అణు విద్యుత్ కర్మాగారాలకు సంబంధించి జర్మనీ ప్రభుత్వం సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. 2022 కల్లా అణు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న అణు కర్మాగారాలను దశలవారిగా మూసి వేస్తూ, 2022కల్లా అణు విద్యుత్ అనేదే దేశంలో లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. జపాన్లో మార్చిలో సంభవించిన భూకంపం, సునామీల వలన 30,000 మంది చనిపోవడమో, ఆచూకీ గల్లంతవడమో జరిగింది. దాంతో పాటు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం భూకంపం, సునామీల ధాటికి బాగా దెబ్బతిని రేడియేషన్ పెద్ద ఎత్తున వాతావరణంలోకి విడుదలయ్యింది. కర్మాగారానికి చుట్టూ 30 కి.మీ పరిధిలో ప్రజలను వారి ఇళ్ళనుండి ఖాళీ చేయించి శిబిరాల్లో ఉంచవలసి వచ్చింది.
ఫుకుషిమాలో ఉన్న ఐదు రియాక్టర్లు ఏదో ఒక స్ధాయిలో నష్టానికి గురాయ్యాయి. మూడు రియాక్టర్లలో పేలుళ్ళు సంభవించాయి. కూలింగ్ వ్యవస్ధ నాశనం కావడంతో అణు ఇంధన రాడ్లు కరగలేదని మొదట బుకాయించినా తర్వాత అణు ప్లాంటు ఆపరేటర్ టెప్కో, రాడ్లు కరిగిపీయాయని అంగీకరించక తప్పలేదు. ఇప్పటికీ ఫుకుషిమా అణు ప్లాంట్ల వద్ద ప్రమాదకర స్ధాయికి వెయ్యి రెట్లు రేడియేషన్ విడుదల అవుతూనే ఉంది. ఇప్పటివరకూ సంభవించిన అణు ప్రమాదాల్లో చెర్నోబిల్ దుర్ఘటన తర్వాత ఫుకుషిమా ప్రమాదమే అతి పెద్దదని నిపుణులు తేల్చారు. ఫుకుషిమాను శుభ్ర పరచడానికి ఇరవై నుండి ముప్ఫై సంవత్సరాలు పడుతుందని తోషిబా, హిటాచి లాంటి కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో జర్మనీలో అణు విద్యుత్ ప్లాట్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. గ్రీన్స్ పార్టీ ఆద్వర్యంలో ఈ అందోళనలు జరిగాయి. జర్మనీలోని 16 రాష్ట్రాల పర్యావరణ మంత్రులు పాత రియాక్టర్లపై విధించిన తాత్కాలిక మారిటోరియాన్ని శాశ్వతం చేయాలని గత వారమే కోరారు. గ్రీన్ పార్టి అధికార కూటమిలో భాగస్వామి కూడా. నిజానికి ఫుకుషిమా ప్రమాదం జరగక ముందే జర్మనీ ప్రభుత్వం 17 పాత అణు విద్యుత్ కేంద్రాల జీవిత కాలాన్ని సగటున మరో 12 సంవత్సరాల పాటు పొడిగించడానికి నిర్ణయించింది. ఆ నిర్ణయం అమలయితే వాటిలో కొన్ని కనీసం 2030 వరకూ కొనసాగేవి. అయితే ఫుకుషిమా ప్రమాదం జరిగాక జర్మనీ ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. స్ధానిక ఎన్నికల్లో పాలక క్రిస్టియన్ డెమొక్రటిక్ పార్టీకి పెట్టని కోటలైన స్ధానాల్లొ గ్రీన్ పార్టీ విజయం సాధించింది. తమ పార్టీ ఓటమికి ఫుకుషిమా అణు ప్రమాదమే కారణమని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ప్రకటించింది. ఆ తర్వాత ఎంజెలా మెర్కెల్ U-మలుపు తీసుకుంది. అణు విద్యుత్ కేంద్రాల భవిష్యత్తుపై ఎధిక్స్ కమిటీ వేసింది. ఆ కమిటీ నిర్ణయం మేరకు దశలవారిగా అణు విద్యుత్ పై ఆధారపడడం మానేయాలని నిర్ణయించింది.
