పాకిస్ధాన్‌కి అమెరికా మిలట్రీ సాయాన్ని మళ్ళీ విమర్శించిన ఇండియా


India, Pak, China borders

ఇండియా, పాక్, చైనాల సరిహద్దులు (Click to enlarge)

అమెరికా, పాకిస్ధాన్‌కి బిలియన్లకొద్దీ మిలట్రీ సహాయం ఇవ్వడాన్నీ భారత దేశం మరొకసారి విమర్శించింది. అమెరికా, ఇండియాల సంబధాల మధ్య ఈ అంశం మొదటినుండీ ఒక చికాకు గా ఉంటూ వచ్చింది. పాకిస్ధాన్‌కి అందిస్తున్న మిలట్రీ సహాయంలో చాలా భాగం ఇండియాకి వ్యతిరేకంగా రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వినియోగిస్తోందని భారత ఆరోపిస్తున్నది. న్యూయార్కు నగరంలోని జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగినప్పటినుండీ టెర్రరిజంపై పోరాటంలో సహకరిస్తున్నందుకు అమెరికా, పాకిస్ధాన్‌కి 20.7 మిలియన్ డాలర్లను (రు. 95220 కోట్లు) సహాయంగా అందించిందని రాయిటర్సు సంస్ధ పేర్కొంది. దీనిలో 2/3 వంతు (రు. 63.5 వేల కోట్లు) పాక్ మిలట్రీకే అందించిందని ఆ సంస్ధ తెలిపింది.

ఇది గత దశాబ్ద కాలంలో అందించిన సహాయం మాత్రమే. అమెరికాతో పాకిస్ధాన్ చెలిపి టెర్రరిస్టుల దాడులతోనే ప్రారంభం కాలేదు. పాకిస్ధాన్, ఇండియాలకు స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నప్పటినుండీ పాక్ అమెరికా కేంపులో చేరితే ఇండియా రష్యా కేంపులో చేరింది. పాక్‌కి అమెరికా యుద్ధ పరికరాలు సరఫరా చేసినప్పుడల్లా ఇండియా విమర్శించేది. రష్యా, ఇండియాకి యుద్ధ పరికరాలు అమ్మినప్పుడల్లా పాకిస్ధాన్ విమర్శించేది. ఇండియాతో అమెరికా నాలుగు సంవత్సరాల క్రితం “పౌర అను ఒప్పందం” కుదుర్చుకున్నప్పుడు పాకిస్ధాన్ తీవ్రంగా విమర్శించింది. తనకూ ఆ ఒప్పందం కావాలని డిమాండ్ చేసింది. కానీ అమెరికా ఒప్పుకోలేదు. పాక్ అణ్వస్త్రం పితామహుడు ఇతర ముస్లిం దేశాలకు అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని అందించడం, పాక్ అణ్వస్త్రాలు టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళడానికి అవకాశాలున్నాయని భయాలు రేకెత్తడంతో పాకిస్ధాన్ తో పౌర అణు ఒప్పందం చేసుకోవడానికి అమెరికా ఒప్పుకోలేదు.

అయితే అమెరికా ఒప్పుకోకపోవడంతోనే పాకిస్ధాన్ డీలా పడకుండా చైనాని అడిగింది. చైనా రెడీ ఐపోయింది. మరో అణు రియాక్టరు స్ధాపించడానికి ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి న్యూక్లియర్ సప్లై గ్రూపు (ఎన్.ఎస్.జి) కు చెందిన దేశాలు అణు పరిజ్ఞానం ఇతర దేశాలకు అమ్మడానికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాయి. వాటి ప్రకారం “అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పంధం” (ఎన్.పి.టి) పై సంతకం చేయని దేశాలకు అణు పరిజ్ఞానాన్ని అమ్మకూడదు. ఆ నియమాన్ని అధిగమిస్తూ అమెరికా ఇండియాతో ఒప్పందం చేసుకుంది. కానీ చైనా పాకిస్ధాన్‌కి ఇంకో అణు రియాక్టరు నెలకొల్పడానికి అంగీకరించడాన్ని మాత్రం అమెరికా తప్పు పట్టింది. చైనా వెంటనే రిటార్టు ఇచ్చింది. “నువ్వు ఇండియాకి ఇవ్వగా లేనిది నేను పాకిస్ధాన్‌కి ఇస్తే తప్పేమిటి?” అని దాంతో అమెరికా నోర్మూసుకుంది.

ఇవి కాకుండా టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధానికి ప్రత్యేక సహాయం అమెరికా, పాకిస్ధాన్ కి అందించింది. ఈ సహాయం ఇండియాకి వ్యతిరేకంగా వినియోగిస్తున్నట్లు అమెరికా అధికారుల్లో కొందరికి కూడా అనుమానం ఉంది. కాని ఆఫ్ఘన్ యుద్ధంలో పాక్ అవసరం అమెరికాకి బాగా ఉన్నందున సహాయం కొనసాగించక తప్పలేదు. బిన్ లాడెన్ హత్య తర్వాత అభిప్రాయ భేదాలు తలెత్తినా, మళ్ళీ హిల్లరీ క్లింటన్ గత రెండు రోజులుగా పాకిస్ధాన్ లో తిష్ట వేసి మరింత సహాయానికి హామీ ఇస్తూ టెర్రరిజం పై యుద్ధం కోసం మరింత కృషి చేయాలని భుజం తట్టింది. అంతే కాకుండా పాకిస్ధాన్ ప్రభుత్వంలో గానీ, మిలట్రీలో గానీ ఉన్నత స్ధానాల్లో ఉన్నవారికి లాడెన్ పాక్ లోనే ఉన్న సంగతి తెలుసు అనడానికి ఆధారాలేవీ లేవని సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నేపధ్యంలో భారత రక్షణ మంత్రి ఆంటోని తాజాగా మళ్ళీ అమెరికాకి తన నిరసనను తెలిపాడు.

అయితే ఉపఖండంలో ఆయుధ పోటీ తలెత్తడానికి ఒక్క పాకిస్ధాన్‌నో, ఇండియానో తప్పు పట్టలేము. ప్రత్యక్షంగా ఇరువురూ దానికి బాధ్యులే. పరోక్షంగా అమెరికా, చైనాలు బాధ్యులు. అమెరికా పాత్ర లేనట్లయితే బహుళా చైనా సైతం అంతగా తలదూర్చేది కాదేమో. ప్రపంచ దేశాల పైన ఆధిపత్యం సాధించే సామ్రాజ్యవాద ప్రయోజనాలలో భాగంగా అమెరికా ప్రపంచంలోని అన్ని ఘర్షణ ప్రాంతాల వద్ద జొరబడి వాటిని చల్లార్చడానికి బదులు మరింత రెచ్చగొట్టి తన మిలట్రీ ఆయుధాలు అమ్ముకోవడం ఒక విధానంగా అమలు చేస్తున్నది. దక్షిణాసియాలోని పొరుగు దేశాలు బైటి దేశాలను తమ వ్యవహారాల్లో జొరబడకుండా నివారించగలిగితే ఆయుధ పోటీని నివారించడం, ఘర్షణలు లేకుండా మిత్ర సంబంధాలు నెలకొల్పడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ విధంగా మిలట్రీ ఖర్చు తగ్గించుకుని ప్రజా సంక్షేమం కోసం మరింతగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s