అమెరికన్లపై నిఘా, ప్రపంచదేశాలపై శాశ్వత యుద్ధం: నల్లచట్టాలకు కాంగ్రెస్ ఆమోదం


అమెరికా లోపలా, బయటా తన అమానుషకృత్యాలను మరింత తీవ్రంగా, శక్తివంతంగా కొనసాగించడానికి అమెరికా ప్రతినిధుల సభ రెండు నల్ల చట్టాలను ఆమోదించింది. ఇప్పటికే దేశం లోపల అమలు చేయడానికి ఉన్న ఓ నల్ల చట్టాన్ని మరింతకాలం కొనసాగించడానికి ఆమోదం తెలుపుతూ, దేశం బైట ప్రపంచం మీద పెత్తనం కోసం అంతం లేని యుద్ధాలు చేసే హక్కును తమకు తాము దఖలుపరుచుకుంటూ రిపబ్లికన్ పార్టీ సభ్యులు మెజారిటీగా కల అమెరికా ప్రతినిధుల సభ, గతవారం చట్టాలను ఆమోదించింది. అమెరికా ఆర్ధిక వృద్ధిలో మెరుగుదల కనిపించడం లేదు. బడా కంపెనీలకు విచక్షణా రహితంగా నిధులు అందుబాటులో ఉంచడానికి ప్రవేశపెట్టిన 600 బిలియన్ డాలర్ల క్యు.ఇ-2 (క్వాంటిటేటివ్ ఈజింగ్) పధకం ముగిసి పోతున్నా సంక్షోభం నుండి బైటపడుతున్న (రికవరీ) ఛాయలేవీ కనిపించడం లేదు. దానివలన చైనా, ఇండియా, బ్రెజిల్ లాంటి దేశాలకు విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐ) వరదెత్తడం తప్ప ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. అమెరికా ప్రభుత్వం ఇచ్చిన క్వాంటిటేటివ్ ఈజింగ్ ద్వారా అందిన మొత్తాన్ని ఎమర్జింగ్ దేశాల్లో పెట్టుబడులుగా పట్టుకెళ్ళారు తప్ప అమెరికా ఆర్ధిక వ్యవస్ధని సంక్షోభం నుండి బైటికి తేవాలన్న ఆసక్తేమీ వాల్‌స్ట్రీట్ కంపెనీలు ప్రదర్శించ లేదు.

యు.ఎస్.ఎ పేట్రియాట్ యాక్టు

దేశంలో సంక్షోభ పరిస్ధుతులు తీవ్రం అవుతున్న కొద్దీ సామాజిక సమస్యలు పెరుగుతున్నాయి. నిరుద్యోగం ఎనిమిది ప్లస్ శాతం అని ప్రభుత్వ చెబుతున్నా వాస్తవానికి నిరుద్యోగం జనాభాలో 20 శాతం పైనే ఉందని అమెరికాకి చెందిన ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ చెబుతున్నాడు. కార్మికులు, ఉద్యోగులుకి సదుపాయాలు తగ్గిస్తున్నారు. వాటిని ఇంకా తగ్గించడానికీ, కొన్ని రద్దు చేయడానికి బిల్లు రెడీగా ఉంది. సంపన్నులకి పన్నులు తగ్గించి ప్రజలపైన పన్నులు పెంచే బిల్లు కూడా రిపబ్లికన్లు సిద్ధంగా ఉంచారు. ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలకి తోడు లిబియా యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధాలకి అవుతున్న ఖర్చువలన అప్పు, బడ్జెట్ లోటు పెరగుతుంటే వాటిని తగ్గించడానికి ప్రజలపైన పన్నులు పెంచుతున్నారు. ఇవన్నీ అమెరికా సమాజంలో మరింత కల్లోలాన్ని రేపుతాయి. ప్రజలు అనివార్యంగా రోడ్డెక్కుతారు. అలా రోడ్డేక్కకుండా ప్రజల ప్రజాస్వామిక హక్కులైన నిరసన హక్కుల్ని అణిచివేయడానికి జార్జి బుష్ తెచ్చిన పేట్రియాట్ చట్టాన్ని మరింతకాలం పొడిగిస్తూ ప్రతినిధుల సభ బిల్లు ఆమోదించింది. “యు.ఎస్.ఎ పేట్రియాట్ యాక్టు” గా పిలిచే ఈ చట్టంలొ మూడు నిబంధనల కాలం ముగియబోతోంది. వాటిని మరింత కాలం పొడిగిస్తూ 250-153 మెజారిటీతో నిర్ణయం తీసుకుంది ప్రతినిధుల సభ.

