ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డొమినిక్ స్ట్రాస్ కాన్ లైంగిక ఆరోపణలతో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవి కోసం పశ్చిమ దేశాలూ, ఎమర్జింగ్ దేశాలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ (BRICS) గ్రూపుకి చెందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ అఫ్రికా దేశాలు ఈసారి ఎమర్జింగ్ దేశాలకు చెందినవారిని ఐ.ఎంఎఫ్ పదవికి నియమించాలని కోరుతున్నాయి. కానీ యూరప్ అప్పు సంక్షోభంలో మరిన్ని దేశాలు జారిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నందున, సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఐ.ఎం.ఎఫ్ సహాయం అవసరమనీ, కనుక యూరప్ దేశాలకు చెందిన వ్యక్తిని ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని నియమించాలనీ యూరప్ కోరుతోంది. ప్రస్తుతం అప్పు సంక్షోభంలో ఉన్న గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలకు అందించిన అంతర్జాతీయ బెయిలౌట్ ప్యాకేజీలో మూడో వంతు భాగాన్ని ఐ.ఎం.ఎఫ్ భరిస్తున్నది.
మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఎన్నుకునే విధానం పట్ల బ్రిక్స్ దేశాలు అభ్యంతరం వ్యక్తిం చేస్తున్నాయి. అభ్యర్ధి జాతీయతను బట్టి పదవికి ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. జాతీయతను బట్టి తగిన అభ్యర్ధిని నిర్ణయించినట్లయితే అది ఐ.ఎం.ఎఫ్ విశ్వసనీయతకు భంగం కలిగినట్లే నని ఆ దేశాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డె ఐ.ఎం.ఎఫ్ పదవికి అర్హుడుగా బహుళ ప్రచారం పొందాడు. కనుక ఎమర్జింగ్ దేశాల గ్రూపు బ్రిక్స్ వాదనకు పెద్దగా విలువ లభించే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా ఐరోపాలు ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల అత్యున్నత పదవులను తమ మద్య పంచుకునే సాంప్రదాయణ్ ఉన్నది. దాన్ని ఇప్పట్లో అతిక్రమించే అవకాశాలు పెద్దగా లేవు.
వాషింగ్టన్లోని ఐ.ఎం.ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఈ ఐదు దేశాలకూ ప్రతినిధులయిన అధికారులు ఉమ్మడిగా ఒక ప్రకటనను విడుదల చేశారు. “ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఐరోపాకి చెందిన వ్యక్తే కొనసాగాలంటూ యూరప్ కి చెందిన అత్యున్నత అధికారులు ఈ మద్యకాలంలో ప్రకటనలు చేయడం మాకు ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్ర పెరుగుతోంది. ఈ నేపధ్యంలో, అభివృద్ధి చెందిన దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం ఈ మారుతున్న పరిస్ధితులను ప్రతిబింబించే విధంగా, ప్రపంచ ద్రవ్య సంస్ధల్లో సంస్కరణలు తేవలసిన అవసరాన్ని ఎత్తి చూపింది” అని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటన యూరప్ దేశాలపై నేరుగా విసరబడిన సవాలని బిబిసి అభిప్రాయపడింది.
బ్రిక్స్ దేశాలు, ఏదైనా ఎమర్జింగ్ దేశంనుండి పోటీ చేసే అభ్యర్ధికి మద్దతునిచ్చినట్లయితే 24 సభ్యులుగల ఐ.ఎం.ఎఫ్ బోర్డుకు మేనేజింగ్ డైరెక్టరును నియమించడం కష్ట సాధ్యంగా మారుతుందని భావిస్తున్నారు. ఐ.ఎం.ఎఫ్ లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచి తమకు సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించాలని ఎమర్జింగ్ దేశాలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నాయి. అయితే యూరప్ కి చెందిన అనేకమంది ప్రభావశీలురైన నాయకులు, అధికారులు లాగార్డే అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తున్నారు. ఆమె బుధవారం తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గురువారం ప్రారంభం కానున్న జి-8 గ్రూపు దేశాల సమావేశానికి ముందే ఆమె ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తొంది.
కెన్నెత్ రాగాఫ్ లాంటి ఐ.ఎం.ఎఫ్ మాజీ అధిపతిలాంటివారు ఎమర్జింగ్ దేశాల వ్యక్తికి ఈ సారి పదవిని అప్పజెప్పాలని గట్టిగా వాదిస్తున్నారు. ఆటోమేటిక్ గా ఐ.ఎం.ఎఫ్ పదవి యూరప్ కి చెందే రోజులు గతించాయనీ, ఎమర్జింగ్ దేశాల డబ్బును ఐ.ఎం.ఎఫ్ పెద్దమొత్తంలొ పొందుతున్నందున వారికి పదవి ఇవ్వడం న్యాయమనీ ఆయన చెప్పాడు. ఆసియా దేశాల విశ్లేషకులు, ఆర్ధికవేత్తలు పలువురు పదవికి అభ్యర్ధిని ఎన్నుకునే విధానం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్త్తం చేస్తున్నారు.