అమెరికాకు పాకిస్ధాన్ “తలాక్! తలాక్!! తలాక్!!!” చెప్పనున్నదా?


జరుగుతున్న పరిణామాలు అమెరికా పట్టునుండి పాకిస్ధాన్ జారిపోనున్నదా అన్న అనుమాలు కలగజేస్తున్నాయి. పాకిస్ధాన్ నుండి అమెరికా మనుషుల (ప్రత్యేక భద్రతా బలగాలు లేదా సి.ఐ.ఏ గూఢచారులు) సంఖ్యను సగానికి తగ్గించాల్సిందిగా పాకిస్ధాన్ మిలట్రీ అమెరికాను డిమాండ్ చేసింది. పాకిస్ధాన్ మిలట్రీ కోరిక మేరకు తమ పాకిస్ధాన్ నుండి తమ మనుషులను వెనక్కి పిలిపిస్తున్నామని అమెరికా కూడా ప్రకటించింది. “అనవసరమైన మనుషులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాకు సాయం చేయడానికి బదులు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారు” అని పేరు చెప్పడానికి ఇస్టపడని ఒక పాక్ భద్రతాధికారి చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. జూన్ నుండి వాళ్ళు వెళ్ళిపోవడం మొదలవుతుందని ఆ అధికారి చెప్పాడు.

Laden cartoons

ఒకే మంచంపై లాడెన్, పాక్!!!

[చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉందో నాకూ తెలుసు. కాని నన్ను నమ్ము! నీలాగే నాక్కూడా షాకింగ్‌గా ఉందిది. ఒట్టు!!]

అమెరికా గూఢచారులు ఎంతమంది పాకిస్ధాన్‌లో ఉన్నదీ అధికారికి సమాచారం ఏదీ లేదు. పెంటగాన్ ప్రతినిధి కల్నల్ డేవ్ లపాన్ “మొత్తం మిలట్రీ మిషన్ 200 నుండి 300 వరకు ఉండొచ్చని చెప్పినట్లు రాయిటర్స్ సంస్ధ తెలిపింది. పాకిస్ధాన్ లో ఉన్న అమెరికా, పాక్ అధికారులు ప్రత్యేక బలగాల సంఖ్య 120 అనీ వారిని 50 కంటే తక్కువకు తగ్గిస్తామనీ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యేక బలగాలు కాకుండా ఇతరులు హెలికాప్టర్ల నిర్వహణకూ, పాక్ మిలట్రీతో సంబంధాలు నిర్వహించడానికీ, సహాయ కార్యాకలాపాల నిర్వహణకూ ఉన్నారని తెలిపారు. వీరి సంఖ్యను తగ్గించేదీ లేనిదీ తెలియలేదు. లాడెన్ హత్యకు అమెరికా హెలికాప్టర్లు రావడం పాక్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో సి.ఐ.ఏ గూఢచారులు కూడా ప్రతి పట్టణంలో తిష్టవేయడం, వారిలొ కొందరు అనుమానం రాకుండ ఉండటానికి పాక్ యువతులను వివాహమాడటం ఇవన్నీ బైటపడ్డాక పాక్ ప్రజల్లో అమెరికా పట్ల ఆగ్రహావేశాలు మరింత తీవ్రమైనాయి.

మరోవైపు, లాడెన్ అబ్బోత్తాబాద్ లో చాలా కాలంనుండి రక్షణ పొందడం వెనక ఐ.ఎస్.ఐ హస్త ఉన్నదని అమెరికా కాంగ్రెస్, సెనేట్ లలో చాలామంది భావిస్తున్నారు. టెర్రరిజం పై యుద్ధం కోసం పాకిస్ధాన్‌కి 20.7 బిలియన్ డాలర్లమేరకు అందించింది. ఈ సహాయం పూర్తిగా టెర్రరిజం నిర్మూలనకే ఖర్చు చేస్తున్నారని ఎవరికీ, అమెరికాకి కూడా నమ్మకం లేదు. అందులో చాలా భాగం విదేశీ ఎకౌంట్లలోకీ, పాక్ బడ్జెట్ లోకీ, కొన్నిసార్లు ఐ.ఎస్.ఐ ద్వారా తాము పోరాడుతున్నామని చెపుతున్న టెర్రరిస్తుల చేతికే వెళ్తున్నదన్న అనుమానాలు దండిగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ అనుమానాలు గుసగసలుగా ఉన్నాయే తప్ప నిర్ణయాత్మకంగా బైటికి రాలేదు. లాడెన్ హత్యతో ఈ గుసగుసలు ప్రకటనలైనాయి. కాంగ్రెస్ సభ్యులు కొంతమంది పాక్ కి ఇక సహాయం ఇవ్వరాదని డిమాండ్ కూడా చేస్తున్నారు.

పాకిస్ధాన్, అమెరికాల మధ్య అభిప్రాయ భేదాలు, అనుమానాలు ఒక ఎత్తైతే, పాకిస్ధాన్ లోనే వివిధ అధికార కేంద్రాల మధ్య ఉన్న తగాదాలు మరొక ఎత్తు. అమెరికా సాయం వినియోగం పట్ల పౌర ప్రభుత్వానికీ, మిలట్రీకీ మధ్య తగాదాలు జరుగుతున్న విషయం వికీలీక్స్ ద్వారా వెల్లడయ్యింది కూడా. 2009లో పాక్‌‌లోని అమెరికా రాయబారి రాసిన ఒక కేబుల్‌లో అమెరికా నేరుగా మిలట్రీకి అందిస్తున్న సహాయం ఎంతో తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని అమెరికా రాయబారిని పాక్ ఆర్ధిక మంత్రి షాకత్ తారిన్ కోరినట్లు రాసినట్లు వెల్లడయ్యింది. “మాకు మిలట్రీ జనరల్ కయాని ఆ సమాచారం ఇవ్వడు” అని కూడా తారిన్ చెప్పినట్లు వెల్లడయ్యింది. అంతేకాక పాక్ అధికారులు టెర్రరిజంపై పోరాడేందుకు అయ్యే ఖర్చుని మిలట్రీ ఎక్కువ చేసి చూపుతున్నదనీ, ఆ నిధులు ప్రవేటు ఖాతాలకు వెళ్తున్నదని అనుమానిస్తున్నారు. పాక్ ప్రభుత్వమే ఈ నిధులను సామాజిక కార్యక్రమాలకు మళ్ళిస్తున్న అనుమానాలను కూడా రాయబారి తన కేబుల్ లో రాశారు.

టెర్రరిస్టు వ్యతిరేక పోరాటం కోసం నెలకొల్పిన నిధినుండి అమెరికా ఇప్పటివరకు 8.8 బిలియన్ డాలర్లు పాక్‌కి తిరిగి చెల్లించిందని రాయిటర్స్ తెలిపింది. ఇందులో గణనీయమైన మొత్తం ఇండియాకి వ్యతిరేకంగా పాక్ మిలట్రీ సామర్ధ్యాన్ని పెంచడానికి వినియోగిస్తున్నారేమోనని అమెరికా అధికారులకు బలమైన అనుమానాలున్నాయి కూడా. పాక్‌కి అమెరికా గత దశాబ్ద కాలంలొ అందించిన 20.7 బిలియన్ డాలర్లలో మూడో వంతు మిలట్రీ సాయంగా అందించిందని తెలుస్తోంది. ఇది మొత్తం టెర్రరిస్టుల నిర్మూలనకే ఖర్చయ్యిందో, టెర్రరిస్టుల పోషణకే ఖర్చయ్యిందో లేక ఇండియాకి వ్యతిరేకంగా ఖర్చయ్యిందో తెలియక అమెరికా రాయబారి నుండీ, పెంటగాన్ మిలట్రీ అధీకారుల వరకూ అనుమానిస్తున్నా ఏమీ చేయలేని పరిస్ధితి అమెరికాది. ఆఫ్ఘన్ తాలిబాన్, పాకిస్ధాన్ భూభాగంపై రక్షణ పొందుతున్నందున పాక్ సహాయం అమెరికాకి తప్పని సరి.

ఈ నేపధ్యంలోనే పాక్ డిమాండ్ మేరకు తన ప్రత్యేక బలగాలను సగంకంటే తగ్గించడానికి అమెరికా అంగీకరించిందని భావించవచ్చు. అసలు అమెరికా, పాకిస్ధాన్ మధ్య సంబంధాలలో ఎవరిది పైచేయి? కొద్దిమంది అమెరికా అవసరాల రీత్యా పాక్‌దే పైచేయి అంటున్నారు. “అమెరికా పాకిస్ధాన్‌ని తన క్లయింటు రాజ్యంగా భావిస్తుంది. ఒక్క అమెరికా తప్ప మరే ఇతర దేశమూ ఆ విధంగా మరోక దేశాన్ని చూడదు. అవసరమైనప్పుడల్లా అమెరికా చేసే డిమాండ్లన్నంటినీ పాక్ అధికారులు అంగీకరించక తప్పదని అమెరికా నమ్ముతుంది. పాకిస్ధాన్‌తో అమెరికాకి ఉన్న సుదీర్ఘ సంబంధం లో ఈ తప్పు దృకపధమే రాజ్యమేలింది” అని దిలీప్ హిరో అనే పాక్-అమెరికా సంబంధాల నిపుణుడు చెబుతున్నాడు.

దిలీప్ హిరో అంచనా ప్రకారం ఇరు దేశాల సంబంధాల్లో వాస్తవంలొ, కనీసం రెండు అంశాల్లో పాకిస్ధాన్ దే పైచేయి. ఒకటి, ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్న అమెరికా (లేదా నాటో) సైన్యానికి సరఫరాలు అందించే భూమార్గం పాకిస్ధాన్ నియంత్రణలో ఉంది. దీన్ని ఎప్పుడు కావాలనుకుంటె అప్పుడు పాక్ మూసెయ్యవచ్చు. అలా చాలా సార్లు మూసింది కూడా. డ్రోన్ దాడులు జరిగినప్పుడు పాక్ ప్రజలు నిరసన మరీ ఎక్కువగా ఉంటే ఈ మార్గాన్ని పాకిస్ధాన్ మూస్తుంది. ఇంకా ఇతర అవసరాలకి కూడ మూసేసిన ఉదాహరణలున్నాయి. రెండు, పాక్ చేతిలో చైనా దృష్టిని ఆకర్ధించగల అస్త్రం ఉంది. ఇది వ్యూహాత్మకమైన అస్త్రం. వివిధ దేశాల మధ్య పాక్, ఆఫ్ఘన్ లు ఉన్న స్ధానం వ్యాహాత్మకంగా కీలకమైనది. ఆ స్ధానంలోకి చైనా ఆధిపత్యాన్ని ఆహ్వానించగల చతురత పాకిస్ధాన్ తరచూ ప్రదరిస్తుంది. లాడెన్ హత్యానంతరం అమెరికా కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, పాక్ ప్రధాని కొన్ని రోజుల క్రిందట చైనా పర్యటించిన సంగతి విదితమే.

అంటే అమెరికానుండి పాకిస్ధాన్ దూరమైన పక్షంలో పాకిస్ధాన్ తన భూభాగంలోని కీలక ప్రాంతాన్ని చైనాకు వ్యాహాత్మకంగా అప్పజెప్పడం ద్వారా బహుళ ధృవ ప్రపంచ వైపుకి ప్రపంచ రాజకీయాలని నెట్టగల ప్రమాదం తలెత్తవచ్చు. ఇప్పుడంటే ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నమై ఏక ధృవ ప్రపంచం పోయి బహుళ ధృవప్రపంచ ఆవిర్భవిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు గాని నిన్న మొన్నటి వరకు అమెరికా ఒక్కటే ప్రపంచ ఆర్ధిక, రాజకీయ వ్యవహారాల్లో కేంద్రంగా హోదా వెలగబెట్టిన సంగతి తెలిసిందే. దురాక్రమణ యుద్ధాల ద్వారా ఆ హోదాని నిలబెట్టుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. చైనాతో దొస్తీ పాకిస్ధాన్ కి అమెరికాతో దోస్తీ అంత కఠినం కాదని పాక్‌కి తెలుసు.

కానీ అమెరికా సరఫరాల రూట్ ని మూసేస్తే అమెరికాకి ప్రత్యామ్నాయం లేదా. ప్రత్యామ్నాయం ఉందని నాటో దళాలకు సరఫరాలు చేయడానికి బాధ్యుడైన అధికారి జనరల్ మిచెల్ స్టీవెన్‌సన్ ఓ సెనేట్ కమిటీ ముందు ఇటీవల సాక్ష్యం ఇచ్చాడు. “పాకిస్ధాన్ భూభాగం కిలకమైనదే అయినప్పటికీ అది మూసినంత మాత్రాన మన సరఫరాలు ఆగవు” అని ఆయన చెప్పాడు. “పాకిస్ధాన్ గుండా వెళ్ళే దక్షీణ రూట్లను పూర్తిగా ఆ దేశం మూసేసినట్లయితే ఉత్తరాన హెలికాప్టర్లు, విమానాలు ద్వారా జారవిడిచే భాగాన్ని రెట్టింపు చేయడం ద్వారా దాన్ని పూడ్చుకోవచ్చు” అని మిచెల్ సెనేట్ కమిటీకి తెలిపాడు. అయితే అంతటితో పాకిస్ధాన్ తో ఉన్న బలహీనతను అమెరికా అధిగమించినట్లేనా?

కాదని డేవిడ్ బ్లూమెంధాల్ వివరిస్తున్నాడు. ఆయన ప్రకారం పాక్‌తో దోస్తీ వలన చైనాకి మూడు ప్రయోజనాలున్నాయి. ఒకటి, పాకిస్ధాన్ తో చెలిమి ద్వారా ఆర్ధికంగా, సైనికంగా చైనాని అధిగమించాలన్న కోరికనుండి ఇండియా దృష్టిని మళ్ళించవచ్చు. అప్పుడు చైనాని అధిగమించే ఆలోచన పక్కకు వెళ్ళి పాక్, చైనాల చెలిమి గురించి ఇండియా బెంగ పెట్టుకుంటుందని ఆయన అభిప్రాయం. రెండు, హిందూ మహా సముద్రంలో పోర్టుల నిర్వహణ ద్వారా దక్షిణాసీయా ప్రాంతంలో సముద్ర మార్గాలపై ఆధిపత్యం సాధించడం. మూడు, పాకిస్ధాన్ సహాయంతో చైనా పశ్చిమ రాష్ట్రం క్సిన్‌జియాంగ్ రాష్ట్రంలోకి ముస్లిం తీవ్రవాదులు రాకుండా అరికట్టడం. ఈ రాష్ట్రంలోని యూఘిర్లు చైనాలోని హాన్ జాతి ఆధిపత్యంపై పోరాడుతున్నారు. వారూ ముస్లింలు ఐనందున పాక్ నుండి తీవ్రవాదం తమ రాష్ట్రంలోకి వ్యాపిస్తుందని చైనాకి భయాలున్నాయి.

విదేశాల్లో మిలట్రీ స్ధావరాల ఏర్పాటు గురించి చైనా ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడక పోయినప్పటికీ అధికారిక వార్తా సంస్ధలు ఆ కోరికను అప్పుడప్పుడూ వెల్లడిస్తూనే ఉన్నాయి. చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఏం రాస్తున్నదో చూడండి. “అంతర్జాతీయ కమ్యూనిటీ కోరుతున్నట్లుగా అంతర్జాతీయంగా, ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలోనూ చైనా నాయకత్వ పాత్ర పోషించదలుచుకుంటె చైనా విదేశాల్లో సైనిక స్ధావరాలను ఏర్పరచుకొవలసిన అవసరం ఉంది. అది ఆయా దేశాల సహకారంతో చేయవలసి ఉంటుంది. చైనాకూ ఇతర ప్రాంతీయ శక్తులకు మద్య ఆర్దిక, సాంస్కృతిక సహకారంతో పాటు మిలట్రీ సహకారం కూడా పెంపొందాల్సిన అవసరం ఉంది. ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలోనూ, ప్రపంచంలోనూ చైనా మరిన్ని భాద్యతలు నిర్వాహించాలని ప్రపంచం నిజంగా కోరుకుంటున్నట్లయితే అంతర్జాతీయ మిలట్రీ సహకారాలలో చైనా అడుగుపెట్టడానికి అది అనుమతించాలి. విదేశాల్లో చైనా మిలట్రీ స్ధావరాలను నెలకొల్పవలసిన అవసరాన్ని అది అర్ధం చేసుకోవాలి” ఇక్కడ సందేశం స్పష్టంగానే ఉంది. ప్రాంతీయ శక్తులు చైనా మిలట్రీ స్ధావరాలను అర్ధం చేసుకుని అనుమతించాలి అని స్పష్టంగానే కోరుతోంది.

ఇది ఆలోచనగా కాదు ఆచరణలో కూడా ఉన్నదని తెలుస్తోంది. గిల్గిత్-బలూచిస్ధాన్‌లో ఇప్పటికే చైనా సైనికుల ఉనికి పెరుగుతున్నదని దక్షిణాసియా అధ్యయన సంస్ధ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. అదీకాక అక్టోబరు 2010 లో చైనా ప్రతినిధి బృందం పాకిస్ధాన్-ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దును సందర్శించిందని మిడిల్-ఈస్టు మీడియా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఒక అధ్యయనంలో తెలిపింది. కనుక అమెరికా పాకిస్ధాన్ ల మద్య నేరుగా ఘర్షణ జరిగినట్లయితే, సంబంధాలు చెడినట్లయితే చైనా పాత్ర అనివార్యం కావచ్చని సూచనలు ఇప్పటికే అందుతున్నాయని భావించవచ్చునేమో. అదే జరిగితే అమెరికా పాకిస్ధాన్ ల బంధం తలాక్ అయినట్లయితే, దాని ప్రభావం అనివార్యంగా మిగతా ప్రపంచంపై పడి ఊహించని పరిణామాలకు దారితీస్తుండనడంలో ఎట్టి సందేహమూ లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s