రక్షణ రంగ కొనుగోళ్ళ విషయం గురించి చర్చించడానికి ఇండియా వస్తున్న జర్మనీ ఛాన్సలర్ విమానాన్ని ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రెండు గంటలపాటు సదరు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరికి టర్కీ మద్యవర్తిత్వంతో మెత్తబడిన ఇరాన్ జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రయాణిస్తున్న విమానానికి అనుమతి ఇవ్వడంతో ఆమె క్షేమంగా ఇండియా చేరగలిగింది. విమానాన్ని తమ గగన తలం లోకి ఇరాన్ ఎందుకు అనుమతించనిదీ కారణం ఇంకా తెలియలేదు.
ఇరాన్ అణు విధానాన్ని పశ్చిమ దేశాలు తీవ్రంగా అడ్డుకుంటున్నాయి. ఇరాన్ అణువిధానం విద్యుత్ ఉత్పత్తి, వైద్య ప్రయోజనాలు లాంటి శాంతియుత ప్రయోజనాలకేనని ఇరాన్ ప్రభుత్వం మొత్తుకుంటున్నప్పటికీ అమెరికా, ఐరోపా దేశాలు నమ్మడం లేదు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ ఇంజనీర్లు, సైంటిస్టులు ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడానికి ఇరాన్ గతంలో అనుమతించింది. అయితే ఆ సైంటిస్టులు తనిఖీ పేరుతో ఇరాన్ అణు ప్లాంటుల సమాచారాన్ని అమెరికాకు చేరవేసే గూఢచర్యానికి పాల్పడడంతో వారిని ఇరాన్ నుండి బహిష్కరించింది. టర్కీ, బ్రెజిల్ దేశాలు కలిసి ఇరాన్ అణు కార్యక్రమంపై మధ్యవర్తిత్వం నెరిపి ఒక ఒప్పందం కుదిర్చినప్పటికీ పశ్చిమ దేశాలు తమ ఆధ్వర్యంలో కుదరని ఒప్పందాన్ని గుర్తించడానికి నిరాకరించాయి.
ఇరాన్ అణు బాంబులు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదంటూ అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఇరాన్ పై ఇప్పటికి నాలుగు దఫాలుగా వాణిజ్య, రాజకీయ ఆంక్షలు విధించాయి. అయినా ఇరాన్ లొంగి రాకపోవడంతో అమెరికా, ఇ.యులు ఇరాన్ పై కచ్చగా ఉన్నాయి. నిజానికి ఇరాన్ అణు బాంబులు తయారు చేయగల సామర్ధ్యం లేదని సి.ఐ.ఏ నివేదిక తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్ సైతం ఇరాన్ కి ఇపుడా సామర్ధ్యం లేదనీ మరో ఐదేళ్ళవరకూ అణు బాంబు తయారు చేసే సామర్ధ్యం సంపాదించడానికి అవకాశాలు లేవని కొద్ది నెలల క్రితం ప్రకటించింది. ఇరాన్ అణు బాంబు తయారు చేయడం లేదని అమెరికా, ఇ.యులకు స్పష్టంగానే తెలుసు. కానీ ఇరాన్ అణు విద్యుత్ సామర్ధ్యం సంపాదించడానికి కూడా పశ్చిమ దేశాలకు ఇస్టం లేదు. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ వద్ద కనీసం 300 వరకూ అణు బాంబులు ఉన్నాయని బిబిసి అంచనా వేసింది. అయినా ఇజ్రాయెల్ పశ్చిమ దేశాల మిత్ర రాజ్యం కావడంతో దానిపై ఆంక్షలు లేక పోగా మరింత ఆర్ధిక సాయం అందిస్తాయి.
మధ్య ప్రాచ్యంలో అమెరికా, యూరప్ ల ప్రయోజనాలను ఇజ్రాయెల్ నెరవేరుస్తుంది. అందువలన ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా మరే దేశమూ అణు సామర్ధ్యాన్ని సంపాదించడానికి వీల్లేదు. సద్ధాం హూస్సేన్ అధ్యక్షుడుగా ఉన్నపుడు ఇరాక్ అణు విద్యుత్ కోసం ప్లాంటులు నెలకొల్పితే ఇజ్రాయెల్ వాటిపై బాంబులు వేసి నాశనం చేసింది. అమెరికా ప్రపంచ రౌడీ పోలీసు అయితే, ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో గూండాగా చెలామణి అవుతోంది. ఇజ్రాయెల్ కోసం ఇరాన్ పై అమానుషమైన ఆంక్షలు విధించి పశ్చిమ దేశాలు అక్కడి ప్రజలను వేధిస్తున్నాయి. ఇరాన్ ఆయిల్ అమ్మకాలపైనా, రవాణా పైనా ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వలన ఇరాన్, ఇండియాల మధ్య కూడా ఆయిల్ రవాణా నిలిచిపోయింది. ఇరాన్ ఆయిల్ కి చెల్లింపులు జర్మనీలోనీ హాంబర్గ్ లోని బ్యాంకు ద్వారా జరుగుతుండేవి. ఆ చెల్లింపులు జరగకుండా అమెరికా, ఇ.యులు ఆంక్షలు విధించాయి. దానితో ఇరాన్తో ఇండియా వ్యాపారం దెబ్బతిన్నది.
