్ళు లభించాయని పోస్టుమార్టం రిపోర్టు తెలిపింది. బుల్లెట్ గాయాలేవీ కనిపించలేదు. గుండెపై బలమైన దెబ్బ తగలడం వలన మరణించి ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు. షాజహాద్ అంతిమ యాత్ర బుధవారం జరగనుంది. టెర్రరిస్టులకు, ఐ.ఎస్.ఐకి సంబంధాలున్నాయని ఆరోపణలు తీవ్రంగా వస్తున్న నేపధ్యంలో విలేఖరి హత్య అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. పాక్ ప్రభుత్వం సవివరమైన దర్యాప్తుకి ఆదేశించింది.

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ విలేఖరి హత్యను ఖండించింది. షాజద్ రిపోర్టులద్వారా టెర్రరిజం వలన పాకిస్ధాన్ స్ధిరత్వానికి ఎంతగా నష్టం చేస్తున్నదీ తెలియజెప్పిందని కొనియాడింది. పనిలో పనిగా పాక్ ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించడం పట్ల కూడా సంతోషం ప్రకటించింది. వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ ని అమెరికా రప్పించి జైల్లో పెట్టడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను గూడా క్లింటన్ ఖండించినట్లయితే ఆమె ఖండన ప్రకటన అర్ధవంతంగా ఉండేది. జులియన్ అస్సాంజ్‌కి అమెరికా రాయబారులు వివిధ దేశాల్లో జరిపిన గూఢచర్య కార్యకలాపాల రిపోర్టులను అందజేసాడన్న ఆరోపణలతో అమెరికా సైనికుడు బ్రాడ్లీ మేనింగ్‌ని అమెరికా ప్రభుత్వం దాదాపు సంవత్సరం పాటు ఒంటరిగా సాలిటరీ కన్‌ఫైన్‌మెంటులో పడేసి చిత్ర హింసలు పెట్టింది. ఎవర్నీ కలవకుండా ఆంక్షలు విధించింది. ప్రతిరోజూ రాత్రి బట్టలన్నీ పూర్తిగా విప్పించి నగ్నంగా పడుకోబెట్టింది. రోజుకు ఒక్క గంట మాత్రమే చీకటి సెల్‌నుండి బైటికి అనుమతించింది. చివరికి ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తానొక్కడే మేనింగ్‌ని కలిసి మాట్లాడలని కోరినప్పటికీ అమెఇకా ప్రభుత్వం అనుమతి నిరాకరించి వారి సమావేశానికి కాపలా పెట్టింది. సమితి ప్రతినిధి తీవ్రంగా నిరసించడంతో గత నెలలోనే బ్రాడ్లీ మేనింగ్ ని మెరుగైన జైలుకి తరలించింది. ఇక గ్వాంటెనామో జైలు హింసల సంగతి చెప్పనవసరం లేదు.

అటువంటి అమెరికా పాక్ విలేఖరి హత్యను ఖండించడం విడ్డూరం. నిజానికి ఐ.ఎస్.ఐ సంస్ధ సి.ఐ.ఏ పెంపుడు పుత్రిక. సి.ఐ.ఏ కి ఉన్న అమానవీయ లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్న సంస్ధ ఐ.ఎస్.ఐ. అటువంటి ఐ.ఎస్.ఐ కీ టెర్రరిస్టులకీ సంబంధాలుండడం అంటే ఐ.ఎస్.ఐ తాతకు దగ్గులు నేర్పే స్ధాయికి ఎదిగినట్లేనని అర్ధం చేసుకోవాలి. “నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా” అంటూ అమెరికా ఉరఫ్ సి.ఐ.ఏ పాఠాలను దానికి అప్పజెబుతోంది ఐ.ఎస్.ఐ. సామూహిక మారణాయుధాలున్నాయని అబద్ధపు ఆరోపణలతో చంపిన సద్దాం హుస్సేన్ అమెరికా ప్రాపకంతో ఎదిగిన వాడే. ప్రపంచ టెర్రరిస్టు నాయకుడుగా ఎదిగిన ఒసామా బిన్ లాడెన్ ను ఆస్ధాయికి తెచ్చింది అమెరికానే. ఆఫ్ఘన్ యుద్ధ ప్రభువులందరినీ మట్టి కరిపించి తాలిబాన్ ఆఫ్ఘన్ అధికారం సంపాదించగలిగిందీ పాక్, అమెరికాల సాయంతోనే.

