ప్రపంచ దేశాల్లొ ప్రస్తుతం కొనసాగుతున్న ఆహార పంపిణీ వ్యవస్ధలే పేదల్ని ఆకలి చావులకు గురి చేస్తున్నదని చారిటీ సంస్ధ ఆక్స్‌ఫాం కుండ బద్దలు కొట్టింది. ప్రపంచ ఆహార వ్యవస్ధ కేవల కొద్దిమంది కోసమే పని చేస్తున్నదని, మిగిలిన వారందరికీ అది విఫల వ్యవస్ధగా మారిందనీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫాం పేర్కొంది. ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధ, ఆహారాన్ని వినియోగించే బిలియన్ల మంది ప్రజలకు తాము ఏమి కొంటున్నదీ, ఏమి తింటున్నదీ అన్న అంశాలపై సరిపోయినంత అధికారం, విజ్ఞానం లేకుండా చేస్తున్నదనీ మంగళవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొన్నది. ఈ వ్యవస్ధ వలన చిన్న ఉత్పత్తిదారుల్లో అతి పెద్ద మెజారిటీకి అధికారం లేకుండా చేస్తూ, వారి ఉత్పాదకతా శక్తిని నిర్వీర్యం చేస్తున్నదని ఆక్స్‌ఫాం పేర్కొన్నది. ఈ సంస్ధ విడుదల చేసిన తాజా నివేదిక స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాలను ప్రభోధిస్తున్నవారికి చెంప పెట్టులాంటిది.
అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగంలో ఉన్న బహుళజాతి సంస్ధలకు అక్కడి ప్రభుత్వాలు పెద్ద మొత్తంలొ సబ్సిడీలు ఇస్తుండడంతో వారి ఉత్పత్తులు ఇండియాలాంటి దేశాల్లోని వ్యవసాయదారుల ఉత్పత్తులను మార్కెట్ నుండి నెట్టివేస్తున్నాయి. ప్రభుత్వాల సబ్సిడీలతో చౌకగా అందే ఉత్పత్తులతో, ఎటువంటి సబ్సిడీలు పొందకుండా లేదా అతి తక్కువ సబ్సిడీలతొ భారత వ్యవసాయదారుల్లాంటి వారు చేసే ఉత్పత్తులు పోటీపడ లేక పోతున్నాయి. పైగా తమ బహుళజాతి సంస్ధల ప్రయోజనాల కోసం అమెరీకా నాయకత్వంలొని పశ్చిమ దేశాలు భారత్ లాంటి మూడో ప్రపంచ దేశాలపై నూతన ఆర్ధిక విధానాలను రుద్దుతూ రైతులకిచ్చే స్వల్ప సబ్సిడీలను సైతం ఎత్తివేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే పేరుతో పశ్చిమ దేశాల వత్తిడికి తలొగ్గిన భారత ప్రభుత్వం నూతన ఆర్ధిక విధానాలను అమలు చేస్తూ రైతులకి ఇస్తున్న సబ్సిడీలను తగ్గించి వేస్తున్నారు. ఎరువుల సబ్సిడీలను నామ మాత్రం చేస్తున్నారు. విత్తనాలను కూడా బహుళజాతి సంస్ధల విత్తనాలపై ఆధారపడే స్ధితికి తెచ్చారు. దానితో భారత రైతులకు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయం నష్టకరంగా పరిణమించింది. అటువంటి పరిస్ధితుల్లో సైతం ఆశచావని రైతులు పంటలు పండించి దళారుల దెబ్బకి సరైన అందక అప్పులు తీర్చలేని పరిస్ధితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రైతుల ఆత్మహత్యలకూ, కోట్లమంది ఆకలి బాధలకూ అధికారం చేతిలో ఉంచుకున్న బహుళజాతి సంస్ధలూ, వారికి సేవచేసే పాలకుల విధానాలే కారణమని ఆక్స్‌ఫాం నివేదిక నిర్ద్వంద్వంగా నిరూపించింది. “వ్యవస్ధాగత వైఫల్యం అనేది ప్రభుత్వాల వైఫల్యం నుండే సంభవిస్తుంది. ప్రభుత్వాలు తమ బాధ్యతలను -నియంత్రణ, సవరణ, సంరక్షణ, నివారణ, పెట్టుబడుల సమకూర్పు- నిర్వహించడంలో విఫలమవుతున్నాయి. అంటే కంపెనీలు, ఇంటరెస్టెడ్ గ్రూపులు, వ్యవస్ధ ఉన్నత స్ధానాల్లో ఉన్నవారు వనరులను కొల్లగొట్టడమే కాకుండా ఫైనాన్సు (పెట్టుబడి), విజ్ఞానం (సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆధునిక యంత్ర పరికరాలు), ఆహారాల లక్ష్య దిశను మార్చగలుగుతున్నారు” అని నివేదిక పచ్చి నిజాన్ని వెల్లడించింది. దానర్ధం బహుళజాతి వ్యాపార సంస్ధలు అభివృద్ధి చెందిన దేశాలలో అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకోవడమే కాకుండా, ఆ అధికారంతో మూడవ ప్రపంచ దేశాల్లోని అధికార స్ధానాల్ని కూడా ప్రభావితం చేస్తూ ప్రపంచ వ్యాపితంగా ఉన్న సహజ వనరులైన భూమి, మానవ వనరులు లాంటివాటిని తమ అధీనంలో ఉంచుకోగలుగుతున్నాయి. వ్యవసాయరంగంలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తమ ఆధీనంలో ఉంచుకుని మూడో ప్రపంచ దేశాల్లోని చిన్న ఉత్పత్తిదారులైన రైతులకు దాన్ని అందకుండా ప్రభుత్వ అధికారం ద్వారానే అడ్డుకుంటున్నారు. దానితో చిన్న కమతాల వ్యవసాయదారుల ఉత్పాదక శక్తిని పెరగకుండా అడ్డుకోగలుగుతున్నారు. ఆ పరిస్ధితి అంతిమంగా చిన్నకమతాల వలననే వ్యవసాయ ఉత్పత్తి పెరగడం లేదనో లేదా తగ్గుతున్నదనో తప్పు అభిప్రాయాలను ప్రచారంలోకి రావడానికి దోహదపడింది. ఆ ప్రచారం కూడా బహుళ జాతి సంష్దలకి చెందిన కార్పొరేటు పత్రికా సంస్ధలే చేశాయన్నది నిర్వివాదాంశం.
ఈ నేపధ్యంలో సంక్షోభం మరింత తీవ్రమవుతున్న నూతన యుగంలోకి ప్రపంచంవెళ్తోందని నివేదిక స్పష్టం చేసింది. ఆహార ధరలు అందనంత ఎత్తుకు చేరుకోవడం, వరదలు తుఫానుల్లాంటి వినాశకరమైన వాతావరణ ఘటనలు, ద్రవ్య వ్యవస్ధ సంక్షోభాలు, ఆ సంక్షోభాలు ప్రపంచ వ్యాపితంగా విస్తరించడం… ఇవన్నీ ఆ నూతన యుగ లక్షణాలేనని నివేదిక పేర్కొన్నది. ఇటువంటి ప్రతి పరిణామం వెనకా కప్పిఉంచబడీన సంక్షోభాల వెల్లువ దాగి ఉందని పేర్కొన్నది.
మెల్లగానైనా స్ధిరంగా సంభవిస్తున్న వినాశకర వాతావరణ మార్పులు, పెరుగుతున్న అసమానతలు, ఎంతకీ తీరని మొండి ఆకలి బాధలు, సహజ వనరులు హరించుకుపోవడం ఇవన్నీ నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల వెనుక ఉన్నాయని నివేదిక పేర్కొన్నది. ఆక్స్‌ఫాం సంస్ధ సిబ్బంది ప్రపంచ వ్యాపితంగా ఉన్న అనేక భాగస్వామ్య సంస్ధలతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఇప్పటి ఆహార పంపిణీ వ్యవస్ధ సంక్షోభం వ్యవస్ధ ఫెళుసుదనానికీ కారణమవడంతో పాటు ఆ ఫెళుసుదనానికి తానే ఎలా ప్రభావితమవుతున్నదీ నిరూపితమయిందని నివేదిక పేర్కొన్నది. ఈ సంక్షుభిత పరిస్ధితి 21 వ శతాబ్దంలో 925 మిలియన్ల (92.5 కోట్లు) మందిని ఆకలి బాధితులుగా మిగిల్చిందిన తేల్చింది.
రానున్న ఇరవై సంవత్సరాల్లో (2030 నాటికి) ఆహార ధరలు 120 నుండి 180 శాతం వరకూ (రెట్టింపు కంటే ఎక్కువ) పెరుగుతాయని, ఓ భయానక దృశ్యాన్ని ప్రజలు ప్రభుత్వాల ముందు ఉంచింది. గత ఇరవై సంవత్సరాల్లో ఆహార ధరలు రెట్టింపు అయ్యాయనీ అవి 120 నుండి 180 శాతం వరకూ వచ్చే ఇరవై సంవత్సరాల్లో పెరగడమంటే ధరగల పెరుగుదల రేటు వేగవంతమైందన్న విషయాన్ని వివరిస్తున్నదని నివేదిక తెలిపింది. ఆహార పంపిణీ వ్యవస్ధను ప్రజలకు అనుగుణంగా మార్చవలసిన అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పింది. 2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లకు చేరుకుంటుందనీ, కానీ 1990 తో పోలిస్తే ఆహార ఉత్పాదకత సగానికి పడిపోయిందనీ తెలిపింది. చిన్న కమతాల రైతులకు వ్యతిరేక పరిస్ధితులు అభివృద్ధి చెందడమే ఈ ఉత్పాదకత తరుగుదలకు కారణమని తేల్చి చెప్పింది. సంస్ధ పరిశోధనలో ప్రపంచంలోని పేదలు తమ ఆదాయాల్లో 80 శాతం ఆహారం మీదనే ఖర్చు పెడుతున్నారని తేలింది. ఉదాహరణకి ఫిలిఫ్ఫైన్సు లో ఇంగ్లండు ప్రజలు ఆహారం కోసం తమ ఆదాయంలో పెడుతున్న భాగం కంటే ఫిలిఫ్ఫైన్సు ప్రజలు పెడుతున్న భాగం నాలుగు రెట్లు ఉన్నదని తెలిపింది. అంటే ఫిలిఫ్ఫైన్సు లో ఆహరం కోసం 80 శాతాన్ని ఖర్చు చేస్తే ఇంగ్లండు ప్రజలు తమ ఆదాయంలో 20 శాతం ఖర్చు పెడితే తమ ఆహర అవసరాలు తీర్చుకోగలుగుతున్నారని అర్ధం.
ప్రపంచంలో ఆహర భద్రత తీవ్ర స్ధాయిలో కొరవడిన ప్రాంతాలు నాలుగింటిని ఆక్స్‌ఫాం గుర్తించింది. ఆ నాలుగింటిలో ఇండియా ఉండడం భారత దేశ ఆరు దశాబ్దాల స్వతంత్ర ప్రగతిని సూచిస్తుంది. ఆ నాలుగు హాట్‌స్పాట్ లను ఆక్స్‌ఫాం ఈ విధంగా పేర్కొన్నది:
- గ్వాటెమాల దేశంలో 865,000 మంది ఆహరం భద్రత లేని స్ధితిలో ఉన్నారు. చిన్న కమతాల రైతుల కోసం ప్రభుత్వం నుండి ఏమాత్రం మద్దతు లేకపోవడం ఈ స్ధితికి కారణం. ఈ రైతులు స్వయంగా విదేశాలనుండి దిగుమతి చేసుకునే ఆహారంపై అధికంగా ఆధారపడి ఉన్నారు.
- బ్రిటన్ ప్రజలు తమ ఆహారం కోసం తమ ఆదాయంలో ఖర్చు పెడుతున్న భాగం కంటే, ఇండియా ప్రజలు రెట్టింపు భాగాన్ని తమ ఆదాయంలో ఖర్చు పెడుతున్నారు. సగటున లీటరు పాలకు భారతీయులు 10 పౌండ్లు (రు. 7428 లు) ఖర్చు పెడుతుంటే కిలో బియ్యానికి 6 పౌండ్లు (రు. 446 లు) సగటున ఖర్చు పెడుతున్నారు. (లీటర్ పాలు ఇండియాలో రు. 7428 లు కాదుగదా అని అనుమానం రావచ్చు. ఇది సగటు వెల అని గుర్తించాలి. అంటే పాలు కొని తాగగలుగుతున్నవారి కంటే పాలు కొనలేని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నదని అర్ధం. అలాగే బియ్యం విషయంలో కూడా. -బ్లాగర్).
- అజర్‌బైజాన్ దేశంలో గోధుమ ఉత్పత్తి గత సంవత్సరం వాతావరణం అనుకూలించక 33 శాతం పడిపోయింది. దానితో రష్యా, కజకిస్ధాన్ ల నుండి గోధుమలను దిగుమతి చేసుకోక తప్పలేదు. ఫలితంగా డిసెంబరు 2009 తో పోలిస్తే డిసెంబరు 2010 లో ఆహార ధరలు 20 శాతం పెరిగాయి.
- తూర్పు ఆఫ్రికా దేశాల్లో 8 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర (క్రానిక్) ఆహార కొరతని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. వీరిలో మహిళలు, పిల్లలు అధికంగా ఉండడం గమనించాలి.
విఫల ఆహార పంపిణీ వ్యవస్ధ (broken food system) వలన ఆకలితో పాటు, ఒబేసిటీ (తిండి ఎక్కువై బరువు, లావు పెరగడం), గర్హనీయమైన ఆహార వృధా, దారుణమైన పర్యావరణ క్షీణత కూడా సంభవిస్తున్నాయని ఆక్స్‌ఫాం నివేదిక ఎత్తి చూపింది. “ఎవరు తినాలి, ఎవరు తినగూడదు” అన్న దాన్ని నిర్ణయిస్తున్నవాటిలో అధికారానిది మొదటి స్ధానానిదని ఆ నివేదిక గుర్తించింది. అంటే ప్రభుత్వాల అధికారాలు ప్రజలకు తిండిని అందించడానికి బదులు వారినుండి దూరం చేయడానికి వినియోగపడుతున్నాయని అర్ధం చేసుకోవచ్చు. “వ్యవస్ధలో చాలా కొద్ది మంది చేత ఆ కొద్ది మంది కోసమే ఈ వ్యవస్ధ నిర్మించబడింది. ఆ వ్యవస్ధ ప్రధాన లక్ష్యం ఆ కొద్దిమందికి లాభాలను సమకూర్చి పెట్టడమే” అని ఆక్స్‌ఫామ్ నివేదిక నగ్న సత్యాన్ని విప్పి చెప్పింది. అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తి కంపెనీలకూ, కమోడిటీ మార్కెట్లతో కేసినో క్లబ్బుల్లాగా ఆడుకోగల శక్తివంతమైన పెట్టుబడిదారులకు ఇస్తున్న అత్యధిక సబ్సిడీలను నివేదిక ఎత్తి చూపింది. పెద్ద పెద్ద వ్యవసాయ రంగ వ్యాపార సంస్ధలు నేటి ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధలో అత్యంత వినాశకారులుగా తయారయ్యాయని వివేదిక కుండ బద్దలు కొట్టింది.
పేదలు ఆకలి బారిన పడకుండా ఉండటానికీ, ఆహార మార్కెట్లను సక్రమంగా నడపడానికీ ప్రపంచ దేశాలు నూతన నియమనిబంధనలను ఆమోదించాలని నివేదిక కోరింది. అదే కోణంలో నాలుగు సూత్రాలను పేర్కొన్నది.
- కమోడిటీల మార్కెట్లలో పారదర్శకతను పెంపొందించాలి. ఫ్యూచర్స్ మార్కెట్లను సక్రమంగా నియంత్రించాలి.
- ఆహార నిల్వలను బాగా పెంచాలి.
- బయో ఇంధనాల విధానాలకు స్వస్తి పలకాలి. (ఆహార పంటలను బయో ఇంధనం తయారీకి తరలించడం పశ్చిమ దేశాల్లో పెరిగింది -బ్లాగర్)
- చిన్న కమతాల వ్యవసాయదారుల రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. ముఖ్యంగా మహిళా రైతులకు ప్రభుత్వం పెట్టుబడులు అందుబాటులో ఉంచాలి.
ఆక్స్‌ఫాం సూచించిన పరిష్కార మార్గాలు కమోడిటీ మార్కెట్లలో, ఫ్యూచర్స్ మార్కెట్లలో పెద్ద పెద్ద వ్యవసాయ సంస్ధలు పాల్పడుతున్న మోసాలను ఎత్తి చూపాయి. షేర్ మార్కెట్ల కార్యకలాపాలను తమకు మాత్రమే అర్ధం అయ్యేంత క్లిష్టంగా ఉంచుతూ మోసపూరిత పద్దతుల్లో అధిక లాభాలు అర్ధిస్తున్నాయన్న నిజాన్ని విప్పి చూపింది. పశ్చీమ దేశాలు ఆహార పంటలను పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా ఉన్న బయో ఫ్యూయల్ తయారీకి తరలిస్తున్న సంగతిని కూడా వెల్లడి చేసింది. పాఠకులకు గుర్తుంటే గత సంవత్సరం అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ తో పాటు ఇతర అమెరికా, యూరప్ అధికారులు ప్రపంచంలో ఆహార కొరత ఏర్పడి, ఆహార భద్రత లేకుండా పోవడానికి కారణం భారత దేశం లాంటి మూడో ప్రపంచ దేశాల్లొ ప్రజలు అధికంగా తినడమే కారణమని కారుకూతలు కూశారు. వాస్తవానికి కొరతకు కారణం పశ్చీమ దేశాల ప్రభుత్వాలు ఆహర పంటలైన గోధుమ, మొక్కజొన్న, వరి ఉత్పత్తులను బయోఇంధనం తయారీకి తరలించడం ఎక్కువ కావడమే. ఆ విషయాన్ని మరుగుపరచడానికి ఇండియన్లు, ఆఫ్రికన్లు ఎక్కువ తింటున్నారని ప్రచారం ప్రారంభించారు. అసలు తిండికి లేక చస్తుంటే ఎక్కువ తింటున్నారని ప్రచారం చేసేటంత అమానుష ప్రచారం ఒక్క బహుళజాతి సంస్ధలు, వారి మానస పు(ప)త్రికలు మాత్రమే చేయగలవు.
ఆక్స్‌ఫాం తాజా నివేదిక బహుళజాతి వ్యవసాయ కంపెనీల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించేదిగా ఉంది. ఇప్పటిదాకా మూడో ప్రపంచ దేశాల్లో వ్యవసాయ సబ్సిడీలవలన నష్టం జరుగుతున్నదని అవి ప్రచారం చేస్తూ వచ్చాయి. తాము స్వయంగా అత్యధిక సబ్సిడీలు పొందుతూనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్వల్ప స్ధాయిలో ఉన్న వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేయాలని వాదిస్తూ వచ్చాయి. వీరి అబద్ధాల గుట్టును ఈ నివేదిక రట్టు చేసింది. అసలు సబ్సిడీలు మెక్కుతున్నది పెద్ద పెద్ద వ్యవసాయ కంపెనీలేనని తేల్చి చెప్పింది. ఈ సంస్ధలే అధికారాల్నీ, పెట్టుబడుల్నీ గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచంలో ఆకలి బాధలకూ, దరిద్రానికీ కారణమవుతున్నాయని ఉదాహరణలతో సహా నిరూపించింది. బహుళజాతి సంస్ధ లాభాపేక్ష, దురాశలే ఆహర భద్రతకు ఆటంకంగా ఉన్నాయని వివరించింది. ప్రపంచ వ్యాపితంగా ఉన్న చిన్న కమతాల రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం అత్యవసరమనీ అది అందితే వారి ఉత్పాదకత అనేక రెట్లు పెరుగుతుందనీ వివరించింది. చిన్న కమతాలే వ్యవసాయ అభివృద్ధికి, తదనంతరం పారిశ్రామికి అభివృద్ధికీ ఆటంకం అని జరుగుతున్న ప్రచారం దుష్ప్రచారమేనని తేల్చింది. అటువంటి పచ్చి నిజాలను ప్రపంచానికి వెల్లడించడం ఆ కంపెనీలు ససేమిరా ఇస్టపడవు. ఆ నివేదికలు తప్పని చెప్పడానికి అనేక దుష్ప్రచారాలను ప్రారంభిస్తాయి. పచ్చి అబద్ధాలు కొత్తగా ప్రచారంలోకి తెస్తాయి.
వివేదిక వెలువడింది మంగళవారం మే 31 తేదీన. అప్పుడే బిబిసి ‘టుడే’ ప్రోగ్రాంలో ఆక్స్‌ఫాం నివేదిక నిర్ధారణలను సవాలు చేస్తూ ఓ బహుళజాతి సంస్ధ ఫండ్ మేనేజర్ మాట్లాడింది. లీడింగ్ ఫండ్ మేనేజర్ గా బిబిసి పేర్కొన్న ఆమె పేరు నికోలా హార్లిక్. బిబిసి లో మాట్లాడుతూ చిన్న కమతాల రైతులకు ప్రాముఖ్యం ఇవ్వాలన్న నిర్ధారణను సవాలు చేసింది. ఈ సంస్ధ బ్రెజిల్ లో భూముల్ని పెద్ద మొత్తంలో గుత్తకి తీసుకుని పెట్టుబడులు పెట్టింది. యాంత్రికీకరణ చెందిన పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నదనీ, వాటిపై ఆధారపడి మరికొన్ని పరిశ్రమలు కూడా ఏర్పడతాయనీ నమ్మజూపింది. ప్రపంచం మొత్తానికి తిండి పెట్టడానికి చిన్న రైతులపై ఆధారపడలేము అని ఉక్రోషపడింది. వ్యవసాయం జరగనటువంటి భూములు పెద్ద మొత్తంలో వృధాగా పడి ఉన్నాయి. వీటిల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రవహిస్తాయి అని ఆమే చెబుతొంది.
అయితే నికోల హార్లిక్ కూడా తెలిసో తెలియకో ఒక పచ్చి నిజాన్ని చెప్పింది. వ్యవసాయ వినియోగంలో లేని భూములు పెద్ద మొత్తంలొ పడి ఉన్నాయన్నదె ఆ నిజం. భారతదేశానికి ఇది బాగా వర్తిస్తుంది. చిన్న కమతాల రైతుల చేతుల్లో లేకుండా అంత పెద్ద భూములు ఖాళీగా ఎందుకు పడి ఉన్నాయన్నది అసలు ప్రశ్న. సమాధానం స్పష్టమే. ఖాళీ భూములు, బంజరు భూములతో పాటు వ్యవసాయ భూములు సైతం భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం వలనే అవి ఖాళీగా పడి ఉన్నాయి. వాటిని కొత్తగా రియల్ ఎస్టేట్ రంగానికి వినియోగించడానికి పెట్టుబడిదారులు ప్రయత్నిస్తుండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చి ఎవరికీ అందకుండా పోయాయి. అలా అక్రమ స్వాధీనంలో ఖాళీగా ఉన్న భూములనీ, బంజరు, పోరంబోకు, దేవాదాయ తదితర ఖాళీ భూములన్నింటిని ప్రజలకు పంచాల్సి ఉంది. అలా పంచడమే భూసంస్కరణలు. భూసంస్కరణలు భారత దేశంలో స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న నాటినుండి ఉంటూ వచ్చిన భారత ప్రజల ప్రధాన డిమాండు. భూసంస్కరణలను అమలు చేయకుండా, చిన్న కమతాల రైతులము ప్రోత్సాహం ఇవ్వకుండా ప్రభుత్వాలు ఆహారం కోసం కరువు ఎలా తెచ్చి పెట్టిందీ ఆక్స్‌ఫాం నివేదిక విప్పి చూపింది. ఇప్పటికైనా పంచడానికి భూములు లేవంటున్నవారు కళ్ళు తెరవాలి. బహుళజాతి సంస్ధలే భూములు ఖాళీగా ఉన్నాయనీ వాటిని తమకు అప్పజెపితే ప్రపంచానికి తిండి పెడతామని కోరుతున్న సంగతిని గుర్తెరగాలి. చిన్న కమతాలు వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకాలని జరుగుతూ వచ్చిన ప్రచారం దుష్ప్రచారమేనని గుర్తెరగాలి. భూసంస్కరణల కార్యక్రమం ఇంకా ప్రభుత్వాలు దాచి పెడుతున్న, అత్యవసరమైన కార్యమ్రమని గుర్తించాలి. భూముల పంపిణీకి ప్రభుత్వాలను డిమాండ్ చేయాలి. భూముల కోసం ఉద్యమాలకు నడుం మిగించాలి. అప్పుడే భారత ప్రజల ఆకలి తీరుతుంది. అప్పుడే భారత దేశంలో ఆకలి చావులు అంతమవుతాయి.