పాకిస్ధాన్ మిలట్రీని పరిహసిస్తూ తిట్టిపోస్తున్న పాక్ మీడియా


Karachi navy base terror attack

కరాచి నావల్ బేస్‌పై టెర్రరిస్టుల దాడి

వరుసగా ఎదురవుతున్న అవమానాలతో పాక్ మిలట్రీ అందరినుండీ దూషణలను, తిరస్కారాలనూ ఎదుర్కొంటోంది. అమెరికా కమెండోలు పాక్ లోకి జొరబడి లాడెన్ హత్య చేయనున్న విషయం తమకు తెలియకుండా జరిగిందని చెప్పడం, సి.ఐ.ఏ గూఢచారులు వందల సంఖ్యలో పాక్‌లో ఉన్నట్లు వెల్లడి కావడం, ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపినా సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ను ఏ శిక్షా లేకుండా విడిచిపెట్టడం, అవసరమైతే ఇంకోసారైనా పాక్‌లో జొరబడ్డానికి వెనకాడం అని ఒబామా ప్రకటించినా అదేమని అడగకుండా నోర్మూసుకుని ఉండడం, తాజాగా కేవలం ఆరుగురు మిలిటెంట్లు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని చెప్పే కరాచి నావల్ బేస్ పై దాడి చేసి 16 గంటలపాటు పాక్ సైనికులను నిలువరించడమే కాక అందులో ఇద్దరు తప్పించుకుని పోవడం… ఇవన్నీ పాకిస్ధాన్ మిలట్రీకి, ప్రభుత్వానికి తీరని అవమానాలను మిగిల్చాయి. సదరు నావల్ బేస్ లోనే పాకిస్ధాన్ కి చెందిన అణ్వాయుధాలు భద్రపరిచారని వార్తలు ఉన్న నేపధ్యంలో సోమవారం నాటి మిలిటెంట్ల దాడి పాకిస్ధాన్ మిలట్రీకి ఘోరమైన అవమానంగా మిగిలింది. ఒక ముఖ్యమైన సైనిక స్ధావరాన్నే రక్షించుకోలేని వారు దేశాన్నేం రక్షిస్తారని సామాన్య ప్రజలు సైతం ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

సోమవారం నాడు మిలిటెంట్లు హఠాత్తుగా కరాచిలోని పి.ఎన్.ఎస్ మెహ్‌‌రాన్ నావల్ బేస్ లోపలికి చొరబడి అక్కడ ఉన్న భవనాన్ని ఆక్రమించుకున్నారు. భీకరంగా కాల్పులు పేలుళ్ళు ప్రారంభించారు. దాడి ప్రారంభం కాగానే తాలిబాన్ దాడికి బాధ్యురాలిగా ప్రకటించుకుంది. మిలిటెంట్లవద్ద అధునాతన ఆయుధాలున్నాయని, మూడు రోజులకు సరిపడా ఆహారం ఉందనీ లాడేన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ దాడి అనీ తాలిబాన్ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్ధాన్ కు ఆయుధాల పరంగా పెద్ద నష్టమే కలిగింది. అమెరికా సరఫరా చేసిన రెండు పి-3సి విమానాలను మిలిటెంట్లు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విమానాలు జలాంతర్గాములను ధ్వంసం చేయగల శక్తి కలిగినవి. అలాగే సముద్రంపై పహారా కాయగల శక్తి కూడా వీటికి ఉంది. కొన్ని భవనాలు దాడి దరిమిలా జరిగిన పేలుళ్ళలో ధ్వంసం అయ్యాయి. కొన్ని ఇతర హెలికాప్టర్లు కూడా నాశనమైనట్లు తెలుస్తోంది. పాక్ ఇంటీరియర్ మంత్రి రెహ్మాన్ మాలిక్ ముగ్గురు మిలిటెంట్లను చంపామనీ, మరొకరు భవన శిదిలాలకింద ఉన్నట్లు భావిస్తున్నామనీ, మరో ఇద్దరు తప్పించుకున్నారని తెలిపాడు. దాడి ప్రారంభమైనప్పుడు డజన్లకొద్దీ మిలిటెంట్లు దాడిలో పాల్గొన్నారని భావించినప్పటికీ చివరికి ఆరుగురే అని తేలింది.

