ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ప్రతిభ, ఏకాభిప్రాయమే ప్రాతిపదికగా ఉండాలి తప్ప జాతీయత, దేశం కాదని ఇండియా ప్రకటించింది. యూరోపియన్ దేశం నుండి మాత్రమే ఆ పదవికి ఎన్నుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రకటించడం పట్ల ఇండియా తో పాటు ఇతర బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే తాను ఐ.ఎం.ఎఫ్ అత్యున్నత పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇ.యు ఆమెకు పూర్తి మద్దతును ఇస్తోంది. ప్రపంచ బ్యాంకును అమెరికా వ్యక్తి నాయకత్వం వహిస్తున్నందున ఆటోమేటిక్ గా ఐ.ఎం.ఎఫ్ పదవికి ఇ.యు కి చెందినవారు నియమీతులు కావాలని ఇ.యు భావిస్తున్నది. ఇప్పటివరకు ఆ సూత్రం పైనే నియామకాలు జరుగుతూ వచ్చాయి. కాని గత దశాబ్ద కాలంగా ఎమర్జింగ్ దేశాల ఆర్ధిక వృద్ధి గణనీయంగా పెరుగుదల నమోదు చేయడం, ఐ.ఎం.ఎఫ్ లొ వారి ఓటింగ్ విలువ పెరగడం వంటి కారణాలతో ఐ.ఎం.ఎఫ్ సంస్కరణలలో భాగంగా దాని ఉన్నత పదవికి కూడా ఎమర్జింగ్ దేశాల ప్రతినిధికి అవకాశం ఇవ్వాలని అవి కోరుతున్నాయి.
ఫ్రాన్సు, ఇ.యు ల అభ్యర్ధి లాగార్డేకి చైనా మద్దతు కూడా ఉందని ఫ్రాన్సు ప్రకటించింది. అయితే అది నిజం కాదని లాగార్డే కి మద్దతు ఇవ్వబోతున్నట్లుగా చైనా నుండి సూచనలేవీ లేవని ఇండియా ఈ రోజు ప్రకటించింది. ఐ.ఎం.ఫ్ లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇ.డి) అరవింద్ వీర్మణి “చైనా ఇ.డి నుండి అటువంటి సమాచారం ఏదీ మాకు అందలేదు” అని రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. “చైనా, ఫ్రాన్సుల మధ్య ప్రవేటు సమాచారాలను మోసేవాడిని కాదు నేను” అని అరవింద్ వివరించాడు. మంగళవారం బ్రిక్స్ దేశాల కూటమి ఉమ్మడి ప్రకటనను జారీ చేస్తూ ఐ.ఎం.ఎఫ్ అత్యున్నత పదవికి సామర్ధ్యం ప్రాతిపదిక కావాలి తప్ప జాతీయత కాదని ప్రకటించాయి. యూరోపియన్ వ్యక్తి మాత్రమే ఐ.ఎం.ఎఫ్ అధిపతి కావాలన్న అలిఖిత అర్ధం లేని నిబంధనను ఇకనుంచి రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందని అవి తమ ప్రకటనలో పేర్కొన్నాయి.
బ్రిక్స్ దేశాల ప్రకటన తర్వాత ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల అభ్యర్ధి ఐ.ఎం.ఎఫ్ పదవికి ఎన్నిక అవడానికి ఇండియా తెరవెనక మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో మునిగి ఉన్నదని రాయిటర్స్ తెలిపింది. అయితే ఎమర్జింగ్ దేశాల కూటమి బ్రిక్స్, ఏకాభిప్రాయ అభ్యర్ధిని ఇంతవరకు ఎన్నిక చేయలేదు. ఏకాభిప్రాయం రానట్లయితే బ్రిక్స్ కూటమి బైటి అభ్యర్ధికి
ఏకాభిప్రాయ ప్రాతిపదికన మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధమేనని ఇండియా ఇ.డి తెలిపాడు. “నామినేషన్లు ముగిసే జూన్ 10 తేదీ నాటికి ఉమ్మడి అభ్యర్ధి లభించనట్లయితే అందుబాటులో ఉన్న అభ్యర్ధులలో ఒకరిని ఎన్నిక చేసుకోవలసి ఉంది. అయితే ఆ ఎంపిక ప్రతిభ, స్వతంత్ర ఆలోచనా విధానం వైపుకి మొగ్గు చూపడం, సభ్యులందరితో సమన్వయం చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం, మారిన ప్రపంచ ఆర్ధిక వాస్తవాలకు అనుగుణంగా ఐ.ఎం.ఎఫ్ పాలన, కోటాలలో సంస్కరణలు తేవాలన్న ఉత్సుకత కలిగి ఉండడం… మొదలైన లక్షణాల ఆధారంగానే జరగవలసిన అవసరం ఉంది” అని వీర్మణి తెలిపాడు.
ఐ.ఎం.ఎఫ్ పదవీ ఎన్నికను సంస్ధలో సంస్కరణలు తేవాల్సిన అవసరాన్ని గుర్తింప జేయడానికి ఎమర్జింగ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని భారత ప్రతినిధి ద్వారా స్పష్టమవుతున్నది. ఇపుడున్న ఎన్నిక విధానాల ప్రకారం అమెరికా, ఇ.యుల మద్దతు ఉన్న అభ్యర్ధే ఎన్నీకయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓటమి ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ తమ అభ్యర్ధిని నిలబెట్టడానికి ఎమర్జింగ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఏక పక్ధంగా ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి నియమించే సంప్రదాయానికి ముగింపు పలకడానికే తమ అభ్యర్ధిని నిలబెట్టాలని అవి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇండియా లాంటి దేశాలకు చివరి క్షణంలో అమెరికా. యూరప్ లు అందించే తాయిలాలకు లొంగిపోయి తమ నిర్ణయాలనుండి జారిపోయే అలవాటు ఉంది. కొపెన్ హాగన్ లో జరిగిన పర్యావరణ సదస్సు అంగీకరించిన చట్టబద్ధం కాని ఒప్పందం అందుకు ఒక ఉదాహరణ. అయినా పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలని మాట మాత్రంగానైనా ఎమర్జింగ్ దేశాలు ప్రయత్నించడాన్ని అహ్వానిస్తూ వారి ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం!