భవిష్యత్తులో కాలుష్యంలేని విద్యుత్ ఉత్పత్తిలో జర్మనీ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందనీ, తద్వారా విద్యుత్ పరికరాల వ్యాపారంలో జర్మనీ లాభపడుతుందనీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆశాభావం వ్యక్తం చేసింది. 2022 సంవత్సరానికల్లా అణు విద్యుత్ వినియోగానికి స్వస్తి పలకాలని జర్మనీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అణు రియాక్టర్ల మూసివేత ద్వారా ఇతర విద్యుత్ ఉత్పత్తి మార్గాలను ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నాలు జర్మనీని రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో అగ్రస్ధానంలో నిలుపుతాయనీ, తద్వారా జర్మనీ ఆర్ధికంగా లాభపడుతుందనీ ఆమె తెలిపింది. “రెన్యుబుల్ ఎనర్జీ వనరుల వినియోగం వైపుకి మారడంలో జర్మనీ, మొదటి ప్రధాన పారిశ్రామక దేశంగా నిలుస్తుంది. తద్వారా మాకు అనేక అవకాశాలు దొరుకుతాయి. ఎగుమతులు, అభివృద్ధి, టెక్నాలజీ, ఉద్యోగాలు… ఇలా వివిధ రంగాల్లో జర్మనీకి అవకాశాలు పెరుగుతాయి” అని ఏంజెలా పేర్కొంది.
జపాన్ లో ఫుకుషిమా ప్రమాదానికి ముందే గత ప్రభుత్వం 2021 నాటికి అణు విద్యుత్ వినియోగానికి పూర్తిగా స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో పర్యావరణ ఉద్యమ పార్టీ అయిన గ్రీన్ పార్టీ భాగస్వామి కావడంతో అది సాధ్యపడింది. అయితే సోషలిస్టులు, గ్రీన్ పార్టీ ల ప్రభుత్వం స్ధానంలో క్రిస్టియన్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వంలోని సెంటర్-రైట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత నిర్ణయాన్ని రద్ధు చేసింది. దాంతో పాటు 17 పాత అణు విద్యుత్ ప్లాంటుల జీవిత కాలాన్ని సగటున మరో 12 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జర్మనీ ప్రజలు ఆందోలనలు నిర్వహించారు. మార్చి నెలలో ఫుకుషిమా ప్రమాదం జరగడంతో జర్మనీ ప్రజల ఆందోళనలు తీవ్రమైనాయి. గ్రీన్ పార్టీ పలుకుబడి పెరిగింది.
ఫుకుషిమా ప్రమాదం తర్వాత జర్మనిలో జరిగిన స్ధానిక ఎన్నికల్లో అధికారి పార్టీకి కోటలుగా భావించే స్ధానాల్లో గ్రీన్ పార్టీ విజయం సాధించింది. దానితొ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ అణు విద్యుత్ పై తన విధానాన్ని మార్చుకోక తప్పలేదు. 2022 నాటికి అణు విద్యుత్ రియాక్టర్లను మూసివేయాలని నిర్ణయించింది. తాత్కాలికంగా మూసివేసిన ఏడు రియాక్టర్లను ఇక తెరవగూడదని నిర్ణయించింది. సమస్యలతో సతమతమవుతున్న మరో రియాక్టర్‌ని కూడా ఇక తెరవకూడదని నిర్ణయించారు. మరో ఆరు రియాక్టర్లను 2021 లోనూ, చివరి మూడింటిని 2022 లోనూ మూసివేయాలని నిర్ణయించారు. మూసివేత నిర్ణయాన్ని తిరిగి సమీక్షించే అవకాశాలు లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలనుండి ఎదురైన నిరసనల మేరకు ప్రభుత్వం అణు విద్యుత్‌ని సమీక్షించడానికి ఓ పానెల్‌ని నిర్ణయించింది. ఆ ప్యానెల్ సిఫారసుల మేరకే తాజా నిర్ణయాలు జరిగాయి. “ఫుకుషిమా ప్రమాదం తర్వాత మేము పాఠాలు నేర్చుకున్నాము. ప్రమాదాలని భిన్నరీతుల్లో పరిష్కరించుకోవలసిన అవసరాన్ని ముందుకు తెచ్చింది” అని ఏంజెలా శషబిషలు లేకుండా తమ పాత నిర్ణయం తప్పని తెలిపింది.
ప్రస్తుతం అణు విద్యుత్ ద్వారా జర్మనీ 23 శాతం విద్యుత్ అవసరాలను తీర్చుకుంటోంది. ఈ భాగాన్ని ఇతర మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి పూడ్చుకోవలసిన అవసరం ఉంది. జర్మనీలో పరిశ్రమల్లోని యంత్రాలను ఆధినికీకరించడం ద్వారా 10 శాతం అవసరాలను తగ్గించవచ్చని సదరు ప్యానల్ గుర్తించింది. మిగిలిన విద్యుత్‌ని గాలి మరల ద్వారా ఉత్పత్తి చేయాలని జర్మనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ దక్షిణ భాగాన అణు విద్యుత్ ప్లాంట్లు అధికంగా ఉన్నాయనీ, గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉత్తర భాగంలోని సముద్ర ప్రాంతాలు ఎక్కువ అనువుగా ఉంటుందని జర్మనీ నిపుణులు భావిస్తున్నారు. గాలిమరల ద్వారా జరిగే ఉత్పత్తి ఆశించినంతగా లేనట్లయితే బొగ్గుపై ఆధారపడవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం వైపునుండి అణు విద్యుత్‌ను ఏ విధంగా పూడ్చుకోవాలనుకుంటున్నదీ సమాచారం లేదు.
ఫుకుషిమా నుండి పాఠాలు నేర్చుకున్నామని అత్యధిక పారిశ్రామికాభివృద్ధి సాధించిన జర్మనీ ఛాన్సలర్ చెబుతుండగా, ఫుకుషిమా ప్రమాదం, అణు విద్యుత్ వినియోగంపై మా నిర్ణయాన్ని మార్చజాలదు అని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చెబుతున్నాడు. ప్రజల ఆందోళనల మేరకు తమ అణువిద్యుత్ కేంద్రాల జీవిత కాలాన్ని పొడిగించాలన్న తమ నిర్ణయాన్ని జర్మనీ పూర్తిగా సవరించుకోగా, పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించైనా జైతాపూర్ ప్రజల గుండెలపై అణు కుంపటిని రగిలించడానికి మన్మోహన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని పులివెందులలో యురేనియం ఉత్పత్తితో పాటు అణు విద్యుత్ రియాక్టర్లను కూడా నెలకొల్పడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాల్లో అక్కడ ఆధిపత్యం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కుటుంబం బలవంతంగా పులివెందుల ప్రజలపై ఈ కుంపటిని పేరుస్తున్నది. వాళ్ళు హైద్రాబాదు, బెంగుళూరుల్లో రాజభవనాలు నిర్మించుకున్నందున పులివెందుల ప్రజల భయాలు వారికి కలిగే అవకాశాలు లేవు.
ప్రజల అభిప్రాయాలు తీసుకుని, వారి నిర్ణయాల మేరకు నడవాల్సిన ప్రజాస్వామిక ప్రభుత్వాలు వారి బతుకుల్ని చీకటిపాలు చేసే నిర్ణయాలను బలవంతంగా అమలు చేయ బూనుకోవడం భారత ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఉన్న ప్రాధమిక లోపాలని తెలియజేస్తున్నది.
మీ సైటు పైర్‌పాక్స్‌లొ సరిగ్గా కనిపించుటలేదు గమనించగలరు
అవునా?! నేను ఉపయోగిస్తున్నదీ ఫైర్‌ఫాక్సే. విండోస్ 7 లో ఫైర్ ఫాక్స్ వర్షన్ 4.01. ఒకవేళ పాత వర్షన్లలో మీరు చెప్పిన సమస్య ఉన్నదేమో. సమస్యకి ఏది కారణమైనా దాన్ని సవరించగల నాలెడ్జి నాకు లేదు. అయినా ముఖ్య విషయం చెప్పారు. కృతజ్ఞతలు. ఇతర మార్గాలున్నాయేమో పయత్నిస్తాను.