దాడి అనంతరం పాకిస్ధాన్ తాలిబాన్ ప్రతినిధి ఎహసానుల్లా ఎహసాన్ రాయిటర్స్ వార్తా సంస్ధతో మాట్లాడాడు. “ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మా పోరాట యోధుల వద్ద ‘నమ్మకం’ అనే శక్తివంతమైన ఆయుధంతో పాటు అధునాతన ఆయుధాలు ఉన్నాయి. అందుకే వందలకొద్దీ సైనిక బలగాలకు ఎదురొడ్డి పోరాడి, వారి ఆయుధాలకు భారీ నష్టం కలిగించగలిగారు” అని ఆయన తెలిపాడు. సాధారణంగా పాక్ మిలట్రీకి మద్దతు వచ్చే మీడియాలో కొన్ని సంస్ధలు ఈ సంఘటనతో మిలట్రీని పరిహసించాయి. మరికొన్ని తిట్టిపోశాయి. ‘ది న్యూస్’ అనే ఆంగ్ల దిన పత్రిక “రాజకీయ వాగాడంబరం, కేబినెట్ డిఫెన్స్

కమిటీ సమావేశాలు ఈ సమస్యకు పరిష్కారం కాబోవు” అంటూ పరిహాసంతో ఎడిటోరియల్ రాసింది. “ఇదొక చారిత్రాత్మక వైఫల్యం. చారిత్రాత్మక నాయకత్వం మాత్రమే ఈ పరిస్ధితిని ఎదుర్కోగలదు” అని ఆ పత్రిక ముక్తాయించింది. ఉర్దూ పత్రిక ‘జంగ్’, పాకిస్ధాన్ మిలట్రీకి గట్టి మద్దతుదారు. అణ్వస్త్రం సామర్ధ్యానికి పూర్తి మద్దతు ఇస్తుంది. ఆ పత్రిక “భద్రతా చర్యల్లో కొట్టవచ్చినట్లు లోపాలు కనిపిస్తున్నాయి” అని వ్యాఖ్యానించింది. “అత్యంత మర్యాదకరమైన భాషలో చెప్పాలంటే దీనిని బాధాకరమైన నిర్లక్ష్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది” అని పేర్కొన్నది.

మరో ఆంగ్ల పత్రిక ‘డాన్’, సామర్ధ్య రాహిత్యం అంటు పరుష పదజాలం ఉపయోగించింది. సైన్యంలోనే తాలిబాన్‌కి సహకరించినవారున్నారని అనుమానించింది. “నావల్ బేస్ లోపలి సమాచారం తాలిబాన్ మిలిటెంట్లకు ముందే సమాచారం ఉందా? అందుకుగల అవకాశాలను పూర్తిగా కొట్టిపారవేయలేం. ఎందుకంటే గతంలో జరిగిన అనేక దాడుల్లో సైన్యం లోపలివారి పాత్ర ఉన్నసంగతి రుజువైంది” అని రాసింది. అక్టోబరు 2009లో రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఇటువంటి దాడే జరిగింది. అప్పడు 42 మంది సైనికాధికారులను మిలిటెంట్లు నిర్బంధంలోకి తీసుకున్నారు. రోజంతా కొనసాగిన ఆ దాడిలో 9 మంది మిలిటెంట్లు, 11 మంది సైనికులు, ముగ్గురు బందీలు చనిపోయారు. తర్వాత జరిగిన దర్యాప్తులో కింది స్ధాయి సైనికులు, అధికారులు అనేకమంది దాడికి సాయపడినట్లుగా తేలింది.