పర్యావరణ మంత్రి నార్బర్ట్ రాట్జెన్ సోమవారం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ నిర్ణయం తీసుకోవదానికి ఆదివారం ప్రారంభమైన సమావేశం సోమవారం ఉదయం వరకూ కొనసాగింది. జీవిత కాలాన్ని పొడిగించాలని నిర్ణయించిన అణు రియాక్టర్లలో ఏడింటిని, సమస్యలతో సతమతమవుతున్న క్రూయెమ్మెల్ రియాక్టర్ ను ఇక ప్రారంభించరాదని నిర్ణయించారు. వాటిని ఇక మూసేసినట్లే. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తారని రాట్జెన్ తెలిపాడు. మరో ఆరు రియాక్టర్లను 2021 లో మూసివేస్తారు. తాజాగా ప్రారంభించిన రియాక్టర్లనూ, మూడు కొత్త రియాక్టర్లనూ 2022 లో మూసివేయాలని నిర్ణయించారు. “ఈ నిర్ణయం పక్కా చివరి మూడు రియాక్టర్లు 2022లో పని చేయడం మానివేస్తాయి. ఇందులో ఏ అనుమానాలూ లేవు, షరతులూ లేవు. నిర్ణయీన్ని తిరిగి సమీక్షించే సమస్యే లేదు” అని రాట్జెన్ ప్రకటించాడు. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశాన్ని నిర్ణయంలోనే ఒక భాగంగా ఉంచాలని వాదించినప్పటికీ అది ఆమోదం పొందలేదు.
వాడిన అణు ఇంధన రాడ్లపై పన్ను ద్వారా సంవత్సరానికి 2.3 ట్రిలియన్లను ఈ సంవత్సరం నుండి వసూలు చేయాలని చేసిన నిర్ణయం కొనసాగుతుందని రాట్జెన్ తెలిపాడు. అణు విద్యుత్ నిషేధం జర్మనీ పారిశ్రామీక ఆధిక్యతను దెబ్బతీస్తుందని అణు విధ్యుత్ కంపెనీలు వాదిస్తున్నాయి. ప్రస్తుతం జర్మనీ తన విద్యుత్ అవసరాలలో 23 శాతం విద్యుత్తుని అణు కర్మాగారాల ద్వారా పొందుతోంది. ప్రధాన అభివృద్ధి చెందిన దేశాల్లో అణు విద్యుత్ ను నిషేధించాలని నిర్ణయించుకున్న దేశాల్లో జర్మని మొదటి దేశంగా నిలిచింది. భారత దేశ ఇంధన అవసరాలలో ప్రస్తుతం 2.78 శాతం అణు విద్యుత్ తీరుస్తోంది. దానిని 2050 సంవత్సరానికల్లా 25 శాతానికి చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జర్మనీ అణు విద్యుత్తు నిషేధం వైపు వెళ్తుండగా ఇండియా దాని విస్తరణ వైపుకు పయనించడం గర్హనీయం. జైతాపూర్ లో స్ధానిక ప్రజల అభిప్రాయాలను లెక్కఛేయకుండా పోలీసు నిర్భంధాన్ని ప్రయోగించి అణు ప్లాంటు నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంటున్నది. భారత ప్రభుత్వ విధానం రియాక్టర్లు తయారు చేసే విదేశీ బహుళజాతి కంపెనీలకు మోదం కాగా భారత దేశ ప్రజలకు మాత్రం ఖేదాన్ని ముగులుస్తుంది.
అణు విద్యుత్ కేంద్రాలు మూసెయ్యటం బానే ఉందిగానీ, అది ఇప్పటి వరకు ఇస్తున్న 23 శాతం విద్యుత్తుని భర్తీ చెయ్యటానికి ఇంకేం వాడుతారు. మీ వ్యాసంలో ఆ ప్రస్తావన లేదు, మీకు తెలిస్తే మాకూ తెలియజేయండి.
చైతన్యగారూ, నేనూ ఆ సమాచారం కోసం ప్రయత్నించాను. కానీ ఆ విషయంలో జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు జర్మనీ పర్యావరణ మంత్రి సమాధానం ఇవ్వలే. విద్యుత్ కేమీ కొరత రాదని మాత్రమే అన్నాడు. ఈ పది సంవత్సరాల్లో ప్రత్యామ్నాయం దొరుకుతుందని ధైర్యమేమో!