అసభ్యకర టి.వి. ప్రకటనలను ప్రసారం చేయవద్దని ఛానెళ్ళను కోరిన ప్రభుత్వం


Axe_Effectభారత సమాచార మంత్రిత్వ శాఖ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పచ్చిగా, అసభ్యకరంగా లైంగిక ప్రకటనలను ప్రసారం చేయవద్దని టి.వి చానళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. డియోడెరంట్ అమ్మకం దారులు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం జారీ చేస్తున్న వీడియో ప్రకటనలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ప్రత్యక్షంగా లైంగికతలను ప్రదర్శించే ప్రకటనలు భారత దేశ ప్రచార, ప్రసార చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయనీ, వీటిని ప్రసారం చేయడం వెంటనే ఆపాలని తన ఆదేశాల్లో ప్రభుత్వం కోరించి. అటువంటి ప్రకటనలు సవరించుకోవడమో, లేదా పూర్తిగా ఆపేయడమో చేయాలని కోరింది. అందుకు 5 రోజుల గడువు విధించింది.

“ఈ ప్రకటనలు పురుషులకు లైంగిక వాంచలను అసభ్యకర రీతిలో రెచ్చగొట్టే సందేశాలతో నిండి ఉంటున్నాయి” అని సమాచార మంత్రిత్వ ళాఖ తెలిపింది. వైల్డ్‌స్టోన్, అడిక్షన్ డియో, యాక్స్ వంటి ఉత్పత్తులు ప్రభుత్వం పేర్కొన్న బ్రాండ్లలో ఉన్నాయి. ఈ కంపెనీల వారెవరూ ఇంతవరకూ స్పందించలేదని బిబిసి తెలిపింది. ఇటువంటి ప్రకటనలు “మంచి అభిరుచినీ, సభ్యతనూ” గాయపరుస్తున్నాయని ప్రభుత్వం ఆక్షేపించింది. తమ ఉత్పత్తుల వాడకం మహిళల లైంగిక వాంచలను ప్రేరేపిస్తాయని సందేశాలిస్తూ అసభ్యంగా, లేకిగా, సజెస్టివ్‌గా ఉంటున్నాయని విమర్శించింది. “అటువంటి డియోడరెంట్ ప్రభావానికి లోనైన మహిళలు వాటిని ధరించిన పురుషులను కోరికతో వెంబడిస్తున్నట్లు చిత్రిస్తున్నాయి. ఈ ప్రకటనల్లో స్త్రీల చిత్రణ లైంగికతతో కూడు ఉంటున్నది” అని ప్రభుత్వం విమర్శించింది.

సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటన అటువంటి ప్రకటనలను నిషేధించే చట్టాన్ని ఉల్లేఖించింది. “స్త్రీల వ్యక్తిత్వ చిత్రణ, మంచి అభిరుచితో, సౌందర్యారాధక దృక్పధంతో ఉండాలి. బాగా వ్యవస్ధీకృతమై ఉన్న మంచి అభిరుచి, సభ్యతా ప్రమాణాలకు లోబడి ఉండేలా కేబుల్ ఆపరేటర్లు జాగ్రత్తలు తీసుకోవాలి” అని చట్టం చెబుతున్నదని గుర్తు చేసింది. ఇది సున్నిత అంశం ఐనందున, సదరు కంపెనీలు బహిరంగంగా స్పందించే అవకాశాలు లేవని ఛానెళ్ల కరెస్పాండెంట్లు భావిస్తున్నట్లుగా వార్తా సంస్ధలు చెబుతున్నాయి. సమాచార మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలు సవరించుకునేలా చూడాలని ‘భారత ప్రకటనల ప్రమాణాల కౌన్సిల్’ (Advertising Standards Council of India) ను కోరింది. గత సంవత్సరం మార్చి నెలలో స్త్రీల శరీరంలో పైభాగం దుస్తులు లేని దృశ్యాలను ప్రదర్శిస్తున్న ఫ్యాషన్ టివి ప్రసారాలను 10 రోజులపాటు ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