తాజా కరాచి దాడిలో లోపలివారి సాయం ఉన్నదీ లేనిదీ చెప్పడానికి తాలిబాన్ ప్రతినిధి ఎహసాన్ నిరాకరించినట్లు రాయిటర్స్ తెలిపింది. “కరాచిలో ఉన్న స్ధానిక మిత్రులు ఈ ఆపరేషన్‌లో సహాయం చేశారు. అయితే నావల్ బేస్ లోపల ఎవరైనా సాయపడిందీ లేనిదీ నేను చెప్పను” అని చెప్పినట్లుగా వార్తా సంస్ధ తెలిపింది. పాకిస్ధాన్‌లోని జీహాదీ గ్రూపులపై అధ్యయనం చేసి ఓ పుస్తకం కూడా రాసిన అమీర్ రాణా అనే నిపుణుడు పాక్ తాలిబాన్ నేరుగా ఈ అపరేషన్ పాల్గొనడం పట్ల సందేహం వ్యక్తం చేశాడు పంజాబ్ లోని ఆల్-ఖైదా మిత్ర గ్రూపు ఈ అపరేషన్ నిర్వహించి ఉండవచ్చని ఆయన తెలిపాడు.  ఆఫ్ఘన్ సరిహద్దు వద్ధ ఉన్న దక్షిణ వజీరిస్ధాన్ రాష్ట్రంలోని పాక్ తాలిబాన్ పై పాక్ సైన్యం 2009లో యుద్ధం ప్రకటించింది. కొన్ని విజయాలను కూడా సాధించినట్లు వార్తలు ఉన్నాయి. సాపేక్షికంగా 2010 సంవత్సరం పెద్దగా ఘటనలు లేవని చెప్పవచ్చు. అయితే ఈ కాలంలో పాక్ తాలిబాన్ తన సంబంధాలను విస్తృత పరచుకున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు. ఇవి తాజా దాడులకు ఉపయోగపడుతున్నాయని వారి అంచనా. మే 2న లాడెన్‌ను చంపామని అమెరికా ప్రకటించాక “ఇప్పుడు పాక్ మిలట్రీ, ప్రభుత్వం మా మొదటి లక్ష్యం. అమెరికా రెండో లక్ష్యం” అని తాలిబాన్ చెప్పినట్లు రాయిటర్స్ సంస్ధ తెలిపింది. తమ లక్ష్యాలను తాలిబాన్ అనుకున్నట్లే సాధిస్తున్నదా?

4 thoughts on “పాకిస్ధాన్ మిలట్రీని పరిహసిస్తూ తిట్టిపోస్తున్న పాక్ మీడియా

 1. అందుకే చెడపకురా చెడేవు అనే మన చక్కని తెలుగు సామెతను పాకీలకు అర్థం అయ్యేట్లు , వారి బాషలోకి అనువదించి ఎవరైనా చెబితే బాగుండు(అమెరికన్లు అయితే బహు చక్కగా చెప్పగలరు కాని మీకు కోపం వస్తుంది అమెరికా అంటే ).
  మీరు చాలా చక్కగా ఓపికగా ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనలని మీ విశ్లేషణలని అంతర్జాతీయ స్థాయిలో చక్కని తెలుగులో అంధిస్తున్నందుకు మీకు నా అభినందనలు.

 2. వాసుగారూ, కొపగించుకునే హక్కు నాకెక్కడిదండీ? కాకుంటే చర్చకు ప్రయత్నిస్తానంతే. పాక్ ప్రభుత్వానికిగానీ, మిలట్రీకి గానీ బుద్ధి చెప్పాల్సింది అక్కడి ప్రజలనేది నా అభిప్రాయం.

  ఈరోజు పాక్‌కి బుద్ది చెబితే రేపు మన పాలకులకీ చెప్పడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. ఆఫ్ఘన్ లొ తిష్ట వేస్తున్నది చైనా, ఇండియాలను కాచుకోడానికే. లేకుంటే ఆ ఎడారులు దానికెందుకు చెప్పండి. పాత యు.ఎస్.ఎస్.ఆర్ దేశాల్లోని ఎనర్జీ నిలవలు, మిడిల్ ఈస్టులో ఇజ్రాయెల్ కి సమర్ధనగా ఇరాన్‌పై చెకింగ్, ఎమర్జింగ్ దేశాలుగా ముందుకొస్తున్న చైనా, ఇండియాలపై చెకింగ్ (ముఖ్యంగా చైనా, ఆ తర్వాత ఇండియా), ఇండియాని మెల్లగా తన కేంపులోకి లాక్కోవడం… వీటన్నింటికీ ఆఫ్ఘనిస్ధాన్ కీలకం. అందుకే దానిపై దాడి. లాడెన్, తాలిబాన్, ఆల్-ఖైదా ఇవన్నీ వంకలే. దాని వంకల్ని మనం మన సమస్యలుగా చేసుకుంటున్నాం. అమెరికా గత చరిత్ర వెలుగులో వర్తమానాన్ని పరికిస్తే దాని ఎత్తుగడలు అర్ధమవుతాయ్.

  నాతో ఒప్పుకోమని కాదు. ఆ దృష్టిలో చూడ్డానికి ప్రయత్నిస్తే మీరూ అదే అంటారేమో!

 3. మీరు చెప్పేదానిలో చాలా భాగం నిజమని ఒప్పుకున్నా, మరి రష్యా కూలబడిపోయింది,చైనాని నమ్మలేము,ఇంగ్లాండ్ అమెరికా తమ్ముడే,బ్రెజిల్ మనకు పెద్దగా ఉపయోగపడదు,ఇతర యూరప్ దేశాలు నాటో కూటమిలో భాగాలే కాబట్టి వాటి స్వంత ప్రయోజనాలేతప్ప మనగురించి 100 శాతం నమ్మదగిన మిత్రదేశాలెవరు.జపాన్ కూడా మనకు పెద్ద ఆదారపడదగిన దేశం కాదు(మన అణు విధానం వీరికి నచ్చదు),ఫ్రాన్స్ వారి వ్యాపార సాంసృతిక అవసరాలకోసం తప్ప మనతో పెద్ద చెలిమి చేయదు.మన దేశం తప్ప ప్రపంచములో ముప్పతిక దేశాలు బలహీన దేశాలపైకి దండెత్తి దోచుకున్నాయి ఇప్పటికి కొనసాగిస్తున్నాయి.మన జీవితాలలోనే ఇస్టంలేని ఎందరో వ్యక్తులతో రాజీపడగా లేనిది ఎన్నొ విషయాలలో అగ్రగామి అయిన అమెరికాని మనం గుడ్డిగా వ్యతిరేకించి ఎలా ముందుకు వెళ్ళగలం. శాంతి కోసం శత్రువులతోనే సంధి చేసుకుంటాం. మరి మన శత్రువు కాని అమెరికాని మనం ఎలా కాదనగలం. మనం ఇప్పుడు అమెరికా ఆదిపత్యానికి వ్యతిరేకంగా గళం విప్పి వ్యతిరేకించి ఆఫ్గనిస్తాన్,ఇరాక్ కొరియా,పాకిస్తాన్ లనుండి అమెరికాని తరమగలమా.
  గట్టిగా చెప్పాలంటే మన దేశం మ్యాపుని సరిగ్గా మన అదికారిక జాలలలో(వెబ్‌సైటు) ప్రదర్శించుకోలేము,20 మంది తీవ్రవాదుల చిట్టాని సరిగ్గా పాకిస్తానుకి పంపలేము,ఉరిశిక్షపడ్డ తీవ్రవాదులని ఉరి తీయలెము మనకెందుకు సారు అమెరికా ఆదిపత్యం గొడవ. మనం అవునన్న కాదన్న వాళ్ళు(అమెరికా) చేయాలనుకున్నది చేస్తారు.
  మనం చైనా కంటే అభివృద్ది సాదిస్తే,భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం వస్తే, కాంగ్రెస్ పార్టి కనుమరుగైపోతే,మనం అన్నింటిలో స్వయం సంవ్రుద్ది సాధిస్తే,నూరుశాతం అక్షరాస్యత సాధన,బుర్ర వాడగల రాజకీయులు,అదికారులు మనసా వాచా దేశంకోసం పనిచెస్తే,మన రైతులు పండించిన దాన్యాన్ని గోనెసంచులలో బద్రపరచి సవ్యంగా వాడుకోగలిగితే అప్పుడు అమెరికా సంగతి చూడచ్చు.
  మీరు ఆశించినట్లే అమెరికా తోక కత్త్తరించి మూలన కూర్చోబెట్టగలం.ఈ శతాబ్దంలోనే మీ(నా) కోరిక నెరవాలని ఆశిద్దాం. ఏదియేమైనా మీరు చాల త్వరగా చక్కగా స్పందించినందుకు నెనర్లు.

 4. వాసుగార్కి, ప్రపంచంలో ముప్పాతిక దేశాలు బలహీన దేశాలపై దండెత్తి దోచుకున్నాయనడం వాస్తవమేనా? నాకు తెలిసినంతవరకు అమెరికా, ఐరోపా దేశాలు తప్ప ప్రస్తుతం ఏవీ ఆ పనిలో లేవు. గతంలో దండెత్తిన దేశాలు ఇప్పుడు సామ్రాజ్యాలు కావు. ఆధునిక చరిత్రలో అంటే యూరప్ పారిశ్రామిక విప్లవం తర్వాత సామ్రాజ్య విస్తరణకు దిగింది అమెరికా, ఐరోపా లోని కొన్ని దేశాలే. ఐరోపాలో ఆ కొన్ని దేశాల్లో అన్నీ యాక్టివ్ గా లేవు. బ్రిటన్, ఫ్రాన్సు లు తప్ప. మిగిలినవి సహాయపడేవే తప్ప తమంతతాము యుద్దాలకీ, ఆక్రమణలకీ దిగలేవు. అమెరికా ఆధిపత్యం ఉన్నంతకాలం బ్రిటన్ ఫ్రాన్సు తప్ప మిగిలినవి అలాగే ఉంటాయేమో, ఒక జర్మనీ, జపాల్ లు తప్ప.