ఈ చట్టం అమలులోకి వస్తే చట్టాలను అమలు చేయడానికి నియమితమైన విభాగాలకు ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే అధికారాలు సంక్రమిస్తాయి. తమకు అనుమానం వచ్చిన వారి టెలిఫోన్ సంభాషణలపైనా, ఇంటర్నేట్ కార్యకలాపాలపైనా అనుమతి లేకుండా నిఘా పెట్టే అధికారాలు లభిస్తాయి. ప్రజల ఏకాంతానికి భంగం కలిగిస్తూ వారి ప్రైవసీ హాక్కుల్ని హరించడానికి అధికారం దొరుకుతుంది. తాము నిఘా పెట్టదలుచుకున్న వారిపైన విదేశీ ఏజెంట్లుగా ముద్రవేసి ఆ అధికారాన్ని పొందవచ్చు. టెర్రరిజంకు సహకరిస్తున్న పౌరేతర (నాన్ సిటిజన్) “ఒంటరి తోడేళ్ళు” గా ముద్రలు బనాయించి పౌరుల వ్యాపార హక్కుల్ని హరిస్తూ, వ్యాపార సమాచారాన్ని దొంగిలించే అధికారం భద్రతాధికారులకి సంక్రమిస్తుంది. వ్యాపార, లైబ్రరీ రికార్డులను తనిఖీ చేయొచ్చు. ఈ చట్టం ద్వారా ప్రజల ప్రైవసీకి భంగం కలగకుండా ఎటువంటి రక్షణలను బిల్లులో ప్రతిపాదించనందుకు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ చట్టాన్ని విమర్శించింది. పేట్రియాట్ చట్టం మాటున జస్టిస్ డిపార్టుమెంటు వారు దేశీయంగా నిఘా పెట్టడానికి హక్కులను సొంతం చేసుకోగలమని భావిస్తున్నారనీ, చట్టంలోని ఈ అంశాలను చాలామంది ప్రతినిధుల సభ సభ్యులకు అర్ధం కూడా చేసుకోలేదని ఇద్దరు డెమొక్రటిక్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఒరెగాన్ నియోజక వర్గ సెనేటర్ రాన్ వైడెన్ దేశీయ నిఘాను విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు ఒబామా ను తీవ్రంగా విమర్శించాడు.

రాన్ వైడెన్ మాటల్లోనే చెప్పాలంటే “తమ ప్రభుత్వం కొన్నిసార్లు రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తుందని అమెరికన్లకు తెలుసు. కాని అమెరికా ప్రభుత్వం ఓ రహస్య చట్టం తయారు చేస్తున్నదని బహుశా నమ్మలేరు. ఈ రహస్య చట్టం గురించి మేము ఇంత గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, అమెరికన్లు తమ ప్రభుత్వం పైన ఉంచిన గొప్ప నమ్మకాన్ని ఈ చట్టం దారుణంగా ఉల్లంఘిస్తుంది. ప్రభుత్వ సంస్ధలు, ఏజెన్సీలపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఈ చట్టం విస్మరిస్తుంది. అందువలన ఆ ప్రభుత్వ సంస్ధలు సమర్ధవంతంగా పని చేయడం జఠిలంగా మారుతుంది” అని వైడేన్ “డెమొక్రసీ నౌ” టీ.వి చానెల్ తో మాట్లాడుతూ చెప్పాడు. రాన్ వైడెన్ ఇంటలిజెన్స్ పై నియమించిన సెనేట్ కమిటీలో సభ్యుడు కావడం గమానార్హం.

రక్షణ ఖర్చు బిల్లు

రిపబ్లికన్లు మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభ గురువారం రక్షణ ఖర్చు బిల్లుని ఆమోదించింది. బిల్లుతో పాటు అనేక దారుణమైన అధికారాలు, అవకాడాలు దఖలు పరుచుకున్నారు. అనేక వివాదాస్పదమైన అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి. ఈ బిల్లు చట్టంగా రూపొందితే టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతున్నట్లు ఏ అమెరికాయేతర పౌరుడిపైనైనా అనుమానం కలిగితే వారికి అమెరికాలో విచారణా సౌకర్యాన్ని నిరాకరిస్తుంది. అటువంటి వారు అమెరికాలో అరెస్టయినా సరే, వారికి కోర్టు ద్వారా విచారణ సౌకర్యం పొంది తాను తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం ఉండదు. వికీలీక్సు అధిపతి జులియన్ అస్సాంజ్ లాంటివారిని స్వీడన్ పై ఒత్తిడి తెచ్చి అమెరికాకి రప్పించుకుని ఈ అవకాశాల ద్వారా ఏ విచారణా లేకుండా జీవితాంతం జైలులోకి తోసేయవచ్చన్నమాట.

అమెరికా టి.వి ఛానెల్ ‘డెమొక్రసీ నౌ మాటల్లో చెప్పాలంటేఇంకా ఘోరం ఏంటంటే టెర్రరిజం కి పాల్పడుతున్నట్లు అనుమానం ఉన్నవారిపై ప్రపంచ వ్యాపిత యుద్ధం ప్రకటించడానికీ, అటువంటి అనుమానితులకు మద్ద్దతు ఇస్తున్నట్లుగా అనుమానం ఉన్న దేశాలపైనా నిరంతర యుద్ద్దం ప్రకటించడానికి అమెరికా అధ్యక్షుడికి విస్తారమైన హక్కులు లభిస్తాయి. గతంలో లాగా సెప్టెంబరు 11 ఘటనలతొ సంబంధం ఉన్నవారిపైనా, వారికి మద్దతు ఇస్తున్న దేశాలపైనా మాత్రమే యుద్ధం ప్రకటించే నియమం లేదు. సెప్టెంబరు 11 ఘటనతో సంబధం ఉన్నా లేకపోయినా వారు టెర్రరిస్టులని అనుమానం వస్తే చాలు. టెర్రరిస్టులని రుజువుకూడా అవసరం లేదని ఇక్కడ గుర్తించాలి. అమెరికాకి అనుమానం వస్తే అచ్చోసిన ఆంబోతులా వ్యక్తులపైకీ, దేశాలపైకీ బాంబుల్తో తెగపడుతుందన్నమాట. ఆ హక్కుని అమెరికా తనకు తానే ఇచ్చుకుంటోంది. అంతర్జాతీయ చట్టాలు, న్యాయ సూత్రాలు, సమితి ఆమోదం, మెజారిటీ మద్దతు ఇవేవీ దానికి అవసరం లేదు.

పైకి టెర్రరిజం అనీ, అనుమానితులనీ, టెర్రరిజానికి మద్దతు ఇచ్చే దేశాలనీ చెప్పినా అమెరికా అసలు లక్ష్యం ఆధిపత్య విస్తరణ. సామ్రాజ్య విస్తరణ. అమెరికా బహుళజాతి కంపెనీలకీ లేదా వాల్‌స్ట్రీట్ కంపెనీలకు ప్రపంచం అంతా స్వేచ్ఛగా విహరించే హక్కులు కావాలి. వాళ్ళు ఏది అమ్మితే అదే కొనాలి. వాళ్ళు ఏది తినిపిస్తే అదే తినాలి. ఏది ధరిస్తే అది, ఏది పాడితే అది… ఇలా అన్నీ. స్వతంత్ర ప్రభుత్వాలేవీ ఉండకూడదు. ఉన్నా నామ్‌కే వాస్తే గానే ఉండాలి. అలా ఉన్నట్లయితేనే అమెరికా ఆర్ధిక సంక్షోభం పరిష్కృతమవుతుందని వారి నమ్మకం. అచ్చోసిన ఆంబోతులా తెగబడితేనే వారికి లాభాలమీద లాభాలు వస్తాయని నమ్మకం. ఇక ప్రపంచంలోని రోడ్లన్నీ వాల్‌స్ట్రీట్ లే కావాలి.

కాని అది ప్రకృతి విరుద్ధం. ప్రపంచం నిండా ఉన్నది వారనుకుంటున్నట్లు కేవలం వినియోగదారులు మాత్రమే కాదు. వారు ప్రజలు. అమెరికా సామ్రాజ్యవాద కంపెనీలవలే కాకుండా వారు చీమూ, నెత్తురూ, మాంసం ఉన్న మనుషులు. వారికి తాము మనుషులమన్న స్పృహ ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలకు లేని మానవ భావాలు, సెంటిమెంట్లు, సంస్కృతి, జాతి, నేల, దేశం అన్న సహజ భావాలు వారి సొంతం. వారిదైన వాటిని కాపాడుకోవడానికి వారు పేట్రియాట్ క్షిపణులకైనా ఎదురొడ్డుతారు. ఒక వియత్నాం, ఒక నికరాగువా, ఒక క్యూబా అదే నిరూపించాయి. ఇంకెన్ని సార్లయినా నిరూపించడానికి ప్రపంచంలోని ఏ ప్రజలైనా సిద్ధంగా ఉంటారన్నదే అమెరికా సామ్రాజ్యవాద ముష్కరులు ఊహించలేని పచ్చి నిజం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s