పాశ్చాత్య దేశాల్లో స్వేచ్ఛ పేరిట విశృంఖలత్వాన్ని ప్రభోధించే సూత్రాలను వల్లెవేయడం సర్వ సాధారణం. ముఖ్యంగా అమెరికాలో స్త్రీ, పురుషుల సమానత్వం పేరుతో, సంస్కృతి అభివృద్ధి పేరుతో అనేక విశృంఖల అలవాట్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. దుస్తుల ధారణనుండి వైవాహిక బంధాల వరకు విశృంఖలత ప్రభావానికి గురికావడంతో సామాజిక సంబంధాలు అట్టడుగు స్ధాయికి దిగజారి ఉన్న సంగతిని మనం చూస్తున్నాం. చివరికి ప్రకృతి సహజమైన లైంగిక అలవాట్లను సైతం ధిక్కరిస్తూ, పెర్వర్షన్ తో కూడిన అలవాట్లను కూడా చట్టబద్ధం చేస్తున్న పరిస్ధితి నెలకొని ఉంది. అటువంటి అలవాట్లు తలెత్తకుండా సామాజిక, వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి బదులుగా వాటిని సామాజిక ధోరణులుగా ప్రధాన స్రవంతిలో ఓ భాగం చేసేయడం గర్హనీయం. అటువంటి ధోరణులకు మానవ హక్కులలో కూడా స్ధానం కల్పించే విపరీత ధోరణులు అమెరికా తదితర పాశ్చాత్య దేశాల ప్రభుత్వాల పాలనా వ్యవస్ధలో కూడా చొచ్చుకు వెళ్ళాయి.

ప్రజల వాస్తవిక సమస్యల నుండి వారి దృష్టిని మళ్ళించడానికీ, తాము అమలు చేసే ప్రజావ్యతిరేక విధానాలపైన ప్రజల దృష్టి కేంద్రీకృతం కాకుండా ఉండటానికి రాజ్య వ్యవస్ధలు ఇటువంటి వైపరీత్యాలను ప్రోత్సహించడం కద్దు. ఉదాహరణకి అబార్షన్ అనేది ఆయా కుటుంబ సభ్యులు చర్చించుకోగల మామూలు సమస్య. ఆయా కుటుంబాలకు చెందిన ప్రవేటు సమస్య. అంతిమంగా నిర్ధిష్ట స్త్రీ ఇష్టాయిష్టాలకు వదిలివేయవలసిన సమస్య. కాని అమెరికాలో అబార్షన్ వ్యతిరేక, అనుకూల అభిప్రాయాల పేరుతో దేశ వ్యాపిత ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అబార్షన్ హక్కు అనేది అక్కడ మత సమస్యగా రూపం తీసుకోవడమే కాక ఎన్నికల సందర్భంగా ప్రచార అంశంగా కూడా మారిపోయింది. ప్రకృతి వ్యతిరేక లైంగిక ధోరణులను వైద్య పరిశోధనల గదులను దాటించి, వాటి పరిష్కారాలను కనుగునే ప్రయత్నాలు మాని విపరీత ధోరణులనే మామూలు సామాజిక ధోరణులుగా వ్యవస్ధీకృతం చేయడం పాశ్చాత్య ప్రభుత్వాలకే సాధ్యం.

ఇటువంటి సమస్యలు కాని సమస్యలను పెద్ద సమస్యలుగా ప్రజలముందు ఉంచడం ఇప్పటి వ్యవస్ధలలో అధిపత్యం వహిస్తున్న వర్గాలకు అవసరం. అవి పెద్ద సమస్యలుగా మారడానికి కావలసిన ప్రచార సామాగ్రి, వ్యవస్ధీకృతం చేయగలగడానికి అవసరమైన సమస్త ఉపకరణాలు వారి సోంతం అయినందున ప్రజలు అమాయకంగా వారి ట్రాప్‌లొ చిక్కుకుంటున్నారు. తద్వారా తమ వాస్తవ ఆర్ధిక, రాజకీయ సమస్యలపైన ఆలోచించే అవకాశం ప్రజలకు లేకుండా పోతున్నది. వాస్తవ సమస్యలపై ప్రజలు దృష్టి కేంద్రీకరించినాడు వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం సహజం. అటువంటి ప్రయత్నాలు అనివార్యంగా ఆధిపత్య వర్గాల ఆర్ధిక, రాజకీయ పెత్తనాలకు వ్యతిరేకంగా పరిణమిస్తాయి. కనుకనే లేని సమస్యలను సృష్టించి సంఘంలో వివిధ అభిప్రాయాల మద్య ఉండే సాధారణ వైరుధ్యాలను అతి పెద్ద సమస్యలుగా మార్చి తమ పబ్బం గడుపుకుంటున్నాయి అధిపత్య వర్గాలు. దీన్ని గుర్తించి ప్రజలు మేల్కొనవలసిన అవసరం ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s