ఈజిప్టుని నలభై ఏళ్ళు ఉక్కుపాదంతో పాలించిన ముబారక్ పోషకురాలు అమెరికానే. ట్యునీషియా నియంతకు అండదండలిచ్చి నిలిపింది అమెరికా, ఫ్రాన్సులే. గడ్డాఫీ గత ఐదు సంవత్సరాలుగా అమెరికా, యూరప్ లతో జట్టుకట్టినవాడే. ఇప్పుడు బహ్రెయిన్, యెమెన్ నియంతలు ప్రజల ప్రజాస్వామిక ఆందోళనలను క్రూరంగా అణిచి వేస్తున్నా ఒక్క మాట మాట్లాడకుండా ఆమోదిస్తున్నది అమెరికా, యూరప్ లే. అటువంటి అమెరికా ఒక్క విలేఖరి హత్యను అదీ పాక్ ప్రభుత్వం చేసిన హత్యను ఖండించడం విలేఖరిపైనా, జర్నలిజం వృత్తిపైనా ఉన్న గౌరవం ఎంతమాత్రం కాదు. లాడెన్ హత్య, లాడెన్ కీ పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లకూ సంబంధాలున్నాయని కొత్తగా ఎత్తుకున్న తన రాగానికి షాజహాద్ రిపోర్టులు బలం చేకూర్చినందునా, ఆ సందర్భాన్ని సొమ్ము చేసుకుంటూ, పాక్ ప్రజల సానుకూలతను సంపాదించడానికే ఈ పరామర్శలూ, ఖండనమండనలు.

షాజహాద్ విస్తృతంగా పరిశోధించి కొన్ని సంచలనాత్మక విషయాలను మే 27 తేదీన ఏసియా టైమ్స్ లో వెల్లడించాడు. ఆయన రిపోర్టు ప్రకారం పాకిస్ధాన్ నౌకాదళాల్లోకి ఆల్-ఖైదా బాగా చొచ్చుకొని పోయింది. ఈ సంగతి అనుమానించిన ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆల్-ఖైదా సెల్ ఒకటి నౌకా దళంలో పనిచేస్తున్నదని కనుగొని కొందరిని అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసి సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలోనే నిర్బంధించి విచారించడానికి సిద్ధపడుతుండగా ఆల్-ఖైదా నుండి ఫోన్ వచ్చింది. ఆల్-ఖైదాతొ సంబంధాలున్నాయంటూ అనుమానించి నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు అంగీకరించలేదు. అరెస్టు చేసిన వారిని విచారించి ఆల్-ఖైదా నౌకాదళంలోకి ఎంతవరకూ విస్తరించిందీ తెలుసుకోవాలనేది నౌకాదళ అధికారుల ప్రయత్నం. విచారణ జరిపితే నౌకాదళంలోని కేడర్ అంతా కోల్పోతామని ఆల్-ఖైదా ఆందోళన పడించి. కొంత చర్చ జరిగాక అరెస్టు చేసిన వారిని విచారించి ఆ తర్వాత వారిని ఉద్యోగాలనుండి తొలగించి వదిలేస్తామని పాక్ నౌకాదళ అధికారులు ప్రతిపాదించారు.

అది కూడా ఆల్-ఖైదా కి నచ్చలేదు. నిరసనగా ఓ బస్సుని పేల్చివేయడంతో తొమ్మిదిమంది మరణించారు. అధికారులు విచారణ కొనసాగించడంతో మే 22 తేదీన కరాచిలోని నౌకాదళ స్ధావరంపై ఆరుగురు (అధికారుల అంచనా) దాడి చేసి తీవ్ర నష్టం కలిగించారు. అనధికారిక సమాచారం ప్రకారం పదిమంది దాడి చేసి ఆరుగురు తప్పించుకుపోగా నలుగురు చనిపోయారు. కరాచి స్ధావరం నిజానికి అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న స్ధావరం. అలాంటి స్ధావరంలోకి జొరపడడానికి లోపలి వారి సాయం లేకుండా జరగదు. లోపలి వారు ఇచ్చిన మ్యాపుల సాయంతో ఈ దాడి జరిగిందని షాజహాద్ తన రిపోర్టులో వెల్లడించాడు. మొదటి భాగం ప్రచురితం కాగా రెండో భాగం ప్రచురితం కావలసి ఉంది. ఈ లోగా ఐ.ఎస్.ఐ కిడ్నాప్ చేసి చంపేసిందని ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది. అయితే ఐ.ఎస్.ఐ మాత్రం తనపై ఆరోపణలని ఖండించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s