  అమెరికాని ఇతర దేశాలనుండి తరమడం మనపని కాదు. ఆయాదేశాల్లొని ప్రజలే అందుకు పూనుకోవాలి. అమెరికా ఇండియా జోలికి రాకుండా అడ్డుకోగలిగితే అదే అతి పెద్ద విజయం. అమెరికా దోపిడీ హస్తం భారత దేశ వ్యవస్ధలో లోతుగా చొచ్చుకుపోయింది. మన పాలక పార్టీల్లో ఏవీ అమెరికా ఆధిపత్యాన్ని తిరస్కరించే పరిస్ధితిలో లేవు. ప్రజల సంపూర్ణ మద్దతు కలిగి, వారికోసమే పనిచేసే వ్యవస్ధ ఉంటే తప్ప అమెరికా, ఐరోపా ల దోపిడీ ఆగదు. ఇండియా ప్రజలకు చెందిన సంపదలన్నీ ఎంచక్కా అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లిపోతోంది. స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ళు దాచుకుంది కేవలం వారికి వచ్చిన కమిషన్ మాత్రమే. అసలు సంపద అమెరికా, ఐరోపాల్లోని ఎం.ఎన్.సి లకి వెళ్తోంది. మన దేశ సంపద మన దేశ సరిహద్దుల్ని దాటకుండా ఆపగలిగితే భారతీయులంతా సుఖంగా బతకొచ్చు. కానీ మన పెట్టుబడిదారులకి ఆ పట్టుదల లేదు. వారికి భారత దేశ సంపద మేమే దోచుకోవాలి. ఇతర దేశ కంపెనీలకు వెళ్ళడానికి వీల్లేదు అన్న నిబద్ధత ఉన్నా చాలా వరకు మేలు జరుగుతుంది. కాని వారే విదేశీ కంపెనీలతో కుమ్మక్కై సంపదల్ని వారికి అప్పజెప్పి మైనారిటీ వాటాతొ సంతృప్తి పడుతున్నారు.

  మనం బాగైతే తర్వాత అమెరికా అన్నారు కదా. మనం బాగుకావడానికే అమెరికా అడ్డం. మనం బాగుకావడమంటే అమెరికా, ఐరోపా దేశాల దోపిడి నుండి బైటపడడమే. అమెరికా, ఐరోపాల శక్తి అనంతమేమీ కాదు. పది సంవత్సరాలనుండి ఆఫ్ఘన్ లో యుద్ధం చేస్తున్నా దాన్ని ఆక్రమించుకోగలిగారా? లేదు. దానిక్కారణం అక్కడ ప్రజలమద్దతు తాలిబాన్ కి ఉండడమే. తాలిబాన్ లెక్కన మన దేశ సంపద మనకే దక్కాలి అనే రాజకీయ పార్టీలు ఇప్పుడు లేవు. అలాగని ఎల్లకాలం లేకుండా పోవు. అణచివేత ఉన్నచోట తిరుగుబాటు తప్పదు. అది ఎప్పుడొస్తుందన్నదే సమస్య తప్ప, అసలు వస్తుందా లేదా అన్నది సమస్య కాదు. సామాజిక పరిణామాలు ప్రజాబాహుళ్యాల మంచివైపే జరుగుతూ వచ్చాయి. ఆ మార్పుల క్రమం ఇంకా పూర్తి కాలేదు. ప్రజలంతా సుఖించగలిగిన రోజే మార్పుల క్రమం పూర్తయినట్లు. వ్యవస్ధల మార్పు అనేది సామాజిక, ఆర్ధిక అనివార్యత. రాజకీయ చర్యలు దానికి సాధనం.

  ఇది నా అభిప్రాయం మాత్రమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s