వాస్తవానికి ఇరాన్ ఆయిల్ చెల్లింపుల విషయం చర్చించడానికే ఇరాన్ ప్రతినిధి ఇండియాలో చర్చలు జరుపుతున్నాడు. ఇరాన్ వద్ద ఇండియా ఆయిల్ కొనుగోలు సంవత్సరానికి 12 బిలియన్ల డాలర్ల (రు. 54,000/-) మేరకు జరుపుతుంది. ఈ చెల్లింపులు జరగకుండా అమెరికా, ఇ.యులు విధించిన ఆంక్షలను ఇండియా కూడా అమలు చేయడానికి పూనుకుంది. అంతే కాక అమెరికా ఒత్తిడి చేయడంతో ఇరాన్ నుండి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసే ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకుంది. ఇరాన్ పై ఆంక్షలకు వ్యతిరేకం అని ఇండియా పైకి చెబుతున్నా భద్రతా సమితిలో అనుకూలంగా ఓటు వేసింది. దానితో ఇండియా ఇరాన్ ల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సంబంధాల మెరుగుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే జర్మనీ ఛాన్సలర్ హఠాత్తుగా ప్రయాణం పెట్టుకోవడం అనుమానించదగ్గ విషయం. ఏంజెలా మెర్కెల్ ఇండియా వస్తున్న విషయం ముందుగా అనుకున్నదీ లేనిదీ తెలియరాలేదు.
ఏంజెలా మెర్కెల్ తో పాటు విమానంలో ప్రయాణించిన రాయిటర్స్ విలేఖరి ఇరాన్ గగనతలంపై ప్రయాణించే హక్కును ఇరాన్ వెనక్కి తీసుకున్నట్లుగా తెలిపినప్పటికీ వివరాలు తెలపలేదు. జర్మనీలోని ఇరాన్ రాయబారికి జర్మనీ ప్రభుత్వం సమన్లు పంపి రప్పించి నిరసన తెలిపింది. “ఇటువంటి పరిస్ధితి మేమెప్పుడూ ఎదుర్కోలేదు. అంతర్జాతీయ నియమాలను ఇరాన్ గౌరవించాలి” అని ఎంజెలా మెర్కెల్ ప్రతినిధి పత్రికలతో చెప్పాడు. విమాన ప్రయాణాన్ని రెండు గంటలు ఆగితేనే అంతర్జాతీయ నియమాలకు గౌరవ భంగం కలిగితే నాలుగు దఫాలుగా ఇరాన్ పైన ఆంక్షలు విధించి దశాబ్దాల తరబడి ఇరాన్ ప్రభుత్వాన్నీ, ఇరాన్ ప్రజలనూ హీనంగా చూస్తూ అగౌరవపరచడాన్ని ఏమనాలో జర్మని చెబితే సబబుగా ఉండేది. ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకుడు నోమ్ ఛోమ్‌స్కీ ప్రకారం అరబ్ దేశాల ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఇజ్రాయెల్ అరాచకాన్ని ఎదుర్కొవడానికి ఇరాన్ అణు బాంబులు తయారుచేసుకోవాల్సిందేనని కోరుకుంటున్నారు. పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రిక సంస్ధలు మాత్రం ఇరాన్ అణుబాంబు ప్రపంచ భద్రతకే భంగమని కాకిగోల చేస్తాయి. ప్రతిదేశానికి భద్రత కోసం అణుబాంబు తయారు చేసుకునే హక్కు ఉన్నదని ఇండియా ప్రభుత్వ విధానమే ఐనప్పటికీ ఇరాన్ విషయంలొ ఇండియా దాగుడు మూతలు ఆడుతోంది. తన ఇంధన అవసరాలకు ఎసరు వచ్చినా పాఠం నేర్చుకోడానికి ఇండియా ప్రభుత్వం సిద్ధంగా